Thursday, June 20, 2013

పిల్లల్ని చూడాలనుంది!

4 comments


తల్లికి మనసులో పులకింత,
అబ్బాయి కనబడ్డాడు,
ఫేస్ బుక్ లో తలుపు తీసాక!

తండ్రికి మనసులో తుళ్లింత
నాన్నా అని అమ్మాయి పిలుపు
స్కైప్ లో కిటికీ తెరిచాక

మూతపడ్డాయి తలుపులు, కిటికీలు
  అమ్మ,నాన్నలకు మళ్లీ ఎదురుచూపులే

ఐప్యాడ్,ల్యాప్ టాప్ వచ్చాయి
అయినా పిల్లలు కనబడలేదు
ఆ రెండింటిని తెరవలేక
అమ్మానాన్నలిక నిత్య చకోరాలే!Sunday, June 16, 2013

నాన్నా నమామి!

13 comments

    

                   అమ్మ! అనగానే అమ్మేకదా,ఏం అనదు అనే భరోసా.అదే నాన్న అనగానే అమ్మో! ఎక్కడివాళ్లక్కడ గప్ చుప్!అందరికీ ఇదే సూత్రం వర్తించక పోవచ్చు అయితే నా విషయంలో మాత్రం అమ్మ దగ్గరకన్నా నాన్న దగ్గరే చనువు ఎక్కువ. అందుకేనేమో నాన్న మమ్మల్ని వీడేదాకా ఆయన వెన్నంటి ఉండగలిగే అవకాశాన్ని ఆ దేవుడు అనుగ్రహించాడు.
          అందరము జీవిస్తాము, మరణిస్తాము. మంచి చేయాలి అని అంతా చెప్తారు అయితే నువ్వు అందరికి మంచి చేయలేకపోవచ్చు కాని ఎవరికి చెడు మాత్రం చేయకు అని చెప్పేవారు.నిజంగా ఆయన జీవితాన్ని కాచి వడబోసి చెప్పిన మాటలు, ఆయన మరణాంతరం కూడా మేము శతక సమానంగా నేటికి వల్లెవేస్తూనే ఉన్నాము.
                   పని చేయడం కష్టంగానే ఉంటుంది,కాని పని పూర్తయాక దొరికే ఆనందం ముందు ఈ కష్టం ఎంత అని అడుగడుగునా మమ్మల్ని కార్యోన్ముఖులను చేయడంలో ఆయన ఓర్పు,నేర్పు ఈనాటికీ చెయ్యి పట్టుకుని నడిపించినట్లే ఉంటుంది.
              ఇక క్రమశిక్షణ మోతాదు మించినా నేటికీ అదే మార్గదర్శిగా దారి చూపుతోంది.భోజనానికి ముందు  మరచిపోకుండా చేతులు కడుక్కోవడం,తినేటప్పుడు చప్పుడు రాకుండా తినడం...ఇలా ఎన్నో రూల్స్ అండ్ రెగులేషన్స్ మా బాల్యంలో మాకు మింగుడు పడేవికావు.అయితే ఆ సారమంతా గ్రహించినవారము కదా మాకు తెలియకుండానే అదే జీవనసరళికి అలవాటుపడిపోయాము.
              తండ్రెపుడు పిల్లల క్షేమాన్నే కాంక్షిస్తాడు.తండ్రి మాట కరుకైనా మనసు వెన్న అన్నది అందరికి అనుభవైకవేద్యమే కదా!
                   ఫాదర్స్ డే సందర్భంగా  నాన్నకు   నమస్సులు!
                 

Tuesday, June 11, 2013

అమ్మనాన్నలే పిల్లలైనవేళ..

14 comments
11-6-2013, ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రికలో  ప్రచురితమైన నా వ్యాసం.     

     బాల్యం, కౌమారం, వృద్ధాప్యం, వానప్రస్థం అని నాలుగు భాగాలుగా విభజించి మనం చెప్పుకుంటున్న మానవ జీవన యానం అందరికీ అనుభవైకవేద్యమే. ఈ దశలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ మనిషి తనతోపాటు తన చుట్టుపక్కల వారిని ప్రభావితం చేస్తూ వైవిధ్యభరితమైన జీవన విధానాలను ప్రదర్శిస్తూంటాడు. ఈ ధోరణులు కుటుంబ వ్యక్తులనే కాక సమాజాన్నీ ప్రభావితం చేస్తుంటాయి. సమాంతరంగా అతడూ సమాజం చేత ప్రభావితమవుతుం టాడు. అయితే, ఈ నాలుగు దశలను దాటి వచ్చాక కలవరపరచే స్థితి పడకపై కదలలేని అవస్థ. ప్రతి మనిషికీ ఈ కష్టం వస్తుందని ముందుగానే నిర్వచించలేం. అయితే అందరూ ప్రార్థించేది మాత్రం మంత్రమేసినట్లు మాయమైపోవాలనుకునే స్థితినే! మనం ఎంతగా అనుకున్నా అన్నీ అలాగే జరగవు కదా! అలాంటి దుర్భర పరిస్థితి వస్తే- తుది శ్వాస విడిచే దాకా కాలు, చెయ్యి వెరశి మొత్తం శరీరం కదలలేని స్థితిలోనున్నా బండరాయిలా జీవించక తప్పని స్థితి. ఈ అవసాన దశనేది తారసపడతుందనేది అందరికీ తెలిసినా అధిగమించలేని అయోమయం మాత్రం వృద్ధులను మరింత బాధకు గురిచేస్తోంది. అంగవైకల్యమున్న పిల్లలు, ప్రమాదానికి గురైన పిల్లలు, మానసిక దౌర్భల్యమున్న చిన్నారులు ఎంతగా ఎదిగినా- తల్లిదండ్రులు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
‘నాకై నేను జరగలేను, కాస్త పక్కకు ఒత్తిగిలుతాను, నన్ను కొంచెం జరుపుతావా నాయనా..’-అని దీనంగా అడిగిన పాపానికి తండ్రి పీకను కసుక్కున కోసేసిన కసాయి కొడుకులు, బతికుండగానే తల్లిని శ్మశానం ముంగిట పడేసిన బిడ్డలు, దస్తావేజులు మార్చి తల్లిదండ్రులను ఏమార్చి ఆస్తులు రాయించుకొనే పిల్లలు ఎక్కడో కాదు.. ‘ధర్మక్షేత్రం, వేదభూమి’ అని కీర్తిగాంచిన మన భారతదేశంలోనే ఉన్నారంటే మానవత్వం ఎంత అడుగంటిపోతోందో..? అని ఉలిక్కిపడకమానం.
పిల్లల పెంపకం, చదువులు, పెళ్లిళ్ళు ఇవన్నీ సవ్యంగా జరిగేలా చూసేది అమ్మానాన్నలే. తమకు రెక్కలు ఆడినంతవరకు ఎలాంటి విశ్రాంతి లేకుండా నిత్యం యంత్రాలవుతారు తల్లిదండ్రులు. లేవలేరు, నడవలేరు, నడిచినా వేలు పట్టుకుని నడిపించాలి, తింటుంటారు, వాంతి చేసేస్తుంటారు, కాలకృత్యాలు దగ్గరుండి చేయించాలి... ఈ పనులన్నింటినీ చిన్నారులకు  ఆనందంగా చేస్తారు అమ్మా నాన్నలు. కానీ- జీవిత చరమదశలో తల్లిదండ్రులకు ఇదే స్థితి రావడం దయనీయం. ఈ స్థితిలో తల్లిదండ్రులకు ఎవరు సేవలు చేస్తారు? అందుకేగదా.. వృద్ధాశ్రమాలున్నాయని కొందరంటారు. అలా అనేవారు భవిష్యత్‌లో తమకూ ఇలాంటి స్థితి తప్పదని గ్రహించాలి.
కన్నవారిపట్ల మమకారం, వాత్సల్యం, ప్రేమ ఉన్న సంతానానికి ఇతరులు చెప్పాల్సిన పని లేదు. వారు ఐచ్ఛికంగా తల్లిదండ్రుల సేవలో తరిస్తారు. ఉద్యోగరీత్యా బయటకు వెళ్లాల్సివస్తే వారిని కనిపెట్టుకుని ఉండటానికి ఆయాలనో, నర్సులనో ఏర్పాటు చేసుకుంటారు. అయితే, జీతం ఇచ్చి నియమించుకునే వారిని ఒక కంట గమనించాలి. వారికి ఎంత డబ్బులిచ్చినా ఓర్పు, సహనం కొనేవి కాదు. మనిషిలో సహజ సిద్ధ గుణాలవి. అందరూ మదర్ థెరెసాలు కాలేకపోవచ్చు కానీ, విసుక్కోవడం, కసురుకోవడం వల్ల వృద్ధులైన తల్లిదండ్రులను మానసికంగా మరింత దుర్భలులను చేస్తుంది. పళ్లు తోమించడం, స్నానం చేయించడం, శారీరక ఉపశమనానికి పౌడరు, వేజలైన్ వంటి వాటిని ఉపయోగించడం- వారికి మనం చేయగల చిన్న చిన్న సహాయాలు. వారి దుస్తులను, వస్తువులను శుభ్రం చేయడం వంటివి ఎంతో తృప్తి కలిగిస్తాయ. తల్లిదండ్రుల్లో పిల్లల పట్ల ప్రేమను ఇనుమడింపచేస్తుంది. మనల్ని పెంచి పెద్దచేసిన వారి శారీరక బాధలను, ముదిమి కష్టాలను పూర్తిగా తీర్చలేకున్నా- వారిని మానసిక వేదనకు గురి కాకుండా చూడగలం కదా? దీన్ని మించిన మానవత్వమేముంది? ఇంతకుమించిన ఆత్మతృప్తి ఎక్కడ దొరుకుతుంది? ఆదరించేవారుంటేనే- ‘పునరపి బాల్యం’. దేవుడు ఆడే చదరంగంలో ఇది చివరి ఎత్తే కదా!

Saturday, June 1, 2013

కాలాతీత వ్యక్తి డా. పి.శ్రీదేవి

6 comments

      ఇందిర పాత్రపై సుజాతగారి విశ్లేషణ చదివాక నేనిది 2010లో రాసాను.ఈ రోజు వనజవనమాలి గారి విశ్లేషణ చూసాక  ఈ వ్యాసం మళ్లీ పోస్ట్ చేస్తున్నాను. నేనెప్పుడో చదివిన కాలాతీత వ్యక్తులు నవలపై మరోమారు స్పందించాలనిపించింది. నవలలెన్నో పుట్టాయి,పుట్తున్నాయి.కొన్ని నవలలు మనం చదువుతాము,కొన్ని మనల్ని చదివిస్తాయి.ఈ కోవలోకే చెందుతుంది డా.పి.శ్రీదేవి రచించిన కాలాతీతవ్యక్తులు.అసంఖ్యాకమైన నవలలు చదివుంటాము.కాని అన్ని గుర్తుండవు.కొన్ని అవే మరుగునపడిపోతాయి.అయితే దాదాపు యాభైయేండ్లనాటి నవల ఇప్పటికీ మనతో సహప్రయాణం చేస్తోంది.బ్రతుకుబాటలో కుటుంబం ప్రాథమికవ్యవస్థ.బంధువులు ,స్నేహితులు, పరిచయాలు,వృత్తి అవసరాలు ఇత్యాదివెన్నో పునాదిగా ఏర్పడ్డది సామాజిక వ్యవస్థ.ఈ రెండు వ్యవస్థలే మనిషి మనుగడను శాసిస్తాయి అని ప్రస్ఫుటింపచేస్తుందీ నవల.ఇఫ్పటికీ ఆనాడు శ్రీదేవి చిత్రించిన వ్యవస్థ తీరు తెన్నులు అటు సమాజంలోను ఇటు కుటుంబంలోను దర్శనమిస్తూనే ఉన్నాయి.
ఇందిర,కళ్యాణి,ప్రకాశం,క్రిష్ణమూర్తి,డా.చక్రవర్తి,ఆనందరావువంటి పాత్రలు సజీవ చిత్రణలే.ఆనందరావునుండి క్లోనింగ్ చేయబడ్డవ్యక్తులుకోకొల్లలు,ఆనందరావుది సుఖజీవనానికి అలవాటుపడ్డ ప్రాణం.బాధ్యతారాహిత్యానికి అతడే నిలువెత్తు నిర్వచనం.కూతురిపైనే పరాన్నభుక్కులా ఆధారపడే తండ్రులున్నారు ఇప్పటికీ.కూతురు ఉద్యోగం చేయకపోతే తమకు తెల్లవారదని,కూతురు అత్తగారింటికి వెళితే సిగరెట్లకు,తాగుడుకు ముఖం వాయాల్సివస్తుందని కడకు కూతుర్లను వృద్ధకన్యలను చేసే మహానుభావులైన తండ్రులు నేడు లేరనలేం. అలాంటి ఆనందరావు తన కూతురైన ఇందిరకు స్వేచ్ఛనిచ్చి తను స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాడు.ఇక శవంపై రాబందుతో పోల్చదగిన పాత్ర శేషావతారం.చెల్లెలిని ఉద్ధరిస్తున్నానంటూ ఆమె ఆస్తిని ఆబగా చప్పరించేసి ఆమె కొడుకు ప్రకాశాన్ని కీలుబొమ్మలా ఆడించాడు,డాక్టరు కోర్సు చదివించడానికి.తనకంటూ ఒక వ్యక్తిత్వంలేని ప్రకాశం నిజంగా ఒక డాక్టరుగాకాక ఏసీదాసాదా వ్యక్తో అయితే పాఠకుడు రాజీపడేవాడు.అర్భకుడని ఇందిర క్షమించినా పాఠకులు క్షమించలేని వ్యక్తి ప్రకాశం. ఇందిర వ్యక్తిత్వం అంచనాలకతీతం.ఇందిరలాంటి స్త్రీని ఆనాడేకాదు నేటికి హర్షించదు సమాజం.గళమెత్తి పోరాడే గొంతుకామెది. అనాలనుకున్నది అనెయ్యడం. చేయాలనుకున్నది చేసెయ్యడం.ఇవే ఇందిర పాత్రకు ప్రత్యేకత కలిగించాయి.స్త్రీకుండే సహజధోరణిలో కళ్యాణి,ప్రకాశంలకు ఎడం కల్పించి ఆమె ప్రకాశానికిదగ్గరైనా,అతడి భీరుత్వాన్ని చూసి భీకరంగా మండిపడ్డ యువతి.భర్త అనేవాడు భార్యకు రక్షణవలయంగా ఉండాలంటుంది.తన కాళ్లమీద తాను నిలబడుతున్నానన్న అభిమానం ఉన్నఇందిరకూడా తాను మగవాడికి రక్షణకాదు తనకు రక్షణ కావాలని కోరుకుంటుంది.అయితే స్త్రీ తనకందిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోరాదన్న పాఠం నేర్పుతుంతీమె గమనం.

నవలలో మరొక ముగ్ధ కళ్యాణి.చిరుగాలికే వణికే చివురుటాకువంటి అమ్మాయి.చిన్నప్పుడు వైద్యవిద్య చదివించలేనని తండ్రి బి.ఎలో చేర్పిస్తాడు,అది ఆమెకు మొదటి దెబ్బ.తనవాడనుకున్న ప్రకాశం తన మరణవార్త తెలిపితే వచ్చి ఆదుకుంటాడని భ్రమపడటం ఆమె జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ.ఎవరు ఎవరికి ఏమీకారు ఆనుకున్నతరుణంలో చిత్రంగా ఒకనాటి సహాధ్యాయి వసుంధర ఆదుకుంటుంది.అలాగే మునసబు రామ్మూర్తినాయుడు ఆమెను తండ్రిలా ఆదుకుంటాడు.కళ్యాణిని పరామర్శించడానికి వచ్చినప్పుడు అతడికి గుండెపోటు వస్తుంది.ప్రకాశం స్నేహితుడు క్రిష్ణమూర్తి,డాక్టరు చక్రవర్తి కళ్యాణికి అండగా నిలుస్తారు.మునసబు మరణిండంతో ఆమెను ఆదుకోవాలనుకుంటారు.అందరు చేయూతనందించేవారే కాని ఆమెకు అందుకోవాలనే ఇచ్ఛ లేదు.నిర్లిప్తత ఆవరించుకున్న కళ్యాణిలోమార్పు తెస్తాడు డాక్టరు చక్రవర్తి.ఘనీభవించిన ఆమె హృదయాన్ని మీటి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.అలాగే క్రిష్ణమూర్తి వసుంధరకు దగ్గర కావాలనుకుంటాడు. అయితే ఇందిరకు అనుకోకుండా కట్టుబడిపోతాడు.

ఇందిర తన ఎప్పటి ధోరణిలోనే సాగిపోతుందను కుంటాడు పాఠకుడు.కాని నవల చివరలో ఆమె జీవితాన్ని విశ్లేషించిన తీరుకు అబ్బురపడతాడు. తననుతాను కాపాడుకోగల సత్తా ఉన్న యువతినని ఇందిర ధీమా.ఆ ధీమా అందించిన మాటల జలపాతహోరు ప్రకాశం, కళ్యాణి,క్రిష్ణమూర్తి తదితర పాత్రలు జీర్ణించుకోలేవు.ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోలేక గుటకలు మింగుతారు.ఇలాంటి సన్నివేశాలే పాఠకులలో ఉత్కంఠను రేపుతాయి. తరువాతేమవుతుందోనన్న ఉత్సుకతను కలిగించి ఏకబిగిని చదివిస్తాయి.ఈ నవలలోనున్న కీలకాంశం ఇదే.
కొన్ని పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. అలాంటిదే వైదేహి పాత్ర.ఆనాటి సాంఘిక భద్రతా వలయంలో వేసారిపోతుంది వైదేహి.సోదరుడి అతిప్రేమ జలగలా పట్టుకుని ఆమెను ఎటు కదలనివ్వదు. వెన్నంటే పెళ్లిచూపుల ప్రహసనాలకు ఎదురొడ్డి నిలవగలగడం అప్పటికే వేళ్లూనుకున్నదనడానికి వైదేహి పాత్రే నిదర్శనం.

ఎన్నో సామాజికాంశాలను తడిమిన నవల కాలాతీత వ్యక్తులు.సినిమాకోణంలో కాక సమాజపరంగా దృశ్యీకరించుకుంటూ చదివితే ఈ నవల నిరంతర చర్చా వేదికే.