Monday, May 28, 2012

సముద్రఘోష

2 comments


మనిషీ నన్ను మరిచావా?
నీకెందుకంత ఆవేదన?
ననుచేరే నీరంతా వృథాయని
అధికశాతం నువ్వే తీసుకో
నదీజలాలలో నావాటా నాకు దొరకనీ
నేను సంతృప్త ద్రావణమైతే
జలపుష్పాలిక వికసించవు
మేఘాలన్నిటిని నింపాను నా ఊపిరినావిరిచేసి
మేఘానంద భాష్పాలు నేలకు నాకు ఉమ్మడికానుక
నను చేరిన జలమంతా దండుగని
నీ ఆవేదన సబబేయైనా
సాంద్రతపెరిగి నామేనంతా ఉప్పుమేటయితే
పరచుకున్న హిమాలయాన్నవుతా
నీవునిలుచున్న పీట పదిలం కావాలంటే
ప్రకృతి చిత్రాన్ని పరిపూర్ణంగా చిత్రించు.

Saturday, May 26, 2012

చదివితే చాలు

13 comments

పుస్తకావిష్కరణ
పుస్తకానికి పుట్టిన రోజు
పొగడ్తల పొగడమాలలు
చప్పట్ల జలతారులు
మరీమరీ చదువుతారని
ఉప్పొంగింది పుస్తకం మనసు
నక్కిదాక్కుంది పచ్చనోటు
చిన్నబోయింది పుస్తకం
అట్టనలగని ప్రతులు వేనవేలు
బీరువాల్లో పేరుకున్న అక్షరలక్షలు
డబ్బుకట్టలనుకుని దోపిడీ చేసి
గ్రంథాలయాల చెంత వదిలితే మేలు
అప్పుడైనా చదువరులు
చదివితే చాలు,అదే పదివేలు.

Sunday, May 20, 2012

అనుబంధాలు

3 comments
20-5-12,ఆదివారం ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన కవిత.

ఆవిరవుతున్న అనుబంధాలు
కరుగుతున్న అనురాగపు సాకారాలు
మనిషి మనగడకవి శేషప్రశ్నలు
పేగుబంధానికర్థం నిఘంటువులో
చిరిగినపుట
ఆర్థికబంధంతో రక్తసంబంధం
మసకబారినమాట
మమతలను మసి చేసిన ద్రావకం
స్వార్థపుతలపులతో మనసు మలినం
బాంధవ్యాలే బరువని,బంధనాలు తెంచుకుని
ఇదే స్వేచ్ఛా ఊపిరి అనుకుని నినదిస్తే
అనుబంధాలు ఆమ్లధారలో ఆవిరవుతాయి
మనసులోని కాలుష్యం ఉప్పెనలా వుధృతమై
ఆనకట్టలేని కాలకూట విషప్రవాహమై
ఊపిరాడనివ్వదు అగమ్య స్వేచ్ఛాకెరటం
ఉప్పెన మిగిల్చిన కన్నీటి చారికలు
మృగ్యమైన అనుబంధపు ఆనవాళ్లు
బంధాలకు రహదారి మమతల వంతెన
పరిమళించాలి అనుబంధ సుగంధాలు
మానవతాప్రాకారాలకవి చెరగని పునాదులు

Sunday, May 13, 2012

అమ్మంటే!

19 comments
ఊయలలూగే పాపాయినడుగు
లాలిపాట కమ్మదనం చెప్తుంది
అమ్మగుండెలో దాక్కున్న బుజ్జాయినడుగు
కన్నప్రేమకు త్రాసు లేదంటుంది
గోరు ముద్దలు తినే చిట్టితల్లినడుగు
అమ్మ ఓర్పుకు ఎల్లలు లేవంటుంది
గాయపడ్డ చిట్టితండ్రినడుగు
అమ్మచేతిస్పర్శే లేపనమంటాడు
అమ్మపేరే మంత్రోచ్ఛారణ!
అమ్మమాటే మంత్రం!
గుబులైతే అమ్మ,దిగులైనా అమ్మే
నదులు ఇంకినా ఇంకిపోనిది అమ్మప్రేమే
అలుపెరుగని రోబో అన్నీ అమర్చేఅమ్మ
తనకంట కన్నీరు దాచుకుని
బిడ్డ బ్రతుకున పన్నీరు నింపేదే అమ్మ
అమ్మ అంటే ఎవరో కాదు
ప్రేమకు ప్రతిరూపమే అమ్మ
దైవానికి మరోపేరే అమ్మ