Friday, March 30, 2012

తాడు బొంగరం




2-1-2011 ఆదివారం ఆంధ్రప్రభలో నేను రాసిన సమీక్షా వ్యాసం బ్లాగులో మరొక్కసారి!

దైనందిన జీవితంలో తారసపడే ఎన్నో హాస్య సంఘటనలను అప్పటికప్పుడు నవ్వుకుని మరచిపోతాం.తాడూ-బొంగరం సంపుటంలో అక్షరబద్ధమైన హాస్యరచనలు మరీమరీ చదివి నవ్వుకునేలా ఉన్నాయి.సహజత్వం వీటి స్థాయిని పెంచేందుకు దోహదపడింది. సామెతలు;కోతలు, కట్టుకథలు,డాంబికాలు ఇవన్నీ నిత్యప్రయోగాలే.వీటిని వాడినతీరు,వాడిన సందర్భం,అందలి హాస్యాంశం పాఠకులకు కితకితలు పెట్తుంది.

తెలుగు ప్రపంచసభలవలె తెలుగు పంచామృతసభలు జరపాలంటూ గోంగూర పచ్చడి,ఆవకాయ,కందిపొడి,వడియాలు,అప్పడాలువంటి తెలుగు రుచులను ఆస్వాదించే వైనాన్ని హాస్యస్ఫోరకంగా రచించారు పులిగడ్డ విశ్వనాథరావుగారు.వొట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టవోయ్ అన్నారు గురజాడ.కాని నేడు మైకందుకుని కేవలం వొట్టిమాటలుచెప్తూ మైకండేయులుగా పేరొందుతున్నారంటారు రచయిత.బ్రహ్మదేవుడు భరతఖండవాసులకు వరమిచ్చిన వాగ్బలముతో, వాక్ యుద్ధంచేసి గెలవగలిగినవారు భరతవాసులంటారు. సామాజిక యదార్థాలను,ఆలోచనలను సూటిగా వ్యక్తపరిచే సామెతలను అశ్రద్ధ చేయవద్దంటారు.సామెతలు,భాషకు కళాత్మకంగా నగిషీలు చెక్కుతాయనడం వాస్తవమే.మననిత్య జీవితంలో మమేకమైన సామెతలను ఉటంకిస్తూ ఓడిపోయినవారు కోర్టులో ఏడిస్తే,గెలిచినవాడు ఇంటికెళ్లి ఏడ్చాడట!అని చెప్పడం ఆ సామెతకున్న పదశక్తిని తెలుపుతోంది.

భావవ్యక్తీకరణలో సామెతల వినియోగం మరింత వ్యాపించాలని, ఇంకా ఎన్నో సామెతలు ఉద్భవించాలని ఆశిస్తున్నారు.కట్టుకథలు కూడా ఓవిధంగా కనికట్టు విద్యలే.కన్నుకట్టుకున్నట్లు ఇంద్రజాలంలో కనపడేదానిని నిజమనుకుంటాం. అదేవిధంగా మసిపూసి మారేడుకాయను చేసినట్లు పనిమనిషి,ఉద్యోగులు,భార్యాభర్తలు,పిల్లలు ఈ కట్టుకథలను ఆశ్రయిస్తారు.నిజాన్ని నిర్భయంగా చెప్పలేని అశక్తతే ఇటువంటి కట్టుకథలకు దారితీస్తుంది.బడి ఎగ్గొట్టడానికి లెక్కలమాస్టారును చంపేస్తారు కట్టుకథతో.ఇంట్లో ముసలివాళ్లను చంపేస్తారు,
ఒక్కసారికాదు,పదేపదే సెలవు కావాలన్నపుడల్లా.అప్పుడు కట్టుకథ గొలుసుకథవుతుంది.

దైవదర్శనం మొదలుకుని ఆసుపత్రిదాకా లంచందే పెద్దపీట.ఆఫీసుల్లో పనులు సానుకూలపడాలంటే ఫైలు థ్రూ ప్రాపర్ చానల్ లో రావాల్సిందే అని చెప్పిన ఫీచర్ నడుస్తున్నచరిత్రకు అద్దం పడుతోంది.వీరు రచించిన చక్కటి అంశం సొరకాయకోతలు.మధురవాణితో గిరీశం కోసిన కోతలతో మొదలవుతుంది ఈ ఫీచర్. రాజకీయాలు,వ్యాపారాలలో ప్రగల్భాలు పలకడం ఈ కోవలోకే వస్తుంది.

ఒకమాట విభిన్న మనషుల దగ్గరకు చేరేసరికి రూపాంతరం చెంది కడకు అసలు అర్థాన్నే పోగొట్టుకుంటుంది.ఇదే చెప్తుంది వక్రరిపోర్టింగ్.బిజినెస్ చేయాలంటే విక్రయ వాక్చాతుర్యం కావాలి. పై ఆఫీసరును పొగిడి ప్రమోషన్లు సాధించుకోవడం,మాటలు చెప్పి వస్తువులను అమ్మెయ్యడం సేల్స్ టాక్ లో పారదర్శకం చేసారు. ప్రసార సాధనాలుగాకాక ప్రచారసాధనాలుగా మారుతున్న వార్తలు అనడం ప్రకటనల హోరును తెలియచేస్తుంది.అలాగే జోస్యం చెప్పే కంప్యూటర్ గణాంకాలు,లౌక్యంగా చెప్పేవారి జోస్యం ఒకొక్కసారి లెక్క తప్పినపుడు వెలువడే హాస్యం చదివితీరవలసిన ప్రహసనమే!ఈ సంపుటంలో ప్రాణాంతకకవిత్వం,తారుమార్లు,మతిమరపు,సమయపాలన తదితర హాస్య ఫీచర్లెన్నో ఉన్నాయి.మానసిక వత్తిడికి హాస్యమేకదా మందు!చదివి హాయిగా నవ్వుకోవాల్సిన పుస్తకం.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

2 comments:

జలతారు వెన్నెల said...

Online order చేసుకోవచ్చా అండి ఈ పుస్తకాన్ని?

సి.ఉమాదేవి said...

మీరు onlineలో order చేసుకోవాలంటేsupport@supatha.in help తీసుకోవచ్చు.వారి సైటు supatha.in చూడండి.

Post a Comment