


ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన కథ.
బాల్యపు జ్ఞాపకాల తోటలో అపురూపమైనవి చిన్ననాటి ఫోటోలు.ఆనాటి ఫోటో కలిగించిన ప్రేరణే ఈ కథ.
జ్ఞాపిక
‘’తాతయ్యా ఈ ఫోటో చూడు’’
ఆనందంగా తాతయ్యకు తన ఫోటో అందించింది ఏడేళ్ల భావన.
పాప పుట్టిన గంటలోనే తనే స్వయంగా తీసిన ఫోటో అది. తన అతి చిన్నప్పటి ఫోటో అంటే భావనకు అమితమైన ఇష్టం.ఆల్బమ్ తెరచి ఫోటోలన్నీ ముందేసుకుని చూస్తూ తాతయ్యలను,అమ్మమ్మ,నానమ్మలను,వారితో తన అనుబంధాలను గుర్తుపెట్టుకునేందుకు తల్లి నేర్పిన తారకమంత్రంగా ఫోటోలను పదేపదే చూస్తూ, ‘దిసీజ్ అమ్మమ్మ,దిసీజ్ నానమ్మ’ అని వల్లె వేస్తూ అన్నిటికన్న ఆప్యాయంగా తన మొదటి ఫోటోను పదే పదే చూసుకునే భావన అమెరికా నుండి ఇండియాకు వస్తూ, అమెరికాలో అమ్మ,నాన్నలతో పంచుకున్నతన అనుభూతులను ఆల్బంలో ఆప్యాయంగా పదిలపరచినవి తీసుకుని వచ్చింది.
“ అమెరికా వచ్చినపుడు నేనే తీసానురా అమ్మలూ నీ మొదటి ఫోటోను.”మనవరాలందించిన ఫోటోను మరోమారు తనివితీరా చూసాడు పరమేశం.
“తాతయ్యా,మరి నీ చిన్నప్పుడు ఫోటో ఏది?” భావన ప్రశ్నను ఊహించని పరమేశం మొదట తెల్లబోయినా, “అదిగో ఆ గోడ మీద ఫోటోలో” అంటూ లేచివెళ్లి ఫోటోను తీసి అందించాడు.తనెక్కడున్నాడో ! వేలు పెట్టి చూపించాడు మనవరాలికి.
“ఇదా!అంతా బ్లాక్ అండ్ వైట్ లో! వేర్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫోటో వెన్ యు వెర్ లైక్ మి? ’’
‘మనవరాలి ప్రశ్నకు, అసలు తన దగ్గరకు ఆ ఫోటో ఎలా వచ్చిచేరిందో, ప్రతిరోజు తననెలా ప్రభావితం చేస్తుందో!ఎలా చెప్పాలి?’పరమేశం మనసు గతాన్ని చిత్రిస్తోంది.
ఆ రోజుల్లో ఎవరి దగ్గర వీడియోలు లేవు,పెళ్లి ఫోటోలు లేవు.అందుకే తాతముత్తాతలని చూపించే జ్ఞాపకాలేవి లేవు.వారిగురించి తల్లిదండ్రులు చెప్పిన జ్ఞాపకాల ఊసులుతప్ప.సాంకేతిక విజ్ఞానం పెరిగేకొలది నేడు రకరకాల ఫోటోలు నిమిషంలో ప్రత్యక్షమమవుతున్నాయి.డిజిటల్ కెమెరాలు ప్రంపంచాన్ని బంధించి చూపుతున్నాయి.మరి నాడో!...
* * *
ఉదయాన్నే నిద్రలేచాడు పరమేశం.
“అమ్మా,ఈ వేళ స్కూల్ లో ఫోటో తీస్తారు,తల స్నానం చేస్తా,నీట్ గా తయారయి రమ్మన్నారు డ్రిల్ సారు. ’’
“అయ్యో,కొట్టిన కుంకుడుకాయలు లేవే?అన్న తల్లి మాటలకు మరేం ఫర్లేదు సబ్బుతోనే చేసేస్తా’’ అని గబగబా స్నానంచేసి జుట్టు ఆరగానే ఒత్తయినజుట్టుకు కాస్త ఆముదం పట్టించి,అదిమిదువ్వి,ఉన్న ఒకేఒక ప్యాంటును ఆనందంగా తొడుక్కుని అద్దంలో చూసుకుంటుంటే,
“అబ్బో! ఈవేళ నిక్కరుకు సెలవా,బానే వున్నావు పదపద స్కూల్ కు టైమవుతోంది’’ పరమేశం తండ్రి తొందరచేసాడు కొడుకును.
“ఈ రోజు పాఠాలుండవు నాన్నా,ఫేర్వెల్ పార్టీ వుంది. ’’
‘పార్టీయా!ఎక్కడ డబ్బులు అడుగుతాడో ?పైసాపైసా పోగేస్తేకాని వచ్చే ఏడాది కాలేజీ ఖర్చులు భరించలేడు.గింజగింజ పోగేస్తేకాని పైసలు చేరవు’,ఆర్థిక శాస్త్రం చదవకపోయినా బ్రతుకు శాస్త్రాన్ని ఔపోసన పట్టినవాడి మనసుపడే తపన అది.
తండ్రి మనసు చదివినవాడిలా, “మాకు మా జూనియర్లు పార్టీ ఇస్తున్నారు,ఫోటో కూడా తీస్తున్నారు. ’’ అంటూ ఆనందంగా బడివైపు పరిగెట్టాడు పరమేశం
“సరే,కాస్త నవ్వు ముఖంతో పడు ఫోటోలో. ’’ వెళ్తున్న కొడుక్కు వినబడేలా గట్టిగా కేకేసి చెప్పాడు పరమేశం తండ్రి.
బిస్కట్లు,కారంబూందీ,పాలకోవా బిళ్ల ఇచ్చారు.కోవా బిళ్ల చప్పరిస్తుంటే తియ్యగా కరిగిపోతోంది.అలాగే అన్నినాళ్ల స్నేహబంధం తరిగిపోతుందేమోనన్న భావన అందరిలో దిగులు రేపింది.
ఫోటోతీసే కుర్రాడు దూరంగానున్న పట్నంనుంచి వచ్చాడేమో,విద్యార్థుల అత్యుత్సాహాన్ని తట్టుకోలేక డ్రిల్ మాస్టారి సాయంతో అందరిని ఫ్రేములోకి సరిగావచ్చేటట్లు కూర్చోబెట్టాడు.ఎండ కనుమరుగైతే ఫోటో కూడా కనుమరుగవుతుందని అతనికి తెలుసు.మరిక ఆలస్యం చేయలేదు.కెమెరా క్లిక్ మంది.ఆనందంతో చప్పట్లు కొట్టి లేచారు పిల్లలందరు.
“పది రూపాయలు కట్టి పేరివ్వండి.ఫోటోలు వచ్చాక ఇస్తాము. ’’ డ్రిల్ సార్ చెప్పిందివిని గతుక్కుమన్నాడు పరమేశం.శెనగలు,మరమరాలకే లెక్కలు కట్టి మరీ ఇచ్చే తండ్రి పది రూపాయలే!అమ్మో!
“చిన్న ఫోటో రాదా సార్? ’’ పరమేశం ప్రశ్నకు నవ్వుతూ తల అడ్డంగా వూపాడు డ్రిల్ మాస్టారు.
మాస్టారి నవ్వు చూసాక మరిమాట్లాడలేకపోయాడు పరమేశం.
“రేపు తీసుకురా డబ్బులు’’ అంటే అందరితోపాటు తల వూపేసాడు.కాదు కూడదు అని మొండికేస్తే కష్టాలన్నీ ఏకరువు పెట్టి మరీ ఇస్తాడు.అడక్కపోయినా బాగుండుననిపిస్తుంది అప్పుడు.అయినా ఉండబట్టలేక అడిగేసాడు ఇంటికి వెళ్లగానే.
“సరేలేరా,ముందు పరీక్షలకు బాగా చదువు,అయినా మీ పిల్లల ఫోటోలన్నీ మీ హెడ్మాస్టరు గదిలో తగిలిస్తారే,రోజు కనబడుతూనే వుంటాయే.మనం మాత్రం రోజు తీరికూర్చుని చూసుకుంటుంటామా?ఎదురెదురుగానే వున్నవాళ్లందరు ఒకరినొకరు చూసుకుంటానే వున్నారు కదా! ’’
“అయ్యో నాన్నాఈ ఫోటో మా బాల్యపు తీపిగురుతని నీకెలా చెప్పాలి?పరీక్షలయాక ఎవరెక్కడుంటామో?ఎప్పుడు కలుసుకుంటామో? ’’
“సరే చూద్దాంలే’’
ఆ మాటకే సంబరపడిపోయాడు పరమేశం.
ఇవాళ రేపు అనుకుంటుండగానే పరీక్షల టైంటేబిల్,పరీక్ష సెంటర్ల హడావిడి1
పరీక్షలన్నీ సంతృప్తికరంగా రాసాక స్కూలుకు వెళ్లి ఆఫీసురూంలోవున్న డ్రిల్ సార్ కు నమస్కరించి,
“ఫోటోలున్నాయా సార్’’ అని అడిగాడు పరమేశం.
“ఇంకానా,పెద్దకామందు గారి అబ్బాయి,కరణంగారి అమ్మాయి,తహసీల్దారుగారి చెల్లెలి కొడుకు అందరు ఫోటోలు పట్టుకెళ్లారుగా. ’’
‘నీవెందుకు తీసుకోలేదు’ అన్నట్లున్న చూపులను తప్పించుకుంటూ,
“సార్, పోనీ నెగటివ్ ఉందా’’ ఆశగా అడిగాడు పరమేశం.
“అదిక్కడెందుకుంటుంది?ఫోటో స్టూడియోలో ఉంటుంది కదా,ఇంతకీ ఫోటో చూడనేలేదా ’’ అంటూ ఒక కవర్ లోనుండి ఫోటో తీసి చూపాడు.
ఆనందంగా ఫోటో అందుకోబోయాడు.
“సరిగా పట్టుకో.అలా కాదు ,వేళ్లముద్రలు మచ్చలుగా పడతాయి.అదీ అలా..... ’’
ఫోటో అంచున పట్టుకుని కళ్లతోనే తడిమాడు.
ఫోటో! తన జీవితంలో మొదటి ఫోటో,ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయురాండ్రు.స్కూలు ప్యూను అందరు కలిసివున్న గ్రూపు ఫోటో.మరోమారు ఆనందంగా చూసి వెనుదిరిగాడు నిస్పృహగా.
మార్కుల రిజిష్టరు వచ్చిందని హెడ్మాష్టరు దగ్గరకు వెళ్లాడు పరమేశం అందరితోపాటు.
ఆశగా గోడలవైపోసారి చూసాడు.
“ఏమిటలా దిక్కులు చూస్తావ్,ఇక్కడ సంతకం పెట్టు పరమేశా! ’’ హెడ్మాష్టరు నవ్వుతూ చేసిన హెచ్చరికతో ఉలిక్కిపడి సంతకం పెట్టి మార్కుల రిజిష్టరందుకున్నాడు.
ఇక మార్కుల పర్సెంటీజీల లెక్కలు,తీసుకోవాల్సిన గ్రూపులపై చర్చలు,మధ్యమధ్యలో మనసులో మెదిలే ఫోటో!
కాలేజీలో చేరేటప్పుడు వచ్చే కొత్తబట్టలు,కొత్త పుస్తకాలు,కొత్తపెన్ను,కొత్త చెప్పులు అన్నీ కొత్తవే!ఇక స్నేహాలు కొత్తవే.స్నేహితులను ఎప్పుడు కలుసుకునే బస్టాండులో మరోమారు కలుసుకుని మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో,ఎక్కడ కలుసుకుంటామో అనుకుంటూ ఇంటిదారి పట్టాడు.దారిలో వగరుస్తూ ఎదురయాడు నరేష్.హడావిడిగా పరిగెడుతున్నాడు.
నరేష్ ను ఆపి, “ఏమైందిరా? ’’ అని ఆతృతగా అడిగాడు పరమేశం.
“అయ్యో!నీకు తెలియదా..మన వేణు చెట్టుమీదనుండి పడిపోయాడట హాస్పిటల్ కు పట్నం తీసికెళ్తున్నారట. ’’
పరమేశం నరేష్ ను అనుసరించాడు.ఇల్లు తాళం వేసి ఉంది.నిరాశగా వెనుదిరిగారు.రోజులో ఒకసారైనా వేణు ఇంటి మీదుగా వెళ్లేవాడు పరమేశం.వేణు వచ్చి ఉంటాడేమోననే ఆశ!మనసంతా వేణు తలపులతో నిండిపోయేది.నెమ్మదిగా మాట్లాడినా చురుకుగా ఉండేవాడు. చదువులోతనపనేమో తానేమో.అయితే ఆటలలోబెస్ట్.చెట్లెక్కడంలో ఫస్ట్.చెట్లపై కోతికొమ్మచ్చులాడేవాడు.ఈ సరదా ఆట వేణునిలా పడగొట్తుందని అనుకోలేదెవరూ.
వాడుకగా వేణు ఇంటి ముందునుంచి వెళ్తున్నాడు పరమేశం.వేణు ఇంటి ముందు సందడిగా ఉంది. వేణును చేతులమీద దించుకుని వెళ్తున్నారు ఇంటి లోపలికి. చెమటలు పట్తున్నాయి పరమేశానికి.ఆతృతగా ఇంట్లోకి వెళ్లాడు.
వేణు తల్లి ఏడుస్తోంది. తండ్రి నిర్లిప్తంగా గోడకు చేరగిలపడున్నాడు. “చెట్లెక్కకురా అంటే విన్నావా’’ వేణు అమ్మమ్మ ఓవైపు అరుపులు, మరోవైపు ఏడుపులు.
“వేణూ! ’’ ఆప్యాయంగా పిలిచాడు పరమేశం.
పరమేశాన్ని చూసి వేణు కళ్లు సంతోషాన్ని నింపుకున్నాయి.
“కాలేజీలో చేరుతున్నారటగా?’’ ఉత్సుకతతో అడిగాడు వేణు.
అవునని ఆనందంగా అనలేకపోయాడు పరమేశం.
“నేనిక నడవలేనన్నారు డాక్టరు,వెన్నెముకలో నరాలు దెబ్బతిన్నాయట. ’’
సైన్సులో చదివిన నాడీ వ్యవస్థ గుర్తుకొచ్చి వెన్నుపాము జలదరించినట్లయింది పరమేశానికి.
“మరెలా? ’’ ఏమనాలో తెలియలేదు పరమేశానికి.
“ఏముంది...ఇలా మంచంలోనే.. ’’ కళ్లల్లో కాంతిలేని నవ్వు వేణు పెదవుల మీద.ఏం చెప్పాలో తోచక పరమేశం పైకి చూసాడు.
పరమేశం కళ్లు ఆనందంగా మెరిసాయి.తమందరు కలిసి తీసుకున్న గ్రూపుఫోటో అందంగా ఫ్రేము చేయబడి గోడమీద!పరమేశం ఆనందాన్ని గుర్తించాడేమో, “ఫోటో చూడలేదా?’’ అడిగాడు వేణు.
“చూసాను స్కూల్ లో కాని తీసుకోలేకపోయాను. ’’
“అరెరె మిస్ అయావే,సరేపోనీ తీసిచూడు,చూస్తే చాలదు అందులో వుండే మనవాళ్లు ఒకొక్కరు ఎక్కడికెళ్లారు,ఏ కాలేజీలో చేరుతున్నారు ఇవన్నీ నాకు వచ్చి చెప్పాలి,సరేనా? ’’ మాటలు డిమాండింగ్ గా వున్నా వేణు గొంతు దీనంగా పలుకుతోంది.
“అదేంట్రా నువ్వు నన్ను అడగాలా?రోజు వస్తా కాలేజీలో చేరేదాకా సరేనా.’’ వేణు చేతిని ప్రేమగానొక్కి చెప్పాడు పరమేశం.
అలా ఫోటోను చూసే భాగ్యం ప్రతిదినము కలుగుతుందనే ఆనందము కలిగింది.ఇక రోజు వేణు దగ్గరకు వెళ్లడం,స్నేహితుల గురించి పాత జ్ఞాపకాలకు కొత్త సంగతులు మేళవించి వర్ణించిమరీ చెప్పేవాడు పరమేశం.గోళీకాయలు మొదలుకుని చెడుగుడు ఆటవరకు చెప్పుకుని పడిపడి నవ్వుకునేవారిద్దరూ.ఎవరెవరు ఎక్కడ చేరుతున్నది అన్నీ వివరంగా తెలుసుకునేవాడు వేణు.వేణు ముఖంలో నీలినీడలు పరచుకుంటే పరమేశం ప్రాణం విలవిలలాడేది.వేరే మాటమార్చి తాత్కాలికంగా మరిపించేవాడు.వేణు తల్లి కూడా తనకొడుకు దగ్గర కూర్చుని కబుర్లు చెప్తున్న పరమేశాన్ని ఆప్యాయంగా పలకరించేది.ఫోటో చూసుకుంటూ కన్నుల్లో నీరు తనకు కనబడకుండా తుడుచుకునే కొడుక్కు పరమేశం కలిగించే ఊరట చూసి ఆమె కళ్లు చెమ్మగిలేవి.
కాలేజీలో చేరాడు పరమేశం.ఇక వేణును పలకరించడం సెలవులలోనే సాధ్యమయేది. నానాటికీ వేణు ఆరోగ్యం మెరుగవడంకాక క్షీణించసాగింది.ఎవరు కదిలించబోయినా ఏడ్చేసేవాడు.పరమేశం కనబడినప్పుడు మాత్రం బాధ మరచినట్టు నవ్వును అరువు తెచ్చుకునేవాడు.
ఒకరోజు హఠాత్తుగా, “ పరమేశం ఈ ఫోటో నువ్వు తేసేసుకో.’’ అన్నాడు వేణు.
“వద్దు వేణు ఏదో కొత్తలో గమ్మత్తుగా ఉండి రోజు చూస్తుండేవాడిని,ఇప్పుడాసరదా తీరిపోయిందిలే నువ్వు మమ్మల్నందరిని రోజు చూసుకోవచ్చుగా. ’’ అన్నా డు పరమేశం.
“అదేంకాదు,వీరందరు పేరుపేరునా నీ మనసులో హత్తుకుపోయారు.అందరిని చక్కగా గుర్తుంచుకున్నావు.నీ దగ్గరసలు ఫోటో లేదుగా. ’’ ఫోటో బలవంతంగా చేతిలో పెట్టాడు.మరోమారు ఫోటోవంక తదేకంగా చూసి సరేలే అంటూ ఫోటోను గోడకున్న మేకుకు తగిలించేసాడు పరమేశం.
“సరే నీ ఇష్టం ఆ ఫోటో నీ దగ్గరకు ఎలాగోలా చేరుస్తాలే. ’’ నవ్వాడు వేణు.
మొదటి టర్మ్ ఎగ్జామ్స్. ఇంటి ధ్యాస మరచి పుస్తకాలకే అతుక్కున్నాడు పరమేశం.అప్పుడు పి.యు.సి ప్రొఫెషనల్ కాలేజీకి గడపలాంటిది.అది దాటితే ఉద్యోగమొచ్చినంత సంబరమే!
పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి రాగానే కమ్మటి భోజనం, ముక్తాయింపుగా చివరలో తిన్న గడ్డ పెరుగు నిద్రను ఆహ్వానిస్తున్నా వేణును కలవాలని మనసు తొందర చేస్తోంది.అడుగులు వేణు ఇంటివైపు గబగబ పడుతున్నాయి.
తలుపు తాకగానే తెరుచుకుంది.తలుపు తెరచిన వెలుగులో వేణు పడుకునే మంచం శూన్యంగా....
తెలియని భీతి ఆవహించింది పరమేశాన్ని.
“రెండ్రోజులయిందిపోయి. ’’ పీలగా పలుకుతోంది వేణు తల్లి గొంతు.వేణు పడుకున్న మంచంపై కూర్చుని ప్రేమగా తలగడను తడుముతూ దుఃఖాన్ని దాచుకునే ప్రయత్నంలో వెక్కుతున్నాడు పరమేశం.
“లే నాయనా ఇదిగో ఈ ఫోటో నీకిమ్మన్నాడు. ’’ ఫోటోను చీరకొంగుతో తుడిచి చేతికందించింది.ఫోటో వైపు చూసాడు పరమేశం.
కన్నుల్లో కమ్ముకున్న నీరు ఫోటోలో వున్న వేణును మసగమసగ్గా చూపిస్తోంది. “ఇది నీ జ్ఞాపిక వేణూ ’’ అంటూ ఫోటోలో ముఖాన్నిదాచుకున్నాడు పరమేశం.
* * *
తాతయ్యా ఎందుకు ఫోటోతో మూసుకున్నావు?తాతయ్య ముఖాన ఉన్న ఫోటోను తొలగించి నవ్వబోయింది భావన. తాతయ్య జ్ఞాపకాలను కదిలించింది తనేనని తెలియని భావన తాతయ్య కళ్లలోని భాష్పానికి భాష్యం వెదకుతోంది.
* * *