Tuesday, December 31, 2013

శుభాకాంక్షలు

4 comments
బ్లాగ్మిత్రులందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు.Sunday, December 29, 2013

చిత్రగ్రంథి

0 comments
ఈ రోజు ఆదివారం ఆంధ్రప్రభలో చిత్రగ్రంథి కవితా సంపుటిపై నా సమీక్ష.


                     

       
                                                             కవితారసాలూరిన చిత్రగ్రంథి

 సుధామ జగమెరిగిన కవి,రచయిత, విశ్రాంత ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారి. సాహితీప్రక్రియలన్నిటిలోను ప్రవేశమున్నప్పటికీ కవితాసరిగమల ఆలాపనకే పెద్దపీటవేసి ఆంధ్రప్రభ దినపత్రికలో కవికాలమ్ నిర్వహించిన ఈ కవి కలం కవితాసుధాభరితమై ప్రశంసలనందుకుంది. సాహితీబాటలో కవిగా,రచయితగా, బహుపాత్రధారియైన సుధామ మనముందుకు తెచ్చిన చిత్రగ్రంథి కవితా సంకలనం వస్తువైవిధ్యంతో అలరిస్తుంది.
ఇక చిత్రగ్రంథిలోకి ప్రవేశిద్దాం.తొలికవితకు శీర్షికే కవి(త) ప్రవేశం .
కలుషితమవుతున్న పర్యావరణం మనిషిని ప్రకృతికి దూరం చేస్తోంది.
నీటిని గాలిని ధ్వనిని
క్షరముకాని అక్షరంగా సహజసిద్ధంగా
స్వచ్ఛంగా నిలుపుకుంటే చాలు
మహిని,మనిషిని కూడా రక్షించుకున్నట్లే. అంటూ పర్యావరణాన్ని రక్షించుకోవాలనే స్పృహను కలిగిస్తారు.
భూత,వర్తమాన,భవిష్యత్కాలాలను సమన్వయపరచుకోవడమెలాగో స్వగతం-స్వాగతం కవిత మనకు వినిపిస్తుంది.
గతాన్ని వర్తమాన కవ్వంతో చిలికి  భవిష్యత్తు మీగడను పైకి తేల్చడమే ముఖ్యం అనడం కవి దార్శనికత మూడు కాలాలకు విస్తరించడమే.
జీవితంపై ఆశ ఉద్దీపన కావాలి కాని అంతం కాకూడదు.
జీవితేచ్ఛ  కవితలో ఆశలు నిర్మించేవాళ్లు గోడలను కొలుస్తారంటారు. అవరోధాల గోడలనధిగమించాలి. మృత్యుశ్వాసనధిగమించి జీవితేచ్ఛ పరిమళించాలి.బ్రతుకుపై నిరాశకు వీడ్కోలు పలికే కవిత.
అగ్నినగ్నీకరం  కవిత భగ్గుమనే హృదయావేదనను ప్రతిఫలిస్తుంది. నగిషీకరించడంకాదు నగ్నీకరించినపుడు అది అగ్నీకరణమన్న కవి భావుకత కవితావేశాన్నందిస్తుంది.
మనిషి మానుషాన్ని మటుమాయం చేస్తున్నాడు. మానవ ప్రకృతిని మానవుడు ధరించేలా చెయ్యి.జీవనగీతం రానివ్వమని కొత్త పల్లవి పాడుతారు.
ఉల్లితరిగినప్పుడు కన్నీళ్లులా ….పఠిత సజలనేత్ర కావాలి అనడం హృద్యంగా ఉంది.
విలువ శీర్షికన రాసిన కవిత అమూల్యమైనదే. మెట్లపై మనిషి జారి పోవడం కాదు,నేడు మెట్లే జారిపోతున్నాయి.
వినిమయ విపణి వీధిలో మనిషే వస్తువై, మారిన ప్రపంచానివే విలువలు కాని వ్యక్తిత్వ ప్రపంచానివి కావు అనడం ఈ కవికి మానవతా విలువలపైనున్న ఆర్తిని ప్రస్ఫుటింపచేస్తుంది.
చితిలోను చ్యుతిలేని వృద్ధాప్యం
బ్రతుక్కీ,మృత్యువుకి మధ్య చివరి జాప్యం.
చివరి జాప్యంలో మారుతున్న విలువలలో మనిషీ మారకద్రవ్యమే అని సూటిగా చెప్పడం గుండెలో నాటుకుని కళ్లను తడుపుతుంది.
ఆకాశవాణినుండి కవితావాణిదాకా సుధామ మీటిన మైలురాళ్లు సాహితీబాట లోని పథికులకు మార్గనిర్దేశనాలే అనడంలో అతిశయోక్తి లేదు.
ఏదో నాలుగు కవితలు రాసేసాం, కలం మూసేసాం అనుకోకుండా  విలక్షణత,వస్తువైవిధ్యానికి ప్రాధాన్యతనిచ్చిన కవితా పఠనం ఉత్సుకతను ఉద్దీపన కావిస్తుంది.చిత్రగ్రంథి  కవితా సంకలనం మనసును ఉరకలేయించడమేకాదు  అదుపు తప్పిన సమాజపోకడలకు  చురకలు వేస్తుంది.చిలికేకొద్ది చిక్కనైన కవిత్వం  తొంగి చూచిన ప్రతి పాఠకుడిపై చిలకరించిన చల్ల పలుకై పలకరిస్తుంది. ఆలోచన, అవగాహన, రమ్యతకు తగిన సమతుల్యత మాటల పటాటోపంకాక పదాల పల్లవింపులు సహజత్వానికి దగ్గర దారై మన దరిదాపులలోనే కవి నిలుచుని మనతో కవితా కబుర్లు చెప్తున్నట్లుంటుంది .మనసును హత్తుకున్న కవితేదయినా ఆ కవితాస్రష్టను కలకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది.


                                                                                                    


Sunday, December 22, 2013

పిలవని పిలుపు

0 comments
గోతెలుగు.కాం లో  నేను రచించిన కథ  ఈ క్రింది లింకులో  చదవమని మనవి.

http://www.gotelugu.com/issue37/1024/telugu-stories/pilavani-pilupu/

గోతెలుగు.కాం వారి సౌజన్యంతో.Sunday, December 15, 2013

జూలియస్ సీజర్

2 comments
ఈ రోజు 15-12-2012 ఆదివారం ఆంధ్రప్రభలో నా సమీక్ష.        
                         
            లక్ష్మీకాంత మోహన్ అనువదించిన మరో చక్కటి  నాటకం జూలియస్ సీజర్.విలియం షేక్స్ పియర్ చిత్రిక పట్టిన ఆనాటి సమాజస్థితి గతులను తరచి చూడాలంటే చరిత్ర,సాహిత్య పఠనమే రహదారి.చదివిన సాహిత్యానికి దృశ్యీకరణ రసానుభూతికి రాచబాట.అయితే నటన ద్వారా మనం చలనచిత్రాలలోని సన్నివేశాలకు  స్పందిస్తాం కాని నాటక ప్రదర్శనలో  ఈ అనుభూతికి మించిన ఆనందం సాక్షాత్కరిస్తుంది. కారణం ప్రత్యక్షంగా కనబడే పాత్రధారులు.వినబడే గాత్రం,అలరించే హావభావాలు.జీవితమనే నాటకరంగంలో మనిషి జీవనం రంగుల రాట్నమే.
జూలియస్ సీజర్ నాటకానికి వేదిక  రోము నగరం.ఆ తర్వాత  సార్థిస్,ఫిలిప్పీ వస్తాయి. రోమన్ సామ్రాజ్యం పతనావస్థకు చేరినపుడు జూలియస్ సీజర్  పాత్ర ప్రవేశిస్తుంది.న్యాయానికి అన్యాయం, మంచికిపోతే  చెడు ఎదురైంది అనడం వింటుంటాం.అది సర్వసామాన్యంగా జరిగేదే!మంచికి చెడుకు నిత్య సంఘర్షణే. సీజర్ పరిపాలనలో అదే జరిగింది. సీజరుకు వ్యతిరేకంగా పనిచేసి అతడిని అంతమొందిస్తే  అతడికి తల ఒగ్గక బ్రతకవచ్చుననుకుంటాడు కేషియస్.అందుకు తన మిత్రుడైన బ్రూటస్ తో సంప్రదింపులు జరుపుతాడు. 
  సీజర్ భార్యకు వచ్చిన పీడకల సైతం సీజరును భయపెట్టదు.అమాయకత్వాన్ని స్వార్థమెపుడు మాయ చేస్తూనే ఉంటుంది.విజయోత్సవంలో పొంగిపోతున్న సీజరును అప్రమత్తంగా ఉండాలని  చేసిన హెచ్చరికలు అతడిని కాపాడలేకపోయాయి. నమ్మిన స్నేహితుడు బ్రూటస్ సైతం సీజరుపై కత్తిదూసినపుడు యు టు బ్రూటస్! అని ప్రాణాలొదులుతాడు సీజరు. నమ్మినవారు మోసం చేసినపుడు ఈ నాటికి ఎక్కడో ఓ చోట వినబడుతుందీ మాట!
ఇక అనువాదంలో ఇమిడిపోయిన తెలుగు పలుకుబడుల ద్వారా నారికేళపాకాన్ని కదళీపాకం చేసి అందించిన రచయిత అభినందనీయుడు.
రచయితగా,కవిగా స్వయంప్రకాశకుడు ఈ అనువాదకర్త.విలియం షేక్స్ పియర్ రచనలు వసివాడని నిత్య పారిజాత సుమాలు.అదే స్ఫూర్థితో అనువదించబడ్డ పదిహేను నాటికలు కూడా రంగస్థల వేదికపైనే కాదు పాఠకుల హృదయ వేదికపై కూడా సుగంధభరితం కావాలని ఆకాంక్షిద్దాం.                     

                                                                                          
Sunday, December 8, 2013

తుఫాను

0 comments
ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో తుఫాను నాటికపై నా సమీక్ష.


                                                                               


                                          నేటికీ మరపురాని నాటి నాటికలు
         విలియమ్ షేక్స్ పియర్ ఆంగ్ల సాహిత్యాభిమానులకు ఆరాధ్యుడు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, వారి మనోభావాలను పదునైన చమత్కృతితో నాటకీకరణ గావించి రంగస్థలానికి తను రచించిన నాటికలను ఆభరణాలుగా ఒసగిన మహాకవి. తాను మరణించినా తన నాటకాలకు చిరాయువు ప్రసాదించిన రచయిత షేక్స్ పియర్. అట్టి రచనలను తనదైన శైలిలో మాతృకలోని మాధుర్యం చెడకుండా అనువదించారు పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్ గారు. ఇతనిలోని కళాకారుడు విభిన్నరూపాలలో అలరించాడు. విద్యార్హతలు కళాపిపాసకు కొలమానాలు కానేరవు. తగిన గుర్తింపు దొరికినపుడు రచయితకు గాని,నటుడికిగాని ప్రాణవాయువందుతుంది.అదే మరిన్ని మంచి రచనలకు ఆయువుపట్టవుతుంది.
          కావ్యేషు నాటకం  రమ్యం అంటారు.నాటికలలో సమకాలీన అంశాలను పరిగణలోనికి తీసుకున్నపుడు ఆనాటి రాజరికాలలోని నిరంకుశత్వాన్ని, భూస్వాముల పెట్టుబడిదారీతనాన్ని,ప్రజల కడగండ్లను కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన షేక్స్ పియర్ రచనలను తెలుగు పాఠకులకు అందించిన లక్ష్మీకాంత మోహన్ అభినందనీయులు.
      ఇక నాటకాలలోనికి వస్తే ముందుగా తుఫాను నాటకాన్ని చూద్దాం.కథకు రంగం ఓడ,దీవి. ఆనాటి పరిసస్థితులకు అనుగుణంగా పాత్రలను సృష్టించి మనల్ని ప్రేక్షకులు గావించిన కథాగమనం.రాజ్యకాంక్ష చిరాయువు.మోసం, కుట్ర, ద్రోహం ఆయుధాలుగా మరింత ఊపిరి పోసుకుంటుంది. తుఫాను నాటకంలో అదే జరిగింది .
           ప్రాస్పెరో తన కూతురు మిరాండాకు తన తమ్ముడు ఆంటోనియో తనకు చేసిన ద్రోహాన్నివివరిస్తాడు. నేపుల్స్ రాజుకు  కప్పంకట్టి, అతని కనుసన్నలలో మెలగి అతడి ద్వారా తన అన్నను  సింహాసనం నుండి దించి సముద్రంలో ఒక ఓటి పడవలో వదిలిపెట్టమని చెప్తాడు అంటోనియో.అయితే గాంజలో అనే వృద్ధుడు వీరికి  తగినంత ఆహారమిచ్చి సహాయపడతాడు.
       ఏరియల్ అనే భూతశక్తి ద్వారా  సముద్రంలో తుఫాను రేపుతాడు ప్రాస్పెరో.జరిగిన అన్యాయానికి ఓడపైనున్నతన ప్రత్యర్థులను భయభ్రాంతులను చేస్తాడు.అయితే వారిని సముద్రానికి అర్పణ చేయడు.తుఫాను ఎలాగైనా ఉపశమింప చేయమని కోరిన కూతురికి ఏమీకాదన్న భరోసా ఇస్తాడు.
ఫెర్డినాండు సముద్రంలో మునిగి పోకుండా ప్రాస్పెరో ఉన్న గుహ దగ్గరకు చేరుకుంటాడు.తన మనసులో రూపు దిద్దుకున్న ప్రణాళిక రచింప ప్రారంభిస్తాడు ప్రాస్పెరొ. ఫెర్డినాండు మరణించాడనుకుని అటు మిలాన్ కు,ఇటు నేపుల్స్ కు రాజులవాలని ఆంటోనియో,సెబాస్టియన్ ఉవ్విళ్లూరుతారు.వారి ఆలోచనకు ఏరియల్ అడ్డుపడుతాడు.
         విభిన్న మలుపులు తిరిగి చివరి అంకంలో మిరాండా,ఫెర్డినాండు ఒకటై రాజ్యాధికారులవుతారు.ఈ సుఖాంతానికి షేక్స్పియర్ రసరంజకంగా తిప్పిన మలుపులను అంతే సహజంగా చక్కటి సంభాషణలతో,తెలుగు పలుకుబడులతో అలరింపచేసారు లక్ష్మీకాంత మోహన్..
ఈ నాటకం మనదేశానికి సంబంధించిన ఇతివృత్తం కాకున్నా,రాసి శతాబ్ధాలు గడిచినా ఇంత ఆసక్తికరంగా వుందంటే ఇదెంత విశ్వజనీనమైందో అర్థమౌతుంది.

                                                                                                              


          

Thursday, December 5, 2013

నెట్ నేస్తం...

0 comments
ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన నా వ్యాసం.

           
  మా అబ్బాయికి ఆరేండ్లే అయినా కంప్యూటర్ ఆవులిస్తే చాలు పేగులు లెక్కపెడతాడు అని మురిసిపోతారు కొందరు తల్లిదండ్రులు.మా అమ్మాయికి ల్యాప్ టాప్ వుంటే చాలు ఇల్లు దాటదు.తమ కనుసన్నలలోనే ఉన్న పాపాయి తమ నీడలో క్షేమంగా ఉందనుకుంటారు అమ్మానాన్నలు.నిజమే! కంప్యూటర్ వచ్చాక కలానికి,కాగితానికి విశ్రాంతి పలికింది.అన్నీ ఆన్ లైన్ లోనే! ఎన్నోవిషయాలను,విశేషాలను అడగడం ఆలస్యం అడిగినవి,అడగనివి కూడా మనముందుకు తెస్తుంది.పాఠ్యాంశాలు పెరిగేకొలది డిక్షనరీ,వికిపీడియా,కంప్యూటరు సంబంధిత పాఠాలు వంటివెన్నోతమ పిల్లలు వినియోగిస్తూ పదుగురితో చర్చిస్తుంటే ఆ ఇంటి పెద్దలు ఆశ్చర్యపోతూ సంబరపడిపోతారు. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం ఈ నాటి పిల్లలకు అందుబాటులోకి రావడం మంచిదే.అయితే ఆ మంచిని మించి  మనిషిని నిలువునా ముంచే వలలో,అదేనండి  నెట్లో  అదే పనిగా చిక్కుకుంటే చిక్కుముళ్లు పడినట్లే!
               తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుకు దోహదపడేందుకు తాహతుకు మించినదైనాసరే కావలసిన డెస్క్ టాప్,ల్యాప్ టాప్,ఐప్యాడ్ వంటివి కొనిస్తారు.తమ అవసరాలను సైతం వాయిదా వేసుకుంటారు.విషయ సముపార్జనకు నెట్ కనెక్షన్ తప్పనిసరి.కాని నెట్ బ్రౌజింగ్ ఒక వ్యసనంగా మారితే మాత్రం ప్రమాదమే!మానసిక వైద్యంలో నిత్య చర్చావేదిక ఈ నెట్ అడిక్షన్.అసలు ఇంటర్నెట్ ఎలా వాడాలో తెలియని వారు  కడకు దానికే అంకితమై ఆ వలలో పూర్తిగా ఇరుక్కుపోవడం లక్ష్యసాధనలో పెద్ద అవరోధం.తత్ఫలితంగా చదువు,పరీక్షలు అంటే విముఖత,నలుగురిలో కూర్చుని మాట్లాడాలంటే నిరాసక్తత పెరుగుతాయి.సామాజిక వెబ్ సైట్లపై ఉండే ఆసక్తి,కుటుంబసభ్యుల విషయంలో ఉండకపోవడం మొదలై,ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నా పెద్దలు గమనించలేకపోవడం దురదృష్టకరం.
              సమాచార సేకరణ జీవితానికి బంగారు బాట వేయడానికి మైలురాయిగా ఉపయోగపడాలి కాని అవాంఛనీయ విషయానురక్తి బ్రతుకు చిత్రాన్ని చిధ్రం చేస్తోంది.సామాజిక సైట్లలో అనుభవాలు,అనుభూతులు పంచుకోవడంలో నియంత్రణ ఉండాలి.నిద్రలేమి లేదా అతినిద్ర,చిరాకు,విసుగు,బద్ధకం,తిండి మానేయడం లేకుంటే అదే పనిగా తినడం వంటివి శారీరక రుగ్మతలుగా అనిపించినా, మానసిక వికారాలు పెంచే వల వ్యామోహానికి పిల్లలను దూరంగా ఉంచడమే మేలు.
                      ఇక కాస్త పెరిగిన యువతీ యువకులకు మంచి పనే చేస్తున్నాం,కనీసం ఇలా అయినా స్నేహాలు పెరుగుతున్నాయి కదా అనిపించడంలో ఆశ్చర్యపడనవసరం లేదు .కాని వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడం,తీసిన లేదా తీసుకున్న ప్రతి ఫోటోను అప్పటికప్పుడు అప్ లోడ్ చేసెయ్యడం,అందరితో పాస్ వర్డ్ షేర్ చేసుకోవడం వంటివి కూడదని హెచ్చరించవలసిన బాధ్యత పెద్దలదే.ఫోనైనా,కంప్యూటరైనా కనబడ్డ ప్రతి సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడు చేసెయ్యడం,ప్రతి కొత్త యాప్ ను వాడాలనుకోవడంలో కాస్త తరచి చూచి అడుగెయ్యాలి.లేదంటే వైరస్ బారిన పడి మన సమయాన్ని,ఢబ్బును వృధాపరుస్తాయి.

 ఈ నేపథ్యంలో పిల్లలేం చేస్తున్నారో పెద్దలు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.మీకు తెలియదు,మీకు రాదు,మీకర్థం కాదు అని పెద్దవాళ్లు దగ్గరికొస్తే తరిమేస్తూ, కంప్యూటరు కిటికీలను మూసేసారంటే తస్మాత్ జాగ్రత్త అనక తప్పదు. విషయ అవగాహన పెంచుకుంటున్నామన్న మిషతో  వలలో పడితే మాత్రం అది మనిషిని సైతం పతనమనే వైరస్ కు బలి చేస్తుంది.
   

Sunday, December 1, 2013

వెనిస్ వర్తకుడు

2 comments
ఈ రోజు(1-12-2013) ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురితమైన నా సమీక్ష.

                  చిన్నతనంలో ఆకట్టుకున్నకథలు, నాటికలు  మనఃఫలకంపైనుండి చెరిగిపోవు.అయితే ఇప్పటికీ రంగస్థలంపై ప్రదర్శించబడే  ఇటువంటి నాటికలు షేక్స్ పియర్ ప్రతిభకు అద్దం పడతాయి.లక్ష్మికాంత్ మోహన్ అకుంఠిత దీక్షతో అనువదించిన నాటికలలో అహ్లాదకరమైన రచన వెనిస్ వర్తకుడు.
         వెనిస్ నగర వర్తకుడు ఆంటనియో.అతడు చేసేది వాణిజ్యమే కాని  వ్యక్తిగా ప్రేమాన్వితుడు, దయార్ద్ర హృదయుడు. అతని స్నేహితుడైన బసానియో పోర్షియాను వివాహమాడాలనుకుంటాడు.అయితే ఆమె స్థాయికి తగినట్లుగా వుండాలంటే అప్పు చేయాలి. ఆంటనియో అతడు కోరిన పైకం ఇవ్వలేక షైలాక్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు.అధర్మానికి,కుటిలత్వానికి షైలాక్ ప్రతీక. దుష్ట ఆలోచనతో అప్పు ఇచ్చిన షైలాక్ మూడు నెలల గడువులో అప్పు తీర్చకపోతే ఆంటనియో శరీరంనుండి ఒక పౌండు మాంసాన్నినష్ట పరిహారంగా కోరుతాడు.మానవ సహజమైన అసూయ ఇలాంటి వింత కోరికకు అంకురం తొడుగుతుంది.
             నాటిక  రెండవరంగం బెల్మాంటులో పోర్షియా ఆమె పరిచారిక నెరిస్సాతో జరిగిన మాటల కలబోతలో మానవీయ కోణాలు ప్రదర్శితమవుతాయి. చక్కగా నడచుకుంటే చక్కని జీవితం అని పలికిన నెరిస్సా పలుకులకు పోర్షియా స్పందిస్తూ చెయ్యటమనేది చెప్పటమంత తేలికైతే కరువుకాటకాలు కనుమరుగయేవి. ఏది మంచో నూరు మందికి చెప్పగలిగినా నేను  ఆచరణలో పెట్టడం మాత్రం కష్టం.మన మనసులు మంచి మాట చెప్తున్నా మన ఉద్రేకాలు మాత్రం మనసులు గీచిన మంచి గీటుల్ని దూకి అవతల పడుతాయి. అంటుంది. షేక్స్ పియర్ మనస్తత్వ విశ్లేషణను అత్యంత సహజంగా అనువదించిన లక్ష్మికాంత మోహన్ అభినందనీయులు.
ఇక నాటకం చివరి అంకంలో షైలాక్ మనసును  మార్చాలని కడసారి ప్రయత్నంగా మారువేషంలోనున్న పోర్షియా, మనిషి హృదయంలో కరుణ సహజంగా ఉండాలికాని నిర్బంధంతో రాదు అంటుంది.అది వర్ష తుషారం ఆకాశం నుండి భూమి మీద పడినట్లు దానంతటదే వస్తుంది. కరుణ అనేది రాజదండంకంటే బలవత్తరమైనది.కరుణ చూపమని దేవుడిని వేడుకునే మనం ఇతరులపై కూడా కరుణ చూపమనే కదా!’ అని షైలాక్ ను ప్రశ్నిస్తుంది. కాని విభిన్న మనస్తత్వాల మానవులం,అందరం ఒకేలా  స్పందించం కదా! షైలాక్ తన మొండిపట్టు వీడడు.అయితే పోర్షియా నాటకం చరమాంకంలో తన మారువేషంతో రంజింప చేసి షైలాక్ ఆట కట్టించడం కొసమెరుపు.
     మూలకథలోని భావ ప్రకటనా పటిమకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా తనకు ఆశువుగా అలవడిన అనువాద కళను చక్కని సంభాషణా చతురత చూపి ఇది మనకు తెలిసిన నాటకమైనా ఉత్సుకతను పెంచే రీతిన మలవడంలో మోహన్ గారు కృతకృత్యులయారనే చెప్పవచ్చు. 
ప్రదర్శనకు అనుకూలమైన నాటికల పరంపరలో ఇదొక అద్భుత రసమయ కావ్యం.