Sunday, April 8, 2012

కథావిహారం





8-4-12 ఈ రోజు ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సప్లిమెంట్ లో ప్రాప్తం కథలసంపుటిపై ప్రచురితమైన నా సమీక్ష.


విభిన్నసంఘర్షణల కథావిహారం ప్రాప్తం

జగత్తులోని ప్రతి అంశం కథావస్తువే!గుట్టలుగా పోగుబడ్డ కథాంశాలలో తనను స్పందింపచేసిన అంశం ఏదైనా సరే దానిని మనసునిండా నింపుకుని వైనంగా నగిషీలు చెక్కి శిల్పాన్ని పారదర్శకం చేస్తారు విహారిగారు. కథానురాగం మెండుగాగల రచయిత.వీరు మధ్యతరగతి జీవులనడుమ,దగాబడ్డ బంధాల మధ్య అగుపడే కథా విహారి.కథకు కావలసిన ముడిసరుకు సమకూరాక అక్షరవిన్యాసం మొదలయే వీరి కథలలో సహజంగా రచయితలు సృష్టించే పదలయలేకాక వాక్యరాగాలు పల్లవిస్తుంటాయి.ప్రాప్తం కథాసంపుటి వారి కథాపాటవానికి ఓ మెచ్చుతునక!

జవాబులు రాసి ఇచ్చేసిన పరీక్షపేపర్ ను తిరిగి ఇవ్వమని అడిగినట్లుంది రేణుక అంటారు విహారిగారు చలిమంట కథలో. చిన్నవాక్యంలో సూక్ష్మంగా చెప్పినా భావజాలంలోతు మాత్రం అఘాతం.నిజమే! విడాకులిచ్చేసాక భర్త మరోపెళ్లి కూడా చేసుకుంటాడు. భర్తపై ప్రేమ చావలేదు,నాకు మళ్లీ నాభర్త కావాలి అని ఏడవడం గతజలసేతు బంధనమేకదా!

ఇక చెరలాట కథాప్రారంభంలో వసంత ముగ్ధగా అనిపించినా కథ చివరి అంకంలోకొచ్చేసరికి ఆమె స్థిత ప్రజ్ఞత ఆమెను చెరలాటలో బలిపశువు కాకుండా కాపాడుతోంది.ఎవరికివారు వసంతను తమ అవసరాలను అనుగుణంగా మలచుకోవాలనుకుంటారే తప్ప ఆమె మనసుకు ప్రాధాన్యతనివ్వరు.అందుకే తన స్వయంనిర్ణయానికి అనుకూలంగా ఒంటరిగానే మిగిలిన వసంత తనకు తోడుగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని నిలుపుకోవడం చెరలాటలో గెలుపే!

బతకనివ్వండి కథ పిల్లలపై వత్తిడి పెంచి తమ తీరని కోరికలను తీర్చే వారసులుగా మార్చుకోవాలనుకునే తల్లిదండ్రుల వైఖరిని అడుగడుగునా చిత్రీకరించి చూపుతుంది.కూతురు ఒక్కరోజు స్విమ్మింగ్ ప్రాక్టీస్ మానితే ప్రళయం వస్తుందన్నట్లు తనే ప్రళయకాల రుద్రుడిలా చిందులేసే తండ్రినుండి కూతురిని దూరంగా తల్లి తెగించి తీసికెళ్లడం ఊహించని మలుపే!శతకోటి వందనాలు అర్పించదగ్గ తల్లి ఆ మాతృమూర్తి. ప్రత్యేకించి ఈ కథపై స్పందనకు కథకుడు వేచి చూసినపుడు అనుకున్నంత స్పందన దొరకలేదంటారు.ఒక మూసలో ఒదిగిపోయి మరిక మార్పును స్వీకరించలేని వ్యవస్థకు చిన్నారులను చిత్రిక పట్టడం నేటి సమాజ చిత్రం.కాళ్లు తడవకుండా సముద్రాన్ని,కళ్లు తడవకుండా సంసారాన్ని ఈదలేమంటారు.మరి సంసారాన్ని ఈదాలంటే సర్దుబాటు గురించి ముందు ఆలోచిస్తారు. పాఠకుడు ఊహించుకున్న ముగింపు రాజీపడటం కావచ్చు అనే సందేహమే ఈ కథను చర్చకు దూరంచేసిందేమో ననిపిస్తుంది.

అద్దంలో బొమ్మ మరో అద్భుతమైన కథ!డబ్బే అందరికీ కేంద్రకం.టైమ్ లేని విత్తార్థులందరు.ఆత్మతృప్తిలేకపోతే ధనరాశులపై పవళించినా నిద్రపట్టదు.మనిషి మనిషికీ చెప్పాలి ఈ కథను అంటారు.నిజమే!తన కుటుంబంలో అసంతృప్తిని చూసిన వ్యక్తి, కడుపారా తృప్తి నిండిన హమాలీ జీవనాన్ని చూసి సంపాదన ఘోషలో కొట్టుకు పోతున్న మధ్యతరగతి అల్పజీవులు వారి భావజాలాన్ని తలకెత్తుకుని బాల్యాన్ని పారేసుకుంటున్న రేపటి పౌరులంటారు. దారి సమస్యల రహదారిగా మారినపుడు మనిషి ప్రవర్తనలో వింతపోకడలు ప్రస్ఫుటిస్తాయి.ఈ విపరీతాన్నే అటెన్షన్ డెఫిషిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ గా పిలువబడుతుందని చెప్తారు.నిశ్చలమైన కాసారానికి చిన్న గులకరాయి చాలు, నీటిని వలయాలుగా తిప్పటానికి అని నడవాల్సిన దారి కథలో రాణి,శ్రీపతి పాత్రల సంఘర్షణ ద్వారా చెప్తారు.

నిత్యయుద్ధం మధ్య తరగతి బ్రతుకు సమరం.అక్కడ బాధ్యతలే గురిపెట్టబడిన అస్త్రాలు.బంధాలను తెంచుకుని వెళ్లలేని జీవనం లాలన కథలో గుండెను చెమ్మగిల చేస్తుంది.

ఆ తల్లికేంకావాలి?... ఆలోచింపచేసే మరోకథ.అసలు ఏ తల్లికయినా ఏంకావాలి?చిన్ననాడు తన లాలనలో పెరిగిన పిల్లలు తన ఆలన పాలన చూసుకుంటారనుకోవడం భ్రమగా మిగిలిపోతే ఆ తల్లికి కావలసిన ఊరట చివరకు మానసిక దౌర్బల్యం రూపులో లభించడం చదివితే అయ్యో!కన్నపేగును నులిమేసే కసాయితనానికి మనసు గిలగిలలాడుతుంది. రవ్వంత అనురాగం,గోరంత సాన్నిహిత్యం ఇవే కదా ఏ తల్లయినా పిల్లలనుండి కోరుకునేవి.

మనిషిలోని భిన్నప్రవృత్తులను,అందుకు తగ్గవారి భావప్రకటనలను,వివిధ మనస్వత్వాలను వివరించి విశ్లేషించి మనలను కథాచట్రంలో ఇరికించి కూచోబెడతారు విహారిగారు.కథలను ఏకబిగిని చదివేసి ఇక లేద్దామనుకునేలోపు పాఠకుడి మనసును ముగింపు వాక్యంతో చెళ్లుమనిపించి మేల్కొలుపుతారు.ఆ తరువాత....?ఆ తరువాత ఏముంది?కథలు కత్తుల్లా గుండె లోతుల్లోకి దిగుతాయి.పాఠకుడు కథాలోకంనుండి మరిక బయటపడటం కష్టమే!ఆలోచనలు కందిరీగల్లా రొదపెడ్తుంటే పరిష్కారబాట పడతాడు.ఒక్కరైన తనదారి సక్రమంకాదు అని గ్రహించి పంథా మార్చుకుంటే కథాప్రయోజనం నెరవేరినట్లే. ఈ కథలు చదివాక రచనాపూదోటలో విహరించే కథామాలి విహారిగారినుండి మరిన్ని రచనాసుమాలకై పాఠకులు నిరీక్షించడం ఖాయం.

పుస్తకం వెల:రూ125/-
దొరకుచోటు:
విశాలాంధ్ర బుక్ హౌస్,
ప్రజాశక్తి బుక్ హౌస్,
నవోదయ బుక్ హౌస్,
దిశ పుస్తక కేంద్రం,
నవోదయ పబ్లిషర్స్
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

6 comments:

శ్రీలలిత said...

విహారి కథలసంపుటి "ప్రాప్తం.." పుస్తకంపై మీ సమీక్ష సమగ్రంగా వుంది. ఈ సమీక్ష చదివినవారు ఆ కథల పుస్తకాన్ని తప్పక చదవాలనుకుంటారు. అలా అనుకోవడం ద్వారా ఆ రచయిత ధ్యేయం నెరవేరినట్టె అవుతుంది. మీ సమీక్షకు మరోసారి అభినందనలు..

సి.ఉమాదేవి said...

మీకు నా సమీక్ష నచ్చినందుకు ధన్యవాదాలు శ్రీలలితగారు.ప్రాప్తం చక్కటి కథాసంపుటం.

జలతారు వెన్నెల said...

పుస్తకాలని ఇంత బాగా పరిచయం చేస్తున్న మీకు చాలా thanks అండి.ఈ పుస్తకం కూడ చదవాల్సిన బూక్స్ లిస్ట్ లో చేర్చాను ఉమ గారు.

సి.ఉమాదేవి said...

ధన్యవాదాలు వెన్నెలగారు.మీ పఠనాసక్తికి జోహార్లు.

జ్యోతిర్మయి said...

విహారి గారి కథలు చదివాను. చాలా బావుంటాయి. మీ సమీక్ష చదివాక వెంటనే ఆ పుస్తకం చదవాలని ఉంది. చదువవలసిన పుస్తకాల జాబితాలో వ్రాసుకున్నాను. మంచి పుస్తకాలు పరిచయం చేస్తున్ననదుకు ధన్యవాదాలు ఉమాదేవి గారూ..

సి.ఉమాదేవి said...

నా సమీక్షలు మిమ్మల్ని ఆకట్టుకుంటున్నందుకు సంతోషం.కథానురక్తిగల సహపాఠకుల ప్రోత్సాహం అభినందనీయం.ధన్యవాదాలు జ్యోతర్మయిగారు.

Post a Comment