Tuesday, June 11, 2013

అమ్మనాన్నలే పిల్లలైనవేళ..

11-6-2013, ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రికలో  ప్రచురితమైన నా వ్యాసం.     

     బాల్యం, కౌమారం, వృద్ధాప్యం, వానప్రస్థం అని నాలుగు భాగాలుగా విభజించి మనం చెప్పుకుంటున్న మానవ జీవన యానం అందరికీ అనుభవైకవేద్యమే. ఈ దశలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ మనిషి తనతోపాటు తన చుట్టుపక్కల వారిని ప్రభావితం చేస్తూ వైవిధ్యభరితమైన జీవన విధానాలను ప్రదర్శిస్తూంటాడు. ఈ ధోరణులు కుటుంబ వ్యక్తులనే కాక సమాజాన్నీ ప్రభావితం చేస్తుంటాయి. సమాంతరంగా అతడూ సమాజం చేత ప్రభావితమవుతుం టాడు. అయితే, ఈ నాలుగు దశలను దాటి వచ్చాక కలవరపరచే స్థితి పడకపై కదలలేని అవస్థ. ప్రతి మనిషికీ ఈ కష్టం వస్తుందని ముందుగానే నిర్వచించలేం. అయితే అందరూ ప్రార్థించేది మాత్రం మంత్రమేసినట్లు మాయమైపోవాలనుకునే స్థితినే! మనం ఎంతగా అనుకున్నా అన్నీ అలాగే జరగవు కదా! అలాంటి దుర్భర పరిస్థితి వస్తే- తుది శ్వాస విడిచే దాకా కాలు, చెయ్యి వెరశి మొత్తం శరీరం కదలలేని స్థితిలోనున్నా బండరాయిలా జీవించక తప్పని స్థితి. ఈ అవసాన దశనేది తారసపడతుందనేది అందరికీ తెలిసినా అధిగమించలేని అయోమయం మాత్రం వృద్ధులను మరింత బాధకు గురిచేస్తోంది. అంగవైకల్యమున్న పిల్లలు, ప్రమాదానికి గురైన పిల్లలు, మానసిక దౌర్భల్యమున్న చిన్నారులు ఎంతగా ఎదిగినా- తల్లిదండ్రులు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
‘నాకై నేను జరగలేను, కాస్త పక్కకు ఒత్తిగిలుతాను, నన్ను కొంచెం జరుపుతావా నాయనా..’-అని దీనంగా అడిగిన పాపానికి తండ్రి పీకను కసుక్కున కోసేసిన కసాయి కొడుకులు, బతికుండగానే తల్లిని శ్మశానం ముంగిట పడేసిన బిడ్డలు, దస్తావేజులు మార్చి తల్లిదండ్రులను ఏమార్చి ఆస్తులు రాయించుకొనే పిల్లలు ఎక్కడో కాదు.. ‘ధర్మక్షేత్రం, వేదభూమి’ అని కీర్తిగాంచిన మన భారతదేశంలోనే ఉన్నారంటే మానవత్వం ఎంత అడుగంటిపోతోందో..? అని ఉలిక్కిపడకమానం.
పిల్లల పెంపకం, చదువులు, పెళ్లిళ్ళు ఇవన్నీ సవ్యంగా జరిగేలా చూసేది అమ్మానాన్నలే. తమకు రెక్కలు ఆడినంతవరకు ఎలాంటి విశ్రాంతి లేకుండా నిత్యం యంత్రాలవుతారు తల్లిదండ్రులు. లేవలేరు, నడవలేరు, నడిచినా వేలు పట్టుకుని నడిపించాలి, తింటుంటారు, వాంతి చేసేస్తుంటారు, కాలకృత్యాలు దగ్గరుండి చేయించాలి... ఈ పనులన్నింటినీ చిన్నారులకు  ఆనందంగా చేస్తారు అమ్మా నాన్నలు. కానీ- జీవిత చరమదశలో తల్లిదండ్రులకు ఇదే స్థితి రావడం దయనీయం. ఈ స్థితిలో తల్లిదండ్రులకు ఎవరు సేవలు చేస్తారు? అందుకేగదా.. వృద్ధాశ్రమాలున్నాయని కొందరంటారు. అలా అనేవారు భవిష్యత్‌లో తమకూ ఇలాంటి స్థితి తప్పదని గ్రహించాలి.
కన్నవారిపట్ల మమకారం, వాత్సల్యం, ప్రేమ ఉన్న సంతానానికి ఇతరులు చెప్పాల్సిన పని లేదు. వారు ఐచ్ఛికంగా తల్లిదండ్రుల సేవలో తరిస్తారు. ఉద్యోగరీత్యా బయటకు వెళ్లాల్సివస్తే వారిని కనిపెట్టుకుని ఉండటానికి ఆయాలనో, నర్సులనో ఏర్పాటు చేసుకుంటారు. అయితే, జీతం ఇచ్చి నియమించుకునే వారిని ఒక కంట గమనించాలి. వారికి ఎంత డబ్బులిచ్చినా ఓర్పు, సహనం కొనేవి కాదు. మనిషిలో సహజ సిద్ధ గుణాలవి. అందరూ మదర్ థెరెసాలు కాలేకపోవచ్చు కానీ, విసుక్కోవడం, కసురుకోవడం వల్ల వృద్ధులైన తల్లిదండ్రులను మానసికంగా మరింత దుర్భలులను చేస్తుంది. పళ్లు తోమించడం, స్నానం చేయించడం, శారీరక ఉపశమనానికి పౌడరు, వేజలైన్ వంటి వాటిని ఉపయోగించడం- వారికి మనం చేయగల చిన్న చిన్న సహాయాలు. వారి దుస్తులను, వస్తువులను శుభ్రం చేయడం వంటివి ఎంతో తృప్తి కలిగిస్తాయ. తల్లిదండ్రుల్లో పిల్లల పట్ల ప్రేమను ఇనుమడింపచేస్తుంది. మనల్ని పెంచి పెద్దచేసిన వారి శారీరక బాధలను, ముదిమి కష్టాలను పూర్తిగా తీర్చలేకున్నా- వారిని మానసిక వేదనకు గురి కాకుండా చూడగలం కదా? దీన్ని మించిన మానవత్వమేముంది? ఇంతకుమించిన ఆత్మతృప్తి ఎక్కడ దొరుకుతుంది? ఆదరించేవారుంటేనే- ‘పునరపి బాల్యం’. దేవుడు ఆడే చదరంగంలో ఇది చివరి ఎత్తే కదా!

  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

14 comments:

nagarani yerra said...

వృద్దాప్యం లో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని వారికి కనువిప్పు కలిగించేలా బాగా చెప్పారు . బావుందండీ .

మాలా కుమార్ said...

వృధ్దాప్యం తలుచుకుంటే భయం వేస్తోంది.
బాగా రాశారు.

bonagiri said...

అసలు మనకంటూ ఏదైనా ఉంటే అదంతా అమ్మ, నాన్న, దేవుడు ఇచ్చిందే కదా. మరి వాళ్ళిచ్చినదాంట్లో కొంత వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కొంత మంది కొడుకులు, కూతుళ్ళు ఎందుకు అలోచిస్తారు? నిజానికి కొంతయినా ఋణం తీర్చుకోగలిగే అదృష్టం కలిగినందుకు సంతోషించాలి.

జలతారు వెన్నెల said...

వ్యాసం చాలా బాగుందండి

Padmarpita said...

ఎందరికో కనువిప్పు.....చాలా బాగుందండి.

అనూ said...

Good post.

వనజవనమాలి said...

మీరు వ్రాసిన కథల లొ మీ బ్లాగ్ లొ ఉన్న కథలలొ మీకు నచ్చిన కథని పంపండి. వివరాలకు నా బ్లాగ్ చూడండి
http://vanajavanamali.blogspot.in/2013/06/blog-post_12.html

సి.ఉమాదేవి said...

నాగరాణి గారు నావ్యాసం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

సి.ఉమాదేవి said...

భయమెందుకు మాలాగారు అన్నం పెట్టే మీ చేతికి ఆ దేవుడి చేతి ఆసరా తప్పక వుంటుంది.

సి.ఉమాదేవి said...

వెన్నెల గారు, వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలండి.

సి.ఉమాదేవి said...

పద్మార్పితగారు,వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలండి.

సి.ఉమాదేవి said...

అనూ గారు,Thank you.

సి.ఉమాదేవి said...

వనజవనమాలిగారు,నేను బ్లాగులో పెట్టిన కథలన్నీ పత్రికలలో ప్రచురితమైనవే.కేవలం బ్లాగుకే లేదా వెబ్ జైన్ల కొరకు రాసినవే పంపాలా?

సి.ఉమాదేవి said...

నేను రాసిన వ్యాసంపై మీ కామెంట్ ఆలోచింపచేస్తుంది.ధన్యవాదాలు బోనగిరిగారు.

Post a Comment