17-3-2012,ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురింపబడిన నా వ్యాసం.
http://www.andhrabhoomi.net/content/batuku-basha-kadu
బతుకు భాష కాదు.. మనసు భాష కావాలి
తెలుగు చదవడం రానివాళ్లున్నారు, తెలుగు రాయలేని వాళ్లున్నారు, తెలుగు మాట్లాడటం రానివారున్నారు. వారు కన్నడిగులు, తమిళులు, బెంగాలీలు, పంజాబీలు, కేరళీయులు అనుకుంటున్నారు కదూ! కాదు... అరె! వీరికి కూడా తెలుగు వచ్చు, మాటలాడటం చూసామే అంటారు. అయితే తెలుగువారయి కూడా తెలుగు మాటలాడటం రానివారు, మాటలాడటానికి ప్రయత్నించనివారు, మాట్లాడాలంటే సిగ్గుపడేవారు ఉన్నారు.
ఇక మాట్లాడినా పట్టి పట్టి మాట్లాడుతారు. అసలు వీరు మాట్లాడేది తెలుగేనా అని సందేహం కలుగుతుంది. మన మాతృభాషకు ఎందుకీ వేదన అని బాధ కలుగుతుంది. చెక్కుమీద తెలుగులో సంతకం చేసినందుకు తనకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడం తెలుసుకున్న భోగరాజు పట్ట్భారామయ్యగారు ఆవేశపూరితులయ్యారు. దాని ఫలితమే ఆంధ్రా బ్యాంకు అవతరణ! ఏది ఆ స్ఫూర్తి ఈనాడు?
తెలుగు బిడ్డడవయ్యు తెలుగు రాదంచును / సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా? / దేశ భాషలందు తెలుగులెస్స యటంచు / తెలుగు బిడ్డా / యెపుడు తెలుసుకుందువురా? అని ప్రజాకవి కాళోజీగారు అన్నమాటలు చురుక్కుమనిపించక మానవు.
ఆంగ్ల భాషను నేర్చుకుని తద్వారా ఉద్యోగ అర్హతలను పెంపొందించుకోవద్దని ఎవరూ అనరు. బ్రతుకు భాషకు మనసు భాషకు ఉన్న అంతరం తెలుసుకోవాలి. తెలుగుపై ఆదరణ పెంచుకుని, తెలుగులో ఇంటా బయటా సంభాషిస్తూ భాషా పాటవాన్ని పెంచే సాహిత్య పఠనాన్ని ప్రోత్సహిస్తూ నవతరాన్ని తెలుగు బాటలో నడపాలి.
తెలుగు భాష బలంగా వేళ్లూనాలంటే భాషాప్రియత్వ ప్రకటనలో ఒరవడి మారాలి. మాతృమూర్తిపై మమత, మమకారం, స్వతస్సిద్ధం. మరి మాతృభాషపై ఉదాసీనత ఎందుకు? ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆంగ్ల భాషను ప్రాథమిక స్థాయి నుండి ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. పిల్లల సామర్థ్యం పెంచే దిశగా విద్యావిధానాలు రూపుదిద్దుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనా తెలుగును విస్మరించి చిన్నచూపుచూడరాదన్న అభిప్రాయం బలంగా వినిపించింది. ఆంగ్లం మాధ్యమంగాకల విద్యా సంస్థలలో తెలుగులో మాట్లాడితే శిక్షింపబడుతున్న చిన్నారుల అవస్థలు చూస్తే పిల్లలకు కాకుండా ముందు వారిని శిక్షించినవారికి పాఠాలు నేర్పవలసిన అవసరముందేమోననిపిస్తుంది.
తెలుగు మనసు భాష. మన మనసులోని భావాలను పరభాషలలో ఎంత సామర్థ్యమున్నా తెలుగులో ప్రకటించినంత స్పష్టంగా ఆలోచనలను అర్థవంతంగా వివరించడం కష్టతరం. తెలుగు జాతీయాలు, నుడికారాలు, పొడుపు కథలు సామెతలతో పరిపుష్టమైన తెలుగు భాష వినసొంపుగా ఉండటమే కాదు భాష పట్ల అభిమానాన్ని పెంచుతుంది. అందుకే చిన్నారులకు కథలు చెప్పేటపుడు కథలో వచ్చిన జాతీయాలు, సామెతలకు అర్థాలు చెప్పి భాష సౌందర్యాన్ని ఇనుమడింపజేయాలి. పిల్లలలో పఠనాసక్తిని పెంపొందించేందుకు కథ రాజమార్గం.
తెలుగుకు పొరుగు రాష్ట్రాలవలెనే మనకూ ప్రత్యేక మంత్రిత్వశాఖ అవసరం ఉందని ఎందరు నొక్కి చెప్పినా కార్యరూపం దాల్చడానికి కాలమెప్పుడు కరుణ చూపుతుందోనని వేచి చూడటమే మనకు మిగిలింది. తెలుగు నేర్చుకుంటే మాకేం లాభం అనేవారికి తెలుగు పరీక్షలో రావలసిన కనీస మార్కులు వారు కోరుకుంటున్న ఉద్యోగానికి అదనపు అర్హత అని నిర్ణయిస్తే ఈ ప్రశ్న వేయరు.
ఆంగ్లం నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషను మృతభాషగా మార్చకూడదుకదా! చివరకు పెద్దతెర, చిన్నతెర అని తేడా లేకుండా ఆంగ్ల శీర్షికలకే ప్రాముఖ్యతనిస్తున్నాయి. కడకు వ్యాసాలలోకూడా అసంఖ్యాకమైన ఆంగ్ల పదాలు దొర్లడం తెలియకుండానే జరిగిపోతుంటుంది. అవసరార్థం అరువు తెచ్చుకున్న పరభాష జీవిత నౌకను నడిపిస్తుందనుకుంటున్న నేపథ్యంలో ఆ భాషపై పెల్లుబికిన వ్యామోహ సునామీ ముంచుతుందో లేక చాప క్రింద నీరులా మూలాలను కబళిస్తుందో తెలియక, అచేతనులై నిలబడ్డ భాషాభిమానులను నివ్వెరబోయేటట్లు చేస్తోంది.
- సి.ఉమాదేవి
Saturday, March 17, 2012
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
మీ బ్లాగ్ చదివాక ఒక్కటి చెప్పాలనిపించిందండి.
నా అనుభవంలో నేను చూసినదేంటంటే ఒక్క తెలుగు వారు మాత్రమే మేము తెలుగువాళ్ళం అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నరు అని అనిపిస్తుంది. "మాతృమూర్తిపై మమత, మమకారం, స్వతస్సిద్ధం. మరి మాతృభాషపై ఉదాసీనత ఎందుకు?" జవాబు లేని ప్రశ్నేనేమో..
చాలా బాగా వ్రాసారు.. ఆలోచింపచేసే విధంగా..
నిజమే తెలుగు భాష పైన ఇంత చిన్న చూపుఎందుకో !
బాగా రాసారు .
కన్న తల్లిని ఈమె నాతల్లి అని చెప్పుకోలేనివారు మాతృభాషలో ఎలా మాట్లాడతారండీ! మీరు మరీనూ!!!
జలతారు వెన్నెలగారు,సుభ గారు,మాలాకుమార్ గారు,శర్మగారు, మీ అందరి స్పందనలకు ధన్యవాదాలు.కలకండ పలుకు,తేనెలొలుకు భాష మనది.తెలుగువెలుగులకై మనవంతు ప్రయత్నం మనం చేద్దాం.
శ్రీ ‘ ఉమాదేవి ‘ గారు రచించినట్టి
వ్యాసమున మాతృభాషాభి వ్యక్త ప్రేమ
బొగడ వేనోళ్ళు చాలవు , స్ఫూర్తి నిచ్చు
గాత ! తెల్గుల కిది , మన కాంక్ష దీర
పండితులు గొప్పలకు బోయి , బాధ్యతలను
మరచి , గీర్వాణమెంచి , ఏమార రెపుడు ,
ప్రజలు మాటాడు భాష చేపట్టి నపుడె
రచన చదువరి కర్థమై రాణ కెక్కు
బ్లాగు: సుజన-సృజన
తెలుగు భాషపై మమకారము తెలుపుతాయి మీ పద్యములు.రాజారావు గారు ధన్యవాదములు.
Post a Comment