Saturday, June 1, 2013

కాలాతీత వ్యక్తి డా. పి.శ్రీదేవి


      ఇందిర పాత్రపై సుజాతగారి విశ్లేషణ చదివాక నేనిది 2010లో రాసాను.ఈ రోజు వనజవనమాలి గారి విశ్లేషణ చూసాక  ఈ వ్యాసం మళ్లీ పోస్ట్ చేస్తున్నాను. నేనెప్పుడో చదివిన కాలాతీత వ్యక్తులు నవలపై మరోమారు స్పందించాలనిపించింది. నవలలెన్నో పుట్టాయి,పుట్తున్నాయి.కొన్ని నవలలు మనం చదువుతాము,కొన్ని మనల్ని చదివిస్తాయి.ఈ కోవలోకే చెందుతుంది డా.పి.శ్రీదేవి రచించిన కాలాతీతవ్యక్తులు.అసంఖ్యాకమైన నవలలు చదివుంటాము.కాని అన్ని గుర్తుండవు.కొన్ని అవే మరుగునపడిపోతాయి.అయితే దాదాపు యాభైయేండ్లనాటి నవల ఇప్పటికీ మనతో సహప్రయాణం చేస్తోంది.బ్రతుకుబాటలో కుటుంబం ప్రాథమికవ్యవస్థ.బంధువులు ,స్నేహితులు, పరిచయాలు,వృత్తి అవసరాలు ఇత్యాదివెన్నో పునాదిగా ఏర్పడ్డది సామాజిక వ్యవస్థ.ఈ రెండు వ్యవస్థలే మనిషి మనుగడను శాసిస్తాయి అని ప్రస్ఫుటింపచేస్తుందీ నవల.ఇఫ్పటికీ ఆనాడు శ్రీదేవి చిత్రించిన వ్యవస్థ తీరు తెన్నులు అటు సమాజంలోను ఇటు కుటుంబంలోను దర్శనమిస్తూనే ఉన్నాయి.
ఇందిర,కళ్యాణి,ప్రకాశం,క్రిష్ణమూర్తి,డా.చక్రవర్తి,ఆనందరావువంటి పాత్రలు సజీవ చిత్రణలే.ఆనందరావునుండి క్లోనింగ్ చేయబడ్డవ్యక్తులుకోకొల్లలు,ఆనందరావుది సుఖజీవనానికి అలవాటుపడ్డ ప్రాణం.బాధ్యతారాహిత్యానికి అతడే నిలువెత్తు నిర్వచనం.కూతురిపైనే పరాన్నభుక్కులా ఆధారపడే తండ్రులున్నారు ఇప్పటికీ.కూతురు ఉద్యోగం చేయకపోతే తమకు తెల్లవారదని,కూతురు అత్తగారింటికి వెళితే సిగరెట్లకు,తాగుడుకు ముఖం వాయాల్సివస్తుందని కడకు కూతుర్లను వృద్ధకన్యలను చేసే మహానుభావులైన తండ్రులు నేడు లేరనలేం. అలాంటి ఆనందరావు తన కూతురైన ఇందిరకు స్వేచ్ఛనిచ్చి తను స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాడు.ఇక శవంపై రాబందుతో పోల్చదగిన పాత్ర శేషావతారం.చెల్లెలిని ఉద్ధరిస్తున్నానంటూ ఆమె ఆస్తిని ఆబగా చప్పరించేసి ఆమె కొడుకు ప్రకాశాన్ని కీలుబొమ్మలా ఆడించాడు,డాక్టరు కోర్సు చదివించడానికి.తనకంటూ ఒక వ్యక్తిత్వంలేని ప్రకాశం నిజంగా ఒక డాక్టరుగాకాక ఏసీదాసాదా వ్యక్తో అయితే పాఠకుడు రాజీపడేవాడు.అర్భకుడని ఇందిర క్షమించినా పాఠకులు క్షమించలేని వ్యక్తి ప్రకాశం. ఇందిర వ్యక్తిత్వం అంచనాలకతీతం.ఇందిరలాంటి స్త్రీని ఆనాడేకాదు నేటికి హర్షించదు సమాజం.గళమెత్తి పోరాడే గొంతుకామెది. అనాలనుకున్నది అనెయ్యడం. చేయాలనుకున్నది చేసెయ్యడం.ఇవే ఇందిర పాత్రకు ప్రత్యేకత కలిగించాయి.స్త్రీకుండే సహజధోరణిలో కళ్యాణి,ప్రకాశంలకు ఎడం కల్పించి ఆమె ప్రకాశానికిదగ్గరైనా,అతడి భీరుత్వాన్ని చూసి భీకరంగా మండిపడ్డ యువతి.భర్త అనేవాడు భార్యకు రక్షణవలయంగా ఉండాలంటుంది.తన కాళ్లమీద తాను నిలబడుతున్నానన్న అభిమానం ఉన్నఇందిరకూడా తాను మగవాడికి రక్షణకాదు తనకు రక్షణ కావాలని కోరుకుంటుంది.అయితే స్త్రీ తనకందిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోరాదన్న పాఠం నేర్పుతుంతీమె గమనం.

నవలలో మరొక ముగ్ధ కళ్యాణి.చిరుగాలికే వణికే చివురుటాకువంటి అమ్మాయి.చిన్నప్పుడు వైద్యవిద్య చదివించలేనని తండ్రి బి.ఎలో చేర్పిస్తాడు,అది ఆమెకు మొదటి దెబ్బ.తనవాడనుకున్న ప్రకాశం తన మరణవార్త తెలిపితే వచ్చి ఆదుకుంటాడని భ్రమపడటం ఆమె జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ.ఎవరు ఎవరికి ఏమీకారు ఆనుకున్నతరుణంలో చిత్రంగా ఒకనాటి సహాధ్యాయి వసుంధర ఆదుకుంటుంది.అలాగే మునసబు రామ్మూర్తినాయుడు ఆమెను తండ్రిలా ఆదుకుంటాడు.కళ్యాణిని పరామర్శించడానికి వచ్చినప్పుడు అతడికి గుండెపోటు వస్తుంది.ప్రకాశం స్నేహితుడు క్రిష్ణమూర్తి,డాక్టరు చక్రవర్తి కళ్యాణికి అండగా నిలుస్తారు.మునసబు మరణిండంతో ఆమెను ఆదుకోవాలనుకుంటారు.అందరు చేయూతనందించేవారే కాని ఆమెకు అందుకోవాలనే ఇచ్ఛ లేదు.నిర్లిప్తత ఆవరించుకున్న కళ్యాణిలోమార్పు తెస్తాడు డాక్టరు చక్రవర్తి.ఘనీభవించిన ఆమె హృదయాన్ని మీటి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.అలాగే క్రిష్ణమూర్తి వసుంధరకు దగ్గర కావాలనుకుంటాడు. అయితే ఇందిరకు అనుకోకుండా కట్టుబడిపోతాడు.

ఇందిర తన ఎప్పటి ధోరణిలోనే సాగిపోతుందను కుంటాడు పాఠకుడు.కాని నవల చివరలో ఆమె జీవితాన్ని విశ్లేషించిన తీరుకు అబ్బురపడతాడు. తననుతాను కాపాడుకోగల సత్తా ఉన్న యువతినని ఇందిర ధీమా.ఆ ధీమా అందించిన మాటల జలపాతహోరు ప్రకాశం, కళ్యాణి,క్రిష్ణమూర్తి తదితర పాత్రలు జీర్ణించుకోలేవు.ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోలేక గుటకలు మింగుతారు.ఇలాంటి సన్నివేశాలే పాఠకులలో ఉత్కంఠను రేపుతాయి. తరువాతేమవుతుందోనన్న ఉత్సుకతను కలిగించి ఏకబిగిని చదివిస్తాయి.ఈ నవలలోనున్న కీలకాంశం ఇదే.
కొన్ని పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. అలాంటిదే వైదేహి పాత్ర.ఆనాటి సాంఘిక భద్రతా వలయంలో వేసారిపోతుంది వైదేహి.సోదరుడి అతిప్రేమ జలగలా పట్టుకుని ఆమెను ఎటు కదలనివ్వదు. వెన్నంటే పెళ్లిచూపుల ప్రహసనాలకు ఎదురొడ్డి నిలవగలగడం అప్పటికే వేళ్లూనుకున్నదనడానికి వైదేహి పాత్రే నిదర్శనం.

ఎన్నో సామాజికాంశాలను తడిమిన నవల కాలాతీత వ్యక్తులు.సినిమాకోణంలో కాక సమాజపరంగా దృశ్యీకరించుకుంటూ చదివితే ఈ నవల నిరంతర చర్చా వేదికే.




  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

6 comments:

మాలా కుమార్ said...

ఈ నవల గురించి చాలా విన్నాను . కాని చదవలేదు . ఆ నవల నాకు దొరకలేదు .
మీ పరిచయం బాగుంది .

Anonymous said...

శ్రీదేవి కాలాతీతవ్యక్తులు కాలాతీత నవల,రచించి 50 ఏళ్ళు దాటుతున్నా అది ఎందుకు కాలగర్భంలో కలిసిపోలేదు?పాత్రచిత్రణలో శైలిలో వైవిధ్యం సాహిత్య విలువలు సంతరించుకున్న రచన కాలానికి ఎదురీది నిలుస్తుందనడానికి ఈ నవల ప్రబల నిలువెత్తు నిదర్శనం;!ఉమగారి విశ్లేషణ లోతుల్లోకి తీసుకెళ్ళింది!వారి సాహిత్యాభిలాషకు జేజేలు!

వనజ తాతినేని/VanajaTatineni said...

ఉమా దేవి గారు.. మీరు చేసిన నవలా పరిచయం బావుంది .

క్లుప్తంగా నవలని పరిచయం చేసి చదవాలనే ఆసక్తి కలిగించారు .

సి.ఉమాదేవి said...

మాలా కుమార్ గారు,ఈ నవల నేను గ్రంథాలయంనుండి తెచ్చి చదివాను.మళ్లీ ప్రయత్నిద్దాం.నేను చేసిన పరిచయం నచ్చినందుకు ధన్యవాదాలు.

సి.ఉమాదేవి said...

సూర్యప్రకాష్ గారు, నేను చేసిన విశ్లేషణ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.మీ అభినందనలకు అభివాదములు.

సి.ఉమాదేవి said...

వనజవనమాలిగారు,నేను చేసిన నవలా పరిచయం మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

Post a Comment