Monday, October 28, 2013

పునరపి బాల్యం

18 comments
7-11-2013,ఆంధ్రభూమి వారపత్రికలో  నా కథ.
అమ్మాయ్, ఈ వేళ ఏం వండుతున్నావ్?కూరగాయల బండి దగ్గర నిలబడి వంకాయలు పుచ్చులు లేకుండా చూసి చూసి కొనుక్కుంటున్న కోడలు మాధవిని కుతూహలంగా అడిగాడు చలపతి.
ఏదో అడుగుతున్నారన్నారమ్మా పెద్దాయన!” కూరల బండివాడు మాధవిని హెచ్చరించాడు.
ఆయనకు పనేముంది?ఇదే పని...ఇవేప్రశ్నలు,ఏం వండుతున్నావు?ఎప్పుడు పెడ్తావు అని! సరే నువ్వు తూకం వెయ్యి మళ్లీ నాకు వంకాయలు వద్దు అలర్జీ, దుంపలొద్దు వాతం అంటూ నా ప్రాణం తీస్తాడు.
పుదీనా ,కొత్తిమీర ఆకుకూరలలోంచి తొంగి చూస్తున్నాయి. పుదీనా పచ్చడి తలుచుకున్న చలపతికి నాలుక జివ్వుమంది. భార్య ఉన్నప్పుడు తిండికి మొహం వాచింది లేదు. తనెప్పుడు ఇది వండిపెట్టు అని అడిగింది లేదు. తనకేది ఇష్టమో తనే ముందుగా చేసిపెట్టేది. తినలేనని  తన మారామేకాని నువ్వు కోరినవి నేను చేయలేనని ఏనాడు విసుక్కోలేదు. ఆమె మరణంతో తాను కోల్పోయింది ఇల్లాలిని కాదు తల్లిని అని అర్థమయేసరికి చలపతిని వచ్చి వరించాయి శారీరక రుగ్మతలు. చేతుల వణుకు,పాదాల తడబాటు ఊతకర్రను హత్తుకున్నాయి.  వేళకు పిలిచే వాళ్లు లేరు,పిలిచినా వండి పళ్లెంలో పెట్టేవాళ్లు లేరు.
ఇంకా ఎందుకు నాన్నానీ భీష్మ ప్రతిజ్ఞలు?పైకి నవ్వినా మనసులో బాధపడుతూ అడిగాడు కొడుకు రాఘవ చేతులు కాల్చుకుంటున్న తండ్రిని చూచి.
నేను,మీ అమ్మ ఒకరికి ఒకరై బతికాము.ఈ పల్లెను, ఇల్లును వదిలి రాలేను.అయినా నీ ఉద్దేశం ఏమిటి?” ‘ తనిక వంటరిగా బ్రతకలేననుకుంటున్నాడేమో!చలపతికి పట్టుదల తారాజువ్వలా ఎగిసింది.అయితే ఒకరోజు ఆయన పట్టుదల కాస్త జారిపడ్డ సబ్బుపైనుండి జర్రున జారిపోయింది. సన్నగా విరిగిన చెయ్యి, కట్టు కట్టించుకున్నా సహకరించకపోవడం ఒకవైపు, వంటపనికి అంతరాయంగా పరిణమించడం మరొకవైపు! పంటి బిగువున పట్టుదలను అదిమిపెట్టి  కొడుకు వెంట నడిచాడు చలపతి.
ఏదో వయసుడిగిన మనిషి, కాస్త నాలుగు గింజలు ఎక్కువ ఉడుకుతాయి.తనకూ కాస్త తోడుగా ఉంటాడనుకుంది కోడలు మాధవి.
నీకు ముందుగా చెప్పకుండా  నాన్నను పిలుచుకుని వచ్చేసాను. చెయ్యికి కట్టు సరిగా కట్టించాలి. ఆయనలా ఇబ్బంది పడుతుంటే  ఊర్లో మన గురించి నలుగురు ఏమనుకుంటారు?

   “నాకు ఇంతగా చెప్పాలా ?మనమెప్పుడో రమ్మన్నాము కదా! మనతోపాటు మామయ్య గారు కూడా  ఉంటానంటే నాకేం శ్రమ?సంతోషంగా అంగీకరించింది మాధవి. అర్థం చేసుకునే భార్య అంటూ పొంగిపోయాడు రాఘవ.
తనకు పనేం ఉంటుంది,ఎంత తింటాడు? ఏం తింటాడు? అని అనుకున్న మాధవికి తన మామగారు చిన్న పిల్లలకన్న ఎక్కువగా తిండి కోసం మారాము చేస్తున్నట్టుగా అనిపించసాగింది. ఆహారంలో రుచుల  గురించే కాదు ఆయనలో అడిగింది చేసిపెట్టాలన్న మొండితనం, ఆకలికి ఆగలేకపోవడం, కేకలు కూడా మోతాదుకు మించి ఉన్నాయనుకుంది.  ఈ ధోరణికి అడ్డుకట్ట ఎలా వేయాలో తెలియక భర్తకు చెప్పాలనుకుంది. అపార్థాలొస్తాయని ,ఇష్టం లేక వంకలు వెతుకుతున్నానని అనుకుంటాడనే భయం మరొక వైపు! ఇన్ని ఆలోచనల నడుమ వంటపని అంటే అయిష్టత ఏర్పడి క్రమంగా మామగారి పట్ల విముఖత ఊడలమర్రిగా మారింది.
అమ్మాయ్ నా ఫ్రెండ్ వచ్చాడు, కాస్త జ్యూస్ ఇస్తావా?
త్వరగా లెక్క చూడు. కేకలు పెద్దవవుతాయి.
ఏదోలేమ్మా పెద్దతనం, చూసీ చూడనట్లు ఉండాల!” అంటూ డబ్బు సరిచూసుకుని  ఇవ్వాల్సిన చిల్లర, కూరగాయలు మాధవికి అందించాడు.
అందరూ మాకు చెప్పే వాళ్లే పిల్ల చేష్టలతో నువ్వు వేగు తెలుస్తుంది .
అమ్మాయ్ మాధవీ జ్యూస్ అడిగానమ్మా!”  చలపతి గొంతులో అసహనం!
వస్తున్నాను మామయ్యగారు  అంటూ గబగబా కూరలు వంటింట్లో ఉంచి, రెండు గ్లాసులలో  ఆరెంజ్ జ్యూస్ నింపి ఇచ్చింది.
ఫ్రెండ్ తో కబుర్లు, నవ్వులు, జోకులు జడివానలా కురుస్తూనే ఉన్నాయి.
అమ్మాయ్ కాసిని పల్లీగింజలు పెట్తావా,కబుర్లాడుకుంటూ తింటాం.  
ఈ మామయ్య ఎప్పుడేం అడుగుతాడో,ఇంట్లో ఉందో లేదో అనే ధ్యాస ఉండదు. లేదంటే  నేను వెళ్లి తెచ్చుకుంటానంటాడు. అదీ కష్టమే తండ్రిని ఒక్కడిని ఎక్కడికి పంపడు.


ఏమ్మా లేవా?ఏమిటో గుప్పెడు వేరుశెనక్కాయలకు మొహంవాచిపోతున్నాం. పొలాల్లో కాయలు తవ్వినప్పుడు కాల్చుకుని అక్కడికక్కడే  ఎన్ని తినే వాళ్లం! ఎలా హరాయించుకునే వాళ్లం! పిడికెడు గింజలకు పావురాళ్లలా వెతుక్కోవలసివస్తోంది. చలపతిలో కోరినవి దొరకలేదన్న నిస్పృహ!
ఇటు చలపతి కొడుకు దగ్గరకు వచ్చి ఏడాది దాటుతోంది, అటు మాధవిలో చిరాకు, విసుగు ఏడుపు రూపాన్ని సంతరించుకుంటున్నాయి ! ఈ రోజైనా భర్తతో చెప్పి తాననుకున్న పరిష్కారానికి ఒప్పించాలనుకుంది. కన్నీళ్ల స్థానంలో కళ్లు కోపాన్నికురిపిస్తున్నాయి. పచ్చడికి దాచి ఉంచిన గింజల డబ్బా టీపాయ్ మీద బలంగా తాకింది. కాసిని గింజలడిగిన పాపానికి విదిలించిపారేసినట్లు ఈ చోద్యమేమిటా అని తెల్లబోయారు స్నేహితులిద్దరు. చిన్నబోయిన ముఖంతో ఉన్న చలపతి నాలుక, గింజల కమ్మదనాన్ని మరిక ఆస్వాదించలేకపోయింది.
వ్యవసాయం రాబడి నేటి వ్యయానికి సాయం వరకే. పూర్తి బరువును దింపలేదు. చెయ్యి చాచి కొడుకును ఖర్చులకోసం అడగలేడు. స్కూటరు పెట్రోలుకే రాబడంతా తగలబడిపోతున్నట్లు బాధపడే కొడుకును నా స్నేహితులను ఆటోలో వెళ్లి కలుసుకుంటాను అని అడిగే ధైర్యం లేకపోయింది. పోనీ స్కూటరులో వదిలి రమ్మని అడిగి, వారమంతా పనితోఅలసిన కొడుకుకు దొరికిన ఆదివారాన్ని కబ్జా చేసినట్టుంటుంది అనే చింత ఒకవైపు! నగరంలో విసిరేసినట్లున్న ఇండ్లను చేరుకోవాలంటే  ఇంత దూరమా అనే దిగులు మరొకవైపు ఉన్నా స్నేహితుడిని కలుసుకోవాలన్న ఉత్సాహం చలపతిని తన ఆలోచన వైపు నడిపింది. అనుకున్నదే తడవుగా ఎవరికీ నష్టం,కష్టం కలగదనుకుని తాననుకున్న ప్రణాళికకు  రచించేసాడు. అయితే ఫలితం మరొకటయింది.
మోచేతికంటిన మట్టిని దులుపుకుంటూ భయం భయంగా చూసాడు కొడుకువైపు.
నాతో చెప్పకూడదా నాన్నా....తీసుకెళ్లేవాడినే... బస్సు ఎక్కలేవు కదా, ఎందుకు ఎక్కావు?
బస్సు ఎక్కలేరు మాస్టారు, అని చెప్తూనే ఉన్నానండి,వినిపించుకుంటే కదా... అంటూ చలపతి కొడుకుతోపాటు తాను చెయ్యందించాడు ఫోను ద్వారా చలపతి పడిపోయాడన్న విషయాన్ని చేరవేసిన వ్యక్తి.
కాస్త బ్యాలన్స్ తప్పిందిలేరా, ఇలా జరుగుతుందనుకుంటానా?చిన్నప్పుడు తనను మందలించిన తండ్రి వైపు చూస్తున్నట్టుగా బిక్కుబిక్కుమంటూ చూసాడు కొడుకు వైపు.
సరేపద...అవతల   మాధవి కంగారు పడుతుంటుంది. ఇంతకీ  ఇంటికెళ్దామా?మీ స్నేహితుడిని కలుస్తారా? అడిగాడు  రాఘవ.

ఈ వేషంతోనా వద్దులేరా తనదగ్గరకు వస్తూ పడిపోయానని వాడు మనసు కష్టపెట్టుకుంటాడు.అంటూ తను బస్సులోనుండి పడగానే తన గాయాన్ని కడిగి, తాగడానికి నీళ్లందించిన వ్యక్తికి నమస్కరించాడు చలపతి.
అయ్యో1పెద్దవారు, నా తండ్రిలాంటివారు,నాకు నమస్కారం పెడతారేం సార్!” అని చలపతి చేతులను ఆప్యాయంగా పట్టుకుని వారించాడావ్యక్తి.
మాధవి గాభరాగా ఎదురొచ్చింది.
అలా వెళ్లొస్తానంటే,ఏదో నాలుగడుగులు నడిచొస్తారనుకున్నాను.మీరిలా చేస్తే ఎలా? నలుగురు ఏమనుకుంటారు అనే భయం ఆమెది.
ఏంలేదమ్మా తోచకపోతేను మా మురళీధరాన్ని కలిసొద్దామనుకున్నాను.”
“  నేను లోపల పనిలో ఉన్నాను మీరు ఎంతసేపైనా రాలేదు.సరే రండి భోంచేద్దురుకాని.తనదేం తప్పు లేదన్న భావాన్ని పలికిస్తోంది మాధవి.
నాన్నా నేను తీసికెళ్తాను మీ స్నేహితుల దగ్గరకు. మీరేం ఫీట్లు చేయకండి.కాసేపు పడుకోండి.నవ్వుతూ అన్నాడు రాఘవ.
నిద్రపోవడం తప్ప మరో పనిలేదు. పల్లెలో పొలానికి  కలుపు తీయించడం, నీళ్లు పారించడం, విత్తనాలు వేయించడం  పచ్చదనానికి శ్రీకారం చుట్టడం. అందరిని కలుపుకుని పోతూ పల్లెలో పొలం పనులు చేయిస్తుంటే చల్లని పైరగాలికి తనే కాదు పుడమితల్లీ  పులకరించేది. ప్రాణానికి మరింత ప్రాణవాయువందేది. ఇక్కడ  ఈ అపార్ట్ మెంట్ లో ఫ్యాను గాలే పైరగాలి!
వంట గదినుండి  చారుకు  పెట్టిన పోపు వాసన గుప్పుమంది.ఉయ్యాలలో పిల్లాడు ఉలిక్కిపడి లేచినట్లు లేచి కూర్చున్నాడు  చలపతి. జుట్టు సవరించుకున్నాడు.చేతులు గట్టిగా రుద్దుకున్నాడు వేడి పుట్టేలా. మరిక పడుకోలేకపోయాడు.
అమ్మాయ్ కరివేపాకు,కొత్తిమీర బాగా వెయ్యి. మీ అత్తయ్య ఇవి లేనిదే చారు చెయ్యననేది. పూలకు పరిమళం,చారుకు తాళింపు గుబాళిస్తేనేకదా తృప్తి! ఇంతకీ చారులో నంజుకోవడానికి వడియాలున్నాయా?అల్లం పచ్చడి ఉందేమోకదా! ”  


మొన్న పుదీనా పచ్చడి, నిన్న టమాట పచ్చడి, ఈ రోజు కొత్తిమీరతో! తీరా చేసాక ఏం పచ్చడో ఏమిటో, రోటి పచ్చడిలా లేదనే విలాపం మొదలు.
మాధవికి ఇందాకటి గాభరా,దిగులు లేవు. వాటి స్థానాన్ని చిరాకు,కోపం ఆక్రమించుకుంటున్నాయి.
నీకు బి.పి,పెరిగి పోతుంది మీ మామగారి విసిగింపులకు తెరదించుతానంది మాధవి స్నేహితురాలు.
ఎలా అంది?” మాధవి.
మాకు తెలిసిన వాళ్లు వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. డాక్టరున్నాడు, పనివాళ్లున్నారు,  టి.వి,ఫ్రిజ్ అన్నీ ఉన్నాయి. మీ మామగారు అక్కడ ఉన్నా ఇక్కడకు వస్తుండవచ్చు, మీరు వెళ్లి చూసి రావచ్చు. పేపర్లుంటాయి,పుస్తకాలుంటాయి. ఆయనకు సరదాగా ఉంటుంది.
తన స్నేహితురాలు ఇంత పాజిటివ్ గా చెప్పాక, ఇన్ని ప్లస్ పాయింట్లు దొరికాక తన భర్తకు ఈ దిశగా సూచన చెయ్యడం తప్పేమి కాదనిపించింది. కాని మాధవినుండి ఇటువంటి సూచన వస్తుందని ఎదురు చూడని రాఘవ తెల్లబోయాడు. అందరిలా  కాదు,విలువలు తెలిసిన వ్యక్తి అనుకుంటే ఆమెనుండి  ఇలాంటి సలహా వస్తుందనుకోలేదు.
ససేమిరా వీల్లేదన్నాడు.
నీకు కష్టమైతే చెప్పు నా తంటాలేవో నేనే పడి ఆయనకు కావలసినవి చూసుకుంటాను.అని కోపగించుకున్నాడు.
స్నేహితురాలి సలహా రక్షణ కవచంలా ఉంది మాధవికి.
మామగారు మీకేం తోచడంలేదుకదా...మాకు తెలిసినవారి తల్లిదండ్రులంతా ఒక ఇంట్లో ఉన్నారు.వృద్ధాశ్రమం అని అనలేకపోయింది.
ఎందుకట?ఆశ్చర్యంగా అడిగాడు చలపతి.
అదే సరదాగా ఉంటుందని.మాధవి నాలుక తడారిపోతోంది. మామగారి స్పందన ఎలా ఉంటుందోనన్న భయం కూడా తోడయింది.
ఇదెక్కడి సరదా అమ్మా! వాళ్ల పిల్లలేమనుకుంటారు?మరిక మాట పెగల్లేదు మాధవికి.

వాళ్ల పిల్లలే వాళ్లనక్కడ ఉంచారని చెప్పలేకపోయింది.
కాని ఆలోచించేకొద్దీ చలపతికి అస్పష్ట చిత్రం స్పష్టంగా కనబడసాగింది.తనకు మాధవి మంత్రోపదేశం చేసినట్టనిపించింది.
తనవల్ల మాధవికి ఇబ్బందిగా ఉందేమో! పాపం నిజమే! పిచ్చిపిల్ల!  అన్నీ తనే చేసుకోవాలి. తనను కూడా వెళ్లి చూసి రమ్మంటోందా? అక్కడికే వెళ్లి ఉండమంటోందా?చలపతిలో అంతర్మథనం.
మాధవి ముభావం,మాటలు కరవైన కాపురం రాఘవను తండ్రిని వృద్ధాశ్రమం వైపు నడిపించాయి. మాధవి చెప్పిన ఇంటి గుమ్మాన్ని సరదాగా ఓసారి ఎక్కి చూడాలనుకున్నాడు కాని ఇలా వృద్ధాశ్రమ తలుపులు బార్లా తెరచుకుని తనకు ఆహ్వానం పలుకుతాయనుకోలేదు చలపతి.  అక్కడ ఉన్నవారు కొత్తగా వచ్చిన వ్యక్తిని హాస్టల్ లో చేరడానికి వచ్చిన కుర్రాడిని చూస్తున్నట్టుగా చలపతివైపు జాలిగా చూస్తున్నారు. తన బట్టల సంచీ,చేతికర్ర మాత్రమే తనవెంట వచ్చాయి. భార్యలేదు భుజంపై చెయ్యివేసి నడవడానికి డెబ్భయవయేట భార్య కొనిచ్చిన జన్మదిన బహుమతి చేతికర్ర!
నిర్లిప్తంగా నవ్వుకున్నాడు చలపతి.
నేను ఈనాటి న్యూస్ పేపర్నికాను, నిన్నటి న్యూస్ పేపర్ని... వేస్ట్ పేపర్ని అనుకున్నాడు. అందరు తనవంక చూస్తూ చిరునవ్వుతో తలపంకించడం ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు. ఇదేం కొత్తకాదు, నువ్వేం కొత్తగా ఫీలవకు వెర్రి నాగన్నా అనే అర్థం కూడా స్ఫురించింది చలపతికి.
అల్లరి ఎక్కువైన కుర్రాడిని హాస్టల్ లో వదిలితే బావురుమంటాడు. మానసిక స్థితి అదేకాని పెరిగిన వయసు చెమర్చుతున్న గుండెను చిక్కబట్టుకుంది.
నాన్నకు కాస్త కాలక్షేపం అవుతుందనుకుని తనకుతాను సమాధానపరచుకున్నాడు రాఘవ. మాధవి ఇక చిన్నబుచ్చుకోదన్న ఊరట మనసులో!
మాధవికి ఇంట్లో మళ్లీ కొత్త కాపురం మొదలుపెట్టినట్లుంది.తండ్రి మంచంపై పడుకుని పద్యాలు వల్లెవేస్తున్నట్లే ఉంది.ఆ ప్రతిధ్వనులు నిశ్శబ్దాన్ని ఛేదించినట్లనిపించినా శూన్యం భయపెడుతున్నట్లుంది. పెళ్లయి నాలుగేండ్లు గడిచినా పిల్లలు కలగని మాధవికి చిన్న కుర్రాడిలా మారాం చేసే మామయ్య లేని లోటు నెల కూడా గడవకముందే తెలిసి వస్తోంది. ఇల్లంతా  బోసిపోయినట్లనిపించి  అందులోంచి పుట్టిన శూన్యం  మాధవి మనసంతా ఆక్రమించుకుని సన్నని వేదన మొదలయింది.

మామయ్యగారిని చూసివస్తామండి ఎలా ఉన్నారో అని పోరసాగింది భర్తను.
నెలేగా అయింది,ఆయన ఉన్నప్పుడు గోల!లేకపోయినా గోలేనా? ”  నవ్వాడు రాఘవ.
సరేనండి నాది గోలేలెండి పదండి. అక్కడ ఆయనేం గోల చేస్తున్నాడో వంటవాడిని, మేనేజరును!
మీకోసం మీ అబ్బాయి,కోడలు వచ్చారు అని చెప్పగానే సంబరపడిపోలేదు చలపతి. నవ్వుకున్నాడంతే.ఏదో లోకానికి భయపడి పలకరించడానికి వచ్చారేమో అనుకుని నెమ్మదిగా కర్రపట్టుకుని లేచి నిలబడి అడుగుముందుకేసాడు.
 చలపతికి శరీరం తూలుతున్నట్లనిపించింది.
అయ్యో పడిపోతారు మామయ్యా,అంటూ మాధవి ,నాన్నా జాగ్రత్త! ” అంటూ రాఘవ పట్టుకున్నారు.
మామయ్యా మీ బ్యాగెక్కడ?
ఎందుకు? అంటూనే వేలితో తన గదివైపు చూపించాడు.
బయట పడి ఉన్న ఆయన బట్టలన్నీ సంచిలోకి గబగబాతోసి,
పదండి మామయ్యా! మనింటికి వెళ్దాం.అంది భయం భయంగా!తన తండ్రిని ఈ స్థితికి తెచ్చిన తనపై భర్తకు ఎంత కోపమొచ్చిందో అని బెరుగ్గా చూసింది  రాఘవ వైపు.
వద్దమ్మా నాకు ఇక్కడే బాగుంది. తను వాళ్లనెంత ఇబ్బంది పెట్టానో అనుకోవడానికే  సిగ్గుపడుతున్నాడు చలపతి.
భార్యపై తొంగి చూచిన విసుగును అదుపులో పెట్టుకుంటూ,
ఏమంటావ్ నాన్నా అన్నట్టు చూసాడు రాఘవ.
వద్దురా నాకిక్కడే బాగుంది. నేనే వస్తాలేరా ఎప్పుడో ఒకప్పుడు .నాకిక వేరే షిఫ్టులొద్దు.దృఢంగా పలికాడు చలపతి.
కాని మాధవి కన్నుల్లో  నీరై జాలువారుతున్న పశ్చాత్తాపం చూసాక తప్పించుకోవాలనుకున్న పట్టుదల సన్నగిలసాగింది చలపతిలో!


అందరితో వెళ్లొస్తా నని చెప్పాడు సంతోషంగా. చేతికర్ర కోడలికందించి కొడుకు భుజంపై చెయ్యివేసి నడిచాడు తనకై ఆటో పిలుస్తున్న కోడలి వంక ఆప్యాయంగా చూస్తూ!
తను వచ్చిన రోజు ఉత్సుకత చూపిన ఎన్నోకళ్లు బేలగా, దీనంగా  చూస్తుంటే చలపతికి మనసులో కలుక్కుమంది. తన కోడలిలో వచ్చిన మార్పు తానొక వేస్ట్ పేపర్ అన్న నిరాశనుండి  తనను తప్పించింది. తనను  వెంటాడుతున్న ఆ దీనత్వం నిండిన  కళ్లల్లోకి వెలుగులు నింపేలా మార్పు జరగాలి అని దేవుడిని మనసారా కోరుకున్నాడు.
మార్పు జరగాల్సింది మనసులలో! వృద్ధాప్యం మరో బాల్యమే! ఈ విషయాన్ని విస్మరించిన మాధవి, తండ్రి కొడుకులకు దూరం పెంచి తన తండ్రిలానే వృద్ధుడైన మామయ్యకు ఖేదం కలిగించానే అని బాధపడసాగింది మాధవి.
అమ్మాయ్! ఆ ఆశ్రమానికి వెళ్లకముందు టమాట ముక్కలు ఎండపెడ్తుంటివే, పచ్చడి కలిపేసావా? అక్కడికెళ్లాక  వారానికే జిహ్వ చచ్చుపడిపోయిందంటే నమ్ము. సరేమరి, వంటయేదాక కాస్త టీ,బిస్కట్లు ఇస్తావా అంటూ పుత్రోత్సాహము తండ్రికి .....పద్యమందుకున్నాడు  చలపతి. పునరపి బాల్యం అని నవ్వుకుంటూ టీ,బిస్కట్ల ప్లేటు అందించింది మాధవి.  
                                                            ****************

( ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక సౌజన్యంతో )
                                                                                                                                                                                                                                                                                                                                                                                                      

Sunday, October 27, 2013

కావ్య కస్తూరి

2 comments

ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో   శ్రీనివాసగాంధిగారు రచించిన  కావ్య కస్తూరి కవితల సంపుటిపై నా సమీక్ష.

కస్తూరి పరిమళాల కవితాఝరి
                మనసున మెదిలే భావాలను కవితలుగా సృజించి పాఠకులకందించారు శ్రీనివాస గాంధిగారు. స్పందన అందించిన ప్రతి వస్తు విశేషము వీరి కవితకు స్ఫూర్తే. అయితే పదాడంబరానికి పోక చక్కటి పదాలతో కవితను పారదర్శకంగా రచించి పాఠకులకందించారు.
నువ్వు సున్నావే ననుకున్నా
నువ్వొచ్చికలిశాకా మనం పది అయ్యాం
సున్నాగా వెళ్లి నన్ను ఒకటిగా ఒంటిగా చేశావు
ఇప్పుడు తెలిసింది సున్నా విలువ!
మనం, మోయలేని జ్ఞాపకాలు, ఇంతేనా మరి, ఎటనుంటివో, నానేరమేమి వంటి కవితల నేపథ్యం జీవన సహచరి  మధుర స్మృతులే.
జీవితంలో ఒంటరిగానున్న తనప్రక్కన వచ్చిన భార్య సున్నాలా వచ్చి చేరి తన విలువను పెంచిదంటారు. సున్న తీసేస్తే విలువ కోల్పోయినట్లు భార్య మరణం అతడిని ఒంటరివాడిని చేసినా ఆమె విలువ మాత్రం అతని మనోయవనికపై శాశ్వతంగా పదిలమై నిలిచింది.
పశువును అమ్మినపుడు పైకమిచ్చును కొన్నవాడు
పసుపుతాడుకు ఎదురు సుంకం ఇదేమి కర్మం
మాంగల్యం పలుపుతాడుగ మారినపుడు అన్వయించదగిన కవిత.
మాటవినని మనసును నిన్నెలా జయించను అనే కవితలో ఆర్తిగా ప్రశ్నిస్తారు.
మనసును ఓడించలేకపోవడమే మనిషి పొందే నిరంతర పరాజయం అని మనసు కవితలో ముక్తాయింపు నిస్తారు.
నీకో ఉత్తరం రాయాలా?ఆలోచింపచేసే కవిత. ఫోన్లలో,ఎస్ ఎం.ఎస్ లలో నోటీసులు మొదలుకుని పెండ్లి పిలుపులదాకా అందుతుంటే ఇక ఉత్తరాలు ఎవరు రాస్తారు, ప్రత్తుత్తరాలెవరిస్తారు? ఈకవిత చదివినపుడు వెంటనే కలమందుకుని లేఖకు శ్రీకారం చుట్టి, ఉభయకుశలోపరి అని రాయాలనిపిస్తుంది.
                    ఇక ఓ కవిత పుట్టింది కవితలో కడుపు నింపుకునే దారి చూపించు, కడుపు నిండని కబుర్ల కవిత్వాలెందుకు?  అన్నారు.నేనేం చెయ్యాలి మరో కవితెలా  పుడుతుంది అని ప్రశ్నిస్తారు. తల్లి గర్భంనుండి ప్రసవవేదన అనంతరం బిడ్డ రూపం ప్రత్యక్షమైనట్లు కవి మనసును చీల్చుకుని పుట్టిన కవిత పాఠకుడి మనసును తడిమినపుడు కవితలు పుట్టడమేకాదు పాఠకుల మనసుల్లో చిరస్మరణీమవుతాయి.
 కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.మరి ఋషిలా మనగలగాలి అంటే ఆలోచన,అవకాశం.పట్టుదల,పవిత్రత ఇలాంటి సద్గుణాలెన్నో ఉండాలి అంటారు మనిషి కవితలో!
           కవితారచనపై అనురక్తితో కవితలు వెలువరించిన శ్రీనివాస గాంధీ గారు వస్తువైవిధ్యాన్ని ప్రదర్శించడమే కాదు తన శ్రీమతికి కవితా జ్ఞాపికగా కావ్య కస్తూరిని రచించి పాఠకులకందించడం ముదావహం.                                                                                                         http://www.prabhanews.com/story/article-405948

Thursday, October 3, 2013

అనుబంధం కలకాలం నిలవాలంటే

2 comments
3-10-13,ఆంధ్రభూమి దినపత్రికలో నా వ్యాసం.


             పెళ్లంటే నూరేళ్లపంట! నిజమే, పెళ్లి అనే పదం వధూవరుల హృదయాలను  మీటే స్వరజతి.అయితే పెళ్లి, వీరిరువురి మధ్యనే కాక రెండు కుటుంబాల నడుమ ఏర్పరచే బంధం కూడా ఎన్నతగినదే. కోటి కోరికల నేపథ్యంలో తమ కాపురం మూడు పువ్వులు,ఆరుకాయలుగా వర్ధిల్లాలని కోరుకుంటారు. పెళ్లికూతురు,పెళ్లికొడుకు పెళ్లిసూత్రాల మాటున  ముడిబడ్డ తమ బంధం కడదాకా నిలవాలని కాంక్షిస్తారు.అదేకదా దాంపత్యధర్మం. అయితే రోజులు గడిచేకొద్ది పెళ్లి సందడి తగ్గి కాపురం హడావిడి మొదలవుతుంది.సంసారంలో అనుకున్నవి అన్నీ  జరగకపోవచ్చు.కోరుకున్నవి జరగనప్పుడు సంసారం  ప్రేమసుధాసారం అనుకున్నది కాస్త సారంలేని సంసారం అనుకోవడం మొదలవుతుంది. ఈ సమయంలో సంయమనం కోల్పోకుండా ప్రవర్తిస్తే సంసార రథానికి బ్రేకులు పడకుండా సాగిపోతుంది. కోరికలు తీరాలంటే కావలసినది ఆర్థిక వెసులుబాటు. ఒకొక్కసారి డబ్బు ఉన్నా ఖర్చు చేయాలంటే కుదరని ఏకాభిప్రాయం. ఒకరు అవసరమనుకున్నది మరొకరికి అనవసరమనిపిస్తుంది. అపార్థాలకు తెర లేచేది ఇక్కడే! అలాంటప్పుడు  సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటే ఇల్లే స్వర్గమవుతుంది.
         డబ్బు: ప్రతి విషయం డబ్బుతో మొదలై డబ్బుతోనే ముగిస్తే ఆ డబ్బే దంపతుల నడుమ అడ్డుగోడై నిలబడుతుంది.అప్పుడిక కలలుగన్న పంచరంగుల స్వప్నాలన్నీ కరిగిపోయినట్లు అనిపిస్తుంది.దానికి కారణం నువ్వంటే నువ్వని వాదనలు లేదా ఇరువురు ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించకోవడం.ఒకరి ఆచార వ్యవహారాలు మరొకరికి నచ్చకపోవడం! అమ్మాయి తెచ్చిన కట్నం చాలలేదని అబ్బాయి, ఆస్తిపరులు కాదని,అనుకున్నంత పెద్ద ఉద్యోగం కాదని అమ్మాయి దెప్పిపొడుస్తుంటే మనసులు దూరమవుతాయి. పొరబడటం సహజమే. అయితే అపోహపడి అపవాదులెయ్యడం దాంపత్య బంధాన్ని పుటుక్కున తెంపేస్తుంది. అడిగినంత కట్నం ఇవ్వలేదనో, కోరిన కోరికలు తీర్చలేదనో అబ్బాయి కినుక వహిస్తూ, అబ్బాయికి ఆస్తి లేదనో,సంపాదన తక్కువనో అమ్మాయి బాధ పడటంలాంటివి పెళ్లయాక లోపాలుగా కనబడటమే ఆశ్చర్యమనిపిస్తుంది. అంతేకాదు అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తున్నా,ఆస్తి వెంట తెచ్చినా అది తమ చేతిలో పడనంతవరకు అసంతృప్తే అయితే అది కయ్యానికే దారి తీసిన వియ్యమవుతుంది.
          నమ్మకం: ఇక దాంపత్యం బలిష్టమైనది కావాలంటే నమ్మకమే గట్టి పునాది.ఈ పునాదిని అనుమానం పట్టి వూపిందా కాపురం కుప్పకూలడానికి గొయ్యి పడ్డట్టే! భర్త డబ్బు విషయంలో లెక్కప్రకారం చెప్పడం లేదనో,ఎవరికైనా ఇస్తున్నాడేమోనని భార్య ,తనకు తెలియకుండా భార్య ఏవేవో కొంటుందనో లేదా పుట్టింటి వారికి అంతో ఇంతో చేరవేస్తుందని భర్తకు భ్రమ.ఈ అర్థంలేని అపనమ్మకాలు, అనుమానాలు దాంపత్యానికి అగాథమవుతాయి.
         ఇతరులజోక్యం:  ఇదొక విచిత్రమైన విషయం. భార్యాభర్తలిరువురు తమ సమస్యను తాము చర్చించుకుని పరిష్కరించుకోక వారి కుటుంబాల లేదా బంధువుల జోక్యాన్ని ఆశిస్తే వారు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు.నిజమే కాని వారి సర్దుబాటు ఇరువురిలో ఏ ఒక్కరికి సమ్మతం కానపుడు సమస్య చిలికి చిలికి గాలివానై అందులో సంసారబంధం కొట్టుకుపోతుంది.
           అభిప్రాయభేదాలు: ఇవి అనుబంధాన్ని కుదిపే వడగళ్లలాంటివి. పెళ్లి అనే ముడి పడినంతమాత్రాన ఇద్దరిది ఏకాభిప్రాయమే అని  నిర్ణయించలేం.ఆలోచనావిధానంలో తేడాలుంటాయి.అభిప్రాయాలలో వైవిధ్యము తప్పదు. అయితే నాదే ఒప్పు,నీది తప్పు అని భీష్మించుకుంటే మాత్రం అది అనుబంధం కాదు అంపశయ్యవుతుంది.
            అనురాగలోపం: భర్తకు భార్యపై,భార్యకు భర్తపై అనురాగం పల్లవించాలి. ప్రేమాభిమానాలు అంగడిలో కొనలేము.మనసున ఉన్న అభిమానాన్ని మాటలతో ప్రకటించినా ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని మనగలగాలి. చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా మంచిదే.అయితే అంతకుమించి ప్రేమపూర్వక సంభాషణ ఉన్నచోట అనురాగం మొలకలేసి దాంపత్యం  విరితోటవుతుంది.
            అవగాహన: ఒకరిమాట ఒకరు వినే వైనంలో శ్రద్ధ చూపకపోతే మనసులు అర్థం కావు.అర్థంకాకపోవడానికి కారణం, వినపడనట్లు ప్రవర్తించడం.వినిపించుకోకపోవడం నిర్లక్షధోరణిని ప్రస్ఫుటిస్తుంది. ఎప్పుడూ ఉండేవే అని తాత్సారం చేస్తే మాట్లాడేవారి అభిమానం, దెబ్బతినే అవకాశం ఉంటుంది. నిజంగా వినవలసిన, ప్రాముఖ్యత ఉన్నవిషయాన్ని వినకపోతే చాలా కోల్పోవలసివస్తుంది.
         సర్దుబాటులేనితనం: నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటుంటే అది కాపురమవదు,కష్టాల కడలవుతుంది.
ఆ కడలిలోని అలల తాకిడిని ఢీకొనలేక కాపురం కుదేలవుతుంది.ఒకరితో ఒకరికి సయోధ్య లేకపోతే సంసారరథం గాడి తప్పుతుంది.
         సంతానలేమి: పిల్లలు కలగడం.కలగకపోవడం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. నెపం ఇల్లాలిపై వేయడం ఎంత అమానుషమో కేవలం పురుషుడినే వేలెత్తి చూపడము అవాంఛనీయమే.పిల్లలు పుట్టకపోయినా లేదా ఆడపిల్లలే     పుట్టినా  తరచి చూడాల్సిన శాస్త్రీయ విషయాలను పక్కకు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూపోతే దాంపత్యంలో ప్రతి సంఘటన విడాకులకు బాట వేస్తుంది.
          ఇగో(అహం): నువ్వా నేనా అని తారతమ్యాలు లెక్కిస్తే అది దాంపత్య భాగస్వామ్యంకాదు.వ్యాపార భాగస్వామ్యం  అవుతుంది. కలిసి చేసే వ్యాపారంలో సైతం సర్దుకుపోయే తత్వముంటేనే ఆ వ్యాపారబంధం నిలబడేది. సంసారనౌక మునిగిపోరాదు అనుకుంటే ఎక్కువ తక్కువలు కాదు, మనము అనే మాటకు విలువ నివ్వాలి.నీ దారి నీదే నా దారి నాదే అనుకుంటే కుటుంబం తెగిన గాలిపటమవుతుంది.
        అసంతృప్తి: పెళ్లయిన చాలా రోజుల తర్వాత అందచందాలపై విమర్శలు ప్రారంభిస్తే మనసు మలినమవుతుంది. కళ్లు తెరుచుకుని చూస్తూ చేసుకున్న పెళ్లిలో కనబడని లోపాలు ఆ తరువాతి కాలంలో కనబడ్డాయంటే అది హాస్యాస్పదమే!
            ఇవన్నీ పెళ్లి విఫలమయేందుకు దోహదపడే విషగుళికల్లాంటివి.మరి అనుబంధం కలకాలం నిలవాలంటే ఓర్పు,నేర్పు కలగలసిన సర్దుబాటుతనం, తరగని ప్రేమాభిమానం సమతూకమై నిలవాలి.అపుడిక సంసార రథం సాఫీగా సాగి దాంపత్యం అనుబంధాలకు లోగిలవుతుంది.