Sunday, November 10, 2013

ఆచార్య స్మారక సంచిక


ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురితమైన సమీక్ష. http://www.prabhanews.com/cartoonspecial/article-408116                                              చిరస్మరణీయమైన స్మారక సంచిక

            ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారిని పరిచయం చెయ్యడమంటే సుగంధం పరిమళిస్తుందని చెప్పడమే! తెలుగు భాషాభిమానులు మరచిపోలేని,మరువకూడని వ్యక్తి కృష్ణమూర్తిగారు. 1957 లోనే భాషా శాస్త్రంలో పెన్సిల్వేనియా (అమెరికా)లో డాక్టరేట్ పొందారు.తెలుగు క్రియా ప్రాతిపదికలు-తులనాత్మక పరిశీలన కృష్ణమూర్తిగారి థీసిస్.
           తెలుగు భాషను ప్రపంచ స్థాయిలో పరిశోధించిన ప్రజ్ఞాశాలి. కృష్ణమూర్తిగారి కృషిని స్మరించుకుంటూ  వారిపై గల అభిమానాన్ని వ్యక్తపరుస్తూ రాసిన వ్యాసావళి అంచెలంచెలుగా ఎదిగిన తెలుగు భాష వైభవాన్ని,అందుకు దోహదపడిన కృష్ణమూర్తి గారిని మనసారా మరోమారు స్మరించుకునేలా మన ముందుకు  తెచ్చారు, సి.పి.బ్రౌన్ అకాడమి వారు.
        శాస్త్రీయ మార్గాలలో తెలుగును ఆధునీకరించడానికి కావలసిన వ్యూహాలన్నిటిని భద్రిరాజుగారు తెలుగువారికి అందించారని అంటారు, గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. తెలుగుభాషకు  క్లాసికల్ లాంగ్వేజి హోదా సిద్ధించడానికి మార్గనిర్దేశక సూత్రనిర్వచన మండలిలో సభ్యులుగా వారు చేసిన సేవలను జ్ఞాపకాల మాలికలల్లి మనముందుంచుతారు.
           రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరోవారు 2004లో భద్రిరాజు కృష్ణమూర్తిగారికి కరెస్పాండింగ్ ఫెలోషిప్ ప్రకటించిన సంధర్భంగా రాసిన తన వ్యాసంలో కె.కె రంగనాథాచార్యులుగారు ఈ ఫెలోషిప్ భద్రిరాజుగారికందిన అరుదైన గౌరవంగా కీర్తిస్తారు. తులనాత్మక ,చారిత్రక,వర్ణనాత్మక భాషా శాస్త్ర శాఖలన్నిటిలోను సమానంగా కృషి సల్పిన కృష్ణమూర్తిగారి శ్రమపై  ఈ వ్యాసం సమగ్రపాఠమే.
       ఇక జి.వి. పూర్ణచందు గారు ప్రాచీనతా హోదా విషయంలో భద్రిరాజుగారి పాత్రపై వివరణాత్మక వ్యాసాన్నందిస్తూ  మనకోసం,మన భాష కోసం తన జీవితమంతా పాటుబడ్డ కృష్ణమూర్తిగారిని పూజింపదగినవారుగా కీర్తిస్తారు.
         అబ్బూరి ఛాయాదేవిగారు తమ ఆత్మీయతానుబంధాన్ని ఉటంకిస్తూ సి.పి.బ్రౌన్ అకాడమీ వారు  తెలుగు భారతి  అనే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారానికి కృష్ణమూర్తిగారి పేరును బలపరచడంలో తను కూడా సభ్యురాలిగా పాలుపంచుకోవడం తనకు దొరికిన సదవకాశం అని భావించారు.
            ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి సైనికుడెంత అవసరమో ప్రాదేశిక భాషల స్వరూప స్వభావాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజల భాషల,ధ్వనుల పరిణామక్రమాణ్ణి గమనిస్తూ వాటి రూపాలను,రుచులను పెంచి పోషించేందుకు కూడా భాషా సైనికుడవసరం అంటారు ఎ.బి.కె.ప్రసాద్ గారు. తెలుగువారి థింక్ టాంక్ భద్రిరాజుగారు అని ప్రస్తుతిస్తారు.
      అరకులోయ ప్రాంతంలో దాదాపు నాలుగువేల మంది మాట్లాడే కొండ భాష(కూబి)గురించి వివరణాత్మక గ్రంథరచన మొదలుకొని అధికార భాషా విధానాల వరకు ఎన్నో పరిశీలనాత్మక వ్యాసాలను రచించిన కృష్ణమూర్తిగారి గురించి కృష్ణమూర్తిః  భారతస్య సుమహత్ గర్వకారణం అని మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీ రామచంద్రుడు గారు చేసిన ప్రశంసకు అన్నివిధాలా అర్హులైనవారు కృష్ణమూర్తిగారు అని పోరంకి దక్షిణామూర్తిగారు  తమ సమగ్ర వ్యాసం ద్వారా మరోమారు విశదపరిచారు.
 ఇక కస్తూరి విశ్వనాథంగారు నాలుగు దశాబ్దాలు దాటిన తన పరిచయ బాటలో పాఠకులకందచేసిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు నాటిన మైలురాళ్ల వివరాలు అలరిస్తాయి.తెలుగు భాషాశాస్త్రంలో ఒక మేరు పర్వతం కృష్ణమూర్తిగారు అంటారు పోతుకూచి సాంబశివరావుగారు.ఇంకా ఎందరో పెద్దల అనుభవాలు, అనుభూతులు తెలుగు వారందరు పునశ్చరణ చేయదగిన పాఠ్యాంశాలే!
కృష్ణమూర్తిగారికి అక్షరనివాళితో పాటు వారికి సంబంధించిన మరెన్నో వివరాలను తెలుగు భాషాభిమానులకు కానుకగా పొందు పరిచిన  ఈ స్మారక సంచిక పఠనీయం,స్మరణీయం.                                            
                                                                                                      • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

0 comments:

Post a Comment