ఒకసారి ఇంటిదగ్గరేవున్న లైబ్రరీలో సాహితీసమాలోచన జరుగుతోంది.పాఠకులంతా ఎంతో శ్రద్ధగా వింటున్నారు అని లైబ్రరీ పెద్దలు,ఆసక్తిగా వింటున్న రచయితలు,రచయిత్రులు తలపోస్తున్నారు.ఎనీ డౌట్స్?అని అంతవరకు ప్రసంగించిన వారు అడగడం ఆలస్యం పై ప్రశ్నశరమై వచ్చితలలో పాతుకుంది.అడిగినగొంతును గుర్తించి అందరు ఆ అమ్మాయివైపుకు తిరిగారు.అవును,ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బాధ్యత అందరిదీ.అప్పటికప్పుడు చెప్పిన సమాధానాలు ఒకొక్కసారి సంతృప్తినివ్వవు.మరికాస్త వివరించి,నచ్చచెప్పితే సాహిత్యాన్ని వాడనీయకుండా కాపాడుకోవచ్చుననే ఆశే ఈ పోస్ట్ రాయడానికి ప్రేరణ.
పుస్తకం హస్తభూషణం అంటారు.రైల్వేస్టేషన్లో హిగ్గిన్ బాథమ్స్ మొదలుకుని కిళ్లీ బడ్డీలో అర్ధణాకు అద్దెకె తెచ్చుకున్న పుస్తకంతో మమేకమైన రోజులు,గడిచిన తరానికి ప్రతినిధులైన పుస్తక ప్రియులకు తియ్యని జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి.
సాహిత్యమెందుకు చదవాలి?లాభమేంటి?పుస్తకం చదివే సమయంలో మరేదైనా లాభదాయకమైనపని చేయొచ్చుకదా?అని ప్రశ్నించేవారూ ఉన్నారు.పుస్తకాన్ని తాకితే ఎక్కడ అతుక్కుపోతుందేమోనని భయపడేవారెందరో అడిగే ప్రశ్నలివి.సైన్స్ చదువు డాక్టరవుతావు,లెక్కలు చెయ్యి ఇంజనీరవుతావు అని చెప్తాం కాని సాహిత్యాన్నెందుకు చదవాలి? అని అడిగినపుడు మనసుతడబడుతుంది.సమాధానం చెప్పలేక కాదు,మనల్నిమనం ఎందుకు మరచిపోతున్నామని?మనలో అంతర్ముఖీనత కరవైనందుకు హృదయం కాసేపు కలత చెందుతుంది.ఛాయిస్ లో వదలేసిన ప్రశ్నలుగా వాటిని భావించుకుని మనసుకు సర్ధిచెప్పుకోవడం కనబడే మార్గం.అలాగని సరిపుచ్చుకుంటే సమాధానం దొరక్క ప్రతిప్రశ్నా తెల్లబోతుంది.
గాఢమైన జీవితానుభవాలు,నిత్యసంఘర్షణ,విభిన్న స్పందనలు,ఊహలు,అనుభూతులు, సామాజిక చైతన్యం,వాస్తవఘటనలు,మరెన్నో సంఘటనలు.ఇదే జీవిత సమాహారం.మనసుతెర తొలగితేనే స్పందన.విభిన్న అంశాలకు,విభిన్నరీతులలో స్పందించిన రచనా శిల్పుల సాహితీపోకడలను,వాటి వెనుకనున్న ఆశయాలను,ఆకాంక్షలను వారి రచనలొసగే ప్రయోజనాలను వెరసి వారి సాహిత్యపు తీరుతెన్నులను స్పృశించడమంటే కొండను అద్దంలో చూపించడమే!
సాహిత్యానికి విభిన్న రూపాలున్నట్టే విభిన్న నిర్వచనాలున్నాయి.జీవితాన్ని దర్శించేదే సాహిత్యమంటారు కొందరు.జీవిత విమర్శే సాహిత్యమంటారు మరికొందరు.ఎవరేమన్నా హితవుకోరేదే సాహిత్యం.అందుకే రచయిత లేదా రచయిత్రి సమాజంలోకి సంధించిన అక్షరాస్త్రాలు చెడును చీల్చి మంచిని నెలకొల్పే దిశగా సాగాలి.రచనలు చూపే మంచిమార్గం పాఠకులను ప్రభావితం చేస్తుందా అని తేలిగ్గా అనెయ్యవచ్చుగాని మంచిచేయకపోతే పోనీ చెడును ప్రోత్సాహించకూడదుకదా?
సాహిత్యం బహుముఖాలుగా విస్తరిల్లడం మనకందరికీ తెల్సు. కవిత,కథ,నాటకం జనబహుళ్యంలోకి చొచ్చుకునిపోయిన చక్కటి సాహితీ ప్రక్రియలు.ఇక జానపదకథలు,హరికథలు,బుర్రకథలు,అమ్మపాడే లాలిపాటనుంచి పైరగాలిలో తేలియాడే పల్లెపాటదాకా అన్నీ సాహిత్యరూపాలే!సాహిత్యం తన విశ్వరూపదర్శనంతో అటు పండితులను ఇటు పామరులను రంజింప చేయగలుగుతుంది.
మనిషి జీవనచిత్రంలో అన్నిరంగులు మిరుమిట్లు గొలపవు.కొన్ని వెలిసిపోతాయి,మరికొన్ని పూర్తిగా తడిసిపోతాయి.అయితే జీవన హరివిల్లు విరియాలంటే ఎలా?మనిషిలో ఉండాల్సిన మానవీయ లక్షణాలు ఆవిరవుతున్న ఆనవాళ్లు భయంగొల్పుతాయి.అలాంటి సమయంలోమనిషిని నిలకడగా నిలిపేది మానవీయకోణాన్నిదర్శింపచేసే సాహిత్యం.ప్రతిదినం పరుగే అయిన జీవన వేగంలో అదృశ్యచక్రాలతో పాదవిన్యాసం చేసే మనిషిని,అతని మనసును స్వాంతన పరచేది సాహిత్యం.
వాస్తవానికి మనిషి తనకుతానే దూరమవుతున్నాడు.బ్రతుకు పోరాటంలో మనిషిని కోరికలు కబళిస్తున్నాయి.వాటిని తీర్చుకునే మార్గాన్వేషణలో ఆలోచనావల్మీకం మేరుపర్వతంలా పెరిగిపోతుంది. హృదయస్పందనలు మూగపోతున్నాయి.మనోనేత్రం నిద్రపోతోంది.మేధ మౌనపాత్ర పోషిస్తుంది.భద్రత బదులు అభద్రతావలయంలోకి తానే చొచ్చుకునిపోతున్నాడు మనిషి.సంఘర్షణ జీవితంలో ఎక్కడో ఒకచోట తారసపడుతూనే ఉంటుంది.పుట్టుకతోనే మొదలవుతుంది సంఘర్షణ,డబ్బు,ప్రేమ,చదువు,ఉద్యోగం వీటన్నిటిలోను ఘర్షణే. వీటి నడుమ మనిషి మనసును వికసింపచేసి జీవన విలువలను నిలబెడుతుంది సాహితీరంగం.
రచయితకున్న సాహితీబాధ్యత తక్కువేమికాదు.రచనలద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి రచయితకుంది.రచనద్వారా ప్రభావితమైన మనిషి తనలోదాగివున్న శక్తులను మేల్కొలిపే ఆయుధం పుస్తకం అనితెలుసుకోగలుగుతాడు.శరీరం రోగగ్రస్థమైనపుడు మందులవాడకం తప్పనిసరి.అనారోగ్యాన్నిముందుగానే నిరోధించాలని టీకాలు వేయిస్తాం.పైగా విటమిన్లనిచ్చి శక్తిని పెంచుతాం.అలాగే మనసుకున్నస్థబ్దతను కరిగించి,విజ్ఞత కలిగించి,విచక్షణ పెంచి,స్వయం నిర్ణయశక్తిని కలుగచేసి,స్థితప్రజ్ఞతను పెంపొందించి సమస్యలను పరిష్కరించే దిశానిర్దేశాన్ని కలుగచేసేదే సాహిత్యం.మనసుకు శక్తినిచ్చిమేధను వికసింపచేసే టానిక్.టి.వి,సినిమావంటి శక్తివంతమైన మాధ్యమాలున్నాపుస్తకమే మనిషి మనసులోని బ్రతుకు పుస్తకాన్ని తెరవగలిగే మాధ్యమమని చెప్పవచ్చు.హృదయాన్నితట్టిలేపే సాహిత్యం మనకు తామరతంపరగా వుంది.పిల్లల నైతిక ప్రవర్తనను నిర్దేశించే నీతిశతకాలు సాహిత్య హితవులే.మానవతావిలువల్ని అడుగంటనీక,అడుగడుగునా సాహితీవిలువల్నిపెంచి పోషించే కథలు,సమాజాన్ని ప్రభావితం చేసే ధనసంస్కృతిని ఎండగట్టే కథలు ఎన్నోతీరులు, ఎన్నోరీతులు.విభిన్న రచయితలు విభిన్న పార్శ్వాలను స్పృశిస్తూ మనిషి మనవలసిన విధమిది అని అంతర్లీనంగా నిద్రాణమైన మానవతావిలువలను సాసితీసరస్వతి ముఖత తెలియచేసే సాహిత్యం మన సొత్తు కావడం మన అదృష్టం.సామాజిక పరిణామంనుంచి గ్లోబలైజేషన్ దాకా వర్గదోపిడీ నుండి అభివృద్ధిదాకా ఎన్నెన్నో అంశాల అక్షరదీపాల సమూహమే సాహిత్యం.సాహిత్యపు వెలుగులో జీవనవిధానాన్నిమెరుగుపరిచే మెలకువలు తెలియాలంటే సాహిత్యపఠనం తప్పనిసరి.
Saturday, January 14, 2012
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఉమా దేవి గారూ మనం సాహిత్యం ఎందుకు చదవాలో చెప్పారు. కాని ఈ రాతలన్నీ పుస్తకాలు చదవని వారు చదవరుగా..పదుగురి మధ్యలో ఒంటరిగా ఉండే సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. సవ్యమైన దారిలో నడవడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో.....
జ్యోతర్మయిగారు,మీరు చెప్పినది నిజమే.ఒక్క దీపం మరెన్నో దీపాలను వెలిగించగలగాలన్నదే నా ఆకాంక్ష!మీ స్పందనకు ధన్యవాదాలు.
Post a Comment