Sunday, July 21, 2013

రసరమ్య కథాగుచ్ఛం

21-7-13, ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నా సమీక్ష.  రసరమ్య కథాగుచ్ఛం
          రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక ప్రచురించిన కథాసంపుటం సోమేపల్లి పురస్కార కథలు. ఇవి చిన్న కథలే అయినా మనసుపై పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. ఇందులో కలమూనిన రచయిత(త్రు)లు తమదైన శైలిలో కథాంశాన్ని క్లుప్తంగా, సూటిగా సముచితరీతిని చెప్పిన తీరు అభినందనీయం.
             కథారచన రచయిత(త్రి) మనసును నిత్యం తొలిచే వడ్రంగి పిట్టలాంటిది.లక్ష్యం దిశగా సాగిన అక్షరసేద్యం పండేదాక మస్తిష్కం నిద్రపోదు. కథాహాలికుల రచనాతపస్సు ఫలసిద్ధి పొందడం ప్రచురింపబడినప్పుడే!వందేళ్ల కథావైభవం ప్రభవిల్లుతున్నవేళ రమ్యభారతి వంటి సాహిత్య పత్రికలేకాక మరెన్నో దిన,వార,మాసపత్రికలు కథలపోటీలు నిర్వహిస్తూ  రచయిత(త్రు)లకు  అందిస్తున్న ప్రోత్సాహం హర్షణీయం.
సూక్ష్మాంశాన్ని సునిశిత పరిశీలనతో చిన్నకథలలో అందంగా అమర్చి పాఠకులకు అందించాలని సోమేపల్లి సాహితీ పురస్కారాలను నెలకొల్పి కథకులకు కథా ఉద్దీపన గావించడం హర్షదాయకం. దాదాపు ముప్ఫైకథలకు పైగా సంపుటీకరించి ప్రచురింపబడ్డ ఈ కథలలో వస్తువైవిధ్యం ఎన్నతగినది. భాషలో సరళత్వం,భావనలో గాఢత  పొదిగి మన ముందు పేర్చిన కథలు పలు సామాజికాంశాలను జల్లెడ పట్టాయి.
                జీడిగుంట రామచంద్రమూర్తిగారి కథ గుండెపోటు. ఇది కొడుకు ప్రవర్తనతో గుండె కోతకు గురైన తల్లి కథ. గుండెలకు హత్తుకుని పెంచిన బిడ్డలు గుండెక్షోభ కలిగిస్తే మరి గుండెపోటు శరీరానికికాదు,మనసుకు అని తెలియచెప్తుంది.
              పచ్చని చెట్లపై పక్షుల కిలకిలల మేలుకొలుపులు నేడు కేవలం మనసుపొరలలో మాత్రమే నిక్షిప్తమైన ఆడియోలుగా  మిగిలిపోయాయని తెలియచెప్పే కథ రేణుకా అయోల రచించిన కథ, అలారం’. గడియారమో,సెల్ ఫోనో గగ్గోలు పెట్తేనే తప్ప మనకు నిద్రలేవాలన్న కోరిక ఉండదనడానికి మనం కోల్పోయిన కిలకిలారావాలే! పెకిలించి వేయబడ్డ చెట్ల స్థానంలో వెలసిన అపార్ట్ మెంట్లు కిలకిలల బదులు కలకలం మిగిల్చాయంటుందీ కథ.
 వృద్ధులను  జీవచ్చవాలుగా పోలుస్తూ వారిని అపహాస్యం చేసే యువతకు చొప్పదండి సుధాకర్ రచించిన       రెక్కలుతెగిన పక్షులు కథ చెంపపెట్టు.
                అన్ని అనర్థాలకు మూలం లంచమనే విషపురుగే.ఇది కుట్టినచోట అన్యాయం న్యాయమైపోతుంది. ఏదేశానికైనా వెళ్తే నేను ట్రావెలర్ గా వెళ్తాను,అదే భారతదేశానికైతే పిల్ గ్రిమ్ గా వెళ్తాను అనే విదేశీయులముందే మనం లంచావతారాలమై ఇవీ మా నిజస్వరూపాలు  అని నిలబడటం బాధాకరం. బస్సులో బయల్పడిన డ్రగ్స్, అధికారుల ధనాశతో మాఫీకావడం మనదేశంలో లంచం ఊడలమర్రిలా ఎలా వ్యాపించిందో తెలిపే కథ జె.ఆర్.సుధీర్ రచించిన బలమైన కుటుంబాలు-బలహీన సమాజం.
వడలి రాధాకృష్ణగారి  నింగి నీడలు ‘. ఇందులోని కరుణరసాత్మక కథనం మనసును చెమరుస్తుంది. గర్భాన్ని అద్దెకిచ్చే తల్లుల మమకారాన్ని ఆర్థికావసరం ఎలా నలిపి పిండి చేస్తుందో చెప్పే కథ. పిల్లలులేని కమలాకరం,దాక్షిణ్య బిడ్డ కోసం ఒక తల్లి గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు.ఆ తల్లికి బలవర్ధక ఆహారం  ఏర్పాటు చేస్తారు. కాని వారు విధించిన షరతు తల్లి మనసును ఆలోచింపచేస్తుంది. బిడ్డలో ఏదైనా అవాంఛనీయత కనబడితే   ఆ బిడ్డను అంగీకరించలేమన్నప్పుడు ఆ తల్లి తీసుకున్న నిర్ణయం చదవాల్సిందే.
            ఆతిథ్యం నిడివిలో చాలా చిన్న కథే! చిన్నారి రమ్య మనసులో, కేవలం పాలు తాగి, బడికి వెళ్లి ఆకలితో లంచ్ బెల్ వరకు వేచి చూసే కంటే అతిథి వచ్చినప్పడు అమ్మ తప్పక చేసే టిఫను తినగలను అనుకుంటుంది. అందుకు  అతిథిని పదిరోజులైనా ఉండమనే రమ్య మాటలు మనసును కలుక్కుమనిపిస్తాయి. చాలీచాలని జీవికలకు అద్దం పడుతుందీ కథ. చిన్న కథలలో గొప్పకథలంటే ఇవే!
          టి.ఎస్.ఎ.కిష్ణమూర్తిగారి కథ సుచిత్ర నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలకు  నిలువుటద్దమే. వేధించిన భర్తే నాలు సంవత్సరాల తరువాత వచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నా అతని ప్రవృత్తి తెలిసిన సుచిత్ర ఆత్మస్థైర్యంతో అతనికి దూరంగా, బిడ్డలకు దగ్గరగా నిలబడి తానేమిటో తెలియచెప్తుంది.
         దేశ పురోగాభివృద్ధిలో వీధికొక బడే కాదు ప్రతి వీధికొక వృద్ధాశ్రమము ఏర్పడుతున్నాయి.  అయితే ఈ వృద్ధాశ్రమాలు  వృద్ధులను కుటుంబాలకు దూరంగా మానసిక బందీలను చేసే బదులు వారికి రిక్రియేషన్ క్లబ్బులుగా మారగలిగితే జీవిత చరమాంకంలో వారికి ఆనందార్ణవమే కదా! ఇదే చెప్తుంది జి.మేరీ కృపాబాయి రచించిన సీనియర్ సిటిజన్ రిక్రియేషన్ క్లబ్ కథ.
               ‘ కొంచెం చేదు,కొంచెం వగరు మనకందరికి అనుభవమైన కథే. నేటి బాల్యం కోల్పోతున్న అమ్మమ్మల, నానమ్మల, తాతయ్యల సాహచర్యం మళ్లీ పొందగలిగిన పిల్లలు ఇక వారి దగ్గరే ఉండి చదువుకుంటామన్న వైనం. సెలవులలో పిల్లలను అత్తమామాలకు అప్పచెప్తే తనకు ఆటవిడుపే అనుకున్న తల్లికి ఈ కథ నామౌచిత్యం శీర్షికకు  సరితూగినదే!
               ఇంటర్నెట్ ప్రసాదించిన ఆటలలో చంపు..చంపు అంటూ ప్రత్యర్థిని హతమార్చే ఆటలు వేలికొసతో ఆడుతున్న చిన్నారుల మనసులను ఆ ఆటలే భూతదయతో నిండాల్సిన వారి మనసులను భూతభయంతో చంపి కలవర పెడుతోంది. ఇది చిన్నకథే కాని మిన్నకథగా మలచిన పాలపర్తి జ్యోతిష్మతిగారి కథ భూతం చదివి ఆ భూతాన్ని వదలగొట్టే ప్రయత్నం చేస్తే బాల్యం భయవిహ్వలం కాదన్న సందేశం బాగుంది.     
                 రమేష్ కుమార్ రచించిన ఖాళీ చదివాక మనసంతా శూన్యమేర్పడి నిజంగానే ఖాళీ ఏర్పడుతుంది. ఆకలిగొన్నవానికి ఆపన్నహస్తం చాచలేనినాడు అది మానవత్వానికి మచ్చేఅని చెప్తుందీ కథ. జీవితచట్రంలో  భర్త జబ్బు వల్ల ఇరుకున పడ్డ భార్య నాలుగు లక్షలు ఖర్చు పెట్టినా నయంకాని రోగంతో తీసుకుంటున్న భర్త ఇంకా ఎంతకాలం బ్రతుకుతాడో చెప్పమని డాక్టరును అడగడం కడుపులో కవ్వం పెట్టి చిలికినట్లవుతుంది.
      వర్ణనలు లేవు,అలంకారాలు లేవు,భాషా చమక్కులు లేవు. అయితేనేం కథలన్నీ ఆకట్టుకున్నాయి. కారణం.. కథలల్లబడిన నేపథ్యం.సామాజికాంశాలకు ఇవ్వబడిన ప్రాముఖ్యం.మానవసంబంధాలు ఉల్కలలా రాలిపడి మనిషిని బంధవిముక్తుడిని చేసాయనుకుని మురిసిపోవడంకాదు కావాల్సింది!అడుగంటిపోతున్న అనుబంధాలను సన్నని దారపుపోగుతోనైనా సరే బలంగా పెనవేయాలనే ఆర్తి కథలలో అంతర్లీనంగా ప్రవహించడం ముదావహం.
                                                                                                                    

                                                                                                                                              
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

3 comments:

శ్రీలలిత said...

మీ సమీక్ష చదివాక కథాసంపుటం వెంటనే కొని చదివేయాలనిపిస్తోందండీ...

ప్రేరణ... said...

చక్కని సమీక్ష

సి.ఉమాదేవి said...

శ్రీ లలితగారు,ప్రేరణ గారు ,మీకు సమీక్ష నచ్చినందుకు ధన్యవాదాలు.

Post a Comment