
అక్షరమంటే అఆలు,కఖలేనని అనుకున్నా!
అక్షరాభ్యాసంతో అక్షరజ్ఞానం వస్తుందనుకున్నా
సాహిత్యాక్షరాలు మనసుపై దాడిచేసాకే
తెలిసింది అక్షరలక్ష్యమేమిటో!
ఆవేశానికి ఆజ్యంపోసి
ప్రశ్నిండం నేర్పే వేదాక్షరాలు
పరవశింపచేసే కవి కోయిలల కుహూరవాలు.
కలతచెందిన మనసుకు
అక్షరమేకదా వైద్యం!
అక్షరాలు వెన్నముద్దలా
లేపనమేకాదు
కొరడాలై ఝళిపిస్తాయి
శతఘ్నులై గర్జిస్తాయి
చలిచీమలై చురుక్కుమనిపిస్తాయి.
ఆలోచనా నెగళ్లలో
నిప్పురవ్వలు అక్షరాలు
ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి
పరిశోధనలకు ప్రాణమిస్తాయి
పడకకే పరిమితమైనా
గుండె చెమ్మగిలితే చాలు
అక్షరాలు ఆవిర్భవిస్తాయి
అల్లుకున్న అక్షరాల గారడీలో
ప్రతి అక్షరం ఒక సైనికుడేనని
బారులు తీరిన అక్షరసేన
కలంసాయంతో కవాతు చేస్తుందని
మనసున మొలచే అక్షరబీజాలు
కాగితంపై అక్షరనాట్లయి
అక్షరక్షేత్రం పండేదాకా
అక్షరం నన్ను నిద్రపోనివ్వదు
అక్షరం నా ఊపిరి
నన్నుఊపిరాడనివ్వదు.
8 comments:
బావుంది..
చాలా బాగుందండి
అక్షరాలతో అక్షరంపై కవిత...బాగుంది
అక్షరానికి ఊపిరి పోశారు! అత్యద్భుతమయిన వర్ణన! ఈ చిత్రం మీరే వేసారా? చాలా బాగుంది!
అక్షరాల్లో ఎంతో ఉందని తెలుసుకాని, ఏం ఉందో మాత్రం మీద్వారానే తెలుసుకున్నా...
గీతిక గారు,పద్మార్పిత గారు,చిన్నిఆశ గారు,రసజ్ఞ గారు,జ్యోతిర్మయి గారు,
మీ అందరి భావాభినందనలకు ధన్యవాదాలు.రసజ్ఞ గారు ఆ చిత్రం నా కథా సంపుటానికి చిత్రకారుడు వేసిన ముఖ చిత్రం.
ఒక్క పిలుపు
లక్ష అక్షౌహినిల సైన్యం
ఒక్కపలుకు
శత సహస్ర శతఘ్నల ఘీంకారం
అలా భాష అక్షరాల్లో ఒలుకు
క్షరం కానిది అక్షరం
మీరు చాలా బాగా వ్రాశారండి.
ధన్యవాదాలు రవిశేఖర్ గారు,మీకు నచ్చినందుకు సంతోషం.
Post a Comment