Friday, March 14, 2014

నిశ్శబ్ద జలపాతాలు

0 comments
2-3-2014  ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో  నా సమీక్ష.

హోరెత్తిన నిశ్శబ్ద జలపాతాలు
           
   పొత్తూరి జయలక్ష్మి రాసిన ప్రతికథ వెనుక తిరోగమించే సమాజపోకడలపట్ల  ఆవేదన బలంగా కనిపిస్తుంది. మూఢనమ్మకాలు మనిషి లక్ష్యాన్ని అలక్ష్యంవైపు నెట్టి సాధించవలసిన విజయాలకు అడ్డుగోడలవుతాయి.ఆచారాలు ఆచరణీయమే! అయితే మూఢాచారాలు మనిషినే కాదు మనసును కకావికలం చేస్తాయి. దీనికి దృష్టాంతాలే నిశ్శబ్ద జలపాతాలు వినిపించిన హోరునాదం.అందులో అలవోకగా రచయిత్రి కలం జాలువార్చిన కథాజలపాతాలు మన మనసులలో నిరంతరం ఉరకలు వేస్తూనే ఉంటాయి.
            అన్ని మంచి శకునములే. చక్కటి కథ. ఊహలకు రెక్కలు పొదిగి మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్లవు ఈమె కథలు.మన ఇరుగు పొరుగు వారి జీవితాలలో జరిగే సంఘటనలు వారినెలా ప్రభావితం చేస్తాయో చూసినట్లు,వినినట్లు మనకు వివరిస్తారు. మంచి పనికి మంచి మనసుంటే చాలంటారు.పిల్లి ఎదురు పడ్డా దుశ్శకునమని ఆందోళన పడటం మనిషిని మరింత భీరువును చేస్తుంది.ఇది అందరికీ తెలుసు కాని కథగా చెప్తే సూదిమందులా సత్వరం పనిచేస్తుంది కదా!
అనుమానం దాంపత్య జీవితానికి విషపు చీడలాంటిది.పరస్పర అనుమాన నివృత్తితో సంసారం స్వర్గమవుతుంది.మనసు పాడింది సన్నాయి పాట కథ ఇదే చెప్తుంది.
ఇక నిస్సహాయుడు కథలో నేటి సమాజ ముఖచిత్రం స్ఫష్టంగా గోచరిస్తుంది.ప్రేమగా పెంచుకున్న వృక్షాలను నరికివేసి ఆ స్థానంలో ఇల్లు కట్టుకోవడం నేడు నిత్యవేడుకే!ప్రాణంలేని ఆత్మీయులు ఫోటోలలో దర్శనమిస్తారు.ప్రాణంలేని చెట్టు గుమ్మంగా,అల్మైరాగా మిగులుతాయి.మనిషికి మరణం ఒక జీవక్రియ కాని చెట్టుకు మాత్రం మరణం హత్యే అన్న రచయిత్రి మాటలు మనసున్న మనిషికి రంపపుకోత!
           పూలబంధం కథ మనసుల పుష్పరాగమే! ఇల్లుకట్టి చూడు కథ ఇల్లు కట్టిన  ప్రతి ఒక్కరికి అనుభవైకవేద్యమే. పులికన్న గిలి భయమెక్కువ ఉంటుంది. ఇల్లు కట్టడంలో వాస్తు ప్రధానం. నమ్మినా నమ్మకపోయినా అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో వాస్తును అంతో ఇంతో పాటిస్తారు. వాస్తే కాదు వాస్తవాలు గ్రహించడం కూడా అవశ్యమేనంటారు.
           ఆర్థికమాంద్యం విసిరిన వలలో గిలగిలలాడిన చేప వికాస్. అయితే బలైనది అతడి భార్య వికసిత.భర్తను చేరుకోగలనన్న ఆశతో అమెరికాలో అడుగు పెట్టిన వికసితకు వికాస్ ముఖం చాటేస్తాడు.అయితే బేలతనం వదలి తన జీవితానికి బాట వేసుకుంది వికసిత. వికసితవదనం కథలో వికాస్ ప్రవర్తనకు మూలకారణాలు ఏవైనా అమ్మాయిలూ, బహుపరాక్! అనక తప్పదు.
            తమకు ఎదురయే ఇబ్బందులకు మూఢనమ్మకాలను ఆశ్రయించి మనసును సాంత్వన పరచాలనుకుంటారు. అది తాత్కాలికమేకాని శాశ్వత పరిష్కారం చూపలేదు. కాలంతోపాటు మనము మారాలి. సాటివారిని మనతో సమానంగా చూసే అలవాటు చేసుకోవాలి మానవత్వాన్ని మించిన మతంకాని కులంకాని లేదనే నిజం అమృతబిందువులు కథలో కురిసిన అమృతమే! 
            కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న నేటి పరిస్థితులలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు,కనీసం తమను కన్నవారేవరో తెలియని పసిపాపలు ఒకవైపు,తమ పొత్తిళ్లను వీడి వత్తిళ్లను కావలించుకున్న సంతానానికి భారమైన వృద్దతల్లిదండ్రులు మరొకవైపు. వీరిని కలిపే ఆలోచనకు అనురాగపు పొదరిల్లు కథ వేదికగా నిలవడం సత్సంకల్పం. 
               రచయిత్రి ముద్రించిన తొలి కథల సంపుటి ఇది. దైనందిన జీవితంలో ఎదురయే విభిన్న వ్యక్తులు, వారిలోని వైవిధ్య వ్యక్తిత్వాలు,వారి జీవితాలలో తారసపడే ఎన్నో సంఘటనల వైచిత్రి రచయిత్రిని కథారచనవైపు పురికొల్పి వుండవచ్చు.అయితే వాటిని నేర్పుగా కథలుగా మలచి సమాజానికి సంతసమేకాక,సందేశము మిళితము చేసి అందించడం సామాజిక స్పృహ ఉన్న వారికే సాధ్యం కదా. అది జయలక్ష్మి కథలలో అంతర్లీనమైన జలపాతమే!