Sunday, October 27, 2013

కావ్య కస్తూరి


ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో   శ్రీనివాసగాంధిగారు రచించిన  కావ్య కస్తూరి కవితల సంపుటిపై నా సమీక్ష.

కస్తూరి పరిమళాల కవితాఝరి
                మనసున మెదిలే భావాలను కవితలుగా సృజించి పాఠకులకందించారు శ్రీనివాస గాంధిగారు. స్పందన అందించిన ప్రతి వస్తు విశేషము వీరి కవితకు స్ఫూర్తే. అయితే పదాడంబరానికి పోక చక్కటి పదాలతో కవితను పారదర్శకంగా రచించి పాఠకులకందించారు.
నువ్వు సున్నావే ననుకున్నా
నువ్వొచ్చికలిశాకా మనం పది అయ్యాం
సున్నాగా వెళ్లి నన్ను ఒకటిగా ఒంటిగా చేశావు
ఇప్పుడు తెలిసింది సున్నా విలువ!
మనం, మోయలేని జ్ఞాపకాలు, ఇంతేనా మరి, ఎటనుంటివో, నానేరమేమి వంటి కవితల నేపథ్యం జీవన సహచరి  మధుర స్మృతులే.
జీవితంలో ఒంటరిగానున్న తనప్రక్కన వచ్చిన భార్య సున్నాలా వచ్చి చేరి తన విలువను పెంచిదంటారు. సున్న తీసేస్తే విలువ కోల్పోయినట్లు భార్య మరణం అతడిని ఒంటరివాడిని చేసినా ఆమె విలువ మాత్రం అతని మనోయవనికపై శాశ్వతంగా పదిలమై నిలిచింది.
పశువును అమ్మినపుడు పైకమిచ్చును కొన్నవాడు
పసుపుతాడుకు ఎదురు సుంకం ఇదేమి కర్మం
మాంగల్యం పలుపుతాడుగ మారినపుడు అన్వయించదగిన కవిత.
మాటవినని మనసును నిన్నెలా జయించను అనే కవితలో ఆర్తిగా ప్రశ్నిస్తారు.
మనసును ఓడించలేకపోవడమే మనిషి పొందే నిరంతర పరాజయం అని మనసు కవితలో ముక్తాయింపు నిస్తారు.
నీకో ఉత్తరం రాయాలా?ఆలోచింపచేసే కవిత. ఫోన్లలో,ఎస్ ఎం.ఎస్ లలో నోటీసులు మొదలుకుని పెండ్లి పిలుపులదాకా అందుతుంటే ఇక ఉత్తరాలు ఎవరు రాస్తారు, ప్రత్తుత్తరాలెవరిస్తారు? ఈకవిత చదివినపుడు వెంటనే కలమందుకుని లేఖకు శ్రీకారం చుట్టి, ఉభయకుశలోపరి అని రాయాలనిపిస్తుంది.
                    ఇక ఓ కవిత పుట్టింది కవితలో కడుపు నింపుకునే దారి చూపించు, కడుపు నిండని కబుర్ల కవిత్వాలెందుకు?  అన్నారు.నేనేం చెయ్యాలి మరో కవితెలా  పుడుతుంది అని ప్రశ్నిస్తారు. తల్లి గర్భంనుండి ప్రసవవేదన అనంతరం బిడ్డ రూపం ప్రత్యక్షమైనట్లు కవి మనసును చీల్చుకుని పుట్టిన కవిత పాఠకుడి మనసును తడిమినపుడు కవితలు పుట్టడమేకాదు పాఠకుల మనసుల్లో చిరస్మరణీమవుతాయి.
 కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.మరి ఋషిలా మనగలగాలి అంటే ఆలోచన,అవకాశం.పట్టుదల,పవిత్రత ఇలాంటి సద్గుణాలెన్నో ఉండాలి అంటారు మనిషి కవితలో!
           కవితారచనపై అనురక్తితో కవితలు వెలువరించిన శ్రీనివాస గాంధీ గారు వస్తువైవిధ్యాన్ని ప్రదర్శించడమే కాదు తన శ్రీమతికి కవితా జ్ఞాపికగా కావ్య కస్తూరిని రచించి పాఠకులకందించడం ముదావహం.                                                                                                         http://www.prabhanews.com/story/article-405948
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

1 comments:

Hymavathy.Aduri said...

వివరణాత్మకంగా చాలాబావుందండీ! ఉమగారూ!
Hymavathy.A

Post a Comment