Thursday, November 21, 2013

నాన్నా నీకేం కావాలి?

27-11-2013 నవ్య సంచికలో ప్రచురితమైన కథ.





                                        
ఓ, గాడ్! అప్పుడే ఐదయిపోయింది.వాట్ నాన్సెన్స్!ఈ సెల్ అలారం సెట్ చేసానే! పని చేయడం లేదా?దీన్ని డస్ట్ బిన్ లో పడేసి మరొక్కటి కొనుక్కోవాలి.లేకపోతే ఆలస్యానికి పెనాల్టీ తప్పదు.అదేదో ఇప్పటికే పడింది. నాకంటే ముందే చేరిపోయిఉంటాడు రాజేష్ వాకింగ్ కు!నడవాలన్న ఆకాంక్షకన్నా తనకన్నా ముందే రాజేష్ బిగ్ షాట్స్  అడుగులో అడుగు వేస్తూ,జోకులు పేలుస్తూ,వారిలో నవ్వులు పూయిస్తూ ,వారి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతూ  సమాంతరంగా పరిచయాల ఖాతాను  కొండలా పెంచుకుంటాడు.మిత్రలాభం బహుబాగా తెలిసినవాడు.పనులు సాధించుకోవాలంటే  ఈ దినచర్య తప్పదు.బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలంటే ఈ మాత్రం బాలెన్సింగ్ చేసుకోవాల్సిందే!
భర్త అవసరాలు గమనిస్తూ,ఇల్లాలి పాత్ర తు.చ తప్పకుండా పోషించే అవంతి బెడ్ కాఫీ అందించినా వద్దువద్దంటూ కారు తాళాలందుకుని పరుగులుతీసాడు సుధీర్.
నిశ్చలంగా చూస్తుండిపోయింది అవంతి.ఎందుకీ పరుగు? నడక మంచిదే కాని నడత కూడా బాగుండాలి కదా! వాకింగ్ గ్రూపులు కట్టి, సమావేశాలు పెట్టి  ఎవరి శైలిలోవారు ఇతరులను  వ్యాపార లావాదేవీలలో వ్యూహత్మకంగా దెబ్బ తీస్తూ, అవసరమనిపిస్తే అడుగులకు మడుగులొత్తుతూ,అవసరంలేదనిపిస్తే  అణచివేస్తూ! ఇన్ని రాజకీయాలు చేస్తేకాని తెలవారదా?ఏమో!
ఆలోచనల వరకే,ఆపైనమాట పెగలదు.సరే తను చెప్పాలనుకున్నది చెప్పాలని నోటినుండి మాట పెగలడం ఆలస్యం,....నీవేమైనా మీ ఇంటినుండి మూటలు  తెచ్చావా?మాటలు పెంచుతున్నావు!కనీసం స్కూటరు కొనివ్వలేదు మీ నాన్న!నాతెలివితో పదిమందితో పరిచయాలు పెంచుకుని ,పనులు సాధించుకుని ఈ స్థాయికి వచ్చి ఎందరో ఆడవాళ్లు కలలుగనే రిచ్ లైఫ్ ను నీకందించాను. ఇంటినిండా విదేశీ వస్తువులు నింపాను.విదేశీ ఆర్కిటెక్ట్ తో  డిజైన్ చేయించి అందరు ఆశ్చర్యపడేలా ఇంటిని తీర్చిదిద్దాను.ఇక ఏం కావాలి నీకు? ఇంకా ఇంకా ఎదగాలనుకునే నన్ను కట్టడి చేసి  అందరిలో వెనకబడమంటావా?
ఇలా క్లాసుల మీద క్లాసులు పీకించుకున్నాక అవంతి ప్రేక్షకపాత్రకే  అంకితమైపోయింది.
కూతురు నీలిమ పిలిచిన పిలుపుకు ఆలోచనలకు చుక్కపెట్టి  గడియారం వంక చూసింది. ఏడవుతోంది. నీలిమను పరిశీలనగా చూసింది. తనను దేనికీ పిలవకుండానే చకచకా బడికి తయారయిన నీలిమను కళ్లతోనే ప్రశంసించింది.ఆ ఏడాదే ఐదవతరగతి లోకి వచ్చింది నీలిమ.పాఠశాలకు వెళ్లివచ్చిన తొలిరోజున
అమ్మా! నా పనులన్నిటిని నేనే చేసుకుంటాను.నువ్వు అడ్డు చెప్పకు.ఈ రోజు మా క్లాస్ టీచరు అన్ని పనులు మీరే స్వంతంగా చేసుకోవాలన్నారు.అని చెప్తే ఫోరా బడాయి అంది కాని టీచరు మాటను శిలాక్షరంలా
పాటిస్తూ పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్న కూతురిని చూడగానే అవంతి మనసు దూదిపింజలా మారిపోయింది.చక్కగా తయారై స్కూల్లో పిల్లలకు చాక్లెట్లు పంచడానికి బయలుదేరిన  కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది, ’ చిట్టి తల్లీ హ్యాపీ బర్త్ డే రా! అంటూ.
అమ్మా, నాన్న....అమ్మ సమాధానం తెలిసినదానిలా మాటను మధ్యలోనే తుంచేసి వంటమనిషి అందించిన టిఫను బాక్సు, వాటర్ బాటిల్ అందుకుంది నీలిమ అయితే తన మాటలకు తల్లి బాధ పడుతుందనుకుని తనను తాను ఊరడించుకునే ప్రయత్నంలో కందిన ముఖాన్ని దాచుకోలేక పోయింది.ఈ ఏడాదైనా  తండ్రి గుర్తుపెట్టుకుని కూతురికి విషెస్ చెప్తాడనుకుంది.కాని కూతురి నిరాశ అతడిని బాధించదు. అయితే కూతురి పేరు మీద బుక్ చేయాలను కుంటున్న కారు,సైటు,ఇల్లు,లేటెస్ట్ మాడల్ సెల్ ఫోన్,ఐ పాడ్ ....ఏది కావాలో కనుక్కోవాలి, ఏదడిగినా కొనివ్వాలి,ఎంతఖర్చయినా సరే!సుధీర్ మనసులో దృఢంగా నిర్ణయమైపోయిందెప్పుడో!
అమ్మా!పాప పుట్టిన రోజుకదా,ప్రత్యేకించి ఏం వండమంటారు?
వంటమనిషి ప్రశ్నకు, “‘సార్ వచ్చాక చెప్తాలే’’ అంది అవంతి.
అతడి ప్లాన్ ఏమిటో,ఎవరిని పిలుస్తాడో,ఎవరిని పిలవడో,ఇంటికే పిలుస్తాడో,లేదా పాప పుట్టినరోజు సాకుగా  తాను వలవేసిన మనుషులకు గ్రాండ్ గా డ్రింక్ పార్టీయే అరేంజ్ చేస్తాడో !సందర్భమేదైనా పరిచయాలు తద్వారా ఏర్పడే రాజమార్గాలు, డొంక తిరుగుళ్లు,అవి పెంచే బ్యాంకు నిలవలు.వెన్నంటి వచ్చే పేరు ప్రతిష్ఠలు, పట్టించుకోకుండా దులపరించుకునే అప్రతిష్ఠలు. అకేషన్ ఏదైనా అప్లికేషన్ మాత్రం ఇదే!తమ పెళ్లిరోజుకు అయిన ఖర్చుకు ఎవరిదైనా పెళ్లి చేసేయవచ్చు. వచ్చిన బహుమతులకన్నా ఇచ్చినవే ఎక్కువ.పొగడ్తలకు ఉప్పొంగిపోతూ, చూసావా నా ప్రతిభ అని కళ్లతోనే యస్.ఎం.యస్ లు పంపుతుంటే అతడి రిచ్ ఫీలింగ్ కు సంతోషపడాలో లేక ఎందుకింత ధనదర్పాల దాహం అని బాధ పడాలో అర్థంకాదు అవంతికి.
విస్తరిలో అన్నీ ఉన్నాయి.అయినా అసంతృప్తి ఎందుకు? ఇంకా సంపాదించాలనే ఆశ చావదెందుకు?తను మధ్య తరగతినుండి వచ్చిన అమ్మాయి.సర్దుకుపోవడం తెలుసుకున్నంతగా కోరికలు తీర్చుకోవాలన్న ఉబలాటం నేర్పని తల్లిదండ్రుల పెంపకం తనది.తన సాదాసీదా ఆలోచనలను ఎప్పటికప్పుడు ఎరేజ్ చేస్తాననే భర్త మాటలకు మూలాలు మరచిన మనిషి అనుకుని మనసులో నవ్వుకున్నా, పైకిమాత్రం సరే...సరేనంటూ  తలూపుతుంది.సర్దుకుపోవడంలో ఇదీ ఒక పాఠమేనని అవంతికి తెలుసు.
కూతురు బడికెళ్లగానే తను భర్తతో కలిసి కనీసం కాఫీ అయినా తాగాలనుకుంటుంది.అనేకసార్లు ఆ భాగ్యము దొరకదు.అదీ ఎండమావే!                                                                                                        విజిటింగ్ కార్డు పట్టుకుని తిప్పితిప్పి  చూస్తున్న భర్త ముఖంలో ఆనందాన్ని ప్రస్ఫుటంగా గమనిస్తోంది అవంతి.
వేడివేడి ఇడ్లీలు,సాంబారు వడ్డించింది వంటమనిషి.
పదండి టిఫను చేద్దాం.పాప బర్త్ డే ఎలా ప్లాన్ చేస్తారో తెలుసుకోవాలన్న ఆతృతలో ఉంది అవంతి.
నో...నో నువ్వు కానిచ్చేయ్.ఈ రోజు అక్కడే సొరకాయ జ్యూస్,సలాడ్స్ కానిచ్చేసాం.లంచ్ కు కూడా రాను.
డిన్నరు?అవంతి ప్రశ్నకు  “ ఏమో ఇప్పడే ఎలా చెప్పను?అది సరే,పాప టైంకే స్కూలుకు వెళ్లింది కదూ.
అవునన్నట్టుగా తల ఊపింది మౌనంగా.
గుడ్,దానికీ నాలానే టైమ్ సెన్స్ ఎక్కువ.చూస్తుండు అదీ ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్ అవుతుంది.
చూడు..ఏదైనా కావాలంటే డ్రైవరుతో వెళ్లి తెచ్చుకో.నా కోసం చూడకు.వింటున్నావా ?ఏమిటా పరధ్యానం?
అన్నీ విన్నాను,ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి.
రాత్రికి వస్తాగా అప్పుడు మాడ్లాడుకుందాం.టైం లేదు.అర్జంటుగా ఒకరిని కలవాలి.అతడితో వెళ్తేగాని మన పనులు సానుకూలపడవు.డబ్బు రేస్ లో ముందుకు అడుగేసాడు.
ఒక్క క్షణం....ఆగండి.అవంతి గొంతులో అణచుకున్న కన్నీటి ఆనవాళ్లు.
విసుగ్గా ఆగాడు సుధీర్ తలైనా తిప్పకుండానే.
ఈ రోజు మనపాప పుట్టిన రోజు...మీరు బర్త్ డే విషెస్ చెప్పాలని త్వరగా వస్తారనుకున్నాను.
అరె!మరిచేపోయానే,చూసావా నాదెంతవర్క్ మైండో!ఇలాటివన్ని నువ్వే మానేజ్ చెయ్యాలని మొన్న నువ్వోసారి గుర్తు చేసినప్పుడే చెప్పాను.నీకన్నా నా సెక్రటరీయే నయం నా ప్రోగ్రాంలన్నీ డైరీలో  వరుసగా ఉంటాయి.
అయితే మీ సెక్రటరీకే  చెప్పండి మన పెళ్లిరోజులు,పుట్టినరోజులు గుర్తుపెట్టుకుని మీకు చెప్పమని.”  కోపాన్ని గొంతులోనే నొక్కుకోవడం కాపురానికి రాగానే నేర్చుకున్న ఇంద్రజాలవిద్య.అన్నీగుర్తుండవు కాని కనీసం చెప్పాకైనా ప్రోగ్రాం ప్లాన్ చెప్పొచ్చు కదా.తన తండ్రి సాధారణ కుటుంబీకుడు.తాము కోరిన చిన్నచిన్న కోరికలు తీర్చినా తీర్చలేకపోయినా కలిసి గుడికి వెళ్లేవారు,పార్కుకెళ్లేవారు. నాన్నతో కలిసి ఆడిన ఆటలు నిత్యజ్ఞాపకాలు.
అలా బొమ్మలా నిలుచుంటే ఏం లాభం?బేబికి ఏం కావాలో చూడు ఛాయిస్ తనదే.
బర్త్ డే గిఫ్ట్ కు ధర ఎంతైనా సరే వెనక్కి తగ్గడు.
మీరు  నిన్న రాత్రే పాపనడిగుంటే బాగుండేది,స్కూలునుంచి రాగానే ప్రజంట్ చేసేవారుకదా?
 సరే ఇప్పుడు మించిపోయిందేముంది?ఏమైనా టెండర్ పోగొట్టుకున్నామా,డేట్ క్యాన్సిల్ అయిందా?ఇంత చిన్న విషయానికి నా టైమ్ ఐదు నిమిషాలు వేస్ట్ చేసావు.
కిటికీ దగ్గరకు వెళ్లి సిగరెట్ వెలిగించాడు, రిలీఫ్ కావాలన్నట్టుగా. ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కనబడ్డ గుడిసెలు సుధీర్ అసహనాన్ని మరింత పెంచాయి. చిరాగ్గా తల విదిలించాడు.వాష్ బేసిన్ దగ్గరకు గబగబ వెళ్లి భళ్లున వాంతి చేసుకున్నాడు.
గుడిసెలు,వారి జీవితాలు తనకు పడవు అనుకున్నాడు సుధీర్.                              
' రాత్రి హ్యాంగోవర్ ఇంకా దిగినట్లు లేదు అనుకుంది అవంతి. ఆ గుడిసెలు తొలగించి  తన బంగళా  ప్రక్కనే కూతురికి, అల్లుడికి మరో సౌధాన్ని నిర్మించాలన్న తపన.ఆ గుడిసెలు ఖాళీ చేయించాలి, స్థలాన్ని కొనెయ్యాలి. రెండు జరిగి తీరుతాయి.తనకున్న పరిచయపరపతి అలాంటిది.ఇదే ధ్యాస ఎక్కువై రాత్రి పగలు,అంతస్తు,హోదాను పెంచుకోవాలనే తపనే తప్ప మరొకటి తలవడు.
మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.రాత్రికి ఇంటికే వచ్చెయ్యండి.ఇక్కడే ఏదో చిన్న పార్టీ ఏర్పాటు చేద్దాం.త్వరగా వచ్చెయ్యండి ప్లీజ్!కూతురి కళ్లలో వెలుగు చూడాలన్న ఆశ అభ్యర్థనను బలంగా వినిపిస్తోంది.
ఏమనుకున్నాడో ఏమో సరేననడం అవంతి మనసంతా ఆనందార్ణవమైంది.
సంతోషమందించిన కొత్తశక్తి అవంతిలో ఉత్సాహాన్ని పెంచింది. సాయంత్రానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా జరిగిపోసాగాయి.భర్త త్వరగా ఇంటికి వస్తాడన్న ఆనందం సాధారణ ఇల్లాలికి నిత్య సంతోషమే. కాని బిజినెస్ టైకూన్ సుధీర్ నెలలో ఏ ఒక్కరోజో వేళకు వస్తాడు.పాప పుట్టినరోజుకు త్వరగా రావడమంటే పాపకు ఇంతకు మించిన సంతోషముండదన్న భావనే అవంతిని ఉత్సాహపరుస్తోంది. ఇల్లంతా పండుగ వాతావరణం పరచుకుంటోంది.రంగురంగుల బెలూన్లు,పూల తోరణాలు భవన అందాన్ని ఇనుమడింపచేస్తున్నాయి.
కూతురు నీలిమ ఇంటికి రాగానే బుగ్గలు రెండు పుణికి ముద్దుపెట్టుకుంది. తల్లి సంతోషానికి కారణమేదైనా నవ్వుతున్న అమ్మ ముఖం నీలిమ మనసును పరవశింపచేసింది.
మీ నాన్న త్వరగా వచ్చేస్తాడమ్మా.త్వరగా తయారవు. నాన్నఫ్రెండ్స్ కూడా రావచ్చు.వారిని చూడగానే లేచి నిలబడి నమస్కరించాలి.  నీకు విషెస్ చెప్తారు.అందరికీ థ్యాంక్స్ చెప్పాలి.తన తండ్రి నేర్పిన పాఠాలను కూతురికీ నేర్పుతోంది అవంతి.
నాన్న త్వరగా ఇంటికి వస్తున్నాడా ? చకచకా తయారయి తండ్రి కోసం ఎదురుచూడసాగింది. కారు శబ్దం విని కిటికీ దగ్గరకు పరుగెత్తింది.కారులెన్నో పరుగులు తీస్తున్నాయి. తండ్రి జాడ మాత్రంలేదు.రంగు రంగుల విద్యుత్తు కాంతుల తోరణాలు వెలగనారంభించాయి.అటు గుడిసెలలో గుడ్డి వెలుగు కనిపించాల్సిన దృశ్యాలను  మసగ్గా   చూపిస్తోంది.కాని నీలిమకు ఆ దృశ్యాల వెలుగులు మనసును చురుక్కుమనిపిస్తున్నాయి.కూలి డబ్బులు ఆ పూటకు సరిపడా మెతుకులనే ఇచ్చాయి.దాన్నే పరమాన్నంగా సత్తుగిన్నెలో కలిపి చంకలోకెత్తుకున్న కొడుక్కో ముద్ద, నాన్నఒడిలో కూర్చుని గారాలు పోతున్న కూతురికో ముద్ద తినిపిస్తున్న దృశ్యం....ఇటు టేబిల్ పై అందంగా నీలిమ అన్నపేరును నీలవర్ణంతో రాయించి తండ్రి రాగానే కట్ చేయడానికి సిద్ధంగా ఉన్న భవన ఆకారంలోని పేద్ద కేకు.నీలిమ కళ్లు మళ్లీ కిటికీనే ఆశ్రయించాయి.చెప్పలేని భావాలు, వ్యక్తీకరణకు చాలీచాలని వయసు, ప్రావీణ్యత సంతరించుకోని భాష అయినా  చిన్నబుచ్చుకున్న మనసులోని బాధను పలుకగలుగుతున్న నీలిమ ముఖంలోని భావాలు అవంతిలో  అసహనాన్ని పెంచుతున్నాయి. ఆపుకోలేని నిద్ర పసి మనసును మరిపిస్తోందేమో అనిపిస్తోంది.
నాన్నవస్తే లేపు అమ్మా....అంటూ కట్ చేయాల్సిన కేకు వంక ఓసారి చూసి నిద్రలోకి జారుకుంది.కాని కేకు కట్ చేయాలని తండ్రి కోసం ఆతృతగా ఎదురు చూసిన  బిడ్డ చూపులు అవంతి గుండెను నిలువునా కోసాయి.
హారన్ చప్పుడు విని తల్లి లేపకుండానే ఉలిక్కిపడి లేచింది నీలిమ.
సారీరా నీలూ,లేటయింది అందరూ పార్టీ పార్టీ అన్నారు.
నా బర్త్ డేకా నాన్నా!” ఆసక్తిగా అడిగింది నీలిమ.
కాదురా,మన ప్రక్కనున్న గుడిసెలు రేపు ఖాళీ చేయిస్తారు.నీకో పేద్ద ఇల్లు కట్టిస్తాను కదా అందుకని పార్టీ.” అవంతి వైపు చూసాడు విజయగర్వంతో.
నాకొద్దు నాన్నా!” చప్పున అంది నీలిమ.
మరేం కావాలి?స్కూల్ కు వెళ్లడానికి కొత్త కారా?
నాకేం వద్దు.కళ్లు చికిలిస్తూ చూసింది తండ్రిని.
సరే బొమ్మలు కొనుక్కో,ఢ్రస్ లు కొనుక్కో,ఎంత డబ్బు కావాలో అడుగు.లక్షా...రెండు లక్షలా?
నీలిమలో భావాలను విడమర్చి చెప్పలేని అశక్తతను గమనించసాగింది అవంతి.తను కలుగచేసుకుంటే తండ్రి కూతురి మధ్య అడ్డం రావద్దంటూ ఆక్షేపణలు.
స్పందించని కూతురిని చూసి విసుగ్గా, “ఏం కావాలో అడగవు,అదివద్దు ఇది వద్దు అంటావు...ఎలా?” 
అసలు నీకేం కావాలి నాన్నా?
మనసులో ఏర్చికూర్చలేని భావాలెన్ని ఉన్నా నీలిమ వేసిన చిన్న ప్రశ్న ఎన్నో కుటుంబాలలో జరుగుతున్న జీవన దృశ్యాన్ని కళ్ల ముందు నిలిపింది.
నాకా!తెల్లబోయాడు సుధీర్
కూతురి ప్రశ్న తండ్రి మనసును కవ్వమై చిలుకుతోంది.
ప్రక్కనే గుడిసెలో  తండ్రి ఒడిలో కూర్చుని అన్నం తిన్నాక ,తండ్రి ప్రక్కనే పడుకున్న పాపలా తను నాన్నతో కబుర్లు  చెప్పాలి,కిలకిలా నవ్వులు నవ్వగలగాలి.తండ్రి అందించే డబ్బుల గలగలలు కాదు తనకు కావలసినది.మనసు మాటలు పేర్చినా వ్యక్తీకరించలేని  నీలిమ తనకు తెలిసిన ప్రశ్ననే పదేపదే ప్రశ్నించసాగింది.
నీకేం కావాలి నాన్నా?ఇంకా ఇంకా డబ్బులు కావాలా? చాలా చాలా కావాలా?మళ్లీ మళ్లీ అదే అడగసాగింది నీలిమ.
అవంతి ముఖంలో సంబరంతో కూడిన ఆశ్చర్యం.తన మనసులోని ప్రశ్న కూతురి ముఃఖత వచ్చినందుకు.                   
ఎంతో సంపాదించుకున్నాము. అన్నీ కూర్చుకున్నాము . అయితేనేం  బిడ్డలకు కాస్త సమయమైనా వెచ్చించలేని తండ్రితనమెందుకు?వారానికొక్కసారైనా భార్యాపిల్లలతో గడపలేని సంపాదన తృప్తినిస్తుందా? నేటి చిన్నారులకు తండ్రితో ఆటలు,పాటలు కాదుకదా మాటలే లేవు! అవంతి గుండెలోనుండి వెలువడలేని  భావావేశం  నీలిమ మనసులో ప్రశ్నావళిగా  ముద్రితమవుతోంది.  


                                                            *****************   
          













  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

6 comments:

Padmarpita said...

చక్కగా చెప్పారు.

మాలా కుమార్ said...

గుండెను తట్టింది. బాగా రాశారు.

సి.ఉమాదేవి said...

ధన్యవాదాలు పద్మార్పిత గారు.

సి.ఉమాదేవి said...

సాహితీ పయనంలో హృదయాన్ని పలకరించగలిగినందుకు సంతోషంగా ఉంది మాలా గారు.

ఆదూరి హైమవతి said...

ఏంకావాలో తెలీని నాన్నకేంకావాలో అడిగే బిడ్డలే అలాంటి తండ్రులకు మార్గదర్శకులు, చక్కని కధ, భాషకు జోహార్లు.

సి.ఉమాదేవి said...

మీ భాషాభిమానం అద్భుతః
నలుగురు కలిసి ఆనందంగా పలకరింపులు,పంక్తి భోజనాలు కరువైన సమాజం కలతపరుస్తోంది హైమగారు.

Post a Comment