Sunday, February 12, 2012

మరపురాని అరకులోయ!



మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే క్రమంలో ప్రకృతిపాత్ర తక్కువేమి కాదు.అరకులోయ ప్రకృతికి చిరునామా.అరకులోయ అనగానే మనసు పులకరిస్తుంది.కనులముందు పచ్చని ప్రకృతి సాక్షాత్కరిస్తుంది.అప్పుడప్పుడే ఊహలు నాతో ఊసులాడుతున్న బాల్యం.విశాఖలో చదువు,సెలవులలో అరకులోయ.విద్య నేర్పిన పాఠాలతో అలసి సెలవులకు అమ్మ,నాన్న వున్న అరకులోయకు ప్రయాణం. తల్లిదండ్రులకన్న ముందే ప్రకృతి తల్లి పలకరించేది.చెయ్యిచాపి ఒడిలోనికి పొదువుకునేది.తల్లి ఒడి తరువాత అంతకు అంత స్పందింపచేసిన ప్రకృతి ఒడిలో ఊహలకు రెక్కలొచ్చాయి.కలలు రూపుదిద్దుకున్నాయి.సెలవులు ప్రకటించగానే మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డు ప్రయాణం గుర్తుకొచ్చి ఒళ్లు గగుర్పొడిచేది.భయము,సంతసము కలగలిసిన భావన.


అది 1959వ సంవత్సరం.ఈనాడు వున్నట్లు ఆరోజుల్లో అరకులోయకు రైలు మార్గంలేదు.విశాఖపట్నంనుండి రెండు బస్సులుండేవి.ఒకటి రాందాసు ట్రాన్స్ పోర్ట్ వారిది.మరొకటి తపాల్ బస్సు అనేవారు.మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చేది.రాందాసువారిది రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేది. తపాల బస్సంటే తెగ సంబరం.పోస్టులో తెప్పించుకునే వార,మాసపత్రికలను మోసుకొచ్చే బస్సంటే సంతోషపడనివారుంటారా?అయితే పుస్తకాలన్నీ పగలే చదివేవాళ్లం. ఎందుకంటే అప్పటికింకా కరెంటు స్థంభాలు రాలేదు.విద్యుత్తు సరఫరాలేదు.చీకటి పడుతుండగా డైనమో వేసేవారు. ఠంచనుగా రాత్రి పదింటికల్లా ఆపేసేవారు.ఆ లోపల దుప్పటిలో దూరాల్సిందే!పైగా పదినెలల వాన,విపరీతమైన చలి. బొగ్గుల కుంపటిలో నిప్పులు చేతులు వెచ్చబెట్టుకోవడానికే కాదు కట్టుకోవాల్సిన బట్టలను కూడా ఆరబెట్టుకోవడానికి పనికి వచ్చేవి.ఇక విద్యుత్తు లేని రోజుల్లో హరికేన్ లాంతర్లు,పెట్రొమాక్స్ లైట్లే అప్పటి నియాన్ లైట్లు!


మార్చి,ఏప్రిల్,మే నెలలు విహారానికి బాగుంటాయి.ఈ నెలలు వేసవి ఆటవిడుపులే.ఏప్రిల్ లో పరీక్షలవడం ఆలస్యం సింహాచలం రూట్లో వెళ్లే బస్సును ఒడిసి పట్టుకోవడం అదో థ్రిల్లు.అనంతగిరి ఘాట్ లో వాయునందనుడిని దర్శంచుకున్నాకే ప్రయాణం జంకు వదలి నిర్భయంగా చేసినట్లు భావన కలిగేది. ప్రకృతిని ఆస్వాదించాలంటే కొండలు,లోయలు,జలపాతాలు పుష్కలంగా దర్శనమిచ్చే అరకులోయను మించి మరోటి వుండదని ఆనాటి మా గట్టి నమ్మకం.మరి అరకులోయ నేటికీ ప్రకృతికి నిలువెత్తు చిరునామాయే కదా!


మేఘాలు వాహనాలలోనికి చొచ్చుకుని వచ్చినట్లుండేవి.మేఘాలు కొండలను ఢీకొట్టి వర్షించడం కాంచి పరవశులమైపోతాము. పచ్చని తివాచీ పరచినట్లు కనబడే కొండలు దగ్గరయేసరికి పెద్ద పెద్ద చెట్లతో దర్శనమిచ్చేవి. అరకు లోయ ఒక పెద్ద బొటానికల్ గార్డెన్ అనిపించేది.ఇఫ్పటిలా పార్కులులాంటివి ఏర్పడకముందే అక్కడ ఆర్కిడ్స్ లో కాఫీ తోటలు,లిచ్చీస్,రోజ్ యాపిల్స్,దాల్చిన్ చెక్క,లవంగాలు, ఒకే మొక్కకు వందలాది పూలు పూచే గులాబీలు వెరసి అన్నీ కలిసి అందించే వింతైన పరిమళం.వీనులవిందైన పాటలకు దీటుగా పక్షుల కిలకిలారావాలు.అడవి బిడ్డల అలరించే థింసానృత్యం!


అవని కాన్వాస్ పై ప్రకృతి పరచిన వర్ణచిత్రం అరకులోయ.నేలను కనబడనివ్వనంత పచ్చదనం.ఆకాశం నిర్మలంగా వున్నా చిలిపి చినుకులు లయబద్ధంగా తకథిమి చేస్తూనే స్పృశిస్తుంటాయి.రూపాయి పట్టుకుని అంతా కలియదిరిగినా బిస్కెట్,బ్రెడ్ వంటివి అవసరానికి దొరికేవికావు.సుంకరమెట్ట సంతలో తేనె,చింతపండు, కాఫీగింజలు, ఆవాలు,చీపుర్లు దొరికేవి.మించి కావాలంటే శృంగవరపు కోటకు వెళ్లాల్సిందే.అంటే ఏదైనా కొనుక్కోవాలంటే యాభై కిలోమీటర్లు పయనించాల్సిందే.నలభైతొమ్మిది టనెల్స్ లెక్కపెట్టడం ఆనాటి సరదా.ఇక బొర్రా గుహలు సినిమావాళ్ల కంటబడ్డాకే వాటికి గుర్తింపు వచ్చింది. విశాఖలో బయలుదేరి అరకులోయ చేరేలోపు ఘాట్ దారంతా కరివేపాకు చెట్లు, సీతాఫలాలు,పుల్ల నారింజ చెట్లు,కుంకుడు చెట్లు,అడ్డాకులు- ఎవరు నాటారు వీటిని అని ఆశ్చర్యపోతాం.సిల్వర్ ఓక్,యూకలిప్టస్ చెట్లు ఏపుగా పెరిగి అందనంత ఎత్తాకారం అన్నట్లు పరవశింప చేస్తాయి.


ఇక అరకు చేరుకున్నాక మనల్నిచూసి అరవిరిసిన మొగ్గల్లాంటి అడవితల్లి బిడ్డలు చిందించే చిరునవ్వులు పాలస్ఫటికంలాంటి అమాయక వదనాలలో ఆనందం,ఆశ్చర్యం కలబోసిన జుగల్ బందీ మన మనసుపై ముద్ర వేసే మాయాజాలం!మోసమెరుగని మనుషులు, మాలిన్యమంటని మనసులు,పాపపుణ్యాల తూకం తెలిసిన సమవర్తులు. వీరి గూడు, నీడ, గడ్డి పైకప్పుగాకల గుడిసెల్లాంటి ఇండ్లే.అయితేనేం,ప్రకృతి ఒడిని సొంతం చేసుకున్న ముద్దుబిడ్డలు.

ఓహ్! ఎటుచూసినా నయనానందకరమే! స్పందించే మనసుండాలేగాని ప్రతి దృశ్యము అమోఘమైన చిత్తరువే. పలకరించే పవనాలు, ఉరకలేసే జలపాతాలు, ఘాట్ రోడ్ లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయే కొండ చిలువలు,చెంగున ఎగిరి వచ్చే జింకలు,బిక్కు బిక్కుమని బిత్తర చూపుల కుందేళ్లు-- ఇవన్నీ ఇప్పటికీ మాయని వెచ్చని అనుభూతులే.
ఆకులో ఆకునై ,పువ్వులో పువ్వునై,కొమ్మలో కొమ్మనై ---ఈ అడవి దాగిపోనా ఎటులయినా ఇచటనే రాలిపోనా అనిపించి ప్రకృతిలో మమేకమైన భావన కలిగేది.కన్న తల్లిని,కన్న ఊరును మించినది లేదు నిజమే.కాని క్రిష్ణయ్యను పెంచిన యశోదమ్మను మరవగలమా?అలాగే అరకు లోయ నన్ను పెంచిన తల్లి.అరకులోయతో అనుబంధం మరువ లేనిది మరువ రానిది.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

10 comments:

Shiva said...

Hi Uma Devi garu,

Great to hear that you are from Araku valley. I love entire agency area of Paderu. I worked for 2.5 years in Ananthagiri and Paderu in ITDA. Thats my first job. Moreover I enjoyed traveling all the places by foot to visit the villages as part of my job. My email id rkrishnay@gmail.com. Mana araku gurinchi matladukovadam ishtamaithe mail cheyandi

మాలా కుమార్ said...

మీరు అరకు లోయ గురించి రాసింది చదువుతుంటే మీరెంత అదృష్టవంతులో అంత చక్కని లోయలో బాల్యం గడిపారు అనిపిస్తోందండి .

నేను నాలుగైదు సార్లు వైజాగ్ వెళ్ళినా అరకు చూసే వీలు కలుగలెదు :(

సి.ఉమాదేవి said...

Thank you Shiva garu for reading the article.Everyone likes Araku as it is a gift of nature.

సి.ఉమాదేవి said...

అవకాశం వస్తే వెళ్లిరండి మాలాకుమార్ గారు,జీవితపులోతులు తెలిపిన లోయ అది!

జ్యోతిర్మయి said...

అరకులోయ గురించి వినడమేకాని చూడడం కుదరలేదు. మీరు కళ్ళకు కట్టినట్టు వర్ణించారు.

Maitri said...

ఉమాదేవిగారూ, నేను 1985 లో అరకుకి వెళ్ళేను కానీ దాన్ని ఒక టూరిస్ట్ చోటుగా మాత్రమే అప్పుటి నా అభిప్రాయం. మీరు రాసినది చూస్తుంటే మళ్ళీ వెళ్ళాలనిపించేటట్లుగా ఉంది. బాగా పరిచయం చేసేరు.
క్రిష్ణవేణి.

జయ said...

అవునండి. అదొక అందమైన అనుభవం. అక్కడ పూసే పచ్చటి పూలు నాకు చాలా ఇష్టం. మళ్ళీ అన్నీ గుర్తు చేసారు. చాలా బాగా చెప్పారు.

సి.ఉమాదేవి said...

పసుపు పచ్చటి పూలు అవనిపై కురిసిన అక్షింతలు.జయగారు,మీ మనసులో జ్ఞాపకాల పుటను తెరిచానన్నమాట!

Unknown said...

araku valley gurinchi chala bagachepparu..araku valley chala istam naku..araku backgroundlo vache kadhalanni chaduvuthanu..chala sarlu vellanu kuda..

సి.ఉమాదేవి said...

Thank you Rajesh garu.My childhood is linked to Araku Valley.Araku is my nostalgia.

Post a Comment