
కన్నీటి చినుకై తడిపే కవిత్వం
చినుకు రాలకముందు మేఘాలు ముసురుకుంటాయి.కవిత జాలువారక ముందు ఆలోచనలు ముసురుకుంటాయి.అయితే గాలితాకిడికి మేఘాలు చెల్లచెదురై చినుకును నిలవరించినా బిక్కి కృష్ణగారి కవితలు మాత్రం చినుకుల్లాకాక వడగండ్లై రైతుల కన్నీటి కడగండ్లను కురిపిస్తాయి.
కవితా దాహార్తిలో దీనులకు,రైతులకు వస్తు ప్రాధాన్యతనొసగినా అనుబంధాలకు, మానవత్వానికి కూడా దిశానిర్దేశం చేయగల కవితలెన్నో చినుకులో ఒదిగున్నాయి.వీరి కవితలు ఊహలలోని పదముద్రలు కావు.అవి బలమైన పాదముద్రలు.అతి సాధారణ అంశమైనా చినుకు కవితలలో తన గొంతును బలంగా వినిపిస్తుంది.కవితలు కలలనుకాక జీవితపార్శ్వాలను గోచరింపచేస్తాయి. చినుకురాలక మేఘాలరాకకై తరచిచూచే రైతన్న ఎదురు చూపుల ముఖచిత్రం ద్వారా కవితా సంపుటిలోని కవితాత్మ ఒక్క చూపుతోనే విదితమవడం అభినందనీయం.
కవితలన్నిటా పరచుకున్న ఆర్ద్రత,ఆత్మీయత,మానవీయత మనిషిని మానవత్వమై పుష్పించమంటుంది. మనిషి మనవలసిన విధమేమిటో చెప్తూ మనిషిని పచ్చని నోటుగాకాక పచ్చని చెట్టులా పరిమళించాలంటారు కవి.మానవతా విలువలు మార్కెట్లో సరుకులై మనిషి డబ్బువాసన వేస్తున్నాడనడం చేదుమాత్రే కాని పచ్చి నిజం.ప్రపంచీకరణ దిశగా అడుగులుపడినప్పుడు ఏమి కోల్పోతున్నామో గమనించాలంటూ హెచ్చరిస్తారు.
భారతదేశం పటంపై చెదిరిన అక్షాంశాలు బాలకార్మికులు అనడం గుండెను పిండే వాక్యమే!భారతదేశం వెలిగిపోతోంది అని అంటున్నాం కాని బాలకార్మికుల బ్రతుకులు చీకటిలోనే ఛిద్రమవుతున్నాయని ఒప్పుకోక తప్పదు.వారి కవితలో మెదడు చెట్టై,ఆలోచన పువ్వై,అనుభవాలు పండ్లవడం ప్రకృతిలో మమేకమవడమే.
నిరుద్యోగం ఎయిడ్స్ కన్నా భయంకరమైనది అంటుంది ఆశల చెట్టు.ప్రకృతిపై ప్రేమ,చెట్లపై మమకారం మెండుగాగల కవితలన్నిటిలోను చెట్లు కూలుతున్న దృశ్యం బాధాకరంగా కవిత్వీకరించబడింది. మనిషిపై పగ చెట్టుపై గొడ్డలివేటు.కాండం నేలకొరగడమంటే మొత్తం కుటుంబం కుప్పకూలడమే.ఇక్కడ చెట్టుపై ఆధారపడ్డవారే కాదు చెట్టుపై నివసించే జీవజాలం కూడా కుటుంబమే.
బాల్యం అందరి హృదయాలలోను ఓ వెచ్చని జ్ఞాపకం.బాల్యంగురించి చెప్తూ,బాల్య గాఢానుభూతులు పరిమళించే పూలతోట/మధురానుభూతులు పంచాల్సిన మనసు /మంచులా గడ్డకట్టుకు పోయింది అని మనసుకు అంటిన స్థబ్దత గురించి వాపోతారు.వీరి కవితావస్తువు ఊహాజనితంకాక నిత్యవేదనలనుండి పుట్టిన ఆవేదనా చినుకు.
ఈ కవితా సంపుటికి తన తొలిపలుకుగా కృష్ణగారు తన ఆలోచనలను,తన అంతరంగాన అలజడి సృష్టించిన చింతనలను స్పష్టంగా తెలిపారు.కవితలలో వైవిధ్యమున్నా ఒకచోట కూర్చిన కదంబమాలలా చినుకు కవితాసంపుటి జీవితంలోని అన్నిరంగులను ఆవిష్కరించింది.అలా చూసి ఇలా మరచిపోయే సమకాలీన సంఘటనలలోని లోతులను స్పృశించడం కవులకే చెల్లు.చినుకులా మొదలైన వీరి కవితాచినుకులు సమాజరుగ్మతలను ప్రక్షాళన చేసేందుకు జడివానై కురిసాయి.
0 comments:
Post a Comment