
ఆవేదనల భావజాలం- కథాజ్వాల
కథలను పాత్రలు నడిపిస్తాయి.పాత్రలను వర్ణనలు వివరిస్తాయి.వర్ణనను వాక్యాలు లిఖిస్తాయి అయితే కథాజ్వాలలో ఈ ప్రక్రియ మొత్తం సమాజానికి మేలుకొలుపైన సందేశంగా,మానసిక విశ్లేషణగా, మేధోపరమైన ఆలోచనా బీజాలను మొగ్గ తొడిగేదిగా ఉండాలని చేసిన కథా రిసెర్చి మాత్రం గట్టిగా జరగిందనేది నిర్వివాదాంశం. ఏ కథనైనా తీసుకోండి.కథతోపాటు మనిషి మస్తిష్కం సైతం తన గమనాన్ని మార్చుకుంటూ ప్రగతి భావాల మాటున నడవమని పోరుతుంది.జీవిత వేదనలను జీవన వేదంగా మలచిన తీరు హృద్యమం. మాఫలేషు కదాచన,కథకు కాళ్లు,కొత్త ప్రహ్లాదుడువంటి కథలు ఈ కోవలోకే వస్తాయి. భావిపౌరుల దీనగాథలు, బలహీనుల ఆర్తనాదాలు బలంగా వినిపించిన కథలు. అణగారిన వర్గాలు ఎలా అణచివేయబడ్డాయో మనసును పిండేలా కథాకళిని నర్తింపచేసిన కథలివి.చేత బెత్తం పట్టిన మాస్టారు చదువు చెప్పినట్లు,పాఠకుడిని కూచోబెట్టి వల్లె వేయించగల కథాకథనం పాఠకుల మెదళ్లలోకి సూటిగా ఇంజెక్ట్ చేయ బడుతుంది. మనసులోని సంక్షోభం బయట పడకపోతే బ్రతుకే సంక్షోభంలో పడిపోతుంది అంటారు జ్వాలాముఖి గారు. జీవిత సత్యాలను, జీవన సూత్రాలను కథీకరించి కథను కదం తొక్కిస్తారు.వెట్టి చాకిరీ దురాగతాలను ఎండగడతారు.
హైదరాబాధలు!అంటూ విభజించిన రచనలలో కథల నిడివి పెద్దదే.అయితే వాటిలో అమరిన పదాల పోహళింపు సూక్తి ముక్తావళే!గతం గుణపాఠంకావాలి,ప్రస్తుతం ప్రాప్తకాలజ్ఞత కావాలి అంటారు అల్లాదీన్ ఆకాశదీపం కథలో.ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి పోయే పోరాట ప్రక్రియ జీవితం అని జీవితాన్ని నిర్వచిస్తారు.నేలవిడిచి సాము చేయని వీరి కథలు జీవితాలను నిలువుటద్దాలలో నిలబెడతాయి.
5 comments:
supatha.in లో order చేసుకోవచ్చాండి ఈ పుస్తకం కూడా?
చేసుకోవచ్చునండి.తాడు బొంగరం order ఇవ్వగలిగారా?
ప్రయత్నించానండి.online కుదరలేదు. మా అమ్మ గారికి చెపితే తను చక్కా కొనేసి చదివేసి , అప్పుడు పంపుతాను అంది. సర్లే ఏమిటి ఎమిటి పంపించడం ప్రధానం అని అనుకున్నాను. కధాజ్వాల కూడా ప్రయత్నిస్తాను online. లేకపోతే మల్లీ అమ్మకి చెప్పాల్సిందే!
సమీక్ష బాగుంది .
మాలాకుమార్ గారు మీకు నచ్చినందుకు సంతోషమండి.
Post a Comment