Wednesday, August 14, 2013

శుభాకాంక్షలు

4 commentsఅందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.

Sunday, August 4, 2013

స్నేహబంధము ఎంత మధురము!

4 comments

          స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం! అన్న పలుకులెంత మధురం అనిపించక మానవు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే స్నేహితుల వేడుక ఫ్రెండ్ షిప్ డే!స్నేహసౌరభం ఎల్లెడలా వ్యాపింపచేసే ఈ రోజు ఆగస్టు మాసం మొదటి ఆదివారంతోపాటు అడుగేసేరోజు.
      నిజమైన స్నేహానికి అసలైన చిరునామా ఎల్లలెరుగని బాల్యం.స్నేహానికి అంకురార్పణ జరిగేది కల్లాకపటం తెలియని బాల్యంలోనే.తల్లి ఒడివీడి బడి చేరినపుడు ఏర్పడే మానసిక శూన్యం సాటి పిల్లల స్నేహ మాధుర్యంతో నిండుకుంటుంది.స్కూల్,ఆపైన కాలేజీ అటు  తరువాత మరిన్ని పై చదువులు. చివరకు ఉద్యోగాలలోనో,వ్యాపారాలలోనో స్థిరపడ్డాక కూడా బాల్య స్నేహితులను కొందరు మరువలేరు.చిన్నప్పటి స్నేహితులను ఎన్నోసంవత్సరాల  తరువాత కూడా గుర్తుపెట్టుకునేవారు కొందరైతే స్నేహంగా పలకరించిన వారిని ఎక్కడ చూసామబ్బా అని తలలు పట్టుకునే వారు మరికొందరు.ఏది ఏమైనా స్నేహ పరిమళం మల్లెలు,గులాబీలు కలబోసిన కలశ తీర్థం.నేటి స్నేహాలలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన  పెనుమార్పులు స్నేహ పరిధిని పెంచాయి. ఫేస్ బుక్ తెరవని వారు అరుదు.స్నేహితుల సంఖ్య వందలు దాటుతోంది.కాని అది పరిమితులకు లోబడిన స్నేహం.
        తాత్కాలిక స్నేహాలు కొన్నుంటాయి.వ్యాపారాభివృద్ధికై జరిగే సమావేశాలు  లేదా ఎవరి పుట్టిన రోజు,పెళ్లి పార్టీలలోనో పరిచయమైన కొత్త నేస్తాలు వీరు. ఇవి ఎంత తొందరగా ఏర్పడుతాయో అంత తొందరగా అంతర్థానమవుతాయి.కొన్ని సందర్భాలలో కొంతకాలం కొనసాగవచ్చు. అయితే ఫలాపేక్షలేని స్నేహమే నిజమైన స్నేహంగా నిలబడుతుంది.ఎలాంటి భేషజాలకు పోని స్నేహమే నిజమైన స్నేహం.
      స్నేహానికి ముఖ్యమైన ధర్మాలు మూడు.మొదటిది,స్నేహంలో కల్మషం ఉండ కూడదు.ఇక రెండవది మోసానికి తావివ్వరాదు.మరి చివరగా స్నేహితుల నడుమ అబద్ధాలు ప్రవేశించ కూడదు. అప్పుడా స్నేహం నిత్య పరిమళమే.
     నీ స్నేహితుల గరించి చెప్పు,నీ గురించి నేను చెప్తాను అంటారు.మంచి చెడుల విశ్లేషణకు స్నేహం కూడా ప్రామాణికమే!వేగవంతమైన జీవనపరుగులో ఓదార్చే చల్లని చలివేంద్రం స్నేహం.హృదయాలను స్వచ్ఛంగా,నిర్మలంగా ఆవిష్కరించినపుడే మాలిన్యంలేని స్నేహానికి బీజం పడుతుంది.స్నేహధర్మాలకు తిలోదకాలిస్తే,దోస్త్ దోస్త్ న రహా అని పాడుకోవలసివస్తుంది. స్నేహానికి పట్టం కట్టిననాడు స్నేహబంధము ఎంత మధురము....