సముద్రం-కథా రచయిత:పాపినేని శివశంకర్
సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి?ఇదీ కథ ప్రారంభం!ఛాయిస్ లో వదిలేద్దామనిపించే ప్రశ్న.కథాగమనంలో లోతు తెలిసేకొలది జవాబుకు ఎదురుచూస్తూ అదే ప్రశ్న చర్విత చర్వణమై మనల్ని నిలదీస్తుంది.పాపినేని శివశంకర్ గారి కథనం నర్తించిన తీరు నల్లేరుపై నడకేయైనా సాహితీ భాండాగారంలోని అరిసెలు,గారెలు,బొబ్బట్లనదగ్గ సాహితీరుచులను చవిచూపిన రీతి మాత్రం అభినందనీయం.
తన స్నేహితుడైన వనమాలిలోకి సాహితీ ప్రవేశం చేసిన రచయిత తాను తడిమిన మైలురాళ్ల జ్ఞాపకాలతో పాఠకులను మమేకం చేస్తూ గావించిన కలం కవాతు కొత్తదనాన్ని సంతరించుకుని పఠనాసక్తిని,రచనానురక్తిని చిప్పిలచేసి సాహితీసౌరభాన్ని గుబాళింపచేసింది. శ్రీశ్రీ,తిలక్,చలం,షేక్సిపియర్ ఒకరా,ఇద్దరా!ఎందరో సాహితీ పిపాసులను అల్లనల్లన తడిమి సువర్ణాధ్యాయాన్ని కనులముందు సాక్షాత్కరింపచేయడం కథ విశిష్ఠతను ద్విగుణీకరింపచేసింది.
వృత్తిలో ప్రవృత్తిని మిళితంచేసి సామాజిక అవగాహనను ఒక సమాచారంగా కాక సృజనాత్మకంగా వనమాలి తన విద్యార్థులకు బోధపరచే విధానాన్ని వివరిస్తూ పాఠాలలోకికాక పుటలలోకి విస్తరించడం అనే వాక్య ప్రయోగం సముచితం,సందర్భయోగ్యం.పుస్తకంలో ఐక్యం కావడమంటే ఇదే.
రాహుల్ సాంకృతాయన్ ఓల్గాసే గంగా,ప్రేమ్ చంద్ రంగభూమివంటి సాహితీ సృజనకారులను వీరి కలం స్పృశించినవేళ చరిత్ర మనోయవనికపై చలనచిత్రమవుతుంది.
వుయ్ ఆర్ ది హాలో మెన్,వుయ్ ఆర్ ది స్టఫ్డ్ మెన్...టి.ఎస్.ఎలియట్ వేదనాక్షరాలు నేడు ఎల్లెడల కనబడుతున్న మనిషి డొల్లతనాన్ని,కృత్రిమ పూర్ణత్వాన్ని మరోమారు వనమాలి ముఖత పలికిన వైనాన్ని గుర్తు చేయడం నేటి సమాజ ముఖచిత్రాన్నిఅంజనం వేసి చూపడమే!
వనమాలి సహధర్మచారిణి కమలినిని పెళ్లి చూపులలో చూసినప్పుడు పరస్పర వివరాలగురించికాక అన్నా కెరినినా గురించే మాట్లాడినపుడే ఆమెకర్థమైంది అతడి జ్ఞాన దాహం.సాహితీ సముద్రాన్ని ఔపోసన పట్టేంత కాంక్షతో ఎదగడం రచయిత తడిమిన ప్రతి రచనలోను ప్రస్ఫుటమవుతుంది.సముద్రమంతా అల్లకల్లోలమైనా,తాను మాత్రం సాహితీ సముద్రాన్ని ఈదుతూ ఉండిపోవడం సామాన్యుల ఊహకందని విచిత్రం!అయితే మనిషిని తనలో కలిపేసుకున్న పుస్తకానికే అగ్రతాంబూలం.
ఇంట్లో పుస్తకాల అరలు,గ్రంథాలయంలో బారులు తీరిన పుస్తకాల బీరువాలు వనమాలిని పలకరించే నిత్య నేస్తాలు.మూర్తిమత్వమందిన పుస్తక రాశుల నడుమ మనుష్యుల మధ్యకన్నా మిన్నగా గడిపే వనమాలి అంశగల పుస్తకప్రియులు నేడు ఎందరో వున్నారన్నది అక్షరసత్యం.
ఎందుకు చదవాలి పుస్తకాలు అనుకునేవారిని చేష్ఠలుడిగి చూస్తాం!సాహితీ జీవనమే పరమావధిగా భావించిన వనమాలికి సన్మానం జరగడం అసాధారణమేమిగాదు.కాని ఇంతటి విజ్ఞానం తమను అందలమెక్కించలేదని,ఎప్పటికి క్రింది మెట్టు పైనే వున్నామన్న కూతురు విమల ఆక్రోశం,తండ్రిపై ఉక్రోషం ఆమె దృక్పథం దృష్ట్యా న్యాయసమ్మతమే అనిపించినా ఆర్థిక సోపానాలకేకాని జ్ఞాన సోపానాలకు విలువలుండవా ఈ సమాజంలో అని గుండె గుబులు పడుతుంది.దూరంగా ఉండీ మనసులు దగ్గరకాలేకున్న వారసులకు ధనసంపద మాత్రమే వారసత్వానికి పనికివచ్చి,జ్ఞానసంపద తాకరానిదైనపుడు వనమాలి స్థితప్రజ్ఞత ముఖేష్ పాటలో రచయిత పాపినేని శివశంకర్ గారు ఉటంకించడం..యహా పూరా ఖేల్ అబీ జీవన్ కా,తూనే కహా హై ఖేలా,చల్ అకేలా,చల్ అకేలా..హాట్సాఫ్!
స్టీఫెన్ హాకింగ్స్ బ్లాక్ హోల్స్ స్మాల్ యూనివర్స్ గురించి అవసానదశలోను ఆలోచించగల ఆసక్తి..ఆశక్తి!విభిన్నమార్గాలలో సాహితీ సముద్రం తను నడయాడిన దారిని మరింత విస్తృతపరుస్తూ మన జీవనంలో కోరుకున్నవారికి కోరినట్లు లభించినా ఏమవుతాయో ఈ పుస్తకాలన్నీ!అటు వనమాలిలోను నిర్లిప్తత! అతని తలగడ ప్రక్కనే పెర్కిన్స్ పుస్తకం,బోర్లాతెరిచిపెట్టి!మనసులో దుఃఖాన్ని ఎవరో ఏతమేసి తోడిపోసినా తీరనిబాధ పుంజీలు తెంపుకుంటుంది.కథాగమనానికి పాత్రల పరిధి స్వల్పమైనా కథనానికది కొదువకాలేదు. పఠనాసక్తిగల పాఠకులతో పంచుకోవాలనుకునే ఈ కథను సమీక్షకు ఎంచుకున్నాను.ఎటు చూసినా పుస్తకాల దొంతరలు! రెపరెపలాడుతున్న పుస్తకకెరటాలు అలలు అలలుగా చుట్టు కమ్ముకొస్తుంటే నిండు సాహితీ సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యగలం? వనమాలి పాత్ర ద్వారా పుస్తక ప్రియుల అంతరంగాన్నిసాహితీసముద్రంగా అభివ్యక్తీకరించిన రచయితకు ధన్యవాదాలు.
తురుపుముక్క-కథా జగత్ లో ప్రచురితమైన ఈ కథను క్రింద ఇచ్చిన లింకులో చదవగలరు.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/samudram---papineni-sivasankar
src="http://kinige.com/images/kinigebannerImage.png" border="0" >
కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా
Tuesday, January 17, 2012
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఉమా దేవి గారూ కథను చాలా చక్కగా సమీక్షి౦చారు.
ధన్యవాదాలు జ్యోతిర్మయిగారు.
Post a Comment