ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 5/7/2012 (జన్మదిన సంచిక)లో ఆంధ్రభూమి-నాటా పోటీలో ఎంపికైన నా కథ
మరో దిద్దుబాటు
రవి అసహనంగా అటు ఇటు కదుల్తున్నాడు.అసహనానికి
కారణం తెలిసినా అధిగమించలేని అశక్తతకు తనపై తనకే కోపం.సుమకు బాధగాలేదా?చిన్న
విషయాన్ని భూతద్దంలో చూసి బ్రతుకును రావణకాష్ఠం చేసింది.ఏమనుకుంటోందో!అనుకున్నాడు విరక్తిగా.
ఒక్క క్షణం కూడా రవి గురించి
ఆలోచించాలనిపించడంలేదు సుమకు.అయినా రవి చుట్టు అల్లుకున్న ఆలోచనలే. ’ఈ రాత్రి గడిస్తే తనెవరో
అతనెవరో!కోర్టు విధించిన గడువు ఎప్పుడు ముగుస్తుందో! కోర్టు విడాకులు మంజూరు చేయడం,
ఆ తరువాత అంతా స్వేచ్ఛే!ఫ్రీబర్డ్స్ అన్నమాట.’
కోర్టు మాట ప్రకారం
జంటగా వంటరి కాపురం చేసారు.తన నిర్ణయాన్ని మార్చే ఏ వింతలు విడ్డూరాలు జరిగి
పోలేదు.అల్లావుద్దీన్ అద్భుత దీపంలా కోరిన వెంటనే విడాకులు వస్తే ఎంత సుఖం!ఆఫ్ట్రాల్!
చిన్న మాటకు పశువులా ప్రవర్తిస్తాడా?’
జరిగినది గుర్తుకు
వస్తే చాలు సుమ మనసు గంధకంలా మండుతోంది.కళ్లలో నీళ్లు, నిస్సహాయత.
‘ఇంత అనాగరికంగా నాపైకే చేయ్యెత్తాడంటే ఎంత పురుషాంహకారం? చదువుకున్నదానిని,హక్కులు
తెలుసు,వాటిని కాపాడుకోవడం తెలుసు,రక్షణకవచాలెన్నో ఉన్నాయి.పల్లెటూరి
పిల్లనుకున్నాడేమో కసిరినా కొట్టినా కాళ్లకు చుట్టుకుపోవడానికి!’
ఎ.సి చల్లనిగాలులు
పంపిస్తున్నాకోపం సెగలు రేపుతోంది.సర్దుబాటుకు ఆస్కారమే లేకుండాపోయిన దాంపత్యం.
‘ఈ ఒక్కరాత్రి గడిస్తే చాలు.ఆపై ఎవరిదారి వారిదే.
తన ఆత్మగౌరవం
కాపాడుకున్నాననే ఆనందం,తనపై చెయ్యి చేసుకోవాలనుకున్న రవికి గుణపాఠం
చెప్పగలిగానన్నతృప్తి!అందుకే సర్ది
చెప్పబోయిన తల్లిదండ్రులను కూడా వారించింది.సుమకు హాయిగా నిద్ర
పట్టేసింది.కాలేజీలో స్త్రీ స్వేచ్ఛ,హక్కులపై తన డిబేట్ల తాలుకు మధుర జ్ఞాపకాలు
కలలై అలరించసాగాయి.
వాళ్లను కలపాలని
వచ్చిన సుమ అమ్మ,నాన్న హాల్లో పడకేసారు ఒకరినొకరు నిందించుకుంటూ.’నీ పెంపకమే దీనికి కారణమంటే కాదు నీ పెంపకమేనంటూ!’ వాదనలో పాయింట్లు బలంగానే
వున్నాయి.కాని ప్రయోజనం శూన్యం.తాము వాదనలో నెగ్గడం కాదు కూతురి కాపురాన్ని
నిలబెట్టలేక ఓడిపోయి మిన్నకుండిపోయారు.మానవులు కాదు మమతలు అంతమయిపోయేరోజు ఎంతో
దూరంలోలేదని ఇద్దరు అనుకున్నా, పైకి పలకలేని పెద్దరికం, మనసులోనే మాటలను సమాధి
చేయడానికి అలవాటుపడిపోయింది.
రవికి మనసంతా
చేదుపూత పూసినట్లుంది. ‘చదువుకున్నది,తెలివైనది,సంసారాన్ని
చక్కగా నడిపించగల తోడు దొరికిందనుకున్నాడు.వెంట వచ్చిన ఆస్తిని వద్దన్నాడు.కూతురి
కోసమన్న అత్తమామల కోరికను కాదనలేకపోయాడు.గారాబంగా పెరిగిన బిడ్డే!అలా అని
పొరబాట్లను సర్దుకోమనకూడదా!అన్నీతనే సర్దుకోవాలా!ఏదో ఆవేశంలో చెయ్యి
లేపాడు.కొట్టాడా? లేదే! సరే,సారీ,సారీ అని ఎన్ని సార్లు
బ్రతిమాలాడు?ఏణ్ణర్థం కాపురంలో ముప్పాతిక శాతం పుట్టింటిలోనే.కాదనలేదే. తల్లిదండ్రులకు
తనపై వున్న ప్రేమతో వారు కొనిచ్చిన నగలు,చీరలు, వాటిని ప్రదర్శించే
అవకాశాలు.కిట్టీ పార్టీలు, పబ్బులు,హబ్బులు,సల్సా డాన్సులు.వద్దంటే ఎలాగు వినదు తనే
తెలుసుకుంటుందిలే అనుకున్నాడు.తన భార్య గురించి ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి
అని ఆఫీసు ప్యూను వెకిలిగా నవ్వుతూ చెప్పినప్పుడు అక్కడే పడి చావాలనిపించింది.ఆ
కోపంలో ఇంటికి రాగానే తన ఆలస్యాన్ని ప్రశ్నించింది సుమ.‘
“ఏమాలస్యం కారు వుండి కూడా ” అంది.
“నాకు టైమవుతోంది కదా. “అవతల మిసెస్ గీత పదే పదే
ఫోన్ చేస్తోంది అన్న బాధ సుమలో.
“నిజమే నీకు టైమవుతోంది. “విసుగ్గా అన్నాడు
“ఏమంటున్నావ్?”
‘ఏమీ లేదులే’ అన్నా విడిచి పెట్టలేదుసుమ.
“ఏదో మనసులో పెట్టుకుని అంటున్నావ్,నిజం చెప్పు ” అని నిలదీయసాగింది.
“అదే! వెళ్లే టైమవుతోంది కదా! “అని సర్దబోయాడు.
“కాదు, మరేదో ధ్వనిస్తోంది.”
“అవును విడిపోయే టైమవుతుంది నువ్విలాగే
ప్రవర్తిస్తే “అనేసాడు తను విసిగిస్తోంటే.
“ఏమన్నావ్” అంటూ విసురుగా మీదకు రాబోయిన సుమను, “ ఏయ్,ఆగు,నీవు ఒక ఆడదానివేనా,దెబ్బలు
తినగలవ్ నా చేతిలో” అంటూ చెయ్యి లేపాడు తాను.
‘తప్పే!అనకూడదు...అనేసాడు.చేతిని లేపడం పొరబాటే!’ వెంటనే సుమ ఆడ పులిలా
మారిపోయింది.
“బి కేర్ ఫుల్! నేను రియాక్టయితే నీకే టైమవుతుంది
జైలుకు.” విసురుగా వెళ్లిపోయింది సుమ
‘అంతే అవే చివరి మాటలు.కాని సుమ రియాక్షన్ ఇంతలా
విడాకుల దాకా వస్తుందనుకోలేదు.తమ కుటుంబాలలో అమ్మ,నాన్న, అక్క,బావ
పెద్దమ్మ,పెద్దనాన్న ఇలా ఎందరో మాటలు విభేదించారు కాని వారి మనసులు
విభేదించలేదు.వారి తగవులు అద్దంపై ఆవగింజలే!ఏనాడు విడాకులు అన్న మాటే
వినబడలేదు.ఇప్పుడు ఒకరి రుచులు ఒకరికి నచ్చకపోయినా,అభిరుచులు వేరైనా,మాట తీరు
నచ్చకపోయినా విడాకులు,విడాకులు అంటూ పెండ్లి
మంత్రాలను మరిపించే విడాకుల మంత్రం.’ రవి తల ఆలోచనలతో
వేడెక్కుతోంది.
‘ఇది సాధారణ తగవు .భార్యాభర్తల నడుమ చిన్న గిల్లికజ్జాలే.కాని
ఇవే చిలికి చిలికి గాలివానలే కాదు సునామీలై దాంపత్య వ్యవస్థను ఛిద్రం
గావిస్తున్నాయి.విడాకులు ఎంతో సులభం
అనుకుని కలిసి జీవించడంకన్నా విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. పెళ్లి మంత్రాలు
చదివినంతసేపు పట్టడంలేదు విడాకుల మంత్రాక్షరాలు పఠించడానికి! స్త్రీల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు
అర్థం సరిగా నిర్వచించుకోలేక విపరీతార్థాన్ని అన్వయించుకుంటున్నారు. భార్యాభర్తలనే
పదాలను క్రోధ ద్రావకంలో ముంచి సంసారాలను నిస్సారవంతం చేసుకుంటున్నారు. అమ్మ,నాన్నలు,అత్త,మామలు
కేవలం ఉత్సవ విగ్రహాలే. పిల్లలను ప్రశ్నించలేని అనిమిషులు. సర్ది చెప్పలేని
తల్లిదండ్రుల నిస్సహాయత.గట్టిగా
చెప్పాలంటే పిల్లల అంబులపొదిలోని ఆత్మహత్యాస్త్రం.’ సుమ తల్లిదండ్రుల మనసుల్లో
మూగ రోదనే.తల్లిదండ్రుల ఊరడింపులు,రవి వారింపులు సుమ పట్టుదలను ఒక్క అంగుళమైనా
కదిలించలేకపోయాయి.
ఇల్లు చేరుకున్న
సుమ ఆనందంగా వూపిరి తీసుకుంది.ఇల్లంతా కలియతిరిగి పనివాళ్లనందరిని ప్రేమగా
పలకరించింది.తనకు తలంటు పోసే భాగ్యను పిలిచింది.
“రా తలంటుదువుగాని “ అని భాగ్యను పెరట్లోకి
లాక్కుపోయింది సుమ
మాటల మధ్యలో తనకు
నెల తప్పిందని సిగ్గుపడుతూ చెప్పింది భాగ్య.
“సరే నీ కొడుకుతో ఆడుకుంటాలే.”గలగలా నవ్వింది సుమ.
ఏదో చెప్పబోయి
ఆగిపోయింది భాగ్య.
“తలంతా భారంగా వుంది ఒక చేత్తోనే కాదు, రెండు
చేతులతో బాగా రుద్దు.”
“రెండో చెయ్యి లేవదమ్మా,ఒక నెల కదప కూడదన్నారు.”
“ఏమిటీ?” కళ్లు మూసుకుని కూర్చున్న సుమ ఉలికిపడి కళ్లు
తెరిచి అప్పుడు చూసింది భాగ్య చేతిని.
“ఏమైందే నీకు?” అంటూ ఆతృతగా అడిగింది
“పడ్డానమ్మా.” అంది భాగ్య.
“బుద్ధుందా?ఎలా పడ్డావ్?”
“మా స్నానాలగదిలోనేనమ్మా,జారిపడ్డాను అంతే.”
“మరేం చేసావ్?అమ్మ డాక్టరు దగ్గరకు పంపలేదా?”
“పంపారమ్మా, వెళ్లి ఆపరేషను కూడా
చేయించుకొచ్చా.మణికట్టు దగ్గర సన్నగా విరిగిందటమ్మా.డాక్టరు బాబు ఇంకా ఓ వారం జాగ్రత్తగా
ఉండమన్నారు.మరేం ఫర్వాలేదు జాగ్రత్తగా వుంటానని చెప్పి వచ్చాను.”
“సరేలే ఘనకార్యం చేసేవుగాని ,కాసిన్ని పూలు
కోసిపెట్టు స్నానం చేసొస్తా. “
కనకాంబరాలు మాలగా
కట్తోంది సుమ.పూలందిస్తోంది భాగ్య.
“భాగ్యా,ఎక్కడున్నావు?”కాస్త గట్టిగానే అరుస్తూ
వచ్చాడు భాగ్య భర్త వెంకటయ్య.
“వచ్చావా,ఏందియాళ అమ్మాయిగారు వచ్చారని సంతంతా
చుట్టబెట్టుకు తెచ్చావా ఏంది?”భాగ్య నవ్వింది.
భార్య నవ్వును
కళ్లంతా విప్పార్చి చూస్తూ,
“కాదే, సంతలో పకోడీల దుకాణం తెరవడం కుసింతాలీసం
అయింది కాని తీపు సయించదంటావని పకోడీలు తెచ్చినా,ఇదిగో పుల్ల మామాడి
కాయలు.మరీ పిందెలల్లే వున్నాయి వచ్చే వారానికి కొంచం పెద్దవే అవుతాయిలే.”
“అమ్మాయిగారు,మా ఆయనకు అన్నం పెట్టి వస్తాను,చారులో
పకోడీలు నంజుకోవాలంటే చానా ఇష్టం.”అంటూ లేచింది. తన అంగీకారం కోసం ఎదురు చూడకుండానే వెంకటయ్య
వెంట పరుగెత్తింది.
“ఆ..ఆ...చిన్నగా నడు.” తలపై మెల్లగా మొట్టాడు
వెంకటయ్య.
“ఏమయ్యోయ్ నిన్ను మొట్టేవాడొస్తున్నాడు.”అని నవ్వుతూ భర్త చెయ్యి
పట్టి ఊపింది భాగ్య.
“ఏయ్!ఏమిటా వేషాలు అమ్మాయిగారు చూస్తున్నారనైనా లేకుండా,సినిమాలు
ఎక్కువయాయి నీకు.”నవ్వుకుంటూ తమ చిన్నగూటిలోకి వెళ్లిపోయారు.
“ఎంత బాగా చూసుకుంటాడు భార్యను!”నిట్టూర్చింది సుమ.
“ఏంచేస్తున్నావు సుమా,భోంచేద్దువుగాని, రా,నాన్న
కాచుక్కూర్చున్నారు.”పిలుస్తూ వచ్చింది సుమ తల్లి.
“పాపం భాగ్య ఎలా పడిందో చూసావా అమ్మా?”సుమ బాధగా అడిగింది
తల్లిని.
“పడిందా? అలా అని ఎవరు చెప్పారు?
“అదేమిటీ!పడలేదా?” సందేహంగా ఆగింది సుమ.
“అయ్యో,వాడు తోస్తే పడిందే అది.”
“ఎవడు? “సుమలో ఆశ్చర్యం
రెట్టింపయింది.
“ఇంకెవడు! దాని మొగుడు.”
“ఎవరు వెంకటయ్యా?భార్యనంత ప్రేమగా చూసుకుంటున్నాడే!ఎందుకు తోస్తాడు?”
“వాడేదో తన పెద్దనాన్న కూతురి పెళ్లికి ఓ
రెండొందలు చదివిస్తానన్నాడు.అదే దీని కొంప ముంచింది.అందరికీ డబ్బు సాయం చేయాలనే
తత్వం వెంకటయ్యది.కాసు కరిగితే మళ్లీ దొరకదు అని దీని భయం.డబ్బులడిగాడని పెంకులెగిరిపోయేలా
అరుపులు,వాడిని వాడి వాళ్లను కలిపి కేకలేసింది.”
“పెళ్లాం,మొగుడి సంగతులు నలుగురిలో ఎత్తి
చూపుతావా?” అని ఇంట్లోకి బలంగా తోసి గడియ వేసేసాడు.ఎంతైనా మగాడు
బలవంతుడు కదా!దాని అరుపులకి హడలిపోయాం.మీ నాన్న,నేను గట్టిగా కోపగించుకున్నాక
బయటకు వచ్చారు.వాడు రంకెలు,చెయ్యి విరిగేట్టు తోసేసాడు బాబోయ్ అని ఇది
ఏడుపు.పుట్టింటికి పోతానని ఒకటే గొడవ.అలాగే వెళ్దువు గానీలే అని కారు డ్రైవరు వెంట
డాక్టరు దగ్గరకు పంపించా.కాస్తలో తప్పింది మణికట్టు దగ్గర చెయ్యి విరిగితే ఎంత
ప్రమాదం!”
“మరి పుట్టింటికెళ్లలేదా?”సుమ ఆతృతగా అడిగింది .
‘మగాడు బలవంతుడైనందుకేనా ఇలా పశుబలం చూపుతాడు !’ఆమె మనసులో రవి రూపం
అస్పష్టంగా.
“అదెందుకెళ్తుంది,దాని మొగుడిని వదిలి?నేను కాచిన
చారు లేకపోతే అన్నం సరిగా తినడు,వేణ్ణీళ్లు కాచివ్వకపోతే కష్టజీవి ఒళ్లునొప్పులు
తగ్గవు.అన్నం వేడిగా వండితే గాని తినడు అని ఒక్క చేత్తోనే వాడికి వండి పెడ్తోంది.
“మరి వాడలా తోస్తే ఇదెలా ఊరుకుంది పోలీసు
కంప్లైంటు ఇవ్వచ్చుగా.” ఆ పని తనైనా చెయ్యాలనుకుంటూ కోపంగా అడిగింది సుమ.
“చదువుకున్నవాళ్ల తెలివితేటలు వీళ్లకుండవులే.సరే
ఆలస్యమవుతోంది రా.” సుమ తల్లి మరోమారు కూతురిని భోజనానికి పిలిచి వెళ్లింది.
‘అమ్మ పొగుడుతోందా?విమర్శిస్తోందా?’ నిరుత్తరురాలై తల్లి వెళ్లినవైపే చూస్తూ, ఆకులు,రాలిన పూల
రేకులు పోగు చేద్దామని చీపురందుకుంది.
“అయ్యో అమ్మాయిగారు మీరూడ్చడమేమిటి,నేనున్నానుగదా.” అని బలవంతంగా సుమ నుండి
చీపురు లాక్కుంది భాగ్య. ఒక కన్నుకు దెబ్బ తగిలితే మరోకన్ను ఏడుస్తుంది,అలాగే ఒక
చేత్తో ఊడుస్తున్నా మరో చెయ్యి సహకరిస్తున్నట్టుగా ఊగుతోంది.అబ్బా! అని దెబ్బ
తగిలిన చేతిని నొక్కుకుంటూనే ఓపికగా పని చేస్తోంది భాగ్య.
“భాగ్యా”
‘ఏంటమ్మా,’ అన్నట్టు చూసింది
“నీకు మీ ఆయన మీద కోపంలేదా?”
“అదేంటమ్మాయిగారు ఎందుకుండాలి కోపం?”
“ఎందుకా నిన్ను లోపలికి తోసి నీ చెయ్యి
విరిచినందుకు.”
“అయ్యో మా ఆయన తప్పేం లేదమ్మా.నన్ను కళ్లల్లో
పెట్టుకుని చూసుకుంటాడు.జీతమంతా నాకే ఇస్తాడు.ఏదో పుట్టినరోజులు,పెళ్లి చదివింపులు
అంటానే ఉంటాడు.అందుకే నాకు తిక్కరేగి ఒల్లనన్నాను.వాడు బతిమలాడేసరికి నేను గొంతు
పెంచి గదిమాను.వాడు నా నోరు తగ్గించమన్నాడు.నాకు పూనకం వచ్చింది కదా
తగ్గలేదు.ఆయనకసలే సిగ్గు నలుగురిలో పలుచనైతామని నన్ను చెయ్యట్టుకుని లోనికి
తోసాడు,నేను తగ్గి ఉండాల్సింది.తగ్గలేదు నేను చెయ్యి బలంగా లాక్కున్నాను.ఆ
పెనుగులాటలో బొమిక కాస్త చిట్లింది.అంతేనండి జరిగింది.మళ్లీ ఆయన్నడగకండమ్మా బాధ
పడి అన్నం తినకుండానే తొంగుంటాడు రాత్రికి.నిజానికి అంట్లు కడగడం,బట్టలుతకడమే కాదు
సగం వంటపని కూడా చేసేస్తున్నాడండి పాపం.” భాగ్య ముఖంలో వెంకటయ్యను గూర్చి దిగులు!
‘బాత్రూంలో పడ్డానని తనతో చెప్పిన అబద్ధాన్ని
మరచిపోయింది , ఇప్పుడేమో వాడి తప్పేమిలేదన్నట్లు వెంకటయ్యను వెనకేసుకొస్తోంది.’
“మరి పుట్టింటి
కెళ్తానన్నావటకదా,వెళ్లుండాల్సింది. ఇలాంటి మొరటువాడితో కాపురంకన్నా విడాకులు నయం.”
తన కష్టం,భాగ్య బాధ
సుమను మరింత ఉద్రేకపరుస్తున్నాయి.
“అదేంటమ్మాయిగారు అలా అంటారు!నేను
పుట్టింటికెళ్లడమేమిటి?నా ఇంటిని, నా ఇంటోడిని గాలికి వదిలేసి నేనెక్కడికెళతాను?ఏదో
బాధలో సవాలక్ష అనుకుంటాం.అవన్నీ చేసేస్తామా? “
సుమ భాగ్యవైపు
వింతగా చూడసాగింది.
“బడిలో చిన్నప్పుడు మన చెయ్యట్టుకుని పంతులుగారు
ఓనమాలు సరిగా దిద్దిస్తారు,మరి పెళ్లాం, మొగుడు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని
తప్పులు సరిదిద్దుకోవాల. అంతగా చదువులేనిదాన్ని నేను చెప్పింది తప్పు అనుకుంటే
మన్నించండమ్మా. “
ఆ రాత్రి సుమ
మనసులో రూపుదిద్దుకుంటున్న దిద్దుబాటు.
************
12 comments:
నేను మీ కథ చదివాను . ఈ కాలం పిల్లల లోని తొందరబాటు ను గురించి బాగారాసారు . కథ బాగుంది .
అభినందనలు .
kadha baavundi vastavaaniki daggara ga vundi. congrats andi uma garu
మాలగారు,కథ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.
మంజుగారు,కథనం నచ్చినందుకు ధన్యవాదాలు.
ఉమాదేవిగారూ,
కథ చాలా బాగుందండీ. ముందుగా మీరు పెట్టిన శీర్షిక నచ్చింది. కథకు చక్కగా సరిపోయింది.
రెండోది ఈ రోజుల్లో అడిగినవన్నీ అమర్చే తల్లితండ్రుల దగ్గర పెరిగిన ఆడపిల్లలు పెళ్ళయాక సర్దుకుపోవడం తెలీకపోవడం వలన కలిగిన పరిణామాలు బాగా చూపించారు.
పెద్దల నోట మాట రానీయనిది పిల్లల ఆత్మహత్యాస్త్రం అన్నది సరిగ్గా నిర్వచించారు.
ఆఖరిగా “బడిలో చిన్నప్పుడు మన చెయ్యట్టుకుని పంతులుగారు ఓనమాలు సరిగా దిద్దిస్తారు,మరి పెళ్లాం, మొగుడు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని తప్పులు సరిదిద్దుకోవాల. "అన్న భాగ్యమాటల్లో జీవితసత్యాన్ని నింపారు.
భార్యాభర్తలు ఒకరికొకరుగా వుండాలన్న మీ కథాంశం ఏ రోజుల్లో నయినా అందరికీ ఆదర్శప్రాయం.
హృదయపూర్వక అభినందనలతో,
జి.ఎస్.లక్ష్మి.
chakkaga undandi.
ఈ చట్టాలు ఎవరిని రక్షించాలని పెట్టారో వారు ఉపయోగించుకున్తున్నారో లేదో కాని ఉంది కదా అని వాడుతున్న వాళ్ళు ఎక్కువైపొతున్నారు. ఆలోచింపచేసే కథ. అభినందనలు ఉమాదేవి గారు..
లక్ష్మిగారు,మీరు చదవడమేకాదు విశ్లేషించడము సంతోషము కలిగించింది.ధన్యవాదములు.
భాస్కర్ గారు,మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి.
మీరన్నది అక్షరసత్యం జ్యోతిర్మయిగారు.
భార్యా భర్తలిద్దరు ఒకరిని ఒకరు పరస్పరం గౌరవించుకోవాల్సిన మాట నిజమే!
కాని male dna వేరు, female dna వేరు! చెయ్యి ఎత్తడం తప్పు, పరుషం గా మాట్లాడడం తప్పు అని అనిపించినా అలా అహంబావం తో నిర్నయాలు తీసుకోకూడదు. మన సొంత పిల్లల మీద ప్రేమ ఉటుంది కదా మనకి, వాళ్ళని కోపం వస్తే మందలించమా/చెయ్యి చేసుకోమా? అంత మాత్రానా వాళ్ళ మీద ప్రేమ లేకే చేసామనే అర్ధం కాదు కదా? చాలా అలోచింప చేసే కథ! బాగుంది ఉమాదేవి గారు!!
సర్దుబాటులేని జీవితం చుక్కానిలేని నావవలె అతలాకుతలమవుతుంది.జీవితంలో ఆవేదనే మిగులుతుంది.మీ సర్దుబాట!బాగుంది వెన్నెలగారు.
Post a Comment