Friday, February 24, 2012
సినిమాలు-స్త్రీ పాత్రలు
గత సంవత్సరం ఆంధ్రప్రభ ఆదివారంలో నేను చేసిన పుస్తకసమీక్ష.
స్త్రీపాత్రలను తెరస్మరణీయం గావించిన రచన
కావ్యనాయికలు,కథానాయికలు,నవలానాయికలపై జరిగినంత విశ్లేషణ సినిమాలలో స్త్రీపాత్రలపై అంతగా జరగలేదనే చెప్పాలి.ఒకవేళ స్త్రీపాత్రలపై కొందరు స్పందించి కొంత అక్షరబద్ధం చేసినా అధిక శాతం సినీనాయికల పాత్ర చిత్రణకన్నా వారి వ్యక్తిగత జీవితచిత్రణపట్లే కుతూహలం చూపడం జరుగుతోంది.ఇటువంటి నేపథ్యంలో సినీసాహిత్యప్రస్థానంపై విమర్శనాత్మక విశ్లేషణను ముద్రించడానికి ఆర్థికసహాయమందించిన సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు వారికి నమస్సులర్పించడం న్యాయం.
ఏమి సినిమాలో ఏమో అని చిన్నచూపు చూసేవారు కూడా ఈ విశ్లేషణ చదివితే తమ అభిప్రాయాలను మార్చుకునే అవకాశం ఖాయం.బాగున్నా,బాగులేకపోయినా మొహమాటం మాటున మొహంమొత్తిన సినిమాను సైతం అందల మెక్కించి ఆహా,ఓహో అనడం ఆనవాయితీగా మారిన రోజుల్లో విమర్శనాత్మక గ్రంథంగా వెలువడిన ఈ పుస్తకం ఆకట్టుకునే అంశాలనెన్నింటినో చర్చించింది.
స్త్రీ పాత్రలేని కథలుండటం అరుదు. సమస్యలు,సరదాలు, సుఖాలు, కష్టాలు, నవ్వులు,కన్నీళ్లు ఇవన్నీ స్త్రీని అల్లుకున్న తీగలే.ఈ సున్నితమైన అంశాలు సినిమాలలో సమస్యలుగా చర్చింపబడినా పరిష్కారాలు మాత్రం వేళ్లమీద లెక్కింపవచ్చు.19వ శతాబ్దంలో మూగగా మన ముందు నిలిచిన సినిమాలు కాలక్రమేణా మనకే మాటలు నేర్పసాగాయి.తొలిరోజులలో పౌరాణికాలపై దృష్టి నిలిపినా క్రమక్రమంగా సాంఘిక సమస్యలపై దృష్టిసారించి సమాజంలో ఆశావహమార్పును నినదించాయి.ఈ చిత్రాలు స్త్రీల జీవిత పార్శ్వాలను పారదర్శకం చేసాయి.
సినిమా! మూడక్షరాల ఈ మంత్రోచ్ఛారణ మైమరిపింపచేసే దృశ్య మాధ్యమం.సినీవినీలాకాశంలో తారాతోరణాలెన్నెన్నో! సినీసంబంధిత విశేషాలను దిన,వార,పక్ష,మాస పత్రికలు వివరిస్తున్నా అవి కేవలం కథ,నటన,నటీనటులు ఇత్యాది వివరాలకే ప్రాధాన్యతనిస్తాయి.
డా.ఎ.సీతారత్నంగారు రచించి మనకందించిన ప్రముఖ తెలుగు సాంఘిక సినిమాలలో స్త్రీల జీవిత చిత్రణ ఆహ్వానించదగిన పుస్తకం. సినిమా నేపథ్యంతో రచనలు చాలా పరిమితంగా వస్తాయి. సినిమాలలో స్త్రీ పాత్రల జీవనవిధానాన్ని దర్శకులు చిత్రీకరించిన వైనాన్ని సమర్థవంతంగా సమీక్షించారు సీతారత్నంగారు. పరిపూర్ణత సాధించారనలేము కాని సమగ్రతకు కొదవలేదు.తన పరిధిలో వీలైనన్ని సినిమాలను చూసి,సినిమా కథలను చదివి ఉపయుక్తమైన అంశాలను వివరించారు.
సినిమా పుట్టుక,పరిణామం మొదలుకుని సినిమాలు, అందులోని పాటలపై ఆధారపడ్డ సెల్ ఫోన్, రేడియో,టి.వీలపై పక్షపాతంలేని పారదర్శకమైన సద్విమర్శ సినీ సాహిత్యంలో తొలివరుసన ఈ గ్రంథాన్ని నిలబెడుతోంది.పరిధి దాటని పరిమితులు పరిపూర్ణతను పెంచాయి.సకాలంలో సరైన విమర్శ అని పలికిన మృణాళినిగారు స్పృశించిన అంశాలకు స్పందిస్తే దీనికి కొనసాగింపుగా మరొక రచనకు నాంది పలకవచ్చు లేదా మరిన్ని పేజీలు పెరగొచ్చు.ఆనాటి సినిమా ప్రచారానికి జట్కా,రిక్షాలలో గ్రామఫోను పాటలు,కరపత్రాలు ఆధారం.
నేడు ఆడియో విడుదలలు,టి.విలలో లైవ్ కార్యక్రమాలు,ప్రీమియర్ షోలు వంటి వైవిధ్యభరితమైన ప్రచారాలు, ప్రసారాలు సినిమాలను నట్టింట కూర్చోబెడు తున్నాయి.ఇక సినిమా పత్రికలేకాక ఇతర వార్తాపత్రికలు, వారపత్రికలు సినిమాలపై సమీక్షలనందిస్తూ ఇతోధికంగా తమ గళాన్నివివరంగా వినిపిస్తున్నాయి.అయితే ఇవి సినిమా సమీక్షలకేకాని స్త్రీ పాత్రలను విశ్లేషించే చర్చా వేదికలు కావు.
సుదీర్ఘ సినీ ప్రయాణంలో గుర్తుంచుకోదగ్గ మైలురాళ్లు చక్కని చిత్రాలే.భక్తి భావాన్ని పెంపొందించే భక్తి సినిమాలు, కుతూహలాన్ని రేకెత్తించే జానపదాలు గుర్తుంచుకోదగ్గవే.కాని నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్ఫుటంగా చిత్రీకరించిన సినిమాలు మన మనసులను ఎన్నటికీ వీడిపోవు.ఈ కోవకు చెందినవే మల్లీశ్వరి,పెళ్లిచేసిచూడు,పెళ్లినాటి ప్రమాణాలు,డా.చక్రవర్తి, వెలుగునీడలు,బలిపీఠం,అంతస్తులు,మూగమనసులు,ముత్యాలముగ్గు వంటి చిత్రరత్నాలు.
1938లోనే వచ్చిన సినిమా గృహలక్ష్మి తాగుడుకు అలవాటుపడ్డ భర్తతో అనుభవించిన వేదనలను చూపించింది. 1940లో విడుదలైన సుమంగళి,1945లో నిర్మించబడ్డ స్వర్గసీమ ఆనాటి సామాజిక రుగ్మతలను ఎండగట్టాయి.సాంఘిక ప్రయోజనం నెరవేరితే అదే పదివేలుగా నిర్మించబడే ఆ నాటి సాంఘిక సినిమాలు,స్త్రీసమస్యలైన బాల్యవివాహం,పునర్వివాహం,వరకట్నం వంటి విషయాలకు పెద్దపీటే వేసాయి.ఆర్థిక అసమానతలతో పార్వతి(సావిత్రి) పాత్రలో బలైనతీరును దేవదాసు,సంఘం సినిమాలో సంఘాన్ని ఎదిరించే దమ్మున్న స్త్రీవాదిగా రాణి పాత్ర(వైజయంతిమాల), స్త్రీ ఓర్పును,నేర్పును సమన్వయపరచిన భార్యపాత్రలో అర్థాంగి సినిమా మొదలైనవి స్త్రీలవేదనలనేకాక స్త్రీ శక్తియుక్తులను ప్రదర్శించాయి.1962లో అఖండవిజయాన్ని మూట కట్టుకున్న గుండమ్మకథ, కులగోత్రాలు విభిన్న స్త్రీ పాత్రల సమాహారమే. స్త్రీపాత్రలోని గయ్యాళితనం కూడా మిగిలిన స్త్రీ పాత్రలనెంత ప్రభావితం చేస్తుందో తెలుపుతాయి ఈ చిత్రాలు.ఇక పదహారేళ్ల వయసు సినిమాలో లైంగికదాడిని ఎదుర్కొనే దిశగా స్త్రీ రాటుదేలడం, అమాయకుడిని అఖండుడిగా తీర్చిదిద్దిన తీరు పడతులు పరిశీలించతగిన అంశాలుగా అంతర్లీనమైన సందేశాన్ని వినిపించారు.త్యాగం తనవంతై తానే రాలిపోతుంది అనే త్యాగమయిగా గోరింటాకులోని స్వప్న (సుజాత)పాత్రలో స్త్రీ మానసిక సంఘర్షణను పతాకస్థాయికి తీసుకుపోయిన ఉదాత్తమైన పాత్ర అంటూ వర్ణించిన సీతారత్నంగారి దృష్టికోణం ఎన్నదగినది.ఇక ఈ నాటి ప్రేక్షకులను అలరించిన నువ్వేకావాలి, మనసంతా నువ్వే,ఆనంద్,గోదావరి సినిమాలు స్త్రీలోని ప్రేమను,లాలిత్యాన్నిమధురంగా మలిచిన పాత్రలు.విస్తృతి పరిధికిలోబడి,వేల సినిమాలలోని కొన్నిస్త్రీపాత్రలనే విశ్లేషించినా,సమాజంలో నాటి,నేటి స్త్రీల స్థితిగతులలోని మార్పులు అవగతమవుతాయి. ఈ పుస్తకాన్ని ఓసారి తెరచిచూస్తే కాలంతోపాటు ఎదిగిన సినీ చరిత్ర రీలులా గిర్రున తిరుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
ఉమాదేవి గారు ,
చాలా బాగా విశ్లేషించారండి . బాగుంది .
మీకు నచ్చినందుకు సంతోషమండి.ధన్యవాదాలు మాలాకుమార్ గారు.
సినిమాల్లో స్త్రీ పాత్ర ముఖ్యంగా తెలుగు సినిమాలలో ఎప్పుడు vulnerable గానే ఉంటుందండీ. పూర్వం సినిమాల్లో స్త్రీలకు పూర్తి నిడివి ఉన్న పాత్రలు వచ్చినా వారు త్యాగమూర్తులు. పురుషాధిక్య సమాజం భావజలాన్ని భుజస్కందలపై మోసే పతివ్రతామతల్లులు. ఉదా: గుండమ్మ కథ, సుమంగళి etc..
ఈ కాలంలో స్త్రీలకు నిడివి ఉన్న పాత్రలు లేవు. వారు తోలుబొమ్మలు. ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. పాటలకి డాన్సులు చేస్తే మాత్రం చాలు.
స్త్రీని వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తీర్చి దిద్దిన సినిమాలు చాలా కొన్ని. వేళ్లపై లెక్కెట్టొచ్చేమో. ఉదా: గోదావరి, Mr. మేధావి, అనుకోకుండా ఒకరోజు, తొమ్మిది నెలలు etc.
మీరు చెప్పిన పుస్తకం చదవాలి ఈసారి.
అవునూ, మీ బ్లాగు ఆగ్రిగేటర్లలో వస్తోందా? నాకు కనిపించట్లేదు. మీరు రాయట్లేదేమో అనుకున్నను. తీరా చూస్తే ఇక్కడ ఇన్ని పోస్టులు!
సౌమ్యా, గోదావరా? అందులో హీరోయిన్ లో నాకు తింగరి తనం తప్ప ఇంకేమీ కనిపించదు. తన కాళ్ల మీద తను నిలబడాలని బొటిక్ పెట్టడం తప్ప ఇంకే రకంగానూ గొప్పగా ఉండదు సీత పాత్ర. నిమిష నిమిషానికీ కోపాలు తెచ్చేసుకోడం, ఊరికే పోట్లాడ్డం,"సారీ చెప్పు సారీ చెప్పు"అని వెంట బడటం, ఇవన్నీ చైల్డిష్ గా అనిపిస్తాయి.
అంకురం అనే అద్భుతమైన సినిమా గుర్తు లేదా నీకు?
సుజాత గారూ... గోదావరి సినిమాలో హీరోయిన్ వేషాలు కొన్ని చైల్డిష్ గా ఉన్న మాట నిజమే అయినా అందులో హీరో, హీరోయిన్ల కు కూడా స్త్రీల పట్ల గౌరవం. వాళ్ళు ముదుకి రావాలనే తపన ఉంటుంది. అది నాకు నచ్చింది.
అంకురం సినిమా మరిచేపోయాను సుమండీ...అద్భుతం కదా అసలు!
సౌమ్యగారు నా బ్లాగు అగ్రిగేటర్లలో వస్తుంది,చిన్నిగుండె చప్పుళ్లు పేరుతో.స్త్రీలు మనవలసిన విధానానికి భిన్నంగా ప్రవర్తిస్తే సినిమాలైనా నిజజీవితంలోనైనా ఆమోదయోగ్యంకాదు.చక్కటి కథాబలంతో స్త్రీశక్తిని నిరూపించిన చిత్రాలెన్నో అందరిచేత నీరాజనాలందుకున్నాయి.
సుజాతగారు,అంకురం ఓ అద్భుతం.స్త్రీ వ్యక్తిత్వాన్ని మహావృక్షమై నిలిపిన చిత్రం.
స్పందించిన మీ ఇరువురికి ధన్నవాదాలు.
Post a Comment