Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Thursday, November 28, 2013

మానవతకు చిరునామా

4 comments
ఎక్స్ రే అవార్డు అందించిన ఈ కవిత,' జీవనోత్సవం ' , పేరున వెలువడ్డ ప్రచురణలో

ఎక్స్ రే అవార్డు కవితల సంకలనంలో ప్రచురించబడింది.





Thursday, June 20, 2013

పిల్లల్ని చూడాలనుంది!

4 comments


తల్లికి మనసులో పులకింత,
అబ్బాయి కనబడ్డాడు,
ఫేస్ బుక్ లో తలుపు తీసాక!

తండ్రికి మనసులో తుళ్లింత
నాన్నా అని అమ్మాయి పిలుపు
స్కైప్ లో కిటికీ తెరిచాక

మూతపడ్డాయి తలుపులు, కిటికీలు
  అమ్మ,నాన్నలకు మళ్లీ ఎదురుచూపులే

ఐప్యాడ్,ల్యాప్ టాప్ వచ్చాయి
అయినా పిల్లలు కనబడలేదు
ఆ రెండింటిని తెరవలేక
అమ్మానాన్నలిక నిత్య చకోరాలే!



Monday, April 1, 2013

కవిత

8 comments


ఈ రోజు ఆంధ్రభూమిలో ప్రచురితమైన నా కవిత 


http://www.andhrabhoomi.net/content/a-413


                        
అబల కాదు అంకుశమై నిలవాలి

క్షిపణిలా అంతరిక్షంలోకి దూసుకెళ్లే అతివలున్నా
గర్భస్థ పిండంగానే పిండప్రదానం పొందే ఆడకూనలెన్నో
అయ్యో పాపం వారి ఆర్తనాదాలకు ఊరడింపు గీతం
ఆకాశంలో సగం కాదు
పుడమిపై పాతిక శాతమయ్యే విపత్తు
ఆడపుట్టుక పుటల నిండా చిదిమేసిన చేవ్రాలెన్నో
కుక్కలనోట, కాటి పాలిట గిరాటైన ఆడపిల్లలు
జననానికి మరణానికి నడుమ అడుగడుగునా గండాలే
ఆటబొమ్మను చేసి ఆడించే వేదికలు
రూపంపై రూకల మూటల వాణిజ్యాలు
చూపులే సూదులై గుండెపై దాడులు
కంటి తుడుపుల మాటల మంత్రాలు
లేపనాలు వద్దు, చీడలపై ద్రావకాలు రంగరించు
నివారణ కాదు నిష్కృతి, నిర్మూలనే ధ్యేయం కావాలి
మనిషి మనిషిలో ఆలోచనల నెగళ్ల నెగదోయాలి
మెదడులో కాదు ఆలోచన, హృదయంలో మొలకెత్తాలి
అన్యాయాన్ని ఎదిరించే ఆదిశక్తి కావాలి
ఆడపిల్ల పుట్టిందని ఉలిక్కిపడటం కాదు
అంకుశం పుట్టిందని గర్వపడాలి.

Thursday, July 12, 2012

రైతు హృదయక్షేత్రం

12 comments
దేశానికి వెన్నెముక
వెన్ను విరిగి వెక్కుతున్న రైతన్న
వరుణిడి కరుణరాలకున్నా
బోరుబావి బోరుమన్నా
సాగునీరులేక పంటసాగిలపడినా
రైతన్న కళ్లలో నిత్యవర్షమే
విత్తనాల మ్యాజిక్కులు
ఎరువుల జిమ్మిక్కులు
రైతులెరుగని లాజిక్కులు
ధర్మం కుంటుతోంది
ఋతుధర్మానిదీ అదేబాట
పురుగుకు వెరచి పరుగుపెట్టే పెస్టిసైడు
రైతును కరిగించే సైనైడు
మొలకెత్తని కల్తీ విత్తనాలు
మిగిల్చేది పుడమితల్లికి పురిటి నొప్పులు
దాహమందక తలలు వాల్చేసిన నాట్లు
వేస్తాయి రైతుగుండెపైన నాగలి గాట్లు.

Monday, May 28, 2012

సముద్రఘోష

2 comments


మనిషీ నన్ను మరిచావా?
నీకెందుకంత ఆవేదన?
ననుచేరే నీరంతా వృథాయని
అధికశాతం నువ్వే తీసుకో
నదీజలాలలో నావాటా నాకు దొరకనీ
నేను సంతృప్త ద్రావణమైతే
జలపుష్పాలిక వికసించవు
మేఘాలన్నిటిని నింపాను నా ఊపిరినావిరిచేసి
మేఘానంద భాష్పాలు నేలకు నాకు ఉమ్మడికానుక
నను చేరిన జలమంతా దండుగని
నీ ఆవేదన సబబేయైనా
సాంద్రతపెరిగి నామేనంతా ఉప్పుమేటయితే
పరచుకున్న హిమాలయాన్నవుతా
నీవునిలుచున్న పీట పదిలం కావాలంటే
ప్రకృతి చిత్రాన్ని పరిపూర్ణంగా చిత్రించు.









Saturday, May 26, 2012

చదివితే చాలు

13 comments

పుస్తకావిష్కరణ
పుస్తకానికి పుట్టిన రోజు
పొగడ్తల పొగడమాలలు
చప్పట్ల జలతారులు
మరీమరీ చదువుతారని
ఉప్పొంగింది పుస్తకం మనసు
నక్కిదాక్కుంది పచ్చనోటు
చిన్నబోయింది పుస్తకం
అట్టనలగని ప్రతులు వేనవేలు
బీరువాల్లో పేరుకున్న అక్షరలక్షలు
డబ్బుకట్టలనుకుని దోపిడీ చేసి
గ్రంథాలయాల చెంత వదిలితే మేలు
అప్పుడైనా చదువరులు
చదివితే చాలు,అదే పదివేలు.

Sunday, May 20, 2012

అనుబంధాలు

3 comments
20-5-12,ఆదివారం ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన కవిత.

ఆవిరవుతున్న అనుబంధాలు
కరుగుతున్న అనురాగపు సాకారాలు
మనిషి మనగడకవి శేషప్రశ్నలు
పేగుబంధానికర్థం నిఘంటువులో
చిరిగినపుట
ఆర్థికబంధంతో రక్తసంబంధం
మసకబారినమాట
మమతలను మసి చేసిన ద్రావకం
స్వార్థపుతలపులతో మనసు మలినం
బాంధవ్యాలే బరువని,బంధనాలు తెంచుకుని
ఇదే స్వేచ్ఛా ఊపిరి అనుకుని నినదిస్తే
అనుబంధాలు ఆమ్లధారలో ఆవిరవుతాయి
మనసులోని కాలుష్యం ఉప్పెనలా వుధృతమై
ఆనకట్టలేని కాలకూట విషప్రవాహమై
ఊపిరాడనివ్వదు అగమ్య స్వేచ్ఛాకెరటం
ఉప్పెన మిగిల్చిన కన్నీటి చారికలు
మృగ్యమైన అనుబంధపు ఆనవాళ్లు
బంధాలకు రహదారి మమతల వంతెన
పరిమళించాలి అనుబంధ సుగంధాలు
మానవతాప్రాకారాలకవి చెరగని పునాదులు

Monday, April 9, 2012

మనిషి నిర్వచనం

4 comments




9-4-12 సోమవారం ఆంధ్రప్రభ సాహితీగవాక్షంలో నా కవిత.

తనచుట్టుతాను గిరిగీసుకున్నవృత్తం
నలుసై అందని మనిషి నిర్వచనం
కాసుల ప్రాముఖ్యత నల్లని ముసుగై
కుటుంబ ప్రాధాన్యతను కమ్ముకుంది కాలమేఘమై
జీవనపరుగులో ర్యాంకు,బ్యాంకు మంత్రాక్షరాలు
చెట్టంత మనిషి ఆర్థికయంత్రాలకు చెరకుపిప్పి
నొప్పికి లేపనం పచ్చనోటు పసరు
రెక్కలు మొలిచిన మేధో వలసపిట్టలు
అంకుల్ శ్యామ్ ఊయల ఒడిలో
కొట్టే కేరింతలకు డాలర్ల చప్పట్లు
చిరునవ్వులు చిదిమేసిన సాయంత్రాలు
జటాయువైన వృద్ధాప్యం
అలసిన బాల్యాన్ని పొదువుకునే అమ్మ పేరు టి.వి
అంతర్జాలపు పయనంలో గమ్యమెరుగని మజిలీలు
మనిషిని వెతకాలి,వెతకి పట్టుకోవాలి
చిరునామాను నిర్వచించాలి
మనిషి పేరు మానవత్వం
ఆప్యాయతే నివాసం
మంచిమాటే చిరునామా.

Sunday, January 8, 2012

అక్షరలక్ష్యం

8 comments

అక్షరమంటే అఆలు,కఖలేనని అనుకున్నా!
అక్షరాభ్యాసంతో అక్షరజ్ఞానం వస్తుందనుకున్నా
సాహిత్యాక్షరాలు మనసుపై దాడిచేసాకే
తెలిసింది అక్షరలక్ష్యమేమిటో!

ఆవేశానికి ఆజ్యంపోసి
ప్రశ్నిండం నేర్పే వేదాక్షరాలు
పరవశింపచేసే కవి కోయిలల కుహూరవాలు.

కలతచెందిన మనసుకు
అక్షరమేకదా వైద్యం!

అక్షరాలు వెన్నముద్దలా
లేపనమేకాదు
కొరడాలై ఝళిపిస్తాయి
శతఘ్నులై గర్జిస్తాయి
చలిచీమలై చురుక్కుమనిపిస్తాయి.

ఆలోచనా నెగళ్లలో
నిప్పురవ్వలు అక్షరాలు
ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి
పరిశోధనలకు ప్రాణమిస్తాయి

పడకకే పరిమితమైనా
గుండె చెమ్మగిలితే చాలు
అక్షరాలు ఆవిర్భవిస్తాయి

అల్లుకున్న అక్షరాల గారడీలో
ప్రతి అక్షరం ఒక సైనికుడేనని
బారులు తీరిన అక్షరసేన
కలంసాయంతో కవాతు చేస్తుందని

మనసున మొలచే అక్షరబీజాలు
కాగితంపై అక్షరనాట్లయి
అక్షరక్షేత్రం పండేదాకా
అక్షరం నన్ను నిద్రపోనివ్వదు

అక్షరం నా ఊపిరి
నన్నుఊపిరాడనివ్వదు.