

ఆదివారం సాక్షి ఫన్ డేలో రచయిత రామాచంద్రమౌళిగారి 'పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు' కథాసంపుటంపై నా సమీక్ష.
సాహితీ ఔషధమే లేపనంగా సమాజహితం కోరే సాహిత్యానికి పెద్దపీట వేసే రచయిత రామా చంద్రమౌళిగారు. మానవతావిలువలు ఆవిరైనవేళ మనిషి మ్రోగని మురళీనాదమే!అయితే ప్రేమ,కరుణ మనిషిని ఆర్తిగా పొదువుకున్న వేళ స్పందించే వేణునాదమవుతాడు.రెండు విభిన్న పార్శ్వాలను స్పృశిస్తూ మనుషుల భిన్నప్రవృత్తులే కథావస్తువుగా స్వీకరించి కథారచనను బాధ్యతగా పరిగణిస్తారు రామా చంద్రమౌళిగారు. వీరి అక్షరకొలిమిలో పుటం పెట్టిన కథలివి.
‘జీవితం ఏమిటి’ విశ్లేషణాత్మక కథ.జీవితం దైవం నాటిన పూలతోటే కాని తల్లిదండ్రుల అవినీతి సంద్రంలో మునిగిన చుక్కానిలేని నావ రవళి.పసితనాన్నే వసివాడిన కసిమొగ్గ అనిపిస్తుంది. ‘ఖాళీ‘ కథలో నీరజ మనసును ఎడారితో పోలుస్తూ ఆమె మనసును అడవి ఆక్రమించిందంటారు.ఆత్మీయత,ఆప్యాయత లోపించిన ఇల్లు మమతల పందిరి కానేరదు.మోడుబారిన జీవితం ఎడారి సదృశమే అని రచయిత పోల్చడం అక్షరసత్యం.ఇక ‘అతీతం’ కథలో అనైతికత విజృంభించి మానవులను పతనదిశగా నడిపిస్తే స్పందించని హృదయాలు,వర్షించని కన్నులు హార్డ్ డిస్క్ ను కోల్పోయాయి అని రచయిత అనడం మన హార్ట్ డిస్క్ ను కుదుపుతుంది.అర్థం కాని గమ్యం,లక్ష్యం లేని పరుగు నిరర్థకమంటారు.ఉరుకు,పరుగుల జీవనవేగంలో మానవతా స్పర్శను రుచి చూపించిన కథ ‘అనిమిత్తం.‘
నేడు మనిషి మమతలవాసన కాక డబ్బు వాసన వేస్తున్నాడు. తృప్తిలేనపుడే ధనాశకు బానిసవుతాడు. మనిషెపుడూ అసంతృప్త ద్రావణమే.ఒక చెప్పు తెగిపోతే మరోచెప్పు పనికిరాదన్నది సామాన్యవిషయం.కాని ఈ సూత్రాన్ని భార్య మరణానికి అన్వయించుకుని గుండె పగిలి నజీర్ మరణిండం చూసి అసంతృప్త ద్రావణమనదగ్గ రమణ విచలితుడవుతాడు.మనిషి లోతులను తెలిపిన కథ ‘లోతు’.
ఏరంగమైనా విలువలు కోల్పోతున్న వైనమేనని రామా చంద్రమౌళిగారు తాను కురిపించిన కథావర్షంలో తడిసిన అక్షరభాష్పాలు మన గుండెను చెమ్మగిలచేస్తాయి.మనిషిని,మనిషి మనసును అధ్యయనం చేసిన సిద్ధాంత వ్యాసమనదగ్గ కథాసంపుటం పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు.
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు(కథలు)
వెల:రూ.100/-$10
ప్రతులకు: రాష్ట్రంలోని అన్ని పెద్ద పుస్తకాల షాపుల్లో
4 comments:
ఇంకొక మంచి పుస్తకం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు ఉమ గారు.
పుస్తకపరిచయం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెలగారు.
madam,me sameesha chala bagundi mukyamga me saily,
ధన్యవాదాలు ఫాతిమాగారు,మీకు నచ్చినందుకు సంతోషం.
Post a Comment