Tuesday, August 14, 2012

ర్యాగింగ్

0 comments
http://www.andhrabhoomi.net/content/ragging






ఆంధ్రభూమి దినపత్రికలో  ప్రచురితమైన వ్యాసం
ర్యాగింగ్ ను అరికట్టలేమా?                                                                                                                        వృత్తి,సాంకేతిక విద్యాలయాలు తెరుస్తున్నవేళ ఇది.ఇంటర్,అర్హత పరీక్షలు పూర్తిచేసుకుని కెరీర్ పరంగా తమకనువైన , తాము అర్హతపొందిన సీట్లను సంపాదించుకుని బ్రతుకు బంగారుబాట చేసుకోవాలని కొత్త కాలేజీలలోకి ప్రవేశిస్తారు విద్యార్థి, విద్యార్థినులు. ప్రొఫెషనల్ కాలేజీలు వారికి కొత్త వాతావరణాన్ని చూపిస్తాయి.భావిజీవితంలో తమను ఉన్నత శిఖారాలకు  చేర్చే విద్యాలయం తమపాలిటి దేవాలయంగా  భావించి విభిన్నతలపులతో విద్యాలయ తలుపుల ముంగిట నిలుస్తారు.కాలేజీలో ప్రవేశించగానే వారు ముందుగా చూసేది తమకు తెలిసినవారెవరైనా ఉన్నారా అని.అటు ప్రొఫెసర్లలో కాని ఇటు సీనియర్లలోకాని తమ వెన్నుదన్ను ఎవరున్నారా అని చూస్తారు.వీరికన్నా వీరి తల్లిదండ్రులు ఎక్కువ ఆత్రుత కనబరుస్తారు.కారణం! కాలేజీలలో చేరిన తమ పిల్లలు ర్యాగింగ్ క్రీడకు ఎక్కడ బెంబేలెత్తుతారో అనే భయం వీరిని ఆందోళనకు గురి చేస్తుంది.కాలేజీ వేదికదాటి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది ర్యాగింగ్ సమస్య.సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తీవ్రంగానే స్పందించింది.అయినా ఎక్కడో ఒక చోట ర్యాగింగ్ పేరున బలవుతున్న విద్యార్థి,విద్యార్థినులను గురించి వింటుంటే మనమెందుకు ఈ విషసంస్కృతిని అరికట్టలేకపోతున్నాం అనే వేదన కలుగుతుంది. ర్యాగింగ్ రాక్షసక్రీడలా మారడానికి కారణ మేమిటి? బాధ్యులెవరు? దీనిని నిరోధించడానికి చర్యలు ఎవరు చేపట్టాలి?

            ఈ ప్రశ్నల నేపథ్యంలో అసలు ర్యాగింగ్ ఎలా మొదలవుతోంది అని ఆలోచిస్తే అందరు చెప్పే కారణమిదే. కొత్తగా వచ్చి చేరినవారికి సీనియర్లతో సయోధ్య ఏర్పడటానికి,వారు కొత్త మరచి అందరితో కలగలిసి తిరిగేందుకు అని.మరి విషయం ఇంత సూక్ష్మాంశమైతే ప్రాణాలను హరింపచేసుకునే వారిమాట ఏమిటి? కొత్తవారికి ర్యాగింగ్ ఇబ్బందికరంగా ఉంటుంది.వారిది పిరికితనం అని తీసిపారెయ్యడానికిలేదు. బలహీనమనస్కులు, సెన్సిటివ్ గా  బాధపడేవారికి ర్యాగింగ్ భయంకరంగా తోస్తుంది.ఇది మోతాదు పెంచితే వారు మానసిక ఒత్తిడికి గురై అందంగా ఊహించుకుంటున్న భవిష్యత్తు మరచిపోయి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.తరుణోపాయం?
              చట్టబద్ధమైన ఆంక్షలు,కఠిన శిక్షలు,విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ స్క్వాడ్లు ఇవన్నీ ప్రభుత్వపరంగా అమలయే విధానాలు.అయితే సామాజిక నేపథ్యంలో ఈ ర్యాగింగ్ తో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో తల్లిదండ్రులకు,విద్యాలయాల యాజమాన్యానికి ఎంతో కొంత బాధ్యత ఉంటుంది.మా పిల్లలు పెద్దవాళ్లయారు వారిపై మా ఆంక్షలేముంటాయి అని పెద్దలు తప్పించుకోవడం కూడదు.ర్యాగింగ్ ఒక ఆటవిడుపు అని భ్రమపడకూడదు. ర్యాగింగ్ మూలంగా జీవితాలు చిధ్రం కాకూడదు.సరికొత్త వాతావరణంలోకి అడుగిడిన విద్యార్థి, విద్యార్థినులకు భయంకలిగించే బదులు సామరస్యంగా స్నేహపూరిత భావంతో ఆహ్వానం పలకాలి.కాలేజీని అందులోని ల్యాబ్, లైబ్రరీ, క్యాంటీన్, టాయిలెట్ వంటివి వెతుక్కోనక్కర  లేకుండా కొత్తవారికి చూపించాలి. మరీ వ్యక్తిగతప్రశ్నలు కాకుండా వారంతవరకు చదివిన విద్యాలయాలు, ఇష్టమైన ఆటలు,పాటలు,పుస్తకాలు మొదలైన విషయాలను అడుగుతూ వారిలో జంకును పోగొట్టాలి. పాఠాలు అర్థం కాకపోతే సీనియర్లుగా వారికి చదువులో కూడా సహకారమందించ వచ్చును. వారిని ప్రొఫెసర్ల దగ్గరకు తీసుకుని వెళ్లి పరిచయం చేయవచ్చు. ఈ విషయాలు స్వల్పంగా కనిపిస్తాయి కాని అనల్పమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి.కొత్తగా చేరినవారికి కావాలసిన ఆత్మీయ వాతావరణాన్ని అందించే బదులు ర్యాగింగ్ పేరుతో వారిని భీతావహులుగావించడం అభిలషణీయం కాదుకదా! ర్యాగింగ్ వలన కలిగే అసౌకర్యాలను, నష్టాలను తల్లిదండ్రులుకూడా తమ పిల్లలకు వివరంగా తెలియచెప్పాలి. ఇదొక సామాజిక సమస్యగా పరిగణించి విద్యాలయాలలో విద్యార్థిని, విద్యార్థులకు ర్యాగింగ్ దురాచారాన్ని రూపుమాపే దిశగా అవగాహన కల్పించాలి.