Sunday, September 22, 2013

కథావేదగిరి రాంబాబు
వేదగిరి రాంబాబుగారి కథానికల సంకలనంపై ఆంధ్రప్రభ ఆదివారం  (11-8-2013) సంచికలో నా సమీక్ష.

 కథా పూదోటలో అలుపెరుగని కథామాలి వేదగిరి రాంబాబు.వీరి పయనం కథాబాటతోనే కాదు సమాజ గమనంతో ముడిపడి వుంది. అందుకే వైద్యానికి, వైద్యుడికి నడుమ అనుసంధానకర్త కాగలిగారు. తన వృత్తి ధర్మాచరణలో తన మనసును తడిమిన ఆర్తి చినుకులకు స్పందించి తన కథలలో ఓదార్పులు,అవగాహనలు, పరిష్కారాలు పారదర్శకం చేయడం అభినందనీయం.
పాత్రతనెరిగి దానం చేయాలన్న నానుడి సర్వసామాన్యంగా వింటుంటాం. తన జేబును డబ్బుతో నింపుకోవాలనుకున్నవానికి కడుపు నిండా తిండి పెట్టినా డబ్బివ్వలేదన్న కసి మాటలలో,చేతలలో కనబడుతుంది. మనిషి బలహీనతలను విశ్లేషిస్తుంది కథ కాని కథ.
ఇక అద్దంలో బింబం కథానిక.నిన్నటి న్యూస్ పేపర్ నేటి వేస్ట్ పేపర్ అన్నట్టు, శక్తి తగ్గిన తల్లిదండ్రులు పిల్లలకు పనికిరానివారుగా కనబడుతున్నారు. బ్రతుకు ద్వారం మూసుకున్నాకే మనసు తలుపులు తెరచుకుంటాయి. మనిషి మరుగైపోయేదాకా విలువలు తెలియవు. తండ్రి గతించాకే వాస్తవాలు అవగతమవుతాయి. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నివిధాలా ఉపయోగించుకుని ఆమె పక్షవాతంతో మంచానపడితే చేతులు కట్టేసుకున్న అన్న మనస్తత్వానికి బాధపడినా తాను మాత్రం తల్లి చెయ్యి విడవననుకున్న కొడుకు కథ! ఇందులో, తండ్రిని కోల్పోవడం ఇంటిచుట్టు ప్రహరీ గోడ కూలినట్లుందనడం వంటి వాక్య ప్రయోగాలు గుండె గోడను  బలంగా కుదుపుతాయి.
అర్థాంగి అనే పదంలో అర్థాన్నివెతికి చూసి ఆహా!అనుకుంటాం.అర్థాంగి కథానికలో భార్య, భర్తకు అర్థాంగిగా అన్నివిధాలా సహకరించడమేకాదు, అవయవదానంచేసిన దేవతగా మనోపీఠంపై  ప్రతిష్టించారు రచయిత.
 సర్వేంద్రియానాం నయనం ప్రధానమంటారు. కన్నులు దానం చేయడం నేడు చాలా మందికి తెలుసు.అయితే లివర్,కిడ్నీల దానంపై మరింత అవగాహన కావాలి. వైద్య సంబంధిత వివరాలపైనే చాలా కథలు కేంద్రీకృతమయ్యాయి. అవయవదానంపై అనుమానాలు, అపోహలు తొలగించే గైడ్ లాంటిది ఈ కథాసంపుటం.
ఇక తల్లికథానికలో  ప్రమాదవశాత్తు కొడుకు బ్రెయిన్ డెడ్ అయితే బిడ్డ అవయవాలను దానం చేయమని తల్లిని కోరుతారు వైద్యులు.గుండెను చిక్కబట్టుకుని,తన కొడుకు అవయవాల దానంతో తొమ్మిదిమంది ప్రాణం నిలబెట్టగలిగితే వారందరిలో తన కొడుకును చూసుకుంటానన్న తల్లి వితరణకు ప్రణమిల్లాలనిపిస్తుంది.తెగినచోటే అంటుకట్టడం చిగురించడానికే. డయాలసిస్ చేసుకునే వ్యక్తి జీవికకు,మరణానికి నడుమ ఊగిసలాడే తంత్రులు నిలవాలంటే తీగతెగిన ప్రాణి ఇచ్చే జీవమున్న అవయవమే ఆ బ్రతుక్కు మొగ్గతొడుగుతుంది.
సంఖ్యాబలమే సాహితీకొలమానమైతే రోజుకొకటి కాదు,గంటకొక కథ పురిటినొప్పులు పడకుండానే వెలువడుతుంది. కథ గురించిన తలపు మొదలైనపుడే  కథలో ఏం చెప్పాలి,ఎలా చెప్పాలి అన్న ప్రశ్నలు ఉదయించాలి.అలాకాక పోటీ జగత్తులో పూటకొక కథ రాస్తానన్న రచయితకుతన వేగిరపాటు పంపిన నెగటివ్ మెసేజ్ బూమెరాంగ్ లా తనకే గురి పెట్టబడటం అస్ఫష్ట ప్రతిబింబాలు కథానికలో చూస్తాం. కిడ్నీ దానం చేసే వ్యక్తి దైవస్వరూపుడే కాని కిడ్నీదానం చేస్తే ఆర్థిక ప్రయోజనము ఉందని కథలో చెప్పడం  చదివిన పాఠకుడు కిడ్నీని అమ్మి చెల్లి పెళ్లి చేయాలనుకోవడం, కథలు పాఠకులపై ప్రభావమెలా చూపుతాయో తెలిపే కథానిక.
 భయం కథానిక చదివితే పులికన్నా గిలి భయమెక్కువ అని మనమనుకునే మాటలు నిజమేననిపిస్తుంది. కొడుకు కోరికను కాదనలేక గాలిపటం,మాంజా కొనుక్కోవడానికి డబ్బులిచ్చి పడిపోకుండా జాగ్రత్తగా ఆడుకోమని చెప్తాడు ఓ తండ్రి.అయితే కొడుకు అజాగ్రత్తగా ఉండి పడిపోతాడేమోననే శంక అతడి నరనరాన భయాన్ని ప్రవహింప చేస్తుంది. ఆందోళనతో ఆఫీసులో ఉండలేక కొడుక్కు జాగ్రత్తలు చెప్పిరావాలన్న ఆతృతలో ఏమరుపాటున స్కూటరు ప్రమాదానికి లోనై తన భయానికి తానే బలైన తండ్రి వైనమే!
 రెండు ఒకటైన వేళ కథానిక నేటి పరిస్థితులకు నిలువుటద్దం. మరణమిక తథ్యమని తెలిసినపుడు మనసు మాటలో పలుకుతుంది.ఈ నేపథ్యంలో ధారావాహికలా వెలువడుతున్న  భర్త మాటలను ఆపాలని ప్రయత్నించిన భార్య విఫలమవుతుంది.కొందరు రామమందిరం, మరికొందరు కళ్యాణమంటపం  కట్టించాలనుకుంటారు కాని సీతమ్మ భర్త రామారావు తన స్నేహితుడి ద్వారా విన్నవిషయాన్ని నిజం చేయాలనుకుంటాడు. తల్లో తండ్రో చనిపోయాక అమెరికాలోనున్న వారిబిడ్డలు వచ్చేదాక విగతజీవులైన వారిని ఎంబాల్మింగ్ చేసి భద్రపరిచే మార్చురీలు భారతదేశంలో చాలా తక్కువగా వున్నాయన్నసంగతి విన్న రామారావు ఆ లోటు తీర్చాలని తన మరణానికి  ముందు పలకడం బాధాకరమే కాని అక్షరసత్యం.కథానిక ముగింపుకొచ్చేసరికి మనసులోనుండి ఉప్పొంగిన కన్నీటి ఉప్పెన ఉప్పగా తగుల్తుంది.
  ఇది నిజం కథానికలో,భర్తకు వైద్యం చేయించాలని హాస్పిటల్ లో చేర్పించిన భార్య అతడికి మరణం అతి చేరువలోనే అన్న నిజాన్ని తెలుసుకుని లాభంలేని ఖర్చును భరించలేననుకుని మరుసటి రోజే గదినుండి ఖాళీ చేసి తీసుకెళ్లిపోవడం,డబ్బులెక్క  వేసుకునేవారు సమర్థించవచ్చునేమోగాని మానవతను లెక్కించేవారికి చేదు కషాయం బలవంతంగా గొంతులో పోసినట్లుంటుంది.
ఈ కథా కదంబమాలలో విరబూసిన కథానికలు మనం చదవం. రచయిత ముంగిట బాసింపట్టు వేసుకుని కూర్చుని వింటాం. కథ రాయడం కన్నా ఆ కథకు ఏదేని ప్రయోజనం ఉండాలని ఆశించడం ప్రతి రచయిత బాధ్యతే అని కథలను చదివిన పాఠకులు,రచయితలు తలపోయక మానరు.మరెన్నోసామాజికాంశాలను తన కథల ద్వారా మన ముందుంచిన రచయిత కథావేదగిరి రాంబాబు కలం మరిన్ని కథానికలు మనకందించగలదని ఆశిద్దాం.                                  
                                         

                    • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

4 comments:

oremuna said...

వేదగిరి రాంబాబు గారి పుస్తకాలు ఇక్కడ http://kinige.com/kbrowse.php?via=author&name=Dr.+Vedagiri+Rambabu&id=814

సి.ఉమాదేవి said...

Thank you oremuna garu.

శ్రీలలిత said...

వేదగిరి రాంబాబుగారి కథలలాగే ఆ కథల మీద మీ సమీక్ష కూడా చాలా అర్ధవంతంగా వుందండీ...

సి.ఉమాదేవి said...

శ్రీలలిత గారు సమీక్ష మిమ్మల్ని ఆకట్టుకొన్నందుకు ధన్యవాదాలండి.

Post a Comment