Sunday, December 8, 2013

తుఫాను

ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో తుఫాను నాటికపై నా సమీక్ష.


                                                                               


                                          నేటికీ మరపురాని నాటి నాటికలు
         విలియమ్ షేక్స్ పియర్ ఆంగ్ల సాహిత్యాభిమానులకు ఆరాధ్యుడు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, వారి మనోభావాలను పదునైన చమత్కృతితో నాటకీకరణ గావించి రంగస్థలానికి తను రచించిన నాటికలను ఆభరణాలుగా ఒసగిన మహాకవి. తాను మరణించినా తన నాటకాలకు చిరాయువు ప్రసాదించిన రచయిత షేక్స్ పియర్. అట్టి రచనలను తనదైన శైలిలో మాతృకలోని మాధుర్యం చెడకుండా అనువదించారు పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్ గారు. ఇతనిలోని కళాకారుడు విభిన్నరూపాలలో అలరించాడు. విద్యార్హతలు కళాపిపాసకు కొలమానాలు కానేరవు. తగిన గుర్తింపు దొరికినపుడు రచయితకు గాని,నటుడికిగాని ప్రాణవాయువందుతుంది.అదే మరిన్ని మంచి రచనలకు ఆయువుపట్టవుతుంది.
          కావ్యేషు నాటకం  రమ్యం అంటారు.నాటికలలో సమకాలీన అంశాలను పరిగణలోనికి తీసుకున్నపుడు ఆనాటి రాజరికాలలోని నిరంకుశత్వాన్ని, భూస్వాముల పెట్టుబడిదారీతనాన్ని,ప్రజల కడగండ్లను కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన షేక్స్ పియర్ రచనలను తెలుగు పాఠకులకు అందించిన లక్ష్మీకాంత మోహన్ అభినందనీయులు.
      ఇక నాటకాలలోనికి వస్తే ముందుగా తుఫాను నాటకాన్ని చూద్దాం.కథకు రంగం ఓడ,దీవి. ఆనాటి పరిసస్థితులకు అనుగుణంగా పాత్రలను సృష్టించి మనల్ని ప్రేక్షకులు గావించిన కథాగమనం.రాజ్యకాంక్ష చిరాయువు.మోసం, కుట్ర, ద్రోహం ఆయుధాలుగా మరింత ఊపిరి పోసుకుంటుంది. తుఫాను నాటకంలో అదే జరిగింది .
           ప్రాస్పెరో తన కూతురు మిరాండాకు తన తమ్ముడు ఆంటోనియో తనకు చేసిన ద్రోహాన్నివివరిస్తాడు. నేపుల్స్ రాజుకు  కప్పంకట్టి, అతని కనుసన్నలలో మెలగి అతడి ద్వారా తన అన్నను  సింహాసనం నుండి దించి సముద్రంలో ఒక ఓటి పడవలో వదిలిపెట్టమని చెప్తాడు అంటోనియో.అయితే గాంజలో అనే వృద్ధుడు వీరికి  తగినంత ఆహారమిచ్చి సహాయపడతాడు.
       ఏరియల్ అనే భూతశక్తి ద్వారా  సముద్రంలో తుఫాను రేపుతాడు ప్రాస్పెరో.జరిగిన అన్యాయానికి ఓడపైనున్నతన ప్రత్యర్థులను భయభ్రాంతులను చేస్తాడు.అయితే వారిని సముద్రానికి అర్పణ చేయడు.తుఫాను ఎలాగైనా ఉపశమింప చేయమని కోరిన కూతురికి ఏమీకాదన్న భరోసా ఇస్తాడు.
ఫెర్డినాండు సముద్రంలో మునిగి పోకుండా ప్రాస్పెరో ఉన్న గుహ దగ్గరకు చేరుకుంటాడు.తన మనసులో రూపు దిద్దుకున్న ప్రణాళిక రచింప ప్రారంభిస్తాడు ప్రాస్పెరొ. ఫెర్డినాండు మరణించాడనుకుని అటు మిలాన్ కు,ఇటు నేపుల్స్ కు రాజులవాలని ఆంటోనియో,సెబాస్టియన్ ఉవ్విళ్లూరుతారు.వారి ఆలోచనకు ఏరియల్ అడ్డుపడుతాడు.
         విభిన్న మలుపులు తిరిగి చివరి అంకంలో మిరాండా,ఫెర్డినాండు ఒకటై రాజ్యాధికారులవుతారు.ఈ సుఖాంతానికి షేక్స్పియర్ రసరంజకంగా తిప్పిన మలుపులను అంతే సహజంగా చక్కటి సంభాషణలతో,తెలుగు పలుకుబడులతో అలరింపచేసారు లక్ష్మీకాంత మోహన్..
ఈ నాటకం మనదేశానికి సంబంధించిన ఇతివృత్తం కాకున్నా,రాసి శతాబ్ధాలు గడిచినా ఇంత ఆసక్తికరంగా వుందంటే ఇదెంత విశ్వజనీనమైందో అర్థమౌతుంది.

                                                                                                              


          

  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

0 comments:

Post a Comment