3-10-13,ఆంధ్రభూమి దినపత్రికలో నా వ్యాసం.

పెళ్లంటే నూరేళ్లపంట! నిజమే, పెళ్లి
అనే పదం వధూవరుల హృదయాలను మీటే
స్వరజతి.అయితే పెళ్లి, వీరిరువురి మధ్యనే కాక రెండు కుటుంబాల నడుమ ఏర్పరచే బంధం
కూడా ఎన్నతగినదే. కోటి కోరికల నేపథ్యంలో తమ కాపురం మూడు పువ్వులు,ఆరుకాయలుగా
వర్ధిల్లాలని కోరుకుంటారు. పెళ్లికూతురు,పెళ్లికొడుకు పెళ్లిసూత్రాల మాటున ముడిబడ్డ తమ బంధం కడదాకా నిలవాలని
కాంక్షిస్తారు.అదేకదా దాంపత్యధర్మం. అయితే రోజులు గడిచేకొద్ది పెళ్లి సందడి తగ్గి
కాపురం హడావిడి మొదలవుతుంది.సంసారంలో అనుకున్నవి అన్నీ జరగకపోవచ్చు.కోరుకున్నవి జరగనప్పుడు సంసారం ప్రేమసుధాసారం అనుకున్నది కాస్త సారంలేని సంసారం
అనుకోవడం మొదలవుతుంది. ఈ సమయంలో సంయమనం కోల్పోకుండా ప్రవర్తిస్తే సంసార రథానికి
బ్రేకులు పడకుండా సాగిపోతుంది. కోరికలు తీరాలంటే కావలసినది ఆర్థిక వెసులుబాటు. ఒకొక్కసారి
డబ్బు ఉన్నా ఖర్చు చేయాలంటే కుదరని ఏకాభిప్రాయం. ఒకరు అవసరమనుకున్నది మరొకరికి
అనవసరమనిపిస్తుంది. అపార్థాలకు తెర లేచేది ఇక్కడే! అలాంటప్పుడు సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటే ఇల్లే
స్వర్గమవుతుంది.
డబ్బు: ప్రతి విషయం డబ్బుతో మొదలై డబ్బుతోనే
ముగిస్తే ఆ డబ్బే దంపతుల నడుమ అడ్డుగోడై నిలబడుతుంది.అప్పుడిక కలలుగన్న పంచరంగుల
స్వప్నాలన్నీ కరిగిపోయినట్లు అనిపిస్తుంది.దానికి కారణం నువ్వంటే నువ్వని వాదనలు
లేదా ఇరువురు ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించకోవడం.ఒకరి ఆచార వ్యవహారాలు మరొకరికి
నచ్చకపోవడం! అమ్మాయి తెచ్చిన కట్నం చాలలేదని అబ్బాయి, ఆస్తిపరులు కాదని,అనుకున్నంత
పెద్ద ఉద్యోగం కాదని అమ్మాయి దెప్పిపొడుస్తుంటే మనసులు దూరమవుతాయి. పొరబడటం సహజమే.
అయితే అపోహపడి అపవాదులెయ్యడం దాంపత్య బంధాన్ని పుటుక్కున తెంపేస్తుంది. అడిగినంత
కట్నం ఇవ్వలేదనో, కోరిన కోరికలు తీర్చలేదనో అబ్బాయి కినుక వహిస్తూ, అబ్బాయికి ఆస్తి
లేదనో,సంపాదన తక్కువనో అమ్మాయి బాధ పడటంలాంటివి పెళ్లయాక లోపాలుగా కనబడటమే
ఆశ్చర్యమనిపిస్తుంది. అంతేకాదు అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తున్నా,ఆస్తి వెంట
తెచ్చినా అది తమ చేతిలో పడనంతవరకు అసంతృప్తే అయితే అది కయ్యానికే దారి తీసిన
వియ్యమవుతుంది.
నమ్మకం: ఇక దాంపత్యం బలిష్టమైనది కావాలంటే
నమ్మకమే గట్టి పునాది.ఈ పునాదిని అనుమానం పట్టి వూపిందా కాపురం కుప్పకూలడానికి గొయ్యి
పడ్డట్టే! భర్త డబ్బు విషయంలో లెక్కప్రకారం చెప్పడం లేదనో,ఎవరికైనా ఇస్తున్నాడేమోనని
భార్య ,తనకు తెలియకుండా భార్య ఏవేవో కొంటుందనో లేదా పుట్టింటి వారికి అంతో ఇంతో
చేరవేస్తుందని భర్తకు భ్రమ.ఈ అర్థంలేని అపనమ్మకాలు, అనుమానాలు దాంపత్యానికి
అగాథమవుతాయి.
ఇతరులజోక్యం: ఇదొక విచిత్రమైన విషయం. భార్యాభర్తలిరువురు తమ
సమస్యను తాము చర్చించుకుని పరిష్కరించుకోక వారి కుటుంబాల లేదా బంధువుల జోక్యాన్ని
ఆశిస్తే వారు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు.నిజమే కాని వారి సర్దుబాటు ఇరువురిలో
ఏ ఒక్కరికి సమ్మతం కానపుడు సమస్య చిలికి చిలికి గాలివానై అందులో సంసారబంధం
కొట్టుకుపోతుంది.
అభిప్రాయభేదాలు: ఇవి అనుబంధాన్ని కుదిపే వడగళ్లలాంటివి. పెళ్లి అనే ముడి
పడినంతమాత్రాన ఇద్దరిది ఏకాభిప్రాయమే అని నిర్ణయించలేం.ఆలోచనావిధానంలో తేడాలుంటాయి.అభిప్రాయాలలో
వైవిధ్యము తప్పదు. అయితే నాదే ఒప్పు,నీది తప్పు అని భీష్మించుకుంటే మాత్రం అది
అనుబంధం కాదు అంపశయ్యవుతుంది.
అనురాగలోపం: భర్తకు భార్యపై,భార్యకు
భర్తపై అనురాగం పల్లవించాలి. ప్రేమాభిమానాలు అంగడిలో కొనలేము.మనసున ఉన్న
అభిమానాన్ని మాటలతో ప్రకటించినా ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని మనగలగాలి. చిన్న బహుమతులు
ఇచ్చిపుచ్చుకోవడం కూడా మంచిదే.అయితే అంతకుమించి ప్రేమపూర్వక సంభాషణ ఉన్నచోట అనురాగం
మొలకలేసి దాంపత్యం విరితోటవుతుంది.
అవగాహన: ఒకరిమాట ఒకరు వినే వైనంలో
శ్రద్ధ చూపకపోతే మనసులు అర్థం కావు.అర్థంకాకపోవడానికి కారణం, వినపడనట్లు
ప్రవర్తించడం.వినిపించుకోకపోవడం నిర్లక్షధోరణిని ప్రస్ఫుటిస్తుంది. ఎప్పుడూ ఉండేవే
అని తాత్సారం చేస్తే మాట్లాడేవారి అభిమానం, దెబ్బతినే అవకాశం ఉంటుంది. నిజంగా వినవలసిన,
ప్రాముఖ్యత ఉన్నవిషయాన్ని వినకపోతే చాలా కోల్పోవలసివస్తుంది.
సర్దుబాటులేనితనం: నువ్వెంత అంటే
నువ్వెంత అనుకుంటుంటే అది కాపురమవదు,కష్టాల కడలవుతుంది.
ఆ కడలిలోని అలల తాకిడిని
ఢీకొనలేక కాపురం కుదేలవుతుంది.ఒకరితో ఒకరికి సయోధ్య లేకపోతే సంసారరథం గాడి
తప్పుతుంది.
సంతానలేమి: పిల్లలు కలగడం.కలగకపోవడం
అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. నెపం ఇల్లాలిపై వేయడం ఎంత అమానుషమో కేవలం
పురుషుడినే వేలెత్తి చూపడము అవాంఛనీయమే.పిల్లలు పుట్టకపోయినా లేదా ఆడపిల్లలే పుట్టినా
తరచి చూడాల్సిన శాస్త్రీయ విషయాలను పక్కకు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు
చేసుకుంటూపోతే దాంపత్యంలో ప్రతి సంఘటన విడాకులకు బాట వేస్తుంది.
ఇగో(అహం): నువ్వా నేనా అని తారతమ్యాలు
లెక్కిస్తే అది దాంపత్య భాగస్వామ్యంకాదు.వ్యాపార భాగస్వామ్యం అవుతుంది. కలిసి చేసే వ్యాపారంలో సైతం
సర్దుకుపోయే తత్వముంటేనే ఆ వ్యాపారబంధం నిలబడేది. సంసారనౌక మునిగిపోరాదు అనుకుంటే
ఎక్కువ తక్కువలు కాదు, మనము అనే మాటకు విలువ నివ్వాలి.నీ దారి నీదే
నా దారి నాదే అనుకుంటే కుటుంబం తెగిన గాలిపటమవుతుంది.
అసంతృప్తి:
పెళ్లయిన చాలా రోజుల తర్వాత అందచందాలపై విమర్శలు ప్రారంభిస్తే మనసు మలినమవుతుంది. కళ్లు
తెరుచుకుని చూస్తూ చేసుకున్న పెళ్లిలో కనబడని లోపాలు ఆ తరువాతి కాలంలో కనబడ్డాయంటే
అది హాస్యాస్పదమే!
ఇవన్నీ పెళ్లి విఫలమయేందుకు దోహదపడే
విషగుళికల్లాంటివి.మరి అనుబంధం కలకాలం నిలవాలంటే ఓర్పు,నేర్పు కలగలసిన
సర్దుబాటుతనం, తరగని ప్రేమాభిమానం సమతూకమై నిలవాలి.అపుడిక సంసార రథం సాఫీగా సాగి
దాంపత్యం అనుబంధాలకు లోగిలవుతుంది.
2 comments:
భార్యాభర్తలకు కనువిప్పుకలిగించే వ్యాసమిది.యువతైనా,వృధ్ధులైనా ఎవరికైనా మనస్సులను ఎవరికివారే తరచి చూసుకుని తమతప్పులను మనసు అద్దం లో చూసుకుని లోపాలు తెల్సుకునే లా తెలియచెప్పేవ్యాసం.
హైమవతి గారు,వ్యాసంపై మీ స్పందన బాగుంది.
Post a Comment