Thursday, January 12, 2012

నాన్న ఉండాలి

ఇటీవల విడుదలైన నవ్య దీపావళి సంచికలో నేను రచించిన కథ...నాన్న ఉండాలి.
అమ్మ,నాన్నలలో ఎవరిని కోల్పోయినా పిల్లలు భరించలేరు.విధి విధించిన అశ్రువేదనకు నా అక్షరాంజలి.“అతడినే చెప్పనివ్వమ్మా.”డ్రామాలో ప్రాంప్టింగ్ లా తోచిందేమో చెప్తున్న లతను వారించాడు డాక్టర్ మనోహర్, ప్రఖ్యాత సైకాలజిస్ట్.
“డాక్టరుగారితో మీరే చెప్పండి నాన్నా,మీరెందుకు ఇలా అయిపోతున్నారో! ”
కూతురివంక సాలోచనగా చూసాడు ముకుందం.
‘ఆ రోజుకు వారం దాటిందేమో కూతురు తన దగ్గరకు వచ్చి.ఛ...తనవలన వీరికెంత ఇబ్బంది! తనను పట్టించుకోవద్దంటే వినదు.ఏం చెప్పాలి?తనను కూడా త్వరగా నిష్క్రమించేలా చేయమనా?’
“నాన్నగారూ,మీరిలా బాధపడుతుంటే పోయినవాళ్లు తిరిగొస్తారా?మాకు మాత్రం బాధగాలేదా అమ్మను పోగొట్టుకున్నామని. ”లత మనసులోని వేదన మాటలో కనబడుతోంది.“అమ్మలు, నేను మీ అమ్మను పోగొట్టుకోలేదు,అంటే నా భార్యనుపోగొట్టుకోలేదు. ఒక స్నేహితురాలిని పోగొట్టుకున్నాను. తల్లిని మళ్లీ పోగొట్టుకున్నట్లుంది.నన్నొదిలి త్వరగా పైకెళ్లి పోయింది. ”ముకుందం చూపు ఊర్ధ్వదిశలో నిలబడిపోయింది.
“మరి మీరిలా బాధపడుతుంటే అక్కడున్న అమ్మ బాధపడదూ,మీ బాధేంటో డాక్టరుగారికి చెప్పండి.ఇప్పుడు అన్నిటికీ మందులున్నాయి కదా నాన్నగారూ.”
కూతురి మాటలకు నిట్టూరుస్తూ, “మనోవ్యాధికి మందుందామ్మా. ” అంటూ కళ్లుమూసుకున్నాడు కాని మనసులోనికి జొరబడే ఆలోచనలకు తలుపులు బిగించలేకపోతున్నాడు.
“ఉంది సార్, మీరు కాస్త సహకరిస్తే చాలు.మీరు మరీ అండమాన్ ఖైదీ జైలుగోడలమధ్య బందీ అయినట్లు మిమ్మల్ని మీరు నాలుగు గోడల మధ్యే బంధించుకుంటే ఎలా? ”
“సరే డాక్టరు గారు, రేపు వస్తాను.ఈ రోజు నాభార్య పుట్టినరోజు.మా ఇద్దరిలో పుట్టినరోజైనా కిస్మిస్,జీడిపప్పు బాగా వేసి ఉదయాన్నే పాయసంకాచి నైవేద్యంపెట్టాక నాకందించేది.కనీసం ఆమె జ్ఞాపకాలలో ఈ రోజును గడవనివ్వండి. ”
డాక్టర్ మనోహర్ కు వారించాలని ఉంది కాని మనోవేదనతో కృంగిపోతున్న ముకుందానికి అడ్డుచెప్పలేక సరేనన్నట్టు మౌనంగా తలవూపాడు.
“అమ్మలు పద, పాయసం కాచాలి అమ్మకు! ”
అతడికి భార్యపట్ల వున్న అనురాగానికి ముగ్ధుడైనా తన జీవనాన్ని మరీ చీకటిమయం చేసుకుంటున్న ముకుందాన్ని జాలిగా చూడటం మినహా ఆగమని గట్టిగా అనలేకపోయాడు డాక్టరు.
తాను ఔపోసన పట్టిన సైకాలజీ డిగ్రీలు ముకుందం ముందు చిన్నపోతున్నట్టనిపించాయి.

***

“రండి నాన్నగారు దీపం వెలిగిద్దురుకాని.... ”మరోమారు పిలిచింది లత.
ముకుందం గది తలుపు తోసి చీకటిలో ఏమికనబడక కిటికీ తీయబోయింది.
“ఆగు..ఏం చేస్తున్నావ్ ...ఎన్ని సార్లు చెప్పాలి కిటికీలు తెరవద్దని.ఒకసారి చెప్తే అర్థంకాదా.రోజు చెప్పాలా.. ” విసురుగా అన్నతండ్రి మాటలకు క్షణంపాటు చివుక్కుమనిపించినా అంతలోనే మనసుకు సర్ది చెప్పుకుని,
“సారీ నాన్నగారు..పాయసం తయారయింది. మీరు వచ్చిదీపం వెలిగిస్తారు,ఈరోజైనా చీకటినుండి బయటకు వస్తారని ఆశపడ్డాను. నా ఆశ అడియాసే.”దుఃఖంతో లత గొంతు పూడుకుపోతోంది.
“నువ్వెందుకు అమ్మలు సారీ చెప్పడం నేనే చెప్పాలి .మీ అమ్మ నన్ను విడిచివెళ్లింది మొదలు నేను ఈ చీకటికి అలవాటు పడిపోయాను.ఏమో, వెలుగును మాత్రం భరించలేకపోతున్నాను. అమ్మలు,అమ్మకు నువ్వే దీపం వెలిగించి నైవేద్యం పెట్టు” సరే నాన్నగారు.”అంటూ కళ్లలో నీరు తండ్రికి కనపడకుండా తలుపు మూసి బయటకు వచ్చాక గట్టిగా వత్తుకుంది. ‘ఇలాంటివి ఎన్ని సందర్భాలో!కన్నీటి జలపాతానికి ఆనకట్ట ఎలా వేయాలో తెలియక తండ్రికి కనబడకుండా దుఃఖాన్ని బోర్లించేది. తల్లిని తలచుకుని ఆవేదనతో తల్లడిల్లిపోయేది.తల్లి మరణం ఎంత బాధాకరమో,ఆ అనుభవంలోని చేదును మ్రింగలేక పోతోంది,తన పెళ్లి చూసింది.అంతే....అంతదాకా పొంచివున్న జబ్బు మరిక ఆగలేనంటూ తల్లిపై దాడి చేసి కబళించింది.దేవుడిని రోజూ వేడుకునేది అమ్మను తీసికెళ్లిపోకు భగవంతుడా,అమ్మ నాపిల్లలను చూడాలి,వారితో మాట్లాడాలి,కమ్మని కథలు చెప్పాలి.వారి ముద్దు మాటలు అమ్మ వినాలి. ’లత నోటివెంట ఎన్ని నివేదనలో!
కాని లత మాటలెందుకో దేవుడు వినలేదు.తల్లిపోయాక దిక్కుతోచని పక్షిపిల్లలా వణికిపోయింది లత.తండ్రి ఉన్నాడు మీకేం ఫరవాలేదు అన్న చుట్టపక్కాల మాటలతో ధైర్యాన్ని కూడదీసుకోసాగింది.అయితే లత అనుకున్నట్లుకాక తండ్రి పరిస్థితి చూసాక లతలో ఏదో తెలియని భీతి బీజమేసి మొక్కగా ఎదగసాగింది.విడువలేక విడువలేక తండ్రిని వదలివెళ్తూ తనతో వచ్చేయమని చివరిసారిగా మరోమారు బ్రతిమాలింది.తల్లి బ్రతికివున్నప్పుడు ఉన్న ఇల్లును వదలి రాలేనని, మరోమారు బలవంతపెట్టి ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసాడు ముకుందం.తండ్రి మాటలలోని నిస్సహాయత,తల్లి నడయాడిన చోటనే వుండాలనుకున్న ఆరాధనా భావాన్ని గమనించిన లత మరిక తండ్రిని ఇబ్బంది పెట్టకూడదనుకుంది.కాని అలాంటి పరిస్థితిలో తండ్రిని వదలలేక వదిలివెళ్లింది.ప్రతిరోజు తండ్రిని పలకరించేది.కాని రానురాను తండ్రి బదులు వంటచేసిపెట్టే కుర్రాడు రాంబాబు మాట్లాడేవాడు.అయ్యగారు సరిగా భోంచేయడం లేదని,ఇష్టముంటే స్నానం,లేకపోతే అదీ లేదని,గది వదలి బయటకురారని,చీకట్లోనే కూర్చున్నారని లైటు వేయబోతే కొట్టినంత పని చేసారని.
ఇలా వింటున్న లతలో మొక్కగా ఎదుగుతున్నభీతి మానుగా మారసాగింది. తల్లిని పోగొట్టుకున్న దురదృష్టం.ఇక తండ్రిని కూడా పోగొట్టుకోలేదు. నాన్న నోటి వెంట అమ్మ జ్ఞాపకాల అనుభూతులు వినాలి,అమ్మతో తమ బాల్యపు ఊసులను నాన్నకు వినిపించాలి. అమ్మను జ్ఞాపకాలలో బ్రతికించుకోవాలి.కాని ఇప్పుడు నాన్నను నిజంగానే బ్రతికించుకోవాలి.అమ్మను పోగొట్టుకుని తల్లి ప్రేమకు దూరమయాం. ఇలాగే తండ్రి బాధతో కుచించుకుపోతుంటే ఇక నాన్నను కూడా పోగొట్టుకుంటామేమో. ధైర్యాన్ని తండ్రిని చూసే నేర్చుకుంది.డబ్బుకు ఇబ్బందైనా,మనసుకు కష్టమైనా తమకు చెప్పి,ఆ తరువాత నాన్న ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు తమను తలెత్తుకుని జీవించేలా చేసాయి తప్ప బెంబేలు పడింది ఎప్పుడు లేదు.అలాంటిది ఇప్పుడు ఇలా తనలో తనే ముడుచుకుపోతూ...అందుకే ఏదైనా చేయాలి.నాన్నను కాపాడుకోవాలి.అమ్మపై దుఃఖాన్ని మరిపించాలి. ఎలా?’
భర్తతో ఆలోచించింది లత.మంచి సైక్రియాట్రిస్ట్ కు చూపమన్న అతని సలహా కూడా ఓసారి ప్రయత్నిస్తే తప్పేముంది అనుకుంటూ తండ్రికి కూడా ముందే చెప్పకుండా వచ్చి డాక్టరు దగ్గరకు బలవంతంగా తీసుకెళ్లింది.అక్కడా ముకుందం సహకరించలేదు. ‘ తల్లి చనిపోయినప్పటి నుండి ఇదే బాధ.తల్లి మరణించి ఏడాది దాటింది.క్షణక్షణం గుర్తుకు వచ్చే తల్లిని మరవడం అసాధ్యమే.తల్లిని మరిపిస్తాడు తండ్రి అనుకుంటే,ఆయనే మరీ చిన్న పిల్లాడిలా బెంబేలెత్తిపోతున్నాడు.’ లత దేవుడికి మరోమారు తన వేదన నింపిన విజ్ఞాపనలు పంపుతూనే ఉంది. ‘తన పిల్లలను నాన్న చూడాలి.అవును నాన్నయినా చూడాలి.తన పిల్లల అల్లరి చూసి నాన్న కోపం మరచి నవ్వడం చూడాలి.బడికి బ్యాగు తగిలించుకుని వెళ్తుంటే వారివెంట వస్తాననే తాతయ్యను వారించి తుర్రుమనే తనపిల్లలను చూసి సాయంత్రం రండిరా మీ పని చెపుతాను అని ప్రేమగా గుర్రుమనే నాన్నను చూడాలి.ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగాలంటే నాన్న ఉండాలి.’
ముకుందానికున్న ఒక్కకొడుకు అమెరికాలో ఉద్యోగం వదిలి రాలేకపోతున్నాడు.కోడలు రానివ్వడంలేదేమోనని అందరు అనేమాట. కాని మాంద్యం ప్రభావానికి కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో అమెరికా వదలి వస్తే ఇక అంతే సంగతులేమో అనే భయాలు వున్నాయి కొందరికి.
పాయసం గ్లాసునిండా పోసి తెచ్చి ఇచ్చింది లత
పాత జ్ఞాపకాలు ఎన్ని తడిమాయో కళ్లు నీటి చెలమలయి అంతవరకు కనబడుతున్న చీకటిని కూడా చూడకుండా చేసాయి ముకుందాన్ని. పాయసం రుచిని ఆస్వాదించే స్థితిలోలేడు ముకుందం. అందుకే గొంతుకడ్డంపడ్డ బాధను దాటుకుని వెళ్లడం పాయసానికి సాధ్యం కావడంలేదు.
ఆ రాత్రి అన్నయ్య దగ్గరనుండి ఫోనందుకున్న లత ఫోనులోనే బావురుమంది
“.ఇలాగైతే త్వరలోనే నాన్నగారిని పోగొట్టుకుంటామేమోనని భయంగా వుంది అన్నయ్యా” అంది వెక్కి వెక్కి ఏడుస్తూ.
బాధపడుతున్న లతకు అన్నయ్య చెప్పిన మాటలు పచ్చి గాయంపై చల్లని లేపనంలా తోచాయి. త్వరలోనే తాను ఇండియా వస్తున్నట్టు, ఆ ఇంటి వారసుడు ఆకాష్ పుట్టినరోజుకు తామందరు అక్కడికి చేరుకుంటున్నట్లు చెప్పిన వార్త లతకు తాను మోస్తున్న భారాన్ని ఎవరో ఆప్యాయంగా అందుకుని దించి తనకు బరువు తగ్గించినట్టనిపించింది.ఆ కబురు తండ్రికి కూడా చెప్తామనుకుంది.కాని రాత్రి,పగలుకు తేడా తెలుసుకోవాలన్న ఆసక్తి ఏమాత్రం చూపకుండా మనిషి ఎప్పుడు కళ్లు మూసుకునే ఉంటాడు.బాధ మరచి కాసేపు పడుకున్నాడేమోనని లత మరిక లేపకుండా పడుకుని కళ్లు మూసుకుంది. అన్న ఇచ్చిన హామీతో చాలరోజులకు లత నిద్రను మనసారా ఆహ్వానించింది.తల్లి తలపులు,నాన్నపై వేదనకు తాత్కాలిక విరామమిస్తూ నిద్రాదేవి లతను తల్లిలా హత్తుకుంది. “నాన్నగారూ అన్నయ్య వస్తున్నాడు. ” తండ్రి ఎప్పుడు లేస్తాడా ఎంత త్వరగా ఈ వార్త అందిద్దామా అని త్వరగానే లేచిన లత తండ్రి అప్పటికే లేచి భార్య ఫోటోను తడుముకుంటూ నిట్టూర్చడం చూసి బిత్తరపోయింది.ఈయన అసలు నిద్రపోతున్నాడా అన్న సందేహం కలిగింది
“నాన్నగారు.. ”
“చెప్పు అమ్మలు...ఈ వేళేమైనా బయలు దేరుతావా,నీదేమో కొత్త సంసారం.నా కోసం
అల్లుడికి ఇబ్బందికలిగిస్తూ ఎన్నాళ్లుంటావు. ”
“అది సరే నాన్నగారు,ఈ మాట వినండి, అన్నయ్య వస్తున్నాడు. ”
“ఏం చేస్తాడు వచ్చి నాలుగు రోజులు నీలాగే నన్ను హైరాన పెట్టేస్తాడు ఆ డాక్టరు,ఈ మందులు అంటూ.నా తంటాలేవో నేను పడతాను మీరు కూడా ఎందుకు శ్రమపడటం? ” “కాదునాన్నా,బంటి పుట్టినరోజు ఇక్కడే చేస్తాడంట.అందుకే వదిన,బంటి కూడా వస్తున్నారు.’’
“ఎప్పుడట వాడి పుట్టిన రోజు?’’ ఎప్పుడోలే అనుకుంటూ అడిగాడు ముకుందం.
“వచ్చే ఆదివారమే కదా నాన్నా.... ”
“వచ్చే ఆదివారమంటే... ముకుందం హృదయంలో ఏదో తెలియని పొటమరింత,ఉద్విగ్నత!
ఆ గోడ మీద క్యాలెండరుండాలి చూడు. ”
లత ఏ గోడమీద క్యాలెండరుందో అని గోడలను పరికించి చూస్తూ చేత్తో తడుముతోంది. “ఏమిటి ఆ వెతుకులాట ఆలైటు వేస్తేకదా కనబడేది. ”
తండ్రేనా లైటు వెయ్యమంటున్నాడు తన తొట్రుపాటు కనబడకుండా లైటువేసి క్యాలెండరు తీసి చూడసాగింది లత.
ఇవేవి గమనించడంలేదు ముకుందం.కాంతికి అలవాటు తప్పిన కళ్లను చికిలించి చూస్తూ “అరె ఇప్పుడా చెప్పేది,సరిగ్గా బయలు దేరకముందు.మనమేం చేయాలి?ఎవరిని పిలవాలి? ”
కొడుకు స్నేహితులయితే ఒక ఐదారుగురు తప్పించి చాలామంది అమెరికా లేదంటే బెంగళూరు.ఇక మిగిలిన వారు అమ్మలు స్నేహితులు, తన కొలీగ్స్.దాదాపు ఏడాది దాటింది అందరిని పలకరించి.ఎవరెవరు ఎక్కడెక్కడ వున్నారో...ఎలా....ఆ చలపతినడగాలి.వాడినందరు అడ్రస్ బుక్ అనేవారు.ల్యాండ్ లైన్ నంబర్లు,సెల్ నంబర్లు.ఇ-మెయిల్ ఐ.డి అన్నీ సేకరించి వుంచుతాడు.”
“అమ్మలు నీ స్నేహితులందరిని పిలువు. నీకు కూడా అందరిని కలిసినట్లుంటుంది.అలాగే చలపతి అంకుల్ కి ఫోను చెయ్యి,నేను రమ్మన్నానని చెప్పు.డాక్టరు గారికి కూడా కాల్ చెయ్యి,మరచిపోకు ఆయన మనవాడిని అదే నా మనవడిని చూడాలి.”వాడి సైకాలజీ ఏమిటో ఆయననడిగి కనుక్కోవాలి. ”తండ్రి ముఖంలో ఏదో చిన్న వెలుగు తొంగి చూసినట్లనిపించింది లతకు. ఆ వెలుగును ఆరనీకుండా మరింత పెంచాలి.
లత వెతుకుతున్న టెలిఫోను డైరక్టరీ దొరకడం ఆలస్యమయేకొద్దీ అసహనం పెరిగి పోసాగింది ముకుందంలో.
“ఎంతసేపు వెతుకుతావు?చిన్నప్పుడు ఇలాగే వెతికేదానివి పెన్సిలు పోతే!నేను చూస్తానుండు.ఆ... ఇదిగో ఇక్కడుందిగా” తన ఫైళ్ల మధ్యన ఉన్న డైరీని దుమ్ము దులిపి వెంటనే ఫోనందుకున్నాడు.
ముకుందం గొంతు విన్న చలపతికి ఒక్క క్షణం తాను వింటున్నది ముకుందం గొంతేనా అన్న అనుమానము కలిగింది. అయితే ముకుందం కూతురు ఆ తరువాత మాట్లాడి సందేహాన్ని తీర్చింది. “ మీరొక్కసారి రావాలి అంకుల్.నాన్నకు తన స్నేహితుల ఫోను నంబర్లు కావాలట.అందరిని కలవాలంటున్నాడు. ”
లత మాటలు చలపతికి అమృతాన్ని అదిమిపట్టి త్రాగించినట్టుంది. ‘ ఏడాదిగా అడపాదడపా కలుసుకుంటున్నాచీకటి ముసుగును తొలగించలేక ముకుందాన్ని విసుక్కున్న సందర్భాలు ఉన్నాయి. అన్నింటికి ఒకటే సమాధానం.వెలుగును భరించలేనని.అప్పటికీ భార్యను పోగొట్టుకున్న ఎందరో భర్తలగురించి,భర్తను పోగొట్టుకున్నఎందరో భార్యలగురించి చెప్పాడు.అన్నీ విన్నాక ఎలా బ్రతుకుతున్నారో అని తన బాధకు వారి బాధను కలుపుకుని ఏడ్చేసేవాడు.నీలా చీకటిలో లేరు వాళ్లు అంటే,అది నీకు కనబడదు వారి గుండెనిండా చీకటి వుంటుంది.ఆ చీకటి తెరతొలగదు.అది తొలగాలంటే బాహ్యంగా మనం అంతమైపోవాలి అనేవాడు.ఇక ఇలా మాట్లాడుతూ ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమోనని,ఆ పిల్లలకు తండ్రినికూడా దూరం చేసినట్టవుతుందని తనే సంభాషణ తుంచేసేవాడు.మళ్లీ తన చీకటిలోకంలో తలుపులు బిడాయించుకుని మనది కాని మరోలోకంలోకి ఆలోచనలతో ప్రయాణం చేసేవాడు.అలాంటిది ఈ వేళ తనే రమ్మంటున్నాడంటే,ఏదో విశేషమే’ అనుకుంటూ,
కాఫీ తాగడం ఆలస్యం ముకుందం ఇంటివైపుకు వాహనాన్ని పరుగులుతీయించాడు.
చలపతి రాకకోసమే కాచుకున్నట్లున్నాడు ముకుందం.
“అమ్మలు, చలపతి అంకుల్ వచ్చారు, చూడు కాఫీ,టిఫిను ఏర్పాట్లు,అలాగే ఆ నంబర్లన్నీ రాసుకో ఈ లోగా నేను స్నానంచేసివస్తాను. ”
తండ్రి స్నానానికి వెళ్లగానే అంకుల్ అంటూ అణచివున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది లత.
“నువ్విప్పుడు ఏడ్చాల్సిన సమయంకాదు,మీ నాన్నఅణగారిపోయిన శక్తులు పుంజుకుంటున్నాడు. అసలు మేమెప్పుడైనా దేనికైనా వెనకముందులాడితే మమ్మల్ని మార్గదర్శిలా మరీ ముందుకు నడిపించేవాడు. మీ నాన్నలో మార్పు వస్తోంది ఎందుకో,ఎలా అన్నది నీకర్థమయే వుంటుంది.మరిక ఏడవకు. ”
“నేను ఆనందంతో ఏడుస్తున్నాను అంకుల్. నా మేనల్లుడు అమెరికానుండి వచ్చి తాతగారింట పుట్టినరోజు జరుపుకుంటాడన్న వార్తతో నాన్నలో చలనాన్ని చూస్తున్నాను.తన స్నేహితులనందరిని పిలవాలంటున్నారు.మీరు కొంచెం ఆ పని చూడండి అంకుల్ ,నేను పార్టీ ఏర్పాట్లు చూస్తాను. ”కళ్లు తుడుచుకుంది లత తండ్రివస్తున్న అలికిడి విని.షేవింగ్ కూడా మానేసిన నాన్న ఇలా శుభ్రంగా అన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి లత తన మొర ఈ సారి ఆలకించాడు అనుకుని మనస్సులోనే దేవుడికి నమస్కరించుకుంది.
“అరె..ఏమిటి ఇంకా నంబర్లు రాసుకోలేదా,సరే టిఫిన్లు కానిచ్చేసి ఒకేసారి ఫోన్ చేసి పిలుస్తాలే.” అంటూ రాంబాబందించిన ఉప్మా ప్లేటందుకుని గబగబా తినసాగిన తండ్రిని కన్నుల నిండుగా చూడసాగింది లత.
“అలా చూస్తూ నిలబడితే ఎలా అమ్మలు మంచినీళ్లు తెప్పించవా? ”
తండ్రి మాటతో సర్దుకుని మంచి నీళ్లు తెచ్చిఇచ్చింది.
***

పిలవాల్సిన స్నేహితుల లిస్టు పెద్దదే,మళ్లీ మనలో పడుతున్నాడు,వెళ్లి చూడాలి అనుకుని, పిలిచిన వారందరు హాజరు వేసుకున్నారు.అలాగే లత నేస్తాలు లతను చూసి చాలా రోజులయింది, పిచ్చిపిల్ల తల్లిని కోల్పోయి ఎలా వుందో పలకరించాలని కొందరు వచ్చారు.మొత్తానికి చాలా సందడిగా ఉంది.అందరి నడుమ సూటు,కోటు,దానికి తగిన టై,బూటు! ఆకర్షించగల రూపురేఖలు! బహుమతులతోపాటు ఆప్యాయతల జల్లు కురుస్తోంది. పుట్టిన రోజు జరుపుకుంటున్న బంటి అందరికి చిరునవ్వుతో ‘హాయ్’ అంటూనే నమస్కారాలు పెడుతున్నాడు.
“ఏమోయ్ మనవడి పెళ్లిలా జరిపిస్తున్నావు పుట్టినరోజు! ”స్నేహితుల జోకులకు చాలా రోజులకు కళ్లెగరేసి నవ్వాడు ముకుందం.
“డాక్టరు గారు వీడి సైకాలజీ చెప్పండి వీడు ఇక్కడమ్మాయినా,అక్కడమ్మాయినా పెళ్లి చేసుకునేది? ” ముకుందం ప్రశ్నకు డాక్టర్ నవ్వుతూ,
“ఎక్కడమ్మాయైనా పెళ్లి మాత్రం మీ ముందరే చేసుకుంటాడు.అది మాత్రం గ్యారంటీ.’’అనగానే నవ్వుల గలగలలు విరిసాయి.
“ఫో తాతయ్యా!ఐ వోంట్ మ్యారీ!’’ అని సిగ్గుగా లోపలికి పారిపోబోయాడు బంటి.
పారిపోబోతున్న మనవడిని పొదివి పట్టుకుని, “నేనెక్కడికి పోతానురా?నీ పెళ్లి చూడందే పోనుగాక పోను.’’ దృఢంగా పలుకుతున్న తండ్రిని చూచి మనసులోనుండి కొండంత బరువు దింపిన ఏడుకొండలవాడికి నమస్సులర్పిస్తూ,‘ఇక ఫరవాలేదు నాన్న చీకటిని మరచిపోతాడు.స్నేహితులందరిని కలిసాక వచ్చిన ధైర్యం ఇక వెనుకకు పోదు.
‘మళ్లీ మళ్లీ వస్తుండండి’ అని స్నేహితులకు వీడ్కోలు పలికి,బంటి బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకున్నాడు ముకుందం. తండ్రి ముఖంలో గ్రహణం తొలగినట్లు చంద్రకాంతి చిన్నగా ప్రవేశిస్తుండటం చూసి నాన్నఇక తట్టుకుని నిలదొక్కుకోగలడు,ధైర్యంగా ఉండగలడు. ఉండాలి.మాకు మా నాన్నఉండాలి.’ లత కళ్లు దుఃఖం,ఆనందం కలగలిసిన తడితో తండ్రిని ఆప్యాయంగా చూస్తున్నాయి.

**********
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

0 comments:

Post a Comment