



అమెరికా ఒక కలల ప్రపంచం.ఆ దేశ జీవనంతో మన జీవనశైలిని తూకమేసి చూపిన రచన అమెరికా ఓ అమెరికా!ఆచార్య మసన చెన్నప్ప గారి నానీల సంపుటిపై ఆంధ్రప్రభ 11-3-2012 దినపత్రికలో ప్రచురింపబడిన నా రచన.
మెరికల్లాంటి భావాల అమరిక-అమెరికా!ఓ అమెరికా!
మనసున ఉదయించిన భావాలను నానీలుగా మెరిపించడం ఆచార్య మసన చెన్నప్పగారి చతురతా పాటవమే! వీరు ఆవిష్కరింపచేసిన అమెరికా!ఓ అమెరికా!నానీల సంపుటి అమెరికా జీవన సరళిని మన జీవన శైలితో త్రాసులో వేసి తూకం చూడమంటుంది.ఇరువైపులా మొగ్గు చూపగలగడం ఈ త్రాసు ప్రత్యేకత!అక్కడ కొన్నిటికి అగ్రాసనమైతే,ఇక్కడ కొన్ని అగ్రతాంబూలమందుకుంటాయి.
నలుగురితో సుఖమా ఇండియాలో ఉండు,ఏకాంతవాసమా అమెరికాకు రా! అంటారు.ఒంటరితనానికి అక్కడ పెద్దపీట. కలసి జీవించడం మన మనసు మాట.ఆ దేశ ప్రభావం కొంత,ఉద్యోగవిధుల వల్ల మరికొంత ఇక్కడ కూడా సమిష్టి కుటుంబాల స్థానే వ్యష్టి కుటుంబాలు అధికమవుతున్నాయి.కుడివైపున వాహనాలు నడపడం వారి మార్గం! వారిని రైటిస్టులని చమత్కరిస్తారు. వైద్యపరమైన వనరులు,సదుపాయాలు అపారమక్కడ.అందుకే వైద్యులను అపర ధన్వంతరులన్నారు.అమెరికా ఘనత శుభ్రతలోనేనంటూ అచట క్రిములుండవు,ఐస్ క్రీములుంటాయంటారు.అక్కడ రోడ్ల శుభ్రతను కాంచిన కవి ఇక్కడ కార్లకు కొబ్బరికాయలు కొట్తే అక్కడ రహదారులకు కొబ్బరికాయలు కొట్టాలంటారు.కార్లు తప్ప మనుషులు కనబడని రహదారులంటారు వారివి.కార్లు,మనుషులే కాదు అన్ని రకాల వాహనాలు,కలసికట్టుగా సంచరించే మన రహదారులు అలాంటి అభివృద్ధి అందుకోవాలని ఆశపడతాం.
షికాగో నగరంలో వివేకం పురివిప్పి నాట్యమాడిందంటూ వివేకానందుని ప్రసంగాన్ని జ్ఞాపకాలతెర తీసి చూపుతారు. శని,ఆదివారాలు మాత్రమే వెసులుబాటు,మిగత ఐదురోజులు ఖైదీలే అంటారు.తూర్పు,పడమర ఎదురెదురు కదా,అందుకే వారు హిమాలయాలవైపు చూస్తే మనం నయాగరావైపు చూపు సారిస్తామన్న కవి పలుకులు అక్షరసత్యాలు.వెలగలిగిన వస్తువుల అంగడి అమెరికా అనడం వస్తువినిమయ ప్రపంచాన్ని ఆవిష్కరింప చేసింది.అమెరికాలో పల్లీలు కొనాలంటే ఒక్కడాలరే అని ఎవరైనా అంటే,ఒక్క డాలరా! యాభైరూపాయలా!అంటూ పావలాకు కొనుక్కున్న రోజులు గుర్తుకొచ్చి గుండెలు బాదుకుంటాం.
అమెరికా భూతలస్వర్గంకాదు,బెడ్ ఆఫ్ రోజెస్ అంతకన్నాకాదు అని చెప్తూనే మనవాళ్లు అమెరికాలో కష్టపడి సుఖాన్ని అనుభవిస్తున్నారంటారు.ఇక్కడ కులాల కురుక్షేత్రమయితే అక్కడ జాతుల జాత్యంహంకారమంటారు.ఎండకాలం మండే కొండలున్న కాలిఫోర్నియాను కాలే ఫోర్నియా అంటారు.ఇలా ఒకటా రెండా ఎన్నోపదాల విరుపులు,మెరుపులు నానీలను చమత్కృతులతో తాపడం పెట్టి మనసును గిలిగింతలు పెట్తాయి.అమెరికాను అలా చూసి,ఇలా మరచిపోక తన మనసున ముద్రితమైన భావాలను వెంట తోడ్కొని వచ్చి చదివినంతనే నాలుకపై స్థిరపడిపోయే వేమన పద్యాల్లా నానీలను రూపకల్పన చేయడం అభినందనీయం.
ప్రతులకు,
1)నవోదయా బుక్ హౌస్
కాచిగూడ,హైదరాబాద్-27
2)ఆంధ్ర సారస్వత పరిషత్
తిలక్ రోడ్,హైదరాబాద్-1
3)ప్రమీల ప్రచురణలు,
శ్రేష్టారామం
9-76/2,ఉదయనగర్ కాలనీ
బోడుప్పల్
హైదరాబాద్-500 039
ఫోన్:040-27201007
7 comments:
ఉమాదేవి గారూ ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందండీ..
క్షమించండి జ్యోతిర్మయిగారు,వివరంగా రాసివుండవలసినది. అయితేనేం,మరిన్ని సొబగులద్దడానికి మీ ప్రశ్నధోహదపడింది.ధన్యవాదములు.
ఆచార్య మసన చెన్నప్పగారి నానీల సంపుటం దొరకుచోటు,
1)నవోదయా బుక్ హౌస్
కాచిగూడ,హైదరాబాద్-27
2)ఆంధ్ర సారస్వత పరిషత్
తిలక్ రోడ్,హైదరాబాద్-1
3)ప్రమీల ప్రచురణలు,
శ్రేష్టారామం
9-76/2,ఉదయనగర్ కాలనీ
బోడుప్పల్
హైదరాబాద్-500 039
ఫోన్:040-27201007
అయ్యో దానికి క్షమాపణలు ఎందుకండీ..నాక్కావలసిన పుస్తకాలన్నీ లిస్టు వ్రాసి రెండు నెలలకోసారి ఇండియా పంపుతాను. మా వాళ్ళు అవి సేకరించి పంపిస్తుంటారు. వారికి నేను పంపిన లిస్టులోని పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే కొండడం తేలికకదా అని అడిగాను.
అమెరికా భూతలస్వర్గంకాదు,బెడ్ ఆఫ్ రోజెస్ అంతకన్నాకాదు అని చెప్తూనే మనవాళ్లు అమెరికాలో కష్టపడి సుఖాన్ని అనుభవిస్తున్నారంటారు.ఇక్కడ కులాల కురుక్షేత్రమయితే అక్కడ జాతుల జాత్యంహంకారమంటారు."
బాగా రాసారు.తప్పకుండా మిస్ అవ్వకుండా చదువుతాను.
జ్యోతిర్మయిగారు,జలతారు వెన్నెలగారు మీ ఇరువురి పుస్తక ప్రియత్వానికి అభినందనలు.
నానీల సంపుటి గురించి మీ సమీక్ష చాలా బాగుంది. అలాగే మీ బ్లాగ్.. బాగుందండీ! నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇక పై చూస్తుంటాను.
నా బ్లాగు మీకు నచ్చినందుకు, ఆ పై సమీక్ష కూడా నచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు వనజవనమాలిగారు.
Post a Comment