Saturday, September 29, 2012

డ్యూక్ గార్డెన్-The crown jewel of Duke University

4 comments


                                                         

                                                            


చెట్ల ఊసులు,పూల బాసలు ఎక్కడైనా ఒకటే!మైసూర్ బృందావనమైనా, ఆహ్లాదపరిచే అరకులోయ ఆర్చిడ్స్ అయినా,హైద్రాబాద్  పబ్లిక్ గార్డెన్ అయినా ,కడియం కనకాంబరాలు,మల్లెల తోటైనా, అలరింపచేసిన అమెరికా డ్యూక్ గార్డెన్ అయినా!

ఇంటి చుట్టు వేసిన పూల చెట్లు సరే, దగ్గరలో ఏదైనా తోటలు లేవా అన్న ప్రశ్నకు మా అమ్మాయి మరి నువ్వు నడవగలవా అంది.నీదే ఆలస్యం అన్నట్టు చూసాను.వెంటనే చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి.మేమున్న చోటునుండి డ్యూక్ గార్డెన్స్ అరగంట ప్రయాణమే.

పెద్దపెద్ద చెట్లనీడ, తల్లి పరచిన సహజ ఛత్రమై  అలరిస్తుంటే  చిరుగాలికి తలలూపుతున్న పూలబాలలు మనసునిట్టే ఆకట్టుకున్నాయి.సాయంకాలపు నీరెండలో తళతళ మెరిసే సప్తవర్ణశోభితమైన తోటలో ,పాదాలను సుతిమెత్తని గరిక అనునయంగా సేదదీరుస్తున్న అనుభూతి కలిగి చకచకా నడుస్తుంటే మా అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తోంది అమ్మకెందుకు చెట్లన్నా,పూలన్నా ఇంత ఇష్టమని!నాకేనా!పసిపాప నవ్వులను,రంగురంగుల పువ్వులను ఆస్వాదించని వారుంటారా? వుండగలరా?

Sarah P.Duke gardens " The crown jewel of Duke University,"

డ్యూక్ యూనివర్సిటీకి అనుబంధమైన ఈ తోట అటు విద్యార్థులకు,ప్రొఫెసర్లకు,సందర్శకులకు నిత్యకళ్యాణం పచ్చతోరణమే!ఒకవంక రోజ్ గార్ఢెన్,మరొక వంక బటర్ ఫ్లై గార్డెన్,మరొకవంక డాఫడిల్స్,చామంతులు,మందారాలు!ఇక తామర కొలను,అందులో ఈదులాడే చేపపిల్లలను చూస్తే పుడమిపై ప్రకృతి తైలవర్ణ చిత్రాన్ని లిఖించి అందాలను పేర్చిన సృష్టికర్త చాతుర్యానికి అబ్బరపడకమానము.అన్నిటినీ మించి మనపైనే వాలిపోతాయేమోననేటట్లు హడావిడి పడిపోయే సీతాకోకచిలుకలు!పూలను తాకితే కుట్టేస్తామన్నట్లు పూలపై వాలి తేనెనుగ్రోలే చిన్ని చిన్ని తేనెటీగలు.వర్ణనకు మించిన సోయగాలు మనలను కదలనీయవు.

ఏడాదికి కనీసం మూడు లక్షలమంది ప్రంపంచంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చి ఈ తోటలను సందర్శిస్తారు.డా.ఫ్రెడెరిక్ ఎం హేన్స్(1883-1946) శ్రమ ఫలితంగానే బీడుభూమిగానున్న నేల పూలవనంగా రూపుదిద్దుకుంది.ఈమె శ్రమకు ఆర్థిక సహాయమందించిన సారా.పి.డ్యూక్,ఆమె కూతురు మేరీ డ్యూక్ బిడిల్ ఔదార్యం ఎన్నదగినవి.

విద్యార్థులకు పాఠ్యవేదికగా,వివాహాలకు పుష్పయవనికగా,సమావేశాలకు సభాప్రాంగణంగా బహుపాత్రలు పోషించే ఈ పూదోట భగవంతుడు మానవులను కరుణతో అనుగ్రహించి   స్వర్గపుతానులోనుండి  తుంచి ఇచ్చిన చిన్న  పూలతివాచీ  ముక్క అనిపించకమానదు.  

కొసమెరుపు:  పేరెన్నికగన్న డ్యూక్ యూనివర్సిటీలో  మనకు తెలిసిన  తెలుగువారెవరైనా  ఉన్నారా అన్న మావారి ప్రశ్నకు, You will soon see  అని  తొమ్మిదేండ్ల మా చిన్నారి మనవరాలు ఇచ్చిన సత్వర జవాబు మాఅందరిలో విరినవ్వులు  పూయించింది.

Thursday, September 27, 2012

అమెరికా వృక్షంపై తెలుగు పక్షులు

4 comments
ఏపుగా పెరిగిన మేపిల్,ఓక్ వృక్ష సముదాయాల నడుమ  విశాలమైన ప్రాంగణం. పచ్చని పచ్చిక పేని పుడమితల్లికి మాలవేసినట్లు చుట్టు పరచుకున్నగరిక తివాచీ!వేదిక అందరికీ కనబడేలా తీరుగా అమర్చిన కుర్చీలు.వేదికేకాదు ఒకరికొకరు పరస్పరం కనబడుతూ కళ్లతో మొదటి పలకరింపులు కూడా జరిగేలా ఉన్నాయి అమరిక.అమ్మాయిల నుదుట తీర్చిన రంగురంగుల బిందీలు తెలుగుదనాన్ని రంగరిస్తున్నాయి. పిల్లలు,పెద్దలు ఉత్సాహానికి ఉల్లాసం జోడించి అటు ఇటు నడయాడుతుంటే గోదావరి గలగలా ప్రవహిస్తున్నట్టు,క్రిష్ణమ్మ ఉరుకులు పెడుతున్నట్లు భావన మదిలో మెదలి మనసంతా ఆనందార్ణవమైంది.ఆటపాటల సంగమమైన తెలుగు సరదాల పందిరి క్రింద ఒకే గూటి పక్షుల నందనవనమై భాసిల్లింది తెలుగు వారి పిక్నిక్ సందడి.
పిల్లలు,పెద్దలు అత్యంత హుషారుగా పాల్గొన్న మ్యూజికల్ చెయిర్స్,టగ్ ఆఫ్ వార్ ఆద్యంతము అలరించాయి.తంబోలా చివరి నిమిషం వరకూ ఉత్కంఠతో సాగింది.బహుమతులు కూడా ఇచ్చి ఉత్సాహపరిచారు.అన్నిటినీ మించి షడ్రషోపేతమైన విందు,సాయంత్రం పిల్లలకు బిస్కట్లు,పెద్దలకు ఘుమఘుమలాడే టీ ఓపికను పెంచాయి. రాజమండ్రి,విశాఖ, హైద్రాబాద్,నల్గొండ,అదిలాబాద్ ఒకరా,ఇద్దరా ఐదువందలపైనే ఒక్క గూటిలో చేరిన పక్షుల కుహూరవాల్లా తేటతెనుగు కిలకిలారావాలు వినిపించసాగారు.మనం చేసుకునే వనభోజనాలను పోలిన ఈ తెలుగు  పిక్నిక్ మనసుకు ఆహ్లాదాన్ని,ప్రమోదాన్ని పెంచి జీవితంలో మనం కోల్పోకూడని అనుభూతులను ఒడిసి పట్టుకోమంటుంది.అన్నిటినీ మించి విజిటర్స్ వీసా పుచ్చుకుని బిడ్డలను కలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల వెంట పిల్లల్లా అడుగులో అడుగు వేస్తూ నడవడం,పిల్లలు అమ్మనాన్నలను పొదివి పట్టుకుని నడిపించడం చూడచక్కటి  వేడుక! 

Wednesday, September 26, 2012

అమెరికాలో ఆటవిడుపు!

6 comments
నిరంతరశ్రమ,పరిశ్రమ మనిషిని ఊపిరి సలపనివ్వవు.అది మనదేశమైనా అమెరికాయైనా ఒకటే.ఆడవారికి ఆటవిడుపు పండుగలు,పేరంటాలు అనుకుంటాం.కాని ఇవి కూడా  అమెరికాలో సరిగా పండుగరోజునకాక  ఉద్యోగానికి సెలవు రోజైన శని,ఆది వారాలలో జరుపుకోవడం ఆనవాయితీ.ఈ పండుగలు కాక అమ్మాయిలు మాత్రమే గర్ల్స్ నైట్ అవుట్ పేరిట వీకెండ్ లో మన కిట్టీపార్టీని పోలిన పార్టీని ఏర్పాటు చేసుకుంటారు.అమ్మా నువ్వు కూడా రావాలి,అంతా తెలుగువాళ్లే,కాసేపు ఉండి వద్దాం అని పిలిచింది మా అమ్మాయి.పిలవడం  ఆలస్యం నైట్ అవుట్ కాసేపే ఎందుకు ఆల్ నైట్  కబుర్లు చెప్పుకుందాం   అనుకున్నాను.వచ్చి వారం కాలేదు తెలుగులో మాటలు కలబోసుకోవాలని మనసు తహతహలాడింది.

అరగంట డ్రయివ్!అమ్మాయి కారు నడుపుతుంటే నిశ్చింతగా కూర్చుని తెలుగు పదాలు నెమరేసుకుంటున్నాను.
గమ్యస్థానం చేరుకున్నాము అరగంటలో!ఎదురు వచ్చిన తెలుగు అమ్మాయిలు నమస్కారంతోపాటు మమకారము   అందించారు.బింగో,మ్యూజికల్ చెయిర్స్ వంటి ఆటలు ఆడటంతో పాటు మాటల కలబోత అలరించింది.మీరు కథలు,కవితలు రాస్తారటకదా ఆంటీ అని ఆసక్తిగా అడిగారు.అవునమ్మా అని అన్నానో లేదో,అయితే కవితలు చెప్పండి అన్నారు అందరూ. ష్! మాట్లాడకండి!ఆంటీ కవితలు వినిపిస్తారు.అని తమ మాటలాపి నిశ్శబ్దంగా కూర్చున్నారు.ప్రక్కనే పెళ్లి ఫోటోలు చూపుతున్న ల్యాప్ టాప్!బ్లాగు సామ్రాజ్యం వర్ధిల్లాలి! నా బ్లాగు యు.ఆర్.ఎల్   చెప్పాను.అక్కడ పండిన నా కవితలను వినిపించాను.నేపథ్యం వివరించాను.వాళ్లు చదవడానికి ప్రయత్నించారు.ఫరవాలేదు,నెమ్మదిగానైనా తప్పుల్లేకుండా చదివారు.సంతోషమేసింది.నేను స్పష్టంగా చదవడం చూసి ముచ్చటపడ్డారు.తేనెలూరు మన తెలుగుభాష రసాలూరు ఏదేశమైన!

ఇక వెళ్దామా అంది మా అమ్మాయి! చంటిపిల్లలా  తల అడ్డంగా ఊపాలనిపించింది. మళ్లీ తెలుగు పిక్ నిక్ తీసుకెళ్తాను అంది. దానికోసం ఎదురు చూస్తూ ఇంటి దారి పట్టాను.ఆ విశేషాలు మరోసారి.