Monday, September 30, 2013

పలుకే బంగారమాయెనా

0 comments
గోతెలుగు.కాం లో ప్రచురింబడిన నా కథ ఈ క్రింది లింకులో చదవమని మనవి.

http://www.gotelugu.com/issue25/689/telugu-stories/paluke-bangaramayena/

Tuesday, September 24, 2013

బదిలీ

0 comments
 

నేను రచించిన కథ  'బదిలీ'    గోతెలుగు.కాం లో ప్రచురింపబడింది. ఈ క్రింది లింకులో చదవగలరని మనవి.

http://www.gotelugu.com/issue24/658/telugu-stories/badilee-telugu-story/

గోతెలుగు.కాం వారి సౌజన్యంతో.

Sunday, September 22, 2013

కథావేదగిరి రాంబాబు

4 commentsవేదగిరి రాంబాబుగారి కథానికల సంకలనంపై ఆంధ్రప్రభ ఆదివారం  (11-8-2013) సంచికలో నా సమీక్ష.

 కథా పూదోటలో అలుపెరుగని కథామాలి వేదగిరి రాంబాబు.వీరి పయనం కథాబాటతోనే కాదు సమాజ గమనంతో ముడిపడి వుంది. అందుకే వైద్యానికి, వైద్యుడికి నడుమ అనుసంధానకర్త కాగలిగారు. తన వృత్తి ధర్మాచరణలో తన మనసును తడిమిన ఆర్తి చినుకులకు స్పందించి తన కథలలో ఓదార్పులు,అవగాహనలు, పరిష్కారాలు పారదర్శకం చేయడం అభినందనీయం.
పాత్రతనెరిగి దానం చేయాలన్న నానుడి సర్వసామాన్యంగా వింటుంటాం. తన జేబును డబ్బుతో నింపుకోవాలనుకున్నవానికి కడుపు నిండా తిండి పెట్టినా డబ్బివ్వలేదన్న కసి మాటలలో,చేతలలో కనబడుతుంది. మనిషి బలహీనతలను విశ్లేషిస్తుంది కథ కాని కథ.
ఇక అద్దంలో బింబం కథానిక.నిన్నటి న్యూస్ పేపర్ నేటి వేస్ట్ పేపర్ అన్నట్టు, శక్తి తగ్గిన తల్లిదండ్రులు పిల్లలకు పనికిరానివారుగా కనబడుతున్నారు. బ్రతుకు ద్వారం మూసుకున్నాకే మనసు తలుపులు తెరచుకుంటాయి. మనిషి మరుగైపోయేదాకా విలువలు తెలియవు. తండ్రి గతించాకే వాస్తవాలు అవగతమవుతాయి. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నివిధాలా ఉపయోగించుకుని ఆమె పక్షవాతంతో మంచానపడితే చేతులు కట్టేసుకున్న అన్న మనస్తత్వానికి బాధపడినా తాను మాత్రం తల్లి చెయ్యి విడవననుకున్న కొడుకు కథ! ఇందులో, తండ్రిని కోల్పోవడం ఇంటిచుట్టు ప్రహరీ గోడ కూలినట్లుందనడం వంటి వాక్య ప్రయోగాలు గుండె గోడను  బలంగా కుదుపుతాయి.
అర్థాంగి అనే పదంలో అర్థాన్నివెతికి చూసి ఆహా!అనుకుంటాం.అర్థాంగి కథానికలో భార్య, భర్తకు అర్థాంగిగా అన్నివిధాలా సహకరించడమేకాదు, అవయవదానంచేసిన దేవతగా మనోపీఠంపై  ప్రతిష్టించారు రచయిత.
 సర్వేంద్రియానాం నయనం ప్రధానమంటారు. కన్నులు దానం చేయడం నేడు చాలా మందికి తెలుసు.అయితే లివర్,కిడ్నీల దానంపై మరింత అవగాహన కావాలి. వైద్య సంబంధిత వివరాలపైనే చాలా కథలు కేంద్రీకృతమయ్యాయి. అవయవదానంపై అనుమానాలు, అపోహలు తొలగించే గైడ్ లాంటిది ఈ కథాసంపుటం.
ఇక తల్లికథానికలో  ప్రమాదవశాత్తు కొడుకు బ్రెయిన్ డెడ్ అయితే బిడ్డ అవయవాలను దానం చేయమని తల్లిని కోరుతారు వైద్యులు.గుండెను చిక్కబట్టుకుని,తన కొడుకు అవయవాల దానంతో తొమ్మిదిమంది ప్రాణం నిలబెట్టగలిగితే వారందరిలో తన కొడుకును చూసుకుంటానన్న తల్లి వితరణకు ప్రణమిల్లాలనిపిస్తుంది.తెగినచోటే అంటుకట్టడం చిగురించడానికే. డయాలసిస్ చేసుకునే వ్యక్తి జీవికకు,మరణానికి నడుమ ఊగిసలాడే తంత్రులు నిలవాలంటే తీగతెగిన ప్రాణి ఇచ్చే జీవమున్న అవయవమే ఆ బ్రతుక్కు మొగ్గతొడుగుతుంది.
సంఖ్యాబలమే సాహితీకొలమానమైతే రోజుకొకటి కాదు,గంటకొక కథ పురిటినొప్పులు పడకుండానే వెలువడుతుంది. కథ గురించిన తలపు మొదలైనపుడే  కథలో ఏం చెప్పాలి,ఎలా చెప్పాలి అన్న ప్రశ్నలు ఉదయించాలి.అలాకాక పోటీ జగత్తులో పూటకొక కథ రాస్తానన్న రచయితకుతన వేగిరపాటు పంపిన నెగటివ్ మెసేజ్ బూమెరాంగ్ లా తనకే గురి పెట్టబడటం అస్ఫష్ట ప్రతిబింబాలు కథానికలో చూస్తాం. కిడ్నీ దానం చేసే వ్యక్తి దైవస్వరూపుడే కాని కిడ్నీదానం చేస్తే ఆర్థిక ప్రయోజనము ఉందని కథలో చెప్పడం  చదివిన పాఠకుడు కిడ్నీని అమ్మి చెల్లి పెళ్లి చేయాలనుకోవడం, కథలు పాఠకులపై ప్రభావమెలా చూపుతాయో తెలిపే కథానిక.
 భయం కథానిక చదివితే పులికన్నా గిలి భయమెక్కువ అని మనమనుకునే మాటలు నిజమేననిపిస్తుంది. కొడుకు కోరికను కాదనలేక గాలిపటం,మాంజా కొనుక్కోవడానికి డబ్బులిచ్చి పడిపోకుండా జాగ్రత్తగా ఆడుకోమని చెప్తాడు ఓ తండ్రి.అయితే కొడుకు అజాగ్రత్తగా ఉండి పడిపోతాడేమోననే శంక అతడి నరనరాన భయాన్ని ప్రవహింప చేస్తుంది. ఆందోళనతో ఆఫీసులో ఉండలేక కొడుక్కు జాగ్రత్తలు చెప్పిరావాలన్న ఆతృతలో ఏమరుపాటున స్కూటరు ప్రమాదానికి లోనై తన భయానికి తానే బలైన తండ్రి వైనమే!
 రెండు ఒకటైన వేళ కథానిక నేటి పరిస్థితులకు నిలువుటద్దం. మరణమిక తథ్యమని తెలిసినపుడు మనసు మాటలో పలుకుతుంది.ఈ నేపథ్యంలో ధారావాహికలా వెలువడుతున్న  భర్త మాటలను ఆపాలని ప్రయత్నించిన భార్య విఫలమవుతుంది.కొందరు రామమందిరం, మరికొందరు కళ్యాణమంటపం  కట్టించాలనుకుంటారు కాని సీతమ్మ భర్త రామారావు తన స్నేహితుడి ద్వారా విన్నవిషయాన్ని నిజం చేయాలనుకుంటాడు. తల్లో తండ్రో చనిపోయాక అమెరికాలోనున్న వారిబిడ్డలు వచ్చేదాక విగతజీవులైన వారిని ఎంబాల్మింగ్ చేసి భద్రపరిచే మార్చురీలు భారతదేశంలో చాలా తక్కువగా వున్నాయన్నసంగతి విన్న రామారావు ఆ లోటు తీర్చాలని తన మరణానికి  ముందు పలకడం బాధాకరమే కాని అక్షరసత్యం.కథానిక ముగింపుకొచ్చేసరికి మనసులోనుండి ఉప్పొంగిన కన్నీటి ఉప్పెన ఉప్పగా తగుల్తుంది.
  ఇది నిజం కథానికలో,భర్తకు వైద్యం చేయించాలని హాస్పిటల్ లో చేర్పించిన భార్య అతడికి మరణం అతి చేరువలోనే అన్న నిజాన్ని తెలుసుకుని లాభంలేని ఖర్చును భరించలేననుకుని మరుసటి రోజే గదినుండి ఖాళీ చేసి తీసుకెళ్లిపోవడం,డబ్బులెక్క  వేసుకునేవారు సమర్థించవచ్చునేమోగాని మానవతను లెక్కించేవారికి చేదు కషాయం బలవంతంగా గొంతులో పోసినట్లుంటుంది.
ఈ కథా కదంబమాలలో విరబూసిన కథానికలు మనం చదవం. రచయిత ముంగిట బాసింపట్టు వేసుకుని కూర్చుని వింటాం. కథ రాయడం కన్నా ఆ కథకు ఏదేని ప్రయోజనం ఉండాలని ఆశించడం ప్రతి రచయిత బాధ్యతే అని కథలను చదివిన పాఠకులు,రచయితలు తలపోయక మానరు.మరెన్నోసామాజికాంశాలను తన కథల ద్వారా మన ముందుంచిన రచయిత కథావేదగిరి రాంబాబు కలం మరిన్ని కథానికలు మనకందించగలదని ఆశిద్దాం.                                  
                                         

                  Friday, September 13, 2013

ఏం చేస్తున్నావు బుజ్జీ?

2 comments
http://www.gotelugu.com/issue19/509/telugu-stories/emi-chestunnavu-bujee-telugu-story/

గో తెలుగు.కాం లో ప్రచురింపబడ్డ కథ. పై లింకు  ద్వారా చదవమని మనవి.

గోతెలుగు.కాం  వారి సౌజన్యంతో.

Wednesday, September 11, 2013

అభినందన చందనం

12 comments

                                               
      

వృత్తి, ప్రవృత్తి కలగలసిన సాహితీ కలనేత డా. పెళ్లకూరు జయప్రదగారి  సాహిత్యం.వారికి నా అభినందన చందనం!          
               డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డిగారు తన నవలలు,కథలు,కవితలద్వారా పాఠకలోకానికి చిరపరిచితురాలు.  వైద్యవృత్తి, రచనారంగం రెండింటిలోను  నైపుణ్యాన్ని ప్రదర్శించగల సవ్యసాచి. అటు వైద్యసేవలనందిస్తూనే ఇటు  సాహితీ సేవ గావిస్తున్న జయప్రదగారు రచనపట్ల  తన అభిప్రాయాన్ని తాను వెలువరించిన కథలు,నవలల ముందుమాటలలోనే స్పష్టం  చేస్తూ నా లక్ష్యం అంతా సమాజం మంచివైపుగా మారాలనేదే అని అంటారు. ఇక నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడ్డాక కథావస్తువును ఆకట్టుకునే రీతిలో అల్లుకుపోవడం వీరికి నల్లేరుపై నడకే.
                    వైద్యవృత్తిలో  తీరికదొరికితే చాలు కాస్త విశ్రాంతి లభిస్తుంది అనుకోకుండా దొరికిన విరామాన్ని సాహితీ సృజనకు వినియోగించడం ముదావహం. సమాజంలోని సమస్యాత్మక సంఘటనలెన్నిటికో  అక్షరతూణీరాలను గురిపెట్టడములోను వీరి హస్తవాసి ఎన్నదగినదే. అస్వస్థతకు చేదుగుళికలే పరమౌషధం కదా!

          సాహితీవనంలో ఆమె పూయించిన సాహితీసుమాలు ఎన్నో,ఎన్నెన్నో! అన్ని ప్రక్రియలలోను తనదైన బాణీని వినిపించారు.ఆకాశవాణిలో సైతం తన కథాసరిగమలను వినిపించారు.విజయవాడ ఆకాశవాణి కేంద్రంనుండి ప్రసారమైన  శాపవిమోచనంగుండె తడి చేసే కథ . కూతురు స్నిగ్ధ కన్నులనుండి జారిన నిర్మలమైన కన్నీటి బొట్టును పితృప్రేమలా అభివర్ణిస్తూనే ఆ కన్నీటి చుక్క తండ్రి ఉత్తరాన్ని తడిచేసిందనడం కథా ఎత్తుగడను తెలుపుతుంది. తండ్రి ఆవేదనను,తాపత్రయాన్ని,కూతురి అసహాయతను  చెప్పకనే చెప్తుంది కథాప్రారంభం . తండ్రి కూతుళ్ల అనుబంధానికి పూడ్చలేని గండి ఎక్కడో  పడే ఉంటుందని అర్థమవుతుంది. ధనవిలువ మాటున మనిషి కూల్చివేస్తున్న విలువలను చిత్రిక పడతారు. మనిషి నడవడిలోని ఆరోహణ,అవరోహణలను సమంగా మీటి  మనిషి మనవలసిన విధమిదీ అంటూ ప్రవర్తనావళిని బీజాక్షరాలుగ కథలో  నాటుతారు.
                  ప్రేమ  అనే పదం ఆకర్షణకే అంకితం. గుర్తిస్తే...దాన్ని మించిన ప్రేమలు చాలావున్నాయి అంటారు జయప్రదగారు.  ప్రేమంటే ఇదే!...ఈ కథ చదివాక స్నేహబంధము ఎంత మధురము అన్న కవి మాటలు గుర్తుకురాక మానవు.సభ్యత   ముసుగులో గొంతు దగ్గర భద్రంగా దాచుకున్న నా కన్నీటి కుండ బ్రద్దలయింది అంటారు. కథ చదివిన పాఠకుడి గుండె ఘనీభవించిన నయాగరా అవుతుంది. చదువులేక అజ్ఞానంతో విషయపరిజ్ఞానం లోపించిన వారికి అవగాహన , చదువుకొనలేనివారికి విద్యాదానం, అమాయక తల్లులకు వాస్తవ పరిస్థితులు, ఆడపిల్లల పుట్టుకకు కారణం స్త్రీ  కాదని పురుషులలోని  వై క్రోమోజోమ్ మాత్రమే ఆడ లేదా మగ అని సెక్స్ ను నిర్ణయిస్తాయని.... ఇలా ఎన్నోఅంశాలు జయప్రదగారి కలం కథాకళి మనతో  కథాకేళి ఆడుకుంటుంది.              
               మానవజీవితం విభిన్న సంఘటనల సమాహారం. కొన్ని వింటాం, కొన్ని చూస్తాం. అయితే ఈ   జీవన వేగంలో  ఎన్నటినో త్వరగానే మరచిపోతాం  అయితే జయప్రదగారు మాత్రం  ఈ సంఘటనలను ఒడిసిపట్టుకుని తన స్పందనను సత్వరమే కవితగా,కథగా లేదా నవలగా మలచి పాఠకులకందిస్తారు. తీసుకున్న ఇతివృత్తం ఏదైనా మనల్ని కూచోబెట్టి చదివించగలిగే శైలి వీరి సొంతం. సమాజంలో తారసపడే వ్యక్తుల ప్రవర్తన మనసును కుదిపినపుడల్లా ఆమె హృదయం ఆవేదనా భరితమవుతుందని చెప్పకనే చెప్తాయి వీరి కథలు. నాకెందుకులే అనే ఉదాసీనతను దరికి రానీయక పరిష్కార దిశగా కథనాన్ని పరుగులు పెట్టిస్తారు. అన్యాయాలను,అరాచకాలను కథలలో, కవితలలో, నవలలలో పాత్రల ముఖతః సాక్షాత్కరింపచేస్తారు.ప్రక్రియ ఏదైనా కావచ్చు కాని పాఠకులను రసరమ్యగుళికలై అలరించే శక్తి వీరి రచనలలోని విశేషం. అక్షరాలు ఆమె మాటలను తు.చ తప్పకుండా ఆలకించి తమను తాము ఆవిష్కరించుకుంటాయి.  సమాజంపట్ల కాస్తయినా ఆలోచనలేకపోతే మనిషి మానవత్వంలోపించిన గాజుబొమ్మే! తేనెటీగల్లా  ముసురుకున్న ఆలోచనలు,  పేర్చబడ్డ అక్షర వల్మీకము! ఫలితంగా జయప్రదగారి కలం ఝళిపించిన ఆలకించే అక్షరం! ఇది నానీల సమాహారం.  వీటిలో ఆవిష్కరింపబడిన అక్షరసత్యాలు చెర్నాకోలై చురుక్కుమనిపిస్తాయి.నానీల సృష్టికర్త డా.గోపిగారు అందించిన స్ఫూర్తితో నానీలకు శ్రీకారం చుట్టానని చెప్పారు. కథకైనా,కవితకైనా నిశితమైన పరిశీలనే ఆయువుపట్టు. వృత్తి,ప్రవృత్తి జుగల్ బందీయై జయప్రదగారికి సమాజపోకడలపై చక్కటి అవగాహన, పరిశీలనాసక్తిని ప్రసాదించింది.
              రచయిత(త్రు)లెవరు తోచడంలేదని రాస్తూ కూర్చోరు.సమాజంపట్ల వారి దృక్పథంలో ఆర్తి,ఆవేదన నెలకొన్న కారణాన కలిగే స్పందన వారిని రచనవైపు పురికొల్పుతుంది. కథలు రాయడానికి అవసరమయే ముడిసరుకు విపణివీధిలో దొరికే వస్తువు కాదు. మస్తిష్కపు పుటలలో మరపడుతున్న ఆలోచనా నెగళ్లు తడబడుతూ, ఒరుసుకుంటూ,ఒకదానినొకటి తోసుకుంటూ అక్షరసేద్యంలో భాగస్వాములుకావాలని  ప్రయత్నిస్తుంటాయి. జీవితం కష్టసుఖాల కావిడే! అయితే సమతుల్యత లోపించి కష్టాలు మాత్రమే కాటువేస్తే మరపుమాటున నిద్రపుచ్చాలని ప్రయత్నిస్తాము. తెచ్చిపెట్టుకున్న నిశ్శబ్దంమాటున  తాత్కాలికంగా నిద్రపోతాయి, కాదు నిద్ర నటిస్తాయి.నిద్ర వదిలిందా విస్ఫోటనమే! పరిష్కారంకోసం ఎదురు చూడవు.కోల్పోయిన జీవితానికి పరిహారం ఇవ్వగలరా అని  ఎదురు ప్రశ్నిస్తాయి. ఇదే వీరి రచనలలోని అంతర్వాహిని. ఘనీభవించిన శోకమూర్తులు ఈమె కథలలోని స్త్రీపాత్రలు. కథ ముగిసే సమయానికి పాఠకుల హృదయాలు ద్రవీభూతమవుతాయి.  వీరి రచనలు చదివిన పాఠకులు మనసును ముడుచుకుని కూర్చోలేరు. ఇక్కడే డా.జయప్రదగారి రచనా శిల్పం అక్షరశిలగామారి చదువరుల హృదయంపై పీఠంవేసి కూర్చుంటుంది. కథకు వస్తువు అనుభవాల ప్రేరణలే అయినా ఊహ సైతం ఊపిరిపోసుకున్న ఆలోచనానుభవమే కదా!
            మా తొలినాటి కథలు అని పరిచయం చేసిన కథలకు ముందుమాటగా తన తొలికథ చిరుప్రాయంలోనే మొగ్గతొడిగిందంటారు. కత్తిపట్టలేని నేను కలం పట్టానన్నారు. అనూహ్యంగా కథనరంగంపై కలంకవాతు చేస్తున్నారు. ఇక వీరి రచనలలో పురుడు పోసుకునే ప్రశ్నలెన్నో!  స్త్రీలపట్ల వివక్ష చూపేవారిని ఈమె గొంతు ఎలుగెత్తి ప్రశ్నిస్తుంది.స్త్రీల మనసులకే సొంతమైన సున్నితభావాలకు విలువనివ్వరేమని ఆవేదన చెందుతారు.  డా.జయప్రద గారు నవలలు కథలేకాక కవితలపై కూడా తన అనురక్తిని చాటుకున్నారు.  ప్రవహించే కాలం విభిన్న కవితాంశాలతో చదివినంతసేపు పాఠకులను  అంతర్ముఖులై మనసులోకి నడవమంటుంది. రచయిత్రిలో పెల్లుబికే భావపరంపర ద్రావకంలా గొంతుకలో దిగుతూ మన తీర్పు కోరుతాయి. స్త్రీ పురుష వివక్షపై ఈమె స్పందించిన తీరు ఘాటైన తిరగమోతే!

   అమెరికా,భారతదేశం భూగోళానికి అటు ఇటే కాని పరస్పర ఆకర్షణ మాత్రం అయస్కాంతమే! బాల్యమంతా పొదువుకున్న రెక్కలక్రింద నుండి  తొంగి చూచి  ఎగరడం నేర్చుకున్నాక నేరుగా వలసకేంద్రంలో దిగి అమ్మ,నాన్నలను కాని కట్టుకున్న ఇల్లాలినికాని కేవలం ఆర్థికాంశాలకే పరిమితం చేస్తే ఉద్భవించేది కవితకాదు అక్షరాల కొలిమి.

భరతగడ్డమీద పిల్లల్నికనడం...
అమెరికాకు దత్తతనివ్వడానికేనని తెలిసుంటే...
ప్రసవానికొక పునర్జన్మ నెత్తకపోదును
అని నిట్టూర్చింది ఆమె నిష్ఫల విశ్వాసం...
నీలో ప్రేమ భాండాగారం ఇంకిపోనంతవరకు
నీ పిల్లల స్వార్థానికి ఢోకాలేదు.....
అయినా ఆమె అథరాలు చిరునవ్వుని వీడవు
ఆమెను కమ్మిన మాయ కాష్టంలో కాలిపోదు
జయప్రదగారు తన కవితలలో ఆర్తి,ఆవేదన సమన్వయపరచి వినిపిస్తారు.రెండు విభిన్నాంశాలను  ఏకవాక్యంలో వ్యక్తీకరిస్తూ నేటి సమాజ పోకడను అక్షరాశ్రువులద్వారా నిరసిస్తారు.కవితలలో భావుకత అలరిస్తే వాస్తవికత ఆలోచింపచేస్తుంది.
ఇక ఆలకించే అక్షరం వీరు వెలువరించిన నానీల సంపుటి.
మంగళసూత్రాన్ని
పేనారుగాని
మనసుల్ని అల్లలేదు
విడాకులందుకే

మనిషి మనసు
అస్థిరం 
అది వేల స్పందనల
మధ్య మగ్గం

గుండె చెమర్చింది
అందుకే
నా వేళ్లకొసన
కవిత్వం పండింది  
నానీలనిండా జాలువారిన చమత్కృతి కదళీపాకమే! నానీలలోని విరుపుల మెరుపులన్నీ మనసును ఓ క్షణం ఉలిక్కిపడేలా చేస్తాయి. నానీల నిర్మాణంలోని సరళత మనసును పరిమళమై చుట్టుకుంటుంది.అందుకే వీరి నానీలు వేమన పద్యాల్లా నాలుకపై నర్తిస్తూనే ఉంటాయి.
డా.జయప్రదగారు నవలలను రచించారనడంకన్నా మనకు పరిచయస్తులైన వారినే మనకు తిరిగి గుర్తుచేసారనవచ్చు. మనం పాత్రలు మాట్లాడటం చూస్తాం. మనసుతో వింటాం.ఆ పైన మనం ఆ పాత్రలతో మమేకమై  అనుబంధాలను పెంచుకుంటాం.  ఇక నవలలలో ఈమెకున్న సౌలభ్యం అలవోకగా పురివిప్పి నర్తించే సంభాషణలే! పైగా ఎక్కడా అనవసర పాత్ర ప్రవేశించదు. అయితే పాత్ర కాలిడిందా  మనోవిశ్లేషణ మొదలవుతుంది. అలా తాకి వదలడంకాదు మనసులోని మర్మము తెలుసుకోమంటూ వెంటపడతాయి వీరు సృష్టించిన అక్షర శిల్పాలు. డా. జయప్రదగారు రచించిన  ఆమె నవల ఏ వాదానికీ లొంగని మానవతావాదానికి ప్రతీక. సరళంగా , సూటిగా సాగుతుందీ నవల. కథ అల్లికలో  మానవతకు పెద్దపీటవేస్తూ ఇతరులకు వెలుగుదారులు పరచే మదర్ థెరీసా బాటను నడిచేవారి మనోదేవాలయాన్ని దర్శింపచేస్తారు. పాఠకులముందు ఆమె కథ ఉంటుంది. కాని అది అద్దమై మన ఆలోచనలను ప్రతిఫలిస్తుంటుంది. నవల ముగింపు కథౌన్నత్యాన్ని శిఖరాగ్రాన నిలబెడుతుంది. మనస్తత్వాల చిత్రీకరణలో చెయ్యి తిరిగిన రచయిత్రి డా.జయప్రదగారు. వీరి వృత్తి వైద్యమే కాని అది తెరచిన కిటికీనుండి వీరు గాంచిన జీవన మూలాలు శృతిబద్ధంగా మీటిన కథోపనిషత్తయి మనలను అలరిస్తుంది. వారికివే నా ఆత్మీయతాభినందనలు.