Friday, February 24, 2012

సినిమాలు-స్త్రీ పాత్రలు

6 comments


గత సంవత్సరం ఆంధ్రప్రభ ఆదివారంలో నేను చేసిన పుస్తకసమీక్ష.

స్త్రీపాత్రలను తెరస్మరణీయం గావించిన రచన

కావ్యనాయికలు,కథానాయికలు,నవలానాయికలపై జరిగినంత విశ్లేషణ సినిమాలలో స్త్రీపాత్రలపై అంతగా జరగలేదనే చెప్పాలి.ఒకవేళ స్త్రీపాత్రలపై కొందరు స్పందించి కొంత అక్షరబద్ధం చేసినా అధిక శాతం సినీనాయికల పాత్ర చిత్రణకన్నా వారి వ్యక్తిగత జీవితచిత్రణపట్లే కుతూహలం చూపడం జరుగుతోంది.ఇటువంటి నేపథ్యంలో సినీసాహిత్యప్రస్థానంపై విమర్శనాత్మక విశ్లేషణను ముద్రించడానికి ఆర్థికసహాయమందించిన సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు వారికి నమస్సులర్పించడం న్యాయం.
ఏమి సినిమాలో ఏమో అని చిన్నచూపు చూసేవారు కూడా ఈ విశ్లేషణ చదివితే తమ అభిప్రాయాలను మార్చుకునే అవకాశం ఖాయం.బాగున్నా,బాగులేకపోయినా మొహమాటం మాటున మొహంమొత్తిన సినిమాను సైతం అందల మెక్కించి ఆహా,ఓహో అనడం ఆనవాయితీగా మారిన రోజుల్లో విమర్శనాత్మక గ్రంథంగా వెలువడిన ఈ పుస్తకం ఆకట్టుకునే అంశాలనెన్నింటినో చర్చించింది.
స్త్రీ పాత్రలేని కథలుండటం అరుదు. సమస్యలు,సరదాలు, సుఖాలు, కష్టాలు, నవ్వులు,కన్నీళ్లు ఇవన్నీ స్త్రీని అల్లుకున్న తీగలే.ఈ సున్నితమైన అంశాలు సినిమాలలో సమస్యలుగా చర్చింపబడినా పరిష్కారాలు మాత్రం వేళ్లమీద లెక్కింపవచ్చు.19వ శతాబ్దంలో మూగగా మన ముందు నిలిచిన సినిమాలు కాలక్రమేణా మనకే మాటలు నేర్పసాగాయి.తొలిరోజులలో పౌరాణికాలపై దృష్టి నిలిపినా క్రమక్రమంగా సాంఘిక సమస్యలపై దృష్టిసారించి సమాజంలో ఆశావహమార్పును నినదించాయి.ఈ చిత్రాలు స్త్రీల జీవిత పార్శ్వాలను పారదర్శకం చేసాయి.
సినిమా! మూడక్షరాల ఈ మంత్రోచ్ఛారణ మైమరిపింపచేసే దృశ్య మాధ్యమం.సినీవినీలాకాశంలో తారాతోరణాలెన్నెన్నో! సినీసంబంధిత విశేషాలను దిన,వార,పక్ష,మాస పత్రికలు వివరిస్తున్నా అవి కేవలం కథ,నటన,నటీనటులు ఇత్యాది వివరాలకే ప్రాధాన్యతనిస్తాయి.
డా.ఎ.సీతారత్నంగారు రచించి మనకందించిన ప్రముఖ తెలుగు సాంఘిక సినిమాలలో స్త్రీల జీవిత చిత్రణ ఆహ్వానించదగిన పుస్తకం. సినిమా నేపథ్యంతో రచనలు చాలా పరిమితంగా వస్తాయి. సినిమాలలో స్త్రీ పాత్రల జీవనవిధానాన్ని దర్శకులు చిత్రీకరించిన వైనాన్ని సమర్థవంతంగా సమీక్షించారు సీతారత్నంగారు. పరిపూర్ణత సాధించారనలేము కాని సమగ్రతకు కొదవలేదు.తన పరిధిలో వీలైనన్ని సినిమాలను చూసి,సినిమా కథలను చదివి ఉపయుక్తమైన అంశాలను వివరించారు.
సినిమా పుట్టుక,పరిణామం మొదలుకుని సినిమాలు, అందులోని పాటలపై ఆధారపడ్డ సెల్ ఫోన్, రేడియో,టి.వీలపై పక్షపాతంలేని పారదర్శకమైన సద్విమర్శ సినీ సాహిత్యంలో తొలివరుసన ఈ గ్రంథాన్ని నిలబెడుతోంది.పరిధి దాటని పరిమితులు పరిపూర్ణతను పెంచాయి.సకాలంలో సరైన విమర్శ అని పలికిన మృణాళినిగారు స్పృశించిన అంశాలకు స్పందిస్తే దీనికి కొనసాగింపుగా మరొక రచనకు నాంది పలకవచ్చు లేదా మరిన్ని పేజీలు పెరగొచ్చు.ఆనాటి సినిమా ప్రచారానికి జట్కా,రిక్షాలలో గ్రామఫోను పాటలు,కరపత్రాలు ఆధారం.
నేడు ఆడియో విడుదలలు,టి.విలలో లైవ్ కార్యక్రమాలు,ప్రీమియర్ షోలు వంటి వైవిధ్యభరితమైన ప్రచారాలు, ప్రసారాలు సినిమాలను నట్టింట కూర్చోబెడు తున్నాయి.ఇక సినిమా పత్రికలేకాక ఇతర వార్తాపత్రికలు, వారపత్రికలు సినిమాలపై సమీక్షలనందిస్తూ ఇతోధికంగా తమ గళాన్నివివరంగా వినిపిస్తున్నాయి.అయితే ఇవి సినిమా సమీక్షలకేకాని స్త్రీ పాత్రలను విశ్లేషించే చర్చా వేదికలు కావు.
సుదీర్ఘ సినీ ప్రయాణంలో గుర్తుంచుకోదగ్గ మైలురాళ్లు చక్కని చిత్రాలే.భక్తి భావాన్ని పెంపొందించే భక్తి సినిమాలు, కుతూహలాన్ని రేకెత్తించే జానపదాలు గుర్తుంచుకోదగ్గవే.కాని నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్ఫుటంగా చిత్రీకరించిన సినిమాలు మన మనసులను ఎన్నటికీ వీడిపోవు.ఈ కోవకు చెందినవే మల్లీశ్వరి,పెళ్లిచేసిచూడు,పెళ్లినాటి ప్రమాణాలు,డా.చక్రవర్తి, వెలుగునీడలు,బలిపీఠం,అంతస్తులు,మూగమనసులు,ముత్యాలముగ్గు వంటి చిత్రరత్నాలు.
1938లోనే వచ్చిన సినిమా గృహలక్ష్మి తాగుడుకు అలవాటుపడ్డ భర్తతో అనుభవించిన వేదనలను చూపించింది. 1940లో విడుదలైన సుమంగళి,1945లో నిర్మించబడ్డ స్వర్గసీమ ఆనాటి సామాజిక రుగ్మతలను ఎండగట్టాయి.సాంఘిక ప్రయోజనం నెరవేరితే అదే పదివేలుగా నిర్మించబడే ఆ నాటి సాంఘిక సినిమాలు,స్త్రీసమస్యలైన బాల్యవివాహం,పునర్వివాహం,వరకట్నం వంటి విషయాలకు పెద్దపీటే వేసాయి.ఆర్థిక అసమానతలతో పార్వతి(సావిత్రి) పాత్రలో బలైనతీరును దేవదాసు,సంఘం సినిమాలో సంఘాన్ని ఎదిరించే దమ్మున్న స్త్రీవాదిగా రాణి పాత్ర(వైజయంతిమాల), స్త్రీ ఓర్పును,నేర్పును సమన్వయపరచిన భార్యపాత్రలో అర్థాంగి సినిమా మొదలైనవి స్త్రీలవేదనలనేకాక స్త్రీ శక్తియుక్తులను ప్రదర్శించాయి.1962లో అఖండవిజయాన్ని మూట కట్టుకున్న గుండమ్మకథ, కులగోత్రాలు విభిన్న స్త్రీ పాత్రల సమాహారమే. స్త్రీపాత్రలోని గయ్యాళితనం కూడా మిగిలిన స్త్రీ పాత్రలనెంత ప్రభావితం చేస్తుందో తెలుపుతాయి ఈ చిత్రాలు.ఇక పదహారేళ్ల వయసు సినిమాలో లైంగికదాడిని ఎదుర్కొనే దిశగా స్త్రీ రాటుదేలడం, అమాయకుడిని అఖండుడిగా తీర్చిదిద్దిన తీరు పడతులు పరిశీలించతగిన అంశాలుగా అంతర్లీనమైన సందేశాన్ని వినిపించారు.త్యాగం తనవంతై తానే రాలిపోతుంది అనే త్యాగమయిగా గోరింటాకులోని స్వప్న (సుజాత)పాత్రలో స్త్రీ మానసిక సంఘర్షణను పతాకస్థాయికి తీసుకుపోయిన ఉదాత్తమైన పాత్ర అంటూ వర్ణించిన సీతారత్నంగారి దృష్టికోణం ఎన్నదగినది.ఇక ఈ నాటి ప్రేక్షకులను అలరించిన నువ్వేకావాలి, మనసంతా నువ్వే,ఆనంద్,గోదావరి సినిమాలు స్త్రీలోని ప్రేమను,లాలిత్యాన్నిమధురంగా మలిచిన పాత్రలు.విస్తృతి పరిధికిలోబడి,వేల సినిమాలలోని కొన్నిస్త్రీపాత్రలనే విశ్లేషించినా,సమాజంలో నాటి,నేటి స్త్రీల స్థితిగతులలోని మార్పులు అవగతమవుతాయి. ఈ పుస్తకాన్ని ఓసారి తెరచిచూస్తే కాలంతోపాటు ఎదిగిన సినీ చరిత్ర రీలులా గిర్రున తిరుగుతుంది.

Sunday, February 19, 2012

బ్లాగు పుస్తకం

4 comments
19-2-2012,ఆదివారం,ఆహ్లాదకరమైన వాతావరణం.ఈ నేపథ్యంలో బ్లాగు పుస్తకం ఆవిష్కరణ.అనుబంధంగా బ్లాగ్మిత్రుల పరిచయాలు,బ్లాగ్ముచ్చట్లు,చాక్లెట్లు,బిస్కట్లు వీటితోపాటు వేడివేడి తేనీరు.

విషయపరిజ్ఞానానికి ఆకాశమే హద్దు.తెలియాల్సింది కొండంత,తెలిసింది గోరంత.మనిషి నిత్య విద్యార్థి.అనుభవాలు నిత్యపాఠాలే కాని కంప్యూటరు పాఠాలు నేడు మనిషికి నిత్యపారాయణాలవుతున్నాయి.కంప్యూటరుకు నేను పెట్టుకున్న ముద్దుపేరు అయస్కాంతం.మరి తాకితేచాలు అతుక్కుపోతాంగదా!మరి కంప్యూటరుతో,ఇంటర్నెట్ తో పరిచయం ఉన్నవారు, గూగులమ్మనడిగి అందని జాబిలమ్మనయినా అందిపుచ్చుకునే వారు బ్లాగ్ లోకంలో విహరించేవుంటారు.అయితే తలుపులు తెరచి అందులోకి వెళ్లాలంటే ఎలా అని తటపటాయిస్తూ బ్లాగ్ ముంగిట నిలబడినవారిని ఆప్యాయంగా చేయిపట్టుకుని లోనికి నడిపించగల ఆహ్వానపత్రిక ఈ బ్లాగు పుస్తకం.సుజాతగారు,రెహ్మాన్ గారు అక్షరీకరించి,చిత్రీకరించిన ఈ జుగల్ బందీ అందించిన బ్లాగు విశేషాలు కొత్తవారికి వివరణాత్మకం,పాతవారికి పునశ్చరణ!

ఈ పుస్తకానికి ఊతమిచ్చిన రూపకర్త చావా కిరణ్ కుమార్ గారు సుజాతగారు,రెహ్మాన్ గారు అభినందనీయులు.
బ్లాగులలో తమ ప్రవేశము,పయనం విశేషాలు అందించిన బ్లాగ్మిత్రుల మాటలముత్యాలు హాస్యమిళితమై అలరించడమేకాదు బ్లాగ్ స్ఫూర్తిని కలిగించాయి.వీరందరికీ పేరుపేరునా బ్లాగాభినందనలు. బ్లాగు రాయాలన్న ఔత్సాహికులకు నిజంగా కరదీపికే ఈ పుస్తకం.

Friday, February 17, 2012

కథల అత్తయ్యగారు

2 comments


సాక్షి ఫన్ డే లో గత సంవత్సరం నేను రాసిన సమీక్ష.

కథాలోకానికి ఆత్మీయవ్యక్తి నిడదవోలు మాలతిగారు.తన బ్లాగు తూలిక ద్వారా అంతర్జాలంలో చిరపరిచితురాలు.

ఇరవైమూడు కథలున్న ఈ సంపుటంలో కథలలోని వైవిధ్యం, కథనాన్ని ఒడుపుగా చెప్పగల నేర్పరితనం కథలను విడవకుండా చదివింప చేస్తాయి.
కథావస్తువులన్నీ వాస్తవసంఘటనలేనని రచయిత్రే ముందుమాటలో చెప్పడం జరిగింది.అయితే ఈ సంఘటనలకు తగినపాత్రలను సృష్టించి,కల్పనను కేవలం కాటుకచందాన ఉపయోగించడం వలన కథలన్నీ రసాత్మకంగా ఆవిష్కరింపబడ్డాయి.
కథావిర్భానికి ఆలోచనే హేతువు.మరి ఆలోచనకు అనుభవాలే వేదిక.రచయిత్రి కథనంలో అనుభవాలను వల్లెవేసినట్లుకాక కథాశిల్పానికి చక్కటి నగిషీలు చెక్కారు.సమతూకంలో అమరిన పాత్రల మేళవింపు,హాస్యపు తాళింపు పఠనాసక్తిని పెంచుతాయి.కథలు మొదట మౌఖికం.అమ్మమ్మ,నానమ్మ లేదా అత్తయ్యలు చెప్పే కథలు పిల్లలలో కథానురక్తిని కలిగిస్తాయి.ఈ అనురక్తే కథల అత్తయ్యగారు సంపుటానికి మూలమనవచ్చు.తన బాల్యాన్ని అత్తయ్య ముంగిట్లో పరచి కథలేరుకున్న మాలతిగారికి కథాబీజం అక్కడే అంకురించినట్లుంది.
1950వనాటి జ్ఞాపకమే జేబు కథ. ఆ రోజులలో చదువుకునే ఆడపిల్లల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చు.జామెట్రీ బాక్సు క్రిందపడి చేసిన శబ్దానికి పరిమళ,మాస్టారి ఆగ్రహానికి గురవుతుంది.ఆ బాక్సును తీసుకురావద్దన్నందుకు పెన్సిలు,రబ్బరు వుంచడానికి తల్లితో పోరి మరీ జాకెట్టుకు జేబును కుట్టించుకుంటుంది.ఈమాట.కాంలో ప్రచురించబడిన ఈ కథలో హాస్యరసం ప్రత్యక్షంగా కనపడదు.అయితే మనం దృశ్యీకరించుకుంటూ చదివినపుడు నవ్వులు పూస్తాయి.
పిల్లలను పెంచడంలో ఒకొక్కరిది ఒక పంథా.ఆడ,మగ తేడాల్లేని పెంపకం నేటితరానిది.పెంపకంలో వైవిధ్యం అమ్మాయిని ధైర్యశాలిగా,అబ్బాయిని భీరువుగా చెయ్యవచ్చు.అయితే అదే ఉపద్రవం అనుకుంటూ బాధపడ్డ ప్రదీపు కొడుకును బలవంతంగా సముద్రంలోకి తీసుకెళతాడు.అయితే పిల్లల పెంపకానికి సిద్ధాంతీకరణకాక సమయస్ఫూర్తి కావాలన్న సూక్ష్మాన్ని పార్వతి పాత్ర ద్వారా చెప్పించడం పెంపకం కథ ముగింపుకు నిండుదనాన్నందించింది.
అమెరికాలో మంచువర్షం ఆహ్లాదమే కాని అజాగ్రత్తగా కాలు మోపితే ప్రమాదంలోకి తోస్తుంది అనే హెచ్చరిక అయ్యో ఒక్కరైనా చెప్పలేదే అనే కథద్వారా అందరికి చెప్పారు.

అక్షరం పరమపదం ఆకట్టుకునే కథ. చక్కటి మాండలికం చదువరిని విశాఖతీరాస కూచోబెడుతుంది.అక్షరజ్ఞానంలేని సంద్రాలు సూక్తిముక్తావళిని ఔపోసన పట్టినట్లు తన వాగ్ధారతో అబ్బురపరుస్తుంది. ఏటుండిపోతాదంటూ వేదాంతం వల్లించే సంద్రాలు నువ్వు మడిసి జలమమెత్తినందుకు నీకో దరమం ఉన్నది,అది నువ్వు చేసుకోవాల.అని చెప్పడం మనిషికి మార్గనిర్దేశనమే.

కథల అత్తయ్యగారిని తొలికథలో పరిచయంచేసి చివరికథ శివుడాజ్ఞలో ప్రత్యక్షంచేసి కథలకూర్పులో సమన్వయం చూపారు.చిన్ననాడు కథలు చెప్పిన అత్తయ్యను కలవాలన్న తపన,కలిసినపుడు తన్మయత్వం,కలవకపోతే బాధ.ఈ రెండు ముగింపుల కథ పాఠకుల ఊహాశక్తికి ప్రేరణ కలిగించే చక్కటి ప్రక్రియ. ధైర్యంగా మాట్లాడలేనివారిని నోట్లో నాలుక లేని వారంటాం.కాని అటువంటి వారికి కూడా పరిస్థితులనుబట్టి నాలుక మొలుస్తుంది.అదే వజ్రాయుధమవుతుంది అని చెప్తుంది పలుకు వజ్రపు తునక.ఆరాలు తీయడం సమాజ లక్షణమని,సమూహ నైజమని గుర్తించాలికాని ఉలిక్కి పడగూడదని చెప్పే మీరెవరి తాలూకు,హాలికులైననేమి వంటి చక్కటి కథలున్న ఈ సంపుటం నిస్సందేహంగా అగ్రస్థానంలోనే ఉంటుంది.
నిడదవోలు మాలతిగారి కథాసంఘటనలు ఎక్కడో ఒకచోట తారసపడేవే.జన్మస్థలాన్నివదలి మూడున్నర దశాబ్దాల క్రిందటే అమెరికాలో అడుగుపెట్టిన వ్యక్తి.వేరుమరచి కొత్తకొమ్మలు,రెమ్మలపై మనిషి ఊగుతున్న నేపథ్యంలో మూలాలు మరువక బాల్యపు ఊసులను,అమెరికా జీవనాన్నికథల అత్తయ్యగారు రూపేణా మనకందించడం ఎక్కడవున్నా మరువని తెలుగు భాషకు,
తెలుగుతనానికి కైమోడ్పు.చక్కని వరుసక్రమంలో,బాపు ముఖచిత్రంతో ఏర్చికూర్చిన విశాలాంధ్ర పబ్లిషర్స్ అభినందనీయులు.

సి.ఉమాదేవి
కథల అత్తయ్యగారు
రచయిత్రి-నిడదవోలు మాలతి
పేజీలు-160 వెల-70/-
ప్రతులకు-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

Sunday, February 12, 2012

మరపురాని అరకులోయ!

10 comments


మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే క్రమంలో ప్రకృతిపాత్ర తక్కువేమి కాదు.అరకులోయ ప్రకృతికి చిరునామా.అరకులోయ అనగానే మనసు పులకరిస్తుంది.కనులముందు పచ్చని ప్రకృతి సాక్షాత్కరిస్తుంది.అప్పుడప్పుడే ఊహలు నాతో ఊసులాడుతున్న బాల్యం.విశాఖలో చదువు,సెలవులలో అరకులోయ.విద్య నేర్పిన పాఠాలతో అలసి సెలవులకు అమ్మ,నాన్న వున్న అరకులోయకు ప్రయాణం. తల్లిదండ్రులకన్న ముందే ప్రకృతి తల్లి పలకరించేది.చెయ్యిచాపి ఒడిలోనికి పొదువుకునేది.తల్లి ఒడి తరువాత అంతకు అంత స్పందింపచేసిన ప్రకృతి ఒడిలో ఊహలకు రెక్కలొచ్చాయి.కలలు రూపుదిద్దుకున్నాయి.సెలవులు ప్రకటించగానే మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డు ప్రయాణం గుర్తుకొచ్చి ఒళ్లు గగుర్పొడిచేది.భయము,సంతసము కలగలిసిన భావన.


అది 1959వ సంవత్సరం.ఈనాడు వున్నట్లు ఆరోజుల్లో అరకులోయకు రైలు మార్గంలేదు.విశాఖపట్నంనుండి రెండు బస్సులుండేవి.ఒకటి రాందాసు ట్రాన్స్ పోర్ట్ వారిది.మరొకటి తపాల్ బస్సు అనేవారు.మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చేది.రాందాసువారిది రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేది. తపాల బస్సంటే తెగ సంబరం.పోస్టులో తెప్పించుకునే వార,మాసపత్రికలను మోసుకొచ్చే బస్సంటే సంతోషపడనివారుంటారా?అయితే పుస్తకాలన్నీ పగలే చదివేవాళ్లం. ఎందుకంటే అప్పటికింకా కరెంటు స్థంభాలు రాలేదు.విద్యుత్తు సరఫరాలేదు.చీకటి పడుతుండగా డైనమో వేసేవారు. ఠంచనుగా రాత్రి పదింటికల్లా ఆపేసేవారు.ఆ లోపల దుప్పటిలో దూరాల్సిందే!పైగా పదినెలల వాన,విపరీతమైన చలి. బొగ్గుల కుంపటిలో నిప్పులు చేతులు వెచ్చబెట్టుకోవడానికే కాదు కట్టుకోవాల్సిన బట్టలను కూడా ఆరబెట్టుకోవడానికి పనికి వచ్చేవి.ఇక విద్యుత్తు లేని రోజుల్లో హరికేన్ లాంతర్లు,పెట్రొమాక్స్ లైట్లే అప్పటి నియాన్ లైట్లు!


మార్చి,ఏప్రిల్,మే నెలలు విహారానికి బాగుంటాయి.ఈ నెలలు వేసవి ఆటవిడుపులే.ఏప్రిల్ లో పరీక్షలవడం ఆలస్యం సింహాచలం రూట్లో వెళ్లే బస్సును ఒడిసి పట్టుకోవడం అదో థ్రిల్లు.అనంతగిరి ఘాట్ లో వాయునందనుడిని దర్శంచుకున్నాకే ప్రయాణం జంకు వదలి నిర్భయంగా చేసినట్లు భావన కలిగేది. ప్రకృతిని ఆస్వాదించాలంటే కొండలు,లోయలు,జలపాతాలు పుష్కలంగా దర్శనమిచ్చే అరకులోయను మించి మరోటి వుండదని ఆనాటి మా గట్టి నమ్మకం.మరి అరకులోయ నేటికీ ప్రకృతికి నిలువెత్తు చిరునామాయే కదా!


మేఘాలు వాహనాలలోనికి చొచ్చుకుని వచ్చినట్లుండేవి.మేఘాలు కొండలను ఢీకొట్టి వర్షించడం కాంచి పరవశులమైపోతాము. పచ్చని తివాచీ పరచినట్లు కనబడే కొండలు దగ్గరయేసరికి పెద్ద పెద్ద చెట్లతో దర్శనమిచ్చేవి. అరకు లోయ ఒక పెద్ద బొటానికల్ గార్డెన్ అనిపించేది.ఇఫ్పటిలా పార్కులులాంటివి ఏర్పడకముందే అక్కడ ఆర్కిడ్స్ లో కాఫీ తోటలు,లిచ్చీస్,రోజ్ యాపిల్స్,దాల్చిన్ చెక్క,లవంగాలు, ఒకే మొక్కకు వందలాది పూలు పూచే గులాబీలు వెరసి అన్నీ కలిసి అందించే వింతైన పరిమళం.వీనులవిందైన పాటలకు దీటుగా పక్షుల కిలకిలారావాలు.అడవి బిడ్డల అలరించే థింసానృత్యం!


అవని కాన్వాస్ పై ప్రకృతి పరచిన వర్ణచిత్రం అరకులోయ.నేలను కనబడనివ్వనంత పచ్చదనం.ఆకాశం నిర్మలంగా వున్నా చిలిపి చినుకులు లయబద్ధంగా తకథిమి చేస్తూనే స్పృశిస్తుంటాయి.రూపాయి పట్టుకుని అంతా కలియదిరిగినా బిస్కెట్,బ్రెడ్ వంటివి అవసరానికి దొరికేవికావు.సుంకరమెట్ట సంతలో తేనె,చింతపండు, కాఫీగింజలు, ఆవాలు,చీపుర్లు దొరికేవి.మించి కావాలంటే శృంగవరపు కోటకు వెళ్లాల్సిందే.అంటే ఏదైనా కొనుక్కోవాలంటే యాభై కిలోమీటర్లు పయనించాల్సిందే.నలభైతొమ్మిది టనెల్స్ లెక్కపెట్టడం ఆనాటి సరదా.ఇక బొర్రా గుహలు సినిమావాళ్ల కంటబడ్డాకే వాటికి గుర్తింపు వచ్చింది. విశాఖలో బయలుదేరి అరకులోయ చేరేలోపు ఘాట్ దారంతా కరివేపాకు చెట్లు, సీతాఫలాలు,పుల్ల నారింజ చెట్లు,కుంకుడు చెట్లు,అడ్డాకులు- ఎవరు నాటారు వీటిని అని ఆశ్చర్యపోతాం.సిల్వర్ ఓక్,యూకలిప్టస్ చెట్లు ఏపుగా పెరిగి అందనంత ఎత్తాకారం అన్నట్లు పరవశింప చేస్తాయి.


ఇక అరకు చేరుకున్నాక మనల్నిచూసి అరవిరిసిన మొగ్గల్లాంటి అడవితల్లి బిడ్డలు చిందించే చిరునవ్వులు పాలస్ఫటికంలాంటి అమాయక వదనాలలో ఆనందం,ఆశ్చర్యం కలబోసిన జుగల్ బందీ మన మనసుపై ముద్ర వేసే మాయాజాలం!మోసమెరుగని మనుషులు, మాలిన్యమంటని మనసులు,పాపపుణ్యాల తూకం తెలిసిన సమవర్తులు. వీరి గూడు, నీడ, గడ్డి పైకప్పుగాకల గుడిసెల్లాంటి ఇండ్లే.అయితేనేం,ప్రకృతి ఒడిని సొంతం చేసుకున్న ముద్దుబిడ్డలు.

ఓహ్! ఎటుచూసినా నయనానందకరమే! స్పందించే మనసుండాలేగాని ప్రతి దృశ్యము అమోఘమైన చిత్తరువే. పలకరించే పవనాలు, ఉరకలేసే జలపాతాలు, ఘాట్ రోడ్ లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయే కొండ చిలువలు,చెంగున ఎగిరి వచ్చే జింకలు,బిక్కు బిక్కుమని బిత్తర చూపుల కుందేళ్లు-- ఇవన్నీ ఇప్పటికీ మాయని వెచ్చని అనుభూతులే.
ఆకులో ఆకునై ,పువ్వులో పువ్వునై,కొమ్మలో కొమ్మనై ---ఈ అడవి దాగిపోనా ఎటులయినా ఇచటనే రాలిపోనా అనిపించి ప్రకృతిలో మమేకమైన భావన కలిగేది.కన్న తల్లిని,కన్న ఊరును మించినది లేదు నిజమే.కాని క్రిష్ణయ్యను పెంచిన యశోదమ్మను మరవగలమా?అలాగే అరకు లోయ నన్ను పెంచిన తల్లి.అరకులోయతో అనుబంధం మరువ లేనిది మరువ రానిది.

Sunday, February 5, 2012

నాన్న-నేను

4 commentsగతసంవత్సరం సాక్షి ఫన్ డేలో నా సమీక్షావ్యాసం.ఆలవోకగా అల్లబడిన అక్షర రేఖలు-నాన్న-నేను
బాల్యపు ఊసులు పదిలపరచబడిన జ్ఞాపికలు.ఈ జ్ఞాపికల సమాహారాన్ని మనముందు సాక్షాత్కరింపచేసిన బుజ్జాయిగారు అభినందనీయులు.సంఘటనల కమనీయమైన కలనేతలో పఠనానికి సమాంతరంగా పాఠకులు కూడా అల్లుకు పోతారు.నాన్న-నేను అని ఆప్యాయతను తలపించే శీర్షికతో నాన్న ఇష్టాలు, చిలిపి చేష్టలు వర్ణించి నవ్వులు పూయిస్తారు.అబద్ధపు కథలను నమ్మినట్టు నటించి చుట్టు ఉన్నవారికి హాస్యరసానందాన్ని పంచిన నాన్న చిలిపితనాన్ని మనసుతో తడుముతారు.
ఒక కథ రాసో,ఒక సినిమాలో నటించో సెలబ్రిటిలమైపోయామనుకునేవారికి బుజ్జాయి గారు,బాల్యము నుండి తండ్రితోపాటు తిరిగి మహామహులైన స్థానం నరసింహారావు,బెజవాడ గోపాలరెడ్డి,కాంచనమాల,విశ్వనాథ,బాపిరాజు వంటి దిగ్గజాలతో పంచుకున్న అనుభవాల అనుభూతులు అద్వితీయం.రవీంద్రుని పాదాల చెంత నాన్న తనను పడుకోబెట్టడం, నాన్న ఉపన్యాసాన్ని ఆపమని అరచినప్పుడు, బుజ్జాయిని బుజ్జగిస్తూ మరిక ఆ ప్రసంగం వినపడకుండా (వినబడితే ఆపమంటాడేమోననే భయంతో) శ్రీశ్రీ ఎత్తుకొని బిస్కెట్లు కొనిచ్చి, గంటసేపు ఆరుబయట తిప్పడం వంటి సంఘటనలు చదువుతుంటే ఆడంబర మెరుగని తేనెపలుకులు ధారగా కురిసి రసాలూరిస్తాయి. బుజ్జాయి వేసిన పెన్సిల్ స్కెచ్ బళ్లారి రాఘవ గారి ఇంట భద్రంగా వుండటం బుజ్జాయిగారి రేఖావిన్యాసానికి నజరానా!పసితనాన్నే రేఖలు దిద్దిన బుజ్జాయిగారు బడిన చదవకపోయినా కనబడిన వాల్ పోస్టర్ల ద్వారా అక్షరాలను గుర్తించి నేర్చుకోవడం ఒకింత విస్మయ మనిపిస్తుంది.బడిలో దొరకని ఎన్నో విలువైన అనుభవాలను, అనుభూతులను, సాహితీ సభలను తలపించే సాహితీ చర్చల నడుమ, సమావేశాలకు విచ్చేసే ఎందరో ఉద్దండుల సరసన తన చెయ్యివీడని తండ్రి ఒడిలోనే చదవగలిగారు.
సాహితీ గుబాళింపులు తండ్రికే వదిలి బొమ్మలు చెప్పే కమ్మని కథలను వేలికొసలనలవోకగా చిత్రించి బాలబాలికలనేకాదు,పెద్దలను కూడా మురిపించి,మైమరిపించిన బుజ్జాయి చిత్రాలు మన కళ్లను చిత్తరువులై నిలుపుతాయి.నాన్నపండించిన సాహితీ క్షేత్రాన్ని,తన చిత్రకళా క్షేత్రాన్ని సమాంతరంగా దర్శింపచేసుకున్న బుజ్జాయిగారు ప్రాజ్ఞులు. బాల్యంలో తెలిసీ తెలియని అల్లరితో నాన్నను దాదాపు నాలుగు మైళ్లు కారు దిగి నడిచేలా ఇబ్బంది పెట్టినా, కాలక్రమేణా తండ్రి అనారోగ్యానికి గురైనపుడు, ఆయనను పసిపాపడిలా చూసుకున్న వైనం మనసును కలచివేస్తుంది.అభిమానుల గౌరవాన్ని సమృద్ధిగా పొందిన క్రిష్ణశాస్త్రిగారి పలుకుబడి ఎన్నో సందర్భాలలో బుజ్జాయిగారికి శ్రీరామరక్షగా భాసిల్లింది.ఈ సంఘటనల సమాహారాన్ని చదువుతుంటే మన ఆత్మీయుడు మన దగ్గర కూర్చుని గుండెలో దాచుకున్న స్వానుభవాలను గుర్తుకు తెచ్చుకుంటూ అర్ద్రతగా చెప్తున్నట్టనిపిస్తుంది. దృశ్య కావ్యంగా గోచరించి మనసును అలరించే ఈ పుస్తకంగురించి ఇంకా ఏం చెప్పినా,ఎంత చెప్పినా సశేషమే!

సి.ఉమాదేవి