Sunday, December 1, 2013

వెనిస్ వర్తకుడు

ఈ రోజు(1-12-2013) ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురితమైన నా సమీక్ష.

                  చిన్నతనంలో ఆకట్టుకున్నకథలు, నాటికలు  మనఃఫలకంపైనుండి చెరిగిపోవు.అయితే ఇప్పటికీ రంగస్థలంపై ప్రదర్శించబడే  ఇటువంటి నాటికలు షేక్స్ పియర్ ప్రతిభకు అద్దం పడతాయి.లక్ష్మికాంత్ మోహన్ అకుంఠిత దీక్షతో అనువదించిన నాటికలలో అహ్లాదకరమైన రచన వెనిస్ వర్తకుడు.
         వెనిస్ నగర వర్తకుడు ఆంటనియో.అతడు చేసేది వాణిజ్యమే కాని  వ్యక్తిగా ప్రేమాన్వితుడు, దయార్ద్ర హృదయుడు. అతని స్నేహితుడైన బసానియో పోర్షియాను వివాహమాడాలనుకుంటాడు.అయితే ఆమె స్థాయికి తగినట్లుగా వుండాలంటే అప్పు చేయాలి. ఆంటనియో అతడు కోరిన పైకం ఇవ్వలేక షైలాక్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు.అధర్మానికి,కుటిలత్వానికి షైలాక్ ప్రతీక. దుష్ట ఆలోచనతో అప్పు ఇచ్చిన షైలాక్ మూడు నెలల గడువులో అప్పు తీర్చకపోతే ఆంటనియో శరీరంనుండి ఒక పౌండు మాంసాన్నినష్ట పరిహారంగా కోరుతాడు.మానవ సహజమైన అసూయ ఇలాంటి వింత కోరికకు అంకురం తొడుగుతుంది.
             నాటిక  రెండవరంగం బెల్మాంటులో పోర్షియా ఆమె పరిచారిక నెరిస్సాతో జరిగిన మాటల కలబోతలో మానవీయ కోణాలు ప్రదర్శితమవుతాయి. చక్కగా నడచుకుంటే చక్కని జీవితం అని పలికిన నెరిస్సా పలుకులకు పోర్షియా స్పందిస్తూ చెయ్యటమనేది చెప్పటమంత తేలికైతే కరువుకాటకాలు కనుమరుగయేవి. ఏది మంచో నూరు మందికి చెప్పగలిగినా నేను  ఆచరణలో పెట్టడం మాత్రం కష్టం.మన మనసులు మంచి మాట చెప్తున్నా మన ఉద్రేకాలు మాత్రం మనసులు గీచిన మంచి గీటుల్ని దూకి అవతల పడుతాయి. అంటుంది. షేక్స్ పియర్ మనస్తత్వ విశ్లేషణను అత్యంత సహజంగా అనువదించిన లక్ష్మికాంత మోహన్ అభినందనీయులు.
ఇక నాటకం చివరి అంకంలో షైలాక్ మనసును  మార్చాలని కడసారి ప్రయత్నంగా మారువేషంలోనున్న పోర్షియా, మనిషి హృదయంలో కరుణ సహజంగా ఉండాలికాని నిర్బంధంతో రాదు అంటుంది.అది వర్ష తుషారం ఆకాశం నుండి భూమి మీద పడినట్లు దానంతటదే వస్తుంది. కరుణ అనేది రాజదండంకంటే బలవత్తరమైనది.కరుణ చూపమని దేవుడిని వేడుకునే మనం ఇతరులపై కూడా కరుణ చూపమనే కదా!’ అని షైలాక్ ను ప్రశ్నిస్తుంది. కాని విభిన్న మనస్తత్వాల మానవులం,అందరం ఒకేలా  స్పందించం కదా! షైలాక్ తన మొండిపట్టు వీడడు.అయితే పోర్షియా నాటకం చరమాంకంలో తన మారువేషంతో రంజింప చేసి షైలాక్ ఆట కట్టించడం కొసమెరుపు.
     మూలకథలోని భావ ప్రకటనా పటిమకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా తనకు ఆశువుగా అలవడిన అనువాద కళను చక్కని సంభాషణా చతురత చూపి ఇది మనకు తెలిసిన నాటకమైనా ఉత్సుకతను పెంచే రీతిన మలవడంలో మోహన్ గారు కృతకృత్యులయారనే చెప్పవచ్చు. 
ప్రదర్శనకు అనుకూలమైన నాటికల పరంపరలో ఇదొక అద్భుత రసమయ కావ్యం.                                                                                           

























  

  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

2 comments:

Lakshmi Raghava said...

good !

సి.ఉమాదేవి said...

Thank you Lakshmi garu.

Post a Comment