Wednesday, January 25, 2012

కథాజగత్-మాతృన్యాయం

మాతృదేవోభవ అనే పదానికి న్యాయం చేసిన కథ మాతృన్యాయం

మాతృన్యాయం-రచయిత: గంగా శ్రీనివాస్

ఈ కథకు సమీక్ష రాయడం ప్రారంభించిన రోజే కన్నవారిని కాదంటే భరణం కట్టాల్సిందే అనే వార్తను చదవడం తటస్థించింది. ఆదాయవనరులు,కుటుంబసభ్యుల సంఖ్యనుబట్టి మార్గదర్శకాలుకూడా జారీ చేసినట్లు వార్త చెప్తోంది.తల్లిదండ్రుల సంరక్షణ,వయోవృద్ధుల నిబంధనలు-2011 అమల్లోకి వస్తే తల్లిదండ్రులకిక అన్యాయమే జరగదు,పిల్లలు సేవలు చేస్తుంటే వారి పని ఇక కాళ్లూపుతూ కూర్చోవడమేనని అనుకుంటారేమో!

కథావస్తువును ఎంచుకునేటప్పుడు పాతవిషయాన్నికాక కొత్తదనానికై అన్వేషణ జరగడం సహజం.వృద్ధులైన తల్లిదండ్రులు-పిల్లల నిరాదరణ అన్నసమస్య నిత్యనూతనం కాదుకాని అదొక రావణకాష్ఠం.నేటియవ్వనమే రేపటి వార్ధక్యం కదా?అద్భుతమైన మార్పు ఆవిష్కరింపబడితే తప్ప ఈ విషయం పాతబడదు.మరి ఈ మార్పు ఎక్కడ ప్రారంభమవాలి? మనిషిలోనా?మనుగడలోనా?పిల్లలప్రవర్తనాతీరును,తల్లిదండ్రులపట్ల వారి ఉదాసీనతను సమాజం ఆక్షేపించాలా లేక ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా?ఇలాంటి ప్రశ్నలెన్నిటినో లేవనెత్తిన కథలోని మలుపులు చూద్దాం.
న్యాయవాది రాఘవరావు నేరస్థుడిని శిక్షింపచేయడంలో తన వాగ్ధాటినే పదునైన కత్తిగా వాడటంలో దిట్ట.అటువంటి న్యాయవాది, తన పొరుగుననే వున్నవృద్ధదంపతులు దుర్గాంబ,అనంతపద్మనాభంలు కొడుకు ఇంట,కోడలిచేత పడుతున్న అగచాట్లను నిశితంగా గమనించేవాడు.ఆ నేపథ్యంలో వారి కొడుకు,కోడలిపై క్రిమినల్ నెగ్లిజన్స్ నేరంగా ప్రతిపాదించి,విధింపచేసే శిక్ష కఠినమైనదే అవుతుంది.
శారీరక బాధలకు పరిష్కారం వైద్యం.మందులు,సర్జరీలు అనారోగ్యాన్ని జయించలేనపుడు విముక్తిగా మరణాన్ని కోరుకుంటాడు మనిషి.అయితే మానసిక,శారీరక బాధేదైనా పిల్లల ప్రేమపూర్వక పలకరింపులే అమ్మానాన్నలకు చలివేంద్రం.ఇవి కొరవడిన అనంతపద్మనాభం తమ పుత్రుడు తమను శారీరక,మానసిక బాధలకు గురి చేస్తున్నాడని న్యాయవాది రాఘవరావు ద్వారా కోర్టుకు ఫిర్యాదు చేస్తాడు.ఇక కోర్టు వాతావరణాన్ని కథనానికి తగినట్లు చిత్రీకరించడంలో శ్రీనివాస్ గారు నూటికి నూరు శాతం సఫలీకృతులైనట్లే.
న్యాయవాది ఆస్తుల వివరాలు ప్రశ్నించినపుడు దుర్గాంబ తడబడుతుంది.ఆ తడమాటుకు తన చురచుర చూపులతో అనంతపద్మనాభం చురకలంటిస్తాడు.కథాశిల్పంలో ఈ ఎత్తుగడ కథాపఠనంపై ఉత్సుకతను పెంచింది.ముగింపుఎలా ఉంటుందోనన్న ఆతృతకు మొగ్గ తొడిగింది.తల్లిదండ్రులమీద దయలేని పుత్రులను చెదలతో పోల్చిన వేమన మానవత్వంలేని పుత్రులను కాస్తంత ఘాటుగానే విమర్శించాడు.అదే తనమాటగా నొక్కిచెప్పాడు న్యాయవాది రాఘవరావు.కొడుకుకోసం తమ ఆస్తులన్నీ కరిగించేసుకున్న దుర్గాంబ,అనంతపద్మనాభంల కొడుకు సాయికిరణ్ ను కఠినంగా శిక్షించాలని రాఘవరావు కోర్టును కోరడం సామాజి స్పృహ వున్న ఎవరిచేతనైనా ఆమోదింపబడే న్యాయమే.

డిఫెన్స్ లాయర్ ప్రవీణ్ క్రాస్ ఎగ్జామిన్ కు ఉపక్రమించినపుడు దుర్గాంబ పేరు లలితమ్మగా మారడం కథాగమనానికేం అడ్డుకాలేదు.

మనవడు తేజను బడికి తీసికెళ్లినపుడు జరిగిన ప్రమాదంలో తేజ,అనంతపద్మనాభం ఇద్దరు గాయపడతారు.ఆ రోజు పుట్టినరోజు కూడా కావడంతో వేసిన కొత్తబట్టలు మట్టికొట్టుకుపోయి గాయాలైన తేజకు మందు రాస్తున్న కోడలు దివ్య దగ్గర, భర్తకు కూడా కాస్త మందు తీసుకోబోయిన అత్తను విసురుగా తోస్తుంది కోడలు.ఫలితం..గోడను గుద్దుకుని తల చిట్లి సొమ్మసిలి పడిపోతుంది దుర్గాంబ.ఈ సంఘటనే అనంతపద్మనాభాన్ని కోర్టు ముంగిట నిలిపింది.అయితే కోర్టులో దుర్గాంబ సమాధానాలు అందరిని ఆశ్చర్యపరిచే దిశగా సాగుతాయి.అటు కొడుకు ఇటు భర్త! ఎవరి పరువు భంగపడరాదు.వారిద్దరి మర్యాద తనపైనే ఆధారపడి ఉన్నాయని ఆమెకు తెలుసు.భర్త బాధపడినా కొడుకు చిన్నబోయినా ఆమెకు బాధే!సమాజంలో జరిగే తప్పుకు సమాజం బాధ్యత ఉండదా?ఈ ప్రశ్న దుర్గాంబ సంఘర్షణలోనుండి ఉత్పన్నమవుతుంది.

ఒకప్పుడు పాఠశాలల్లో మోరల్ సైన్స్ పేరిట వారానికి ఒక పీరియడైనా వుండేది.కాని ఆ సమయాన్నికూడా లెక్కలు,కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటరు కబ్జా చేస్తున్నాయి.కాసులొచ్చే చదువులకే క్లాసులలో ప్రాధన్యత పెరిగి సమాజానికి ఉపయోగపడే పాఠాలు
మృగ్యమవుతున్నాయన్న నిజాన్నితల్లి దుర్గాంబ పాత్ర ద్వారా రచయిత చక్కగా వినిపించారు.

పెద్దలకు,పిల్లలకు నడుమ అత్మీయబంధమే గృహపాలనలోని మూలసూత్రంగా గుర్తింపునందుకున్ననాడు శ్రీనివాస్ గారి చేతిలో పురుడు పోసుకున్నఈ కథకు ఊపిరందుతుంది.చివరకు టి.వి. సీరియళ్లలోని అత్తా కోడళ్ల హింసనాదాలు కూడా మనుషులదారేకాక మనసులదారే తప్పేటట్లు చేస్తున్నాయి,నీతిపాఠాలు నేటి పిల్లలకు దూరమయాయంటూ దుర్గాంబ కార్చిన కన్నీరు కన్నతల్లులందరిదీ. ఆవేశంలో జరిగే అనర్థాలలో ఇది కాకతీళయంగా జరిగిన ఒక సంఘటనే తప్ప మరేమి కాదంటూ,ముందుగా పథకరచన జరగలేదన్న సూక్ష్మాన్ని హుందాగా తెలిపిన దుర్గాంబ మాటలు అందరిని మాటరానివారిని చేసాయి.కోడలి దురుసుతనానికి,కొడుకు నిర్లిప్తతకు తగిన శిక్ష పడాలని వాంఛించిన అనంతపద్మనాభం ఆవేశానికి దుర్గాంబ పలుకులు హిమవర్షమే!ఇక చివరకు వారి కొడుకు సాయికిరణ్ కు ఏ శిక్ష పడుతుందోనని ఆతృతగా చూస్తుంటే తల్లిదండ్రులను యాత్రలకు తీసికెళ్లమని న్యాయమూర్తి సూచించినపుడు శ్రవణకుమారుని కథ గుర్తుకు వస్తుంది.మరి అన్యాయానికి న్యాయం చేసిన మాతృన్యాయమూర్తి చేసింది సబబేనా అని ప్రశ్నించుకుంటే విభిన్నస్పందనలు వినిపిస్తాయి.ఎన్నివిన్నా చివరకు చెప్పగలిగేదొకటే....మాతృదేవోభవ!

సున్నితమైన సామాజిక అంశాన్ని తీసుకుని దాని వెనుకగల మూలకారణాలను దుర్గాంబ పాత్ర ద్వారా తెలియచేసి చర్చకు వేదిక కాగల అంశాలనెన్నింటినో మనముందుంచిన రచయిత గంగా శ్రీనివాస్ గారు అభినందనీయులు.
మాతృన్యాయం కథను క్రింద ఇవ్వబడిన లింకులో చదవండి.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/matrn-yayam



src="http://kinige.com/images/kinigebannerimage.png"border="0">

కినిగె తెలుగు పుస్తకానికి చిరునామా
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

0 comments:

Post a Comment