Thursday, July 25, 2013

చేరువైనా,దూరమైనా మాటమహిమే!



నేటి ఆంధ్రభూమిలో(25-7-13) నా వ్యాసం.

       సృష్టిలో మనిషికి మాత్రమే లభించిన వరం వాక్కు. మన మాటలో ఎంతగా విజ్ఞత పాటిస్తే అది మంత్రమై ఎదుటివారిని అంతగా అలరిస్తుంది. చిలకలకు, మైనాలకు మాటాలు నేర్పితే అవి మనం నేర్పిన మాటలనే పలుకుతాయి. అదే మనిషైతే సొంత ఆలోచనాశక్తితో భావాలను పంచుకుంటాడు. పసిపాపలను లాలించి, బుజ్జగించే మాటలు, ఎదిగిన పిల్లలను అనునయించే మాటలు, కష్టాల బారిన పడినవారిని ఓదార్చే మాటలు... ఇలా ఎన్నో రూపాలలో మాటే మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే, మాటలను వినియోగించేటప్పుడు పాటించాల్సిన కనీస మర్యాదల్ని విస్మరిస్తే- మాటలే తూటాలై పేలి అవతలి వ్యక్తి మనసును గాయపరుస్తాయి. కటువు మాటలు పాముకాటుకన్నా విషపూరితం. తప్పు చేసిన వారిని దండించే సందర్భంలో సౌమ్యత పాటిస్తే మళ్లీ ఆ తప్పు జరిగే అవకాశం ఉండదు. ఎపుడూ అరుస్తూ, కేకలు వేస్తూ కంకర రాళ్లలాంటి మాటలను ఇతరులపై ప్రయోగిస్తే మనసుల మధ్య దూరం కొలవలేనంతగా పెరిగిపోతుంది.
       ‘మీరొక మాట చెప్పండి.. పనవుతుంది..’ అని కొందరంటుంటారు. అది పెళ్లి సంబంధమైనా కావచ్చు. ఉద్యోగానికి సిఫారసు కావొచ్చు. కొంతమంది మాటకున్న విలువ అలాంటిది. కొంతమంది పెద్దలు అంతగా చదువుకోకపోయినా, సాహిత్యంపై పట్టులేకపోయినా అనుభవం నేర్పిన పాఠాలను తమ మాటలలో రసాత్మకంగా చెబుతుంటారు. అలాంటి వారి మాటలు భావితరాలు తమ జీవనగమనంలో పేర్చుకోవలసిన మైలురాళ్లని అర్థమవుతుంది. అలాగే, కొందరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. మరి కొందరు ప్రయోజనం లేని మాటలను ఊసుపోక చెబుతూ పదే పదే వల్లె వేస్తుంటారు. పరుగులు తీసే కాలానికి ఇలాంటి మాటలు ‘స్పీడ్ బ్రేకర్లే’. కాలం విలువ తెలిసిన వారు మాత్రం ఇలా వృథా మాటలతో కాలక్షేపం చేయరు. మాటతీరుతో ఎవరి ము ఖభావాలను గానీ, వారి మనసులో ఏముందో గానీ కొంతవరకూ చెప్పవచ్చు. కానీ, ఇది ఎల్లవేళలా సాధ్యం కాదు. తేనెపూసిన మాటల గమ్మత్తేమిటంటే మనకు తెలియకుండానే ఆ మాటలు నిజాలని నమ్మేస్తాం. అసలు నిజం బయట పడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మాటలను సమతూకంలో వాడటం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. కానీ, ఆ పద్ధతిని అలవాటు చేసుకోవడం అంత కష్టమేమీ కాదు.
‘మేం చాలా కచ్చితంగా మాట్లాడతాం, ఏదైనాసరే కుండబద్దలు కొట్టినట్లు చెప్తాం..’ అని ఎవరైనా అంటే- వాళ్లు కుండల్ని కాదు.. ఎదుటివారి హృదయాన్ని బద్దలు కొడుతున్నారని గ్రహించాలి. చెప్పే విధానంలో సౌమ్యత లేకపోతే వినే వ్యక్తిలో గౌరవం తగ్గుతుంది. దీంతో ప్రేమాభిమానాలు తగ్గిపోయ ఒకరికొకరు దూరమవుతారు. మనసు గాయాలకు మంచి మాటే సరైన లేపనం. ‘మా మాటే శిలాక్షరం’- అని ఎవరైనా మొండిగా అనుకుంటే వారు మనుషులేనా? అన్న మాట వాడక తప్పదు!
http://www.andhrabhoomi.net/content/c-56








  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

10 comments:

Unknown said...

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది!మాటే మంత్రము అనే సినేమపాతకూడా ఉంది!సుతిమెత్తగా మృదువుగా సౌమ్యంగా ఆర్ద్రంగా కళ్ళలోకి చూసి మాట్లాడాలి!ప్రబల శత్రువైనా నవ్వుతూ మాట్లాడాలి ఆ తర్వాత అతనికి వ్యతిరేకంగా కటిన కరకు నిర్ణయం తీసుకోవలసి వచ్చినా!attitude ను మార్చుకొని సౌమనస్యంగా మాట్లాడడం అలవరచుకోవాలి!సి.ఉమాదేవిగారి టపా నాకు నచ్చింది!

చెప్పాలంటే...... said...

అవును అండి మాటా మంచే మిగిలేది మీ చక్కని టపా కు అభినందనలు

సి.ఉమాదేవి said...

సూర్యప్రకాష్ గారు,నా వ్యాసంపై మీ ఆభిప్రాయం సహేతుకం.టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

సి.ఉమాదేవి said...

మంజులగారు,మాట పెంచే మంచి,మంచి పెంచే మాట వెరసి మంచి మాటే కదా!మీ అభినందనలకు ధన్యవాదాలు.

Padmarpita said...

చక్కని సంభాషణలా సాగింది....బాగుందండి.

సి.ఉమాదేవి said...

పద్మార్పితగారు, మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి.

శ్రీలలిత said...

మీ మాటలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయండీ. అభినందనలు...

సి.ఉమాదేవి said...

మీ మంచిమాటకు ధన్యవాదాలు శ్రీలలితగారు.




మరువం ఉష said...

మాట మీద మాటగా బాగా చెప్పారండి. ఇలాగే మునుపు మాట మీద చదివిన అనేక రచనల్లోవి ఓ నాలుగు పంచాలనిపించి:

మాట గురించి విశ్వనాథ వారి మాట – “మాటకున్నంత శక్తి మరొకదానికి లేదు. మాటకు అనేకములైన అర్థములు ఉంటవి. వంద సందర్భాల్లో ఒకేమాట వంద అర్థాలనిస్తుంది. ఒక్కమాటే అన్ని అర్థాలిస్తే రెండు మూడు మాటలు కలిస్తే ఎప్పుడు ఏ అర్థమిస్తుందో చెప్పలేము. కనుక మాటకు శక్తి లేదనకు. శక్తి లేనిది మనకు. మాట అర్థం ఇస్తుంది. అర్థం చేసుకొనవలసినది మనము.”

"తనువున విఱిగిన యలుఁగుల
ననువునఁ బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్‌
మనమున నాటిన మాటల
వినుమెన్ని యుపాయముల వెడలునె యధిపా!" - తిక్కన

శరీరంలో బాణాల ములుకులు గుచ్చుకుంటే ఏదో ఉపాయంతో
తీసేయవచ్చు. కాని పరుషంగా మనసులో గుచ్చుకున్న మాటలను తొలగించలేము అని దీని భావం.

"Don’t mix bad words with your bad mood. You’ll have many opportunities to change your mood, but you’ll never get the opportunity to replace the words you spoke….." - Jerose

“Life's disappointments are harder to take when you don't know any swear words.” - Bill Watterson

Both are equally true though...

సి.ఉమాదేవి said...

ఉష గారు,వీణ మీటినట్లున్న మీ మాటలు మాటకున్న ప్రధాన్యాన్ని మరోమారు జాగృతపరిచాయి.చక్కని విశ్లేషణ,అంతే చక్కని వివరణ మీ కవితాక్షరాలకే సంభవం!ధన్యవాదాలండీ.

Post a Comment