Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts
Wednesday, January 28, 2015
Wednesday, September 17, 2014
ప్రక్షాళన
24-9-2014 నవ్య సంచికలో నేను రచించిన కథ ప్రక్షాళన ప్రచురితమైంది.
బ్లాగ్మిత్రులు చదువుతారని చిన్న ఆశ.
http://www.navyaweekly.com/2014/sep/24/page22.asp
బ్లాగ్మిత్రులు చదువుతారని చిన్న ఆశ.
http://www.navyaweekly.com/2014/sep/24/page22.asp
Thursday, November 21, 2013
నాన్నా నీకేం కావాలి?
27-11-2013 నవ్య సంచికలో ప్రచురితమైన కథ.
‘ఓ, గాడ్! అప్పుడే ఐదయిపోయింది.వాట్ నాన్సెన్స్!ఈ
సెల్ అలారం సెట్ చేసానే! పని చేయడం లేదా?దీన్ని డస్ట్ బిన్ లో పడేసి మరొక్కటి
కొనుక్కోవాలి.లేకపోతే ఆలస్యానికి పెనాల్టీ తప్పదు.అదేదో ఇప్పటికే పడింది. నాకంటే
ముందే చేరిపోయిఉంటాడు రాజేష్ వాకింగ్ కు!నడవాలన్న ఆకాంక్షకన్నా తనకన్నా ముందే రాజేష్
బిగ్ షాట్స్ అడుగులో అడుగు వేస్తూ,జోకులు
పేలుస్తూ,వారిలో నవ్వులు పూయిస్తూ ,వారి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతూ సమాంతరంగా పరిచయాల ఖాతాను కొండలా పెంచుకుంటాడు.మిత్రలాభం బహుబాగా
తెలిసినవాడు.పనులు సాధించుకోవాలంటే ఈ
దినచర్య తప్పదు.బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలంటే ఈ మాత్రం బాలెన్సింగ్
చేసుకోవాల్సిందే!’
భర్త అవసరాలు
గమనిస్తూ,ఇల్లాలి పాత్ర తు.చ తప్పకుండా పోషించే అవంతి బెడ్ కాఫీ అందించినా
వద్దువద్దంటూ కారు తాళాలందుకుని పరుగులుతీసాడు సుధీర్.
నిశ్చలంగా చూస్తుండిపోయింది
అవంతి. ‘ఎందుకీ పరుగు? నడక మంచిదే కాని నడత కూడా బాగుండాలి కదా! వాకింగ్ గ్రూపులు కట్టి, సమావేశాలు పెట్టి ఎవరి శైలిలోవారు ఇతరులను వ్యాపార లావాదేవీలలో వ్యూహత్మకంగా దెబ్బ
తీస్తూ, అవసరమనిపిస్తే అడుగులకు
మడుగులొత్తుతూ,అవసరంలేదనిపిస్తే
అణచివేస్తూ! ఇన్ని రాజకీయాలు చేస్తేకాని తెలవారదా?ఏమో!’
‘ఆలోచనల వరకే,ఆపైనమాట పెగలదు.సరే తను
చెప్పాలనుకున్నది చెప్పాలని నోటినుండి మాట పెగలడం ఆలస్యం,....’నీవేమైనా మీ ఇంటినుండి మూటలు తెచ్చావా?మాటలు పెంచుతున్నావు!కనీసం స్కూటరు కొనివ్వలేదు మీ నాన్న!నాతెలివితో
పదిమందితో పరిచయాలు పెంచుకుని ,పనులు సాధించుకుని ఈ స్థాయికి వచ్చి ఎందరో ఆడవాళ్లు
కలలుగనే రిచ్ లైఫ్ ను నీకందించాను. ఇంటినిండా విదేశీ వస్తువులు నింపాను.విదేశీ ఆర్కిటెక్ట్
తో డిజైన్ చేయించి అందరు ఆశ్చర్యపడేలా
ఇంటిని తీర్చిదిద్దాను.ఇక ఏం కావాలి నీకు? ఇంకా ఇంకా ఎదగాలనుకునే నన్ను కట్టడి
చేసి అందరిలో వెనకబడమంటావా?’
ఇలా క్లాసుల మీద క్లాసులు
పీకించుకున్నాక అవంతి ప్రేక్షకపాత్రకే అంకితమైపోయింది.
కూతురు నీలిమ పిలిచిన
పిలుపుకు ఆలోచనలకు చుక్కపెట్టి గడియారం
వంక చూసింది. ఏడవుతోంది. నీలిమను పరిశీలనగా చూసింది.
తనను దేనికీ పిలవకుండానే చకచకా బడికి తయారయిన నీలిమను కళ్లతోనే ప్రశంసించింది.ఆ
ఏడాదే ఐదవతరగతి లోకి వచ్చింది నీలిమ.పాఠశాలకు వెళ్లివచ్చిన తొలిరోజున
‘అమ్మా! నా పనులన్నిటిని నేనే చేసుకుంటాను.నువ్వు
అడ్డు చెప్పకు.ఈ రోజు మా క్లాస్ టీచరు అన్ని పనులు మీరే స్వంతంగా చేసుకోవాలన్నారు.’అని చెప్తే ‘ఫోరా బడాయి’ అంది కాని టీచరు మాటను శిలాక్షరంలా
పాటిస్తూ
పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్న కూతురిని చూడగానే అవంతి మనసు దూదిపింజలా
మారిపోయింది.చక్కగా తయారై స్కూల్లో పిల్లలకు చాక్లెట్లు పంచడానికి బయలుదేరిన కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది, ’ చిట్టి తల్లీ హ్యాపీ బర్త్ డే రా! ‘ అంటూ.
“అమ్మా, నాన్న....”అమ్మ సమాధానం తెలిసినదానిలా మాటను మధ్యలోనే తుంచేసి వంటమనిషి అందించిన టిఫను
బాక్సు, వాటర్ బాటిల్ అందుకుంది నీలిమ అయితే తన మాటలకు తల్లి బాధ పడుతుందనుకుని తనను
తాను ఊరడించుకునే ప్రయత్నంలో కందిన ముఖాన్ని దాచుకోలేక పోయింది.ఈ ఏడాదైనా తండ్రి గుర్తుపెట్టుకుని కూతురికి విషెస్
చెప్తాడనుకుంది.కాని కూతురి నిరాశ అతడిని బాధించదు. అయితే కూతురి పేరు మీద బుక్
చేయాలను కుంటున్న కారు,సైటు,ఇల్లు,లేటెస్ట్ మాడల్ సెల్ ఫోన్,ఐ పాడ్ ‘....ఏది కావాలో కనుక్కోవాలి, ఏదడిగినా
కొనివ్వాలి,ఎంతఖర్చయినా సరే!’సుధీర్ మనసులో దృఢంగా నిర్ణయమైపోయిందెప్పుడో!
“అమ్మా!పాప పుట్టిన రోజుకదా,ప్రత్యేకించి ఏం
వండమంటారు?”
వంటమనిషి ప్రశ్నకు, “‘సార్ వచ్చాక చెప్తాలే’’ అంది అవంతి.
‘అతడి ప్లాన్ ఏమిటో,ఎవరిని పిలుస్తాడో,ఎవరిని
పిలవడో,ఇంటికే పిలుస్తాడో,లేదా పాప పుట్టినరోజు సాకుగా తాను వలవేసిన మనుషులకు గ్రాండ్ గా డ్రింక్
పార్టీయే అరేంజ్ చేస్తాడో !’ సందర్భమేదైనా పరిచయాలు
తద్వారా ఏర్పడే రాజమార్గాలు, డొంక తిరుగుళ్లు,అవి పెంచే బ్యాంకు నిలవలు.వెన్నంటి
వచ్చే పేరు ప్రతిష్ఠలు, పట్టించుకోకుండా దులపరించుకునే అప్రతిష్ఠలు. అకేషన్ ఏదైనా
అప్లికేషన్ మాత్రం ఇదే!తమ పెళ్లిరోజుకు అయిన ఖర్చుకు ఎవరిదైనా పెళ్లి చేసేయవచ్చు.
వచ్చిన బహుమతులకన్నా ఇచ్చినవే ఎక్కువ.పొగడ్తలకు ఉప్పొంగిపోతూ, చూసావా నా ప్రతిభ
అని కళ్లతోనే యస్.ఎం.యస్ లు పంపుతుంటే అతడి రిచ్ ఫీలింగ్ కు సంతోషపడాలో లేక
ఎందుకింత ధనదర్పాల దాహం అని బాధ పడాలో అర్థంకాదు అవంతికి.
‘ విస్తరిలో అన్నీ ఉన్నాయి.అయినా అసంతృప్తి
ఎందుకు? ఇంకా సంపాదించాలనే ఆశ చావదెందుకు?తను మధ్య తరగతినుండి వచ్చిన
అమ్మాయి.సర్దుకుపోవడం తెలుసుకున్నంతగా కోరికలు తీర్చుకోవాలన్న ఉబలాటం నేర్పని
తల్లిదండ్రుల పెంపకం తనది.తన సాదాసీదా ఆలోచనలను ఎప్పటికప్పుడు ఎరేజ్ చేస్తాననే
భర్త మాటలకు మూలాలు మరచిన మనిషి అనుకుని మనసులో నవ్వుకున్నా, పైకిమాత్రం సరే...సరేనంటూ తలూపుతుంది.’ సర్దుకుపోవడంలో ఇదీ ఒక పాఠమేనని అవంతికి తెలుసు.
కూతురు బడికెళ్లగానే తను
భర్తతో కలిసి కనీసం కాఫీ అయినా తాగాలనుకుంటుంది.అనేకసార్లు ఆ భాగ్యము దొరకదు.అదీ
ఎండమావే! విజిటింగ్ కార్డు పట్టుకుని
తిప్పితిప్పి చూస్తున్న భర్త ముఖంలో
ఆనందాన్ని ప్రస్ఫుటంగా గమనిస్తోంది అవంతి.
వేడివేడి ఇడ్లీలు,సాంబారు
వడ్డించింది వంటమనిషి.
“ పదండి టిఫను చేద్దాం.” పాప బర్త్ డే ఎలా ప్లాన్ చేస్తారో
తెలుసుకోవాలన్న ఆతృతలో ఉంది అవంతి.
“నో...నో నువ్వు కానిచ్చేయ్.ఈ రోజు అక్కడే సొరకాయ
జ్యూస్,సలాడ్స్ కానిచ్చేసాం.లంచ్ కు కూడా రాను.”
“డిన్నరు?“ అవంతి ప్రశ్నకు “ ఏమో ఇప్పడే ఎలా చెప్పను?అది సరే,పాప టైంకే స్కూలుకు వెళ్లింది కదూ.”
అవునన్నట్టుగా తల ఊపింది
మౌనంగా.
“ గుడ్,దానికీ నాలానే టైమ్ సెన్స్ ఎక్కువ.చూస్తుండు
అదీ ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్ అవుతుంది.
చూడు..ఏదైనా కావాలంటే
డ్రైవరుతో వెళ్లి తెచ్చుకో.నా కోసం చూడకు.వింటున్నావా ?ఏమిటా పరధ్యానం?”
“ అన్నీ విన్నాను,ఒక్క నిమిషం నేను చెప్పేది
వినండి.”
“రాత్రికి వస్తాగా అప్పుడు మాడ్లాడుకుందాం.టైం లేదు.అర్జంటుగా
ఒకరిని కలవాలి.అతడితో వెళ్తేగాని మన పనులు సానుకూలపడవు. “డబ్బు రేస్ లో ముందుకు అడుగేసాడు.
“ఒక్క క్షణం....ఆగండి.”అవంతి గొంతులో అణచుకున్న కన్నీటి ఆనవాళ్లు.
విసుగ్గా ఆగాడు సుధీర్
తలైనా తిప్పకుండానే.
“ఈ రోజు మనపాప పుట్టిన రోజు...మీరు బర్త్ డే విషెస్
చెప్పాలని త్వరగా వస్తారనుకున్నాను.”
“ అరె!మరిచేపోయానే,చూసావా నాదెంతవర్క్
మైండో!ఇలాటివన్ని నువ్వే మానేజ్ చెయ్యాలని మొన్న నువ్వోసారి గుర్తు చేసినప్పుడే
చెప్పాను.నీకన్నా నా సెక్రటరీయే నయం నా ప్రోగ్రాంలన్నీ డైరీలో వరుసగా ఉంటాయి.”
“అయితే మీ సెక్రటరీకే చెప్పండి మన పెళ్లిరోజులు,పుట్టినరోజులు
గుర్తుపెట్టుకుని మీకు చెప్పమని.” కోపాన్ని గొంతులోనే నొక్కుకోవడం కాపురానికి
రాగానే నేర్చుకున్న ఇంద్రజాలవిద్య.అన్నీగుర్తుండవు కాని కనీసం చెప్పాకైనా
ప్రోగ్రాం ప్లాన్ చెప్పొచ్చు కదా.తన తండ్రి సాధారణ కుటుంబీకుడు.తాము కోరిన
చిన్నచిన్న కోరికలు తీర్చినా తీర్చలేకపోయినా కలిసి గుడికి
వెళ్లేవారు,పార్కుకెళ్లేవారు. నాన్నతో కలిసి ఆడిన ఆటలు నిత్యజ్ఞాపకాలు.’
‘ అలా బొమ్మలా నిలుచుంటే ఏం లాభం?బేబికి ఏం కావాలో
చూడు ఛాయిస్ తనదే.’
బర్త్ డే గిఫ్ట్ కు ధర
ఎంతైనా సరే వెనక్కి తగ్గడు.
“మీరు
నిన్న రాత్రే పాపనడిగుంటే బాగుండేది,స్కూలునుంచి రాగానే ప్రజంట్
చేసేవారుకదా?”
“సరే ఇప్పుడు
మించిపోయిందేముంది?ఏమైనా టెండర్ పోగొట్టుకున్నామా,డేట్ క్యాన్సిల్ అయిందా?ఇంత చిన్న
విషయానికి నా టైమ్ ఐదు నిమిషాలు వేస్ట్ చేసావు.”
కిటికీ దగ్గరకు వెళ్లి
సిగరెట్ వెలిగించాడు, రిలీఫ్ కావాలన్నట్టుగా. ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కనబడ్డ గుడిసెలు
సుధీర్ అసహనాన్ని మరింత పెంచాయి. చిరాగ్గా తల
విదిలించాడు.వాష్ బేసిన్ దగ్గరకు గబగబ వెళ్లి భళ్లున వాంతి చేసుకున్నాడు.’
గుడిసెలు,వారి జీవితాలు తనకు పడవు’ అనుకున్నాడు సుధీర్.
' రాత్రి హ్యాంగోవర్ ఇంకా దిగినట్లు లేదు ’ అనుకుంది అవంతి. ఆ గుడిసెలు తొలగించి తన బంగళా
ప్రక్కనే కూతురికి, అల్లుడికి మరో సౌధాన్ని నిర్మించాలన్న తపన.ఆ గుడిసెలు
ఖాళీ చేయించాలి, స్థలాన్ని కొనెయ్యాలి. రెండు జరిగి తీరుతాయి.తనకున్న పరిచయపరపతి
అలాంటిది.’ ఇదే ధ్యాస ఎక్కువై రాత్రి పగలు,అంతస్తు,హోదాను పెంచుకోవాలనే తపనే తప్ప మరొకటి
తలవడు.
“ మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.రాత్రికి ఇంటికే
వచ్చెయ్యండి.ఇక్కడే ఏదో చిన్న పార్టీ ఏర్పాటు చేద్దాం.త్వరగా వచ్చెయ్యండి ప్లీజ్!” కూతురి కళ్లలో వెలుగు చూడాలన్న ఆశ అభ్యర్థనను
బలంగా వినిపిస్తోంది.
ఏమనుకున్నాడో ఏమో సరేననడం
అవంతి మనసంతా ఆనందార్ణవమైంది.
సంతోషమందించిన కొత్తశక్తి
అవంతిలో ఉత్సాహాన్ని పెంచింది. సాయంత్రానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా
జరిగిపోసాగాయి.భర్త త్వరగా ఇంటికి వస్తాడన్న ఆనందం సాధారణ ఇల్లాలికి నిత్య
సంతోషమే. కాని బిజినెస్ టైకూన్ సుధీర్ నెలలో ఏ ఒక్కరోజో వేళకు వస్తాడు.పాప
పుట్టినరోజుకు త్వరగా రావడమంటే పాపకు ఇంతకు మించిన సంతోషముండదన్న భావనే అవంతిని
ఉత్సాహపరుస్తోంది. ఇల్లంతా పండుగ వాతావరణం పరచుకుంటోంది.రంగురంగుల బెలూన్లు,పూల
తోరణాలు భవన అందాన్ని ఇనుమడింపచేస్తున్నాయి.
కూతురు నీలిమ ఇంటికి రాగానే
బుగ్గలు రెండు పుణికి ముద్దుపెట్టుకుంది. తల్లి సంతోషానికి కారణమేదైనా నవ్వుతున్న అమ్మ ముఖం నీలిమ మనసును
పరవశింపచేసింది.
“ మీ నాన్న త్వరగా వచ్చేస్తాడమ్మా.త్వరగా తయారవు. నాన్నఫ్రెండ్స్
కూడా రావచ్చు.వారిని చూడగానే లేచి నిలబడి నమస్కరించాలి. నీకు విషెస్ చెప్తారు.అందరికీ థ్యాంక్స్
చెప్పాలి.” తన తండ్రి నేర్పిన పాఠాలను కూతురికీ నేర్పుతోంది
అవంతి.
‘నాన్న త్వరగా ఇంటికి వస్తున్నాడా ?’ చకచకా తయారయి తండ్రి కోసం ఎదురుచూడసాగింది.
కారు శబ్దం విని కిటికీ దగ్గరకు పరుగెత్తింది.కారులెన్నో పరుగులు తీస్తున్నాయి.
తండ్రి జాడ మాత్రంలేదు.రంగు రంగుల విద్యుత్తు కాంతుల తోరణాలు వెలగనారంభించాయి.అటు గుడిసెలలో
గుడ్డి వెలుగు కనిపించాల్సిన దృశ్యాలను మసగ్గా చూపిస్తోంది.కాని
నీలిమకు ఆ దృశ్యాల వెలుగులు మనసును చురుక్కుమనిపిస్తున్నాయి.కూలి డబ్బులు ఆ పూటకు
సరిపడా మెతుకులనే ఇచ్చాయి.దాన్నే పరమాన్నంగా సత్తుగిన్నెలో కలిపి చంకలోకెత్తుకున్న
కొడుక్కో ముద్ద, నాన్నఒడిలో కూర్చుని గారాలు
పోతున్న కూతురికో ముద్ద తినిపిస్తున్న దృశ్యం....ఇటు
టేబిల్ పై అందంగా నీలిమ అన్నపేరును నీలవర్ణంతో రాయించి తండ్రి రాగానే కట్
చేయడానికి సిద్ధంగా ఉన్న భవన ఆకారంలోని పేద్ద కేకు.నీలిమ కళ్లు మళ్లీ కిటికీనే
ఆశ్రయించాయి.చెప్పలేని భావాలు, వ్యక్తీకరణకు చాలీచాలని వయసు, ప్రావీణ్యత సంతరించుకోని భాష అయినా చిన్నబుచ్చుకున్న మనసులోని బాధను పలుకగలుగుతున్న నీలిమ ముఖంలోని
భావాలు అవంతిలో అసహనాన్ని పెంచుతున్నాయి. ఆపుకోలేని
నిద్ర పసి మనసును మరిపిస్తోందేమో అనిపిస్తోంది.
“ నాన్నవస్తే లేపు అమ్మా....” అంటూ కట్ చేయాల్సిన కేకు వంక ఓసారి చూసి నిద్రలోకి
జారుకుంది.కాని కేకు కట్ చేయాలని తండ్రి కోసం ఆతృతగా ఎదురు చూసిన బిడ్డ చూపులు అవంతి గుండెను నిలువునా కోసాయి.
హారన్ చప్పుడు విని తల్లి
లేపకుండానే ఉలిక్కిపడి లేచింది నీలిమ.
“ సారీరా నీలూ,లేటయింది అందరూ పార్టీ పార్టీ
అన్నారు.”
“ నా బర్త్ డేకా నాన్నా!” ఆసక్తిగా అడిగింది నీలిమ.
“ కాదురా,మన ప్రక్కనున్న గుడిసెలు రేపు ఖాళీ
చేయిస్తారు.నీకో పేద్ద ఇల్లు కట్టిస్తాను కదా అందుకని పార్టీ.” అవంతి వైపు చూసాడు విజయగర్వంతో.
“ నాకొద్దు నాన్నా!” చప్పున అంది నీలిమ.
“మరేం కావాలి?స్కూల్ కు వెళ్లడానికి కొత్త కారా?”
“నాకేం వద్దు.” కళ్లు చికిలిస్తూ చూసింది తండ్రిని.
“సరే బొమ్మలు కొనుక్కో,ఢ్రస్ లు కొనుక్కో,ఎంత
డబ్బు కావాలో అడుగు.లక్షా...రెండు లక్షలా?”
నీలిమలో భావాలను విడమర్చి
చెప్పలేని అశక్తతను గమనించసాగింది అవంతి.తను కలుగచేసుకుంటే తండ్రి కూతురి మధ్య
అడ్డం రావద్దంటూ ఆక్షేపణలు.
స్పందించని కూతురిని చూసి
విసుగ్గా, “ఏం కావాలో అడగవు,అదివద్దు ఇది వద్దు
అంటావు...ఎలా?”
“అసలు నీకేం కావాలి నాన్నా?”
మనసులో ఏర్చికూర్చలేని
భావాలెన్ని ఉన్నా నీలిమ వేసిన చిన్న ప్రశ్న ఎన్నో కుటుంబాలలో జరుగుతున్న జీవన
దృశ్యాన్ని కళ్ల ముందు నిలిపింది.
“నాకా!”తెల్లబోయాడు సుధీర్
కూతురి ప్రశ్న తండ్రి మనసును కవ్వమై చిలుకుతోంది.
‘ప్రక్కనే గుడిసెలో తండ్రి ఒడిలో కూర్చుని అన్నం తిన్నాక ,తండ్రి
ప్రక్కనే పడుకున్న పాపలా తను నాన్నతో కబుర్లు చెప్పాలి,కిలకిలా నవ్వులు నవ్వగలగాలి.తండ్రి
అందించే డబ్బుల గలగలలు కాదు తనకు కావలసినది.’మనసు మాటలు
పేర్చినా వ్యక్తీకరించలేని నీలిమ తనకు
తెలిసిన ప్రశ్ననే పదేపదే ప్రశ్నించసాగింది.
“నీకేం కావాలి నాన్నా?ఇంకా ఇంకా డబ్బులు కావాలా?
చాలా చాలా కావాలా?“ మళ్లీ మళ్లీ అదే అడగసాగింది నీలిమ.
అవంతి ముఖంలో సంబరంతో కూడిన
ఆశ్చర్యం.తన మనసులోని ప్రశ్న కూతురి ముఃఖత వచ్చినందుకు.
‘ ఎంతో సంపాదించుకున్నాము. అన్నీ కూర్చుకున్నాము .
అయితేనేం బిడ్డలకు కాస్త సమయమైనా
వెచ్చించలేని తండ్రితనమెందుకు?వారానికొక్కసారైనా భార్యాపిల్లలతో గడపలేని సంపాదన
తృప్తినిస్తుందా? నేటి చిన్నారులకు తండ్రితో ఆటలు,పాటలు కాదుకదా మాటలే లేవు!’ అవంతి గుండెలోనుండి వెలువడలేని భావావేశం నీలిమ మనసులో ప్రశ్నావళిగా ముద్రితమవుతోంది.
*****************
Saturday, November 16, 2013
జీవిత చక్రం
గోతెలుగు.కాం లో నా కథ జీవిత చక్రం క్రింది లింక్ లో చదవమని మనవి.
గోతెలుగు.కాం సౌజన్యంతో.
http://www.gotelugu.com/issue32/891/telugu-stories/jeevitha-chakram-telugu-story/
గోతెలుగు.కాం సౌజన్యంతో.
http://www.gotelugu.com/issue32/891/telugu-stories/jeevitha-chakram-telugu-story/
Monday, October 28, 2013
పునరపి బాల్యం
7-11-2013,ఆంధ్రభూమి వారపత్రికలో నా కథ.
“అమ్మాయ్, ఈ వేళ ఏం వండుతున్నావ్?” కూరగాయల బండి దగ్గర నిలబడి వంకాయలు
పుచ్చులు లేకుండా చూసి చూసి కొనుక్కుంటున్న కోడలు మాధవిని కుతూహలంగా అడిగాడు చలపతి.
“ఏదో అడుగుతున్నారన్నారమ్మా పెద్దాయన!” కూరల బండివాడు మాధవిని
హెచ్చరించాడు.
“ఆయనకు పనేముంది?ఇదే పని...ఇవేప్రశ్నలు,ఏం
వండుతున్నావు?ఎప్పుడు పెడ్తావు అని! సరే నువ్వు తూకం వెయ్యి మళ్లీ నాకు వంకాయలు
వద్దు అలర్జీ, దుంపలొద్దు వాతం అంటూ నా ప్రాణం తీస్తాడు.”
పుదీనా ,కొత్తిమీర
ఆకుకూరలలోంచి తొంగి చూస్తున్నాయి. పుదీనా పచ్చడి తలుచుకున్న చలపతికి నాలుక జివ్వుమంది. భార్య ఉన్నప్పుడు
తిండికి మొహం వాచింది లేదు. తనెప్పుడు ఇది వండిపెట్టు అని అడిగింది లేదు. తనకేది ఇష్టమో తనే
ముందుగా చేసిపెట్టేది. తినలేనని తన
మారామేకాని నువ్వు కోరినవి నేను చేయలేనని ఏనాడు విసుక్కోలేదు. ఆమె మరణంతో తాను
కోల్పోయింది ఇల్లాలిని కాదు తల్లిని అని అర్థమయేసరికి చలపతిని వచ్చి వరించాయి
శారీరక రుగ్మతలు. చేతుల వణుకు,పాదాల తడబాటు ఊతకర్రను హత్తుకున్నాయి. వేళకు పిలిచే వాళ్లు లేరు,పిలిచినా వండి పళ్లెంలో
పెట్టేవాళ్లు లేరు.
‘ఇంకా ఎందుకు నాన్నానీ భీష్మ ప్రతిజ్ఞలు?’ పైకి నవ్వినా మనసులో
బాధపడుతూ అడిగాడు కొడుకు రాఘవ చేతులు కాల్చుకుంటున్న తండ్రిని చూచి.
“నేను,మీ అమ్మ ఒకరికి ఒకరై బతికాము.ఈ పల్లెను, ఇల్లును వదిలి
రాలేను.అయినా నీ ఉద్దేశం ఏమిటి?” ‘ తనిక వంటరిగా బ్రతకలేననుకుంటున్నాడేమో!’చలపతికి పట్టుదల
తారాజువ్వలా ఎగిసింది.అయితే ఒకరోజు ఆయన పట్టుదల కాస్త జారిపడ్డ సబ్బుపైనుండి
జర్రున జారిపోయింది. సన్నగా విరిగిన చెయ్యి, కట్టు కట్టించుకున్నా
సహకరించకపోవడం ఒకవైపు, వంటపనికి అంతరాయంగా పరిణమించడం మరొకవైపు! పంటి బిగువున
పట్టుదలను అదిమిపెట్టి కొడుకు వెంట
నడిచాడు చలపతి.
‘ఏదో వయసుడిగిన మనిషి, కాస్త నాలుగు గింజలు ఎక్కువ
ఉడుకుతాయి.’ తనకూ కాస్త తోడుగా ఉంటాడనుకుంది కోడలు మాధవి.
“ నీకు ముందుగా చెప్పకుండా
నాన్నను పిలుచుకుని వచ్చేసాను. చెయ్యికి కట్టు సరిగా కట్టించాలి. ఆయనలా ఇబ్బంది
పడుతుంటే ఊర్లో మన గురించి నలుగురు
ఏమనుకుంటారు?”
“నాకు ఇంతగా
చెప్పాలా ?మనమెప్పుడో రమ్మన్నాము కదా! మనతోపాటు మామయ్య గారు కూడా ఉంటానంటే నాకేం శ్రమ?” సంతోషంగా అంగీకరించింది
మాధవి. అర్థం చేసుకునే భార్య అంటూ పొంగిపోయాడు రాఘవ.
తనకు పనేం ఉంటుంది,ఎంత
తింటాడు? ఏం తింటాడు? అని అనుకున్న మాధవికి తన మామగారు చిన్న పిల్లలకన్న ఎక్కువగా
తిండి కోసం మారాము చేస్తున్నట్టుగా అనిపించసాగింది. ఆహారంలో రుచుల గురించే కాదు ఆయనలో అడిగింది చేసిపెట్టాలన్న
మొండితనం, ఆకలికి ఆగలేకపోవడం, కేకలు కూడా మోతాదుకు మించి ఉన్నాయనుకుంది. ఈ ధోరణికి అడ్డుకట్ట ఎలా వేయాలో తెలియక భర్తకు
చెప్పాలనుకుంది. అపార్థాలొస్తాయని ,ఇష్టం లేక వంకలు వెతుకుతున్నానని అనుకుంటాడనే
భయం మరొక వైపు! ఇన్ని ఆలోచనల నడుమ వంటపని అంటే అయిష్టత ఏర్పడి క్రమంగా మామగారి
పట్ల విముఖత ఊడలమర్రిగా మారింది.
“అమ్మాయ్ నా ఫ్రెండ్ వచ్చాడు, కాస్త జ్యూస్ ఇస్తావా?”
“త్వరగా లెక్క చూడు. కేకలు పెద్దవవుతాయి.”
“ఏదోలేమ్మా పెద్దతనం, చూసీ చూడనట్లు ఉండాల!” అంటూ డబ్బు
సరిచూసుకుని ఇవ్వాల్సిన చిల్లర, కూరగాయలు
మాధవికి అందించాడు.
“ అందరూ మాకు చెప్పే వాళ్లే పిల్ల చేష్టలతో నువ్వు వేగు
తెలుస్తుంది .”
“అమ్మాయ్ మాధవీ జ్యూస్ అడిగానమ్మా!” చలపతి గొంతులో అసహనం!
“ వస్తున్నాను మామయ్యగారు ” అంటూ గబగబా కూరలు వంటింట్లో ఉంచి, రెండు
గ్లాసులలో ఆరెంజ్ జ్యూస్ నింపి ఇచ్చింది.
ఫ్రెండ్ తో కబుర్లు, నవ్వులు, జోకులు జడివానలా
కురుస్తూనే ఉన్నాయి.
“అమ్మాయ్ కాసిని పల్లీగింజలు పెట్తావా,కబుర్లాడుకుంటూ
తింటాం.”
‘ఈ మామయ్య ఎప్పుడేం అడుగుతాడో,ఇంట్లో ఉందో లేదో అనే ధ్యాస
ఉండదు. లేదంటే నేను వెళ్లి
తెచ్చుకుంటానంటాడు. అదీ కష్టమే తండ్రిని ఒక్కడిని ఎక్కడికి పంపడు.’
“ ఏమ్మా లేవా?ఏమిటో గుప్పెడు వేరుశెనక్కాయలకు
మొహంవాచిపోతున్నాం. పొలాల్లో కాయలు తవ్వినప్పుడు కాల్చుకుని అక్కడికక్కడే ఎన్ని తినే వాళ్లం! ఎలా హరాయించుకునే వాళ్లం! పిడికెడు గింజలకు
పావురాళ్లలా వెతుక్కోవలసివస్తోంది. చలపతిలో కోరినవి దొరకలేదన్న నిస్పృహ!
ఇటు చలపతి కొడుకు దగ్గరకు
వచ్చి ఏడాది దాటుతోంది, అటు మాధవిలో చిరాకు, విసుగు ఏడుపు రూపాన్ని
సంతరించుకుంటున్నాయి ! ఈ రోజైనా భర్తతో చెప్పి తాననుకున్న పరిష్కారానికి
ఒప్పించాలనుకుంది. కన్నీళ్ల స్థానంలో కళ్లు కోపాన్నికురిపిస్తున్నాయి. పచ్చడికి
దాచి ఉంచిన గింజల డబ్బా టీపాయ్ మీద బలంగా తాకింది. కాసిని గింజలడిగిన పాపానికి
విదిలించిపారేసినట్లు ఈ చోద్యమేమిటా అని తెల్లబోయారు స్నేహితులిద్దరు. చిన్నబోయిన
ముఖంతో ఉన్న చలపతి నాలుక, గింజల కమ్మదనాన్ని మరిక ఆస్వాదించలేకపోయింది.
వ్యవసాయం రాబడి నేటి
వ్యయానికి సాయం వరకే. పూర్తి బరువును దింపలేదు. చెయ్యి చాచి కొడుకును ఖర్చులకోసం
అడగలేడు. స్కూటరు పెట్రోలుకే రాబడంతా తగలబడిపోతున్నట్లు బాధపడే కొడుకును నా
స్నేహితులను ఆటోలో వెళ్లి కలుసుకుంటాను అని అడిగే ధైర్యం లేకపోయింది. పోనీ
స్కూటరులో వదిలి రమ్మని అడిగి, వారమంతా పనితోఅలసిన కొడుకుకు దొరికిన ఆదివారాన్ని
కబ్జా చేసినట్టుంటుంది అనే చింత ఒకవైపు! నగరంలో విసిరేసినట్లున్న ఇండ్లను
చేరుకోవాలంటే ఇంత దూరమా అనే దిగులు
మరొకవైపు ఉన్నా స్నేహితుడిని కలుసుకోవాలన్న ఉత్సాహం చలపతిని తన ఆలోచన వైపు
నడిపింది. అనుకున్నదే తడవుగా ఎవరికీ నష్టం,కష్టం కలగదనుకుని తాననుకున్న ప్రణాళికకు
రచించేసాడు. అయితే ఫలితం మరొకటయింది.
మోచేతికంటిన మట్టిని
దులుపుకుంటూ భయం భయంగా చూసాడు కొడుకువైపు.
“ నాతో చెప్పకూడదా నాన్నా....తీసుకెళ్లేవాడినే... బస్సు
ఎక్కలేవు కదా, ఎందుకు ఎక్కావు?”
“ బస్సు ఎక్కలేరు మాస్టారు, అని చెప్తూనే
ఉన్నానండి,వినిపించుకుంటే కదా...” అంటూ చలపతి కొడుకుతోపాటు తాను చెయ్యందించాడు ఫోను ద్వారా
చలపతి పడిపోయాడన్న విషయాన్ని చేరవేసిన వ్యక్తి.
“ కాస్త బ్యాలన్స్ తప్పిందిలేరా, ఇలా జరుగుతుందనుకుంటానా?” చిన్నప్పుడు తనను మందలించిన
తండ్రి వైపు చూస్తున్నట్టుగా బిక్కుబిక్కుమంటూ చూసాడు కొడుకు వైపు.
“ సరేపద...అవతల మాధవి కంగారు
పడుతుంటుంది. ఇంతకీ ఇంటికెళ్దామా?మీ
స్నేహితుడిని కలుస్తారా?” అడిగాడు రాఘవ.
“ ఈ వేషంతోనా వద్దులేరా తనదగ్గరకు వస్తూ పడిపోయానని వాడు మనసు
కష్టపెట్టుకుంటాడు.” అంటూ తను బస్సులోనుండి పడగానే తన గాయాన్ని కడిగి, తాగడానికి
నీళ్లందించిన వ్యక్తికి నమస్కరించాడు చలపతి.
“ అయ్యో1పెద్దవారు, నా తండ్రిలాంటివారు,నాకు నమస్కారం పెడతారేం సార్!” అని చలపతి చేతులను
ఆప్యాయంగా పట్టుకుని వారించాడావ్యక్తి.
మాధవి గాభరాగా
ఎదురొచ్చింది.
“ అలా వెళ్లొస్తానంటే,ఏదో నాలుగడుగులు
నడిచొస్తారనుకున్నాను.మీరిలా చేస్తే ఎలా?” నలుగురు ఏమనుకుంటారు అనే భయం ఆమెది.
“ ఏంలేదమ్మా తోచకపోతేను మా మురళీధరాన్ని కలిసొద్దామనుకున్నాను.”
“ నేను లోపల పనిలో ఉన్నాను
మీరు ఎంతసేపైనా రాలేదు.సరే రండి భోంచేద్దురుకాని. ”తనదేం తప్పు లేదన్న
భావాన్ని పలికిస్తోంది మాధవి.
“నాన్నా నేను తీసికెళ్తాను మీ స్నేహితుల దగ్గరకు. మీరేం ఫీట్లు
చేయకండి.కాసేపు పడుకోండి.” నవ్వుతూ అన్నాడు రాఘవ.
‘నిద్రపోవడం తప్ప మరో పనిలేదు. పల్లెలో పొలానికి కలుపు తీయించడం, నీళ్లు పారించడం, విత్తనాలు
వేయించడం పచ్చదనానికి శ్రీకారం చుట్టడం. అందరిని
కలుపుకుని పోతూ పల్లెలో పొలం పనులు చేయిస్తుంటే చల్లని పైరగాలికి తనే కాదు
పుడమితల్లీ పులకరించేది. ప్రాణానికి మరింత
ప్రాణవాయువందేది. ఇక్కడ ఈ అపార్ట్ మెంట్
లో ఫ్యాను గాలే పైరగాలి! ’
వంట గదినుండి చారుకు
పెట్టిన పోపు వాసన గుప్పుమంది.ఉయ్యాలలో పిల్లాడు ఉలిక్కిపడి లేచినట్లు లేచి
కూర్చున్నాడు చలపతి. జుట్టు
సవరించుకున్నాడు.చేతులు గట్టిగా రుద్దుకున్నాడు వేడి పుట్టేలా. మరిక పడుకోలేకపోయాడు.
“అమ్మాయ్ కరివేపాకు,కొత్తిమీర బాగా వెయ్యి. మీ అత్తయ్య ఇవి
లేనిదే చారు చెయ్యననేది. పూలకు పరిమళం,చారుకు తాళింపు గుబాళిస్తేనేకదా తృప్తి! ఇంతకీ చారులో
నంజుకోవడానికి వడియాలున్నాయా?అల్లం పచ్చడి ఉందేమోకదా! ”
‘ మొన్న పుదీనా పచ్చడి, నిన్న టమాట పచ్చడి, ఈ రోజు కొత్తిమీరతో!
తీరా చేసాక ఏం పచ్చడో ఏమిటో, రోటి పచ్చడిలా లేదనే విలాపం మొదలు.’
మాధవికి ఇందాకటి
గాభరా,దిగులు లేవు. వాటి స్థానాన్ని చిరాకు,కోపం ఆక్రమించుకుంటున్నాయి.
‘ నీకు బి.పి,పెరిగి పోతుంది మీ మామగారి విసిగింపులకు
తెరదించుతానంది ’ మాధవి స్నేహితురాలు.
“ఎలా అంది?” మాధవి.
“మాకు తెలిసిన వాళ్లు వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. అక్కడ అన్ని
సౌకర్యాలు ఉన్నాయి. డాక్టరున్నాడు, పనివాళ్లున్నారు, టి.వి,ఫ్రిజ్ అన్నీ ఉన్నాయి. మీ మామగారు అక్కడ ఉన్నా
ఇక్కడకు వస్తుండవచ్చు, మీరు వెళ్లి చూసి రావచ్చు. పేపర్లుంటాయి,పుస్తకాలుంటాయి. ఆయనకు సరదాగా
ఉంటుంది.”
‘ తన స్నేహితురాలు ఇంత పాజిటివ్ గా చెప్పాక, ఇన్ని ప్లస్
పాయింట్లు దొరికాక తన భర్తకు ఈ దిశగా సూచన చెయ్యడం తప్పేమి కాదనిపించింది. కాని
మాధవినుండి ఇటువంటి సూచన వస్తుందని ఎదురు చూడని రాఘవ తెల్లబోయాడు. అందరిలా కాదు,విలువలు తెలిసిన వ్యక్తి అనుకుంటే
ఆమెనుండి ఇలాంటి సలహా వస్తుందనుకోలేదు.
ససేమిరా వీల్లేదన్నాడు.
“నీకు కష్టమైతే చెప్పు నా తంటాలేవో నేనే పడి ఆయనకు కావలసినవి
చూసుకుంటాను.” అని కోపగించుకున్నాడు.
స్నేహితురాలి సలహా రక్షణ
కవచంలా ఉంది మాధవికి.
“మామగారు మీకేం తోచడంలేదుకదా...మాకు తెలిసినవారి
తల్లిదండ్రులంతా ఒక ఇంట్లో ఉన్నారు.” వృద్ధాశ్రమం అని అనలేకపోయింది.
“ఎందుకట?” ఆశ్చర్యంగా అడిగాడు చలపతి.
“ అదే సరదాగా ఉంటుందని.” మాధవి నాలుక తడారిపోతోంది. మామగారి స్పందన ఎలా
ఉంటుందోనన్న భయం కూడా తోడయింది.
“ ఇదెక్కడి సరదా అమ్మా! వాళ్ల పిల్లలేమనుకుంటారు?” మరిక మాట పెగల్లేదు
మాధవికి.
వాళ్ల పిల్లలే వాళ్లనక్కడ
ఉంచారని చెప్పలేకపోయింది.
కాని ఆలోచించేకొద్దీ
చలపతికి అస్పష్ట చిత్రం స్పష్టంగా కనబడసాగింది.తనకు మాధవి మంత్రోపదేశం
చేసినట్టనిపించింది.
‘తనవల్ల మాధవికి ఇబ్బందిగా ఉందేమో! పాపం నిజమే! పిచ్చిపిల్ల! అన్నీ తనే చేసుకోవాలి. తనను కూడా వెళ్లి చూసి
రమ్మంటోందా? అక్కడికే వెళ్లి ఉండమంటోందా?’ చలపతిలో అంతర్మథనం.
మాధవి ముభావం,మాటలు కరవైన
కాపురం రాఘవను తండ్రిని వృద్ధాశ్రమం వైపు నడిపించాయి. మాధవి చెప్పిన ఇంటి
గుమ్మాన్ని సరదాగా ఓసారి ఎక్కి చూడాలనుకున్నాడు కాని ఇలా వృద్ధాశ్రమ తలుపులు
బార్లా తెరచుకుని తనకు ఆహ్వానం పలుకుతాయనుకోలేదు చలపతి. అక్కడ ఉన్నవారు కొత్తగా వచ్చిన వ్యక్తిని హాస్టల్
లో చేరడానికి వచ్చిన కుర్రాడిని చూస్తున్నట్టుగా చలపతివైపు జాలిగా చూస్తున్నారు. తన
బట్టల సంచీ,చేతికర్ర మాత్రమే తనవెంట వచ్చాయి. భార్యలేదు భుజంపై చెయ్యివేసి
నడవడానికి డెబ్భయవయేట భార్య కొనిచ్చిన జన్మదిన బహుమతి చేతికర్ర!
నిర్లిప్తంగా నవ్వుకున్నాడు
చలపతి.
‘నేను ఈనాటి న్యూస్ పేపర్నికాను, నిన్నటి న్యూస్ పేపర్ని... వేస్ట్
పేపర్ని’ అనుకున్నాడు. అందరు తనవంక చూస్తూ చిరునవ్వుతో తలపంకించడం ఓ
కంట గమనిస్తూనే ఉన్నాడు. ఇదేం కొత్తకాదు, నువ్వేం కొత్తగా ఫీలవకు వెర్రి నాగన్నా
అనే అర్థం కూడా స్ఫురించింది చలపతికి.
అల్లరి ఎక్కువైన కుర్రాడిని
హాస్టల్ లో వదిలితే బావురుమంటాడు. మానసిక స్థితి అదేకాని పెరిగిన వయసు
చెమర్చుతున్న గుండెను చిక్కబట్టుకుంది.
నాన్నకు కాస్త కాలక్షేపం
అవుతుందనుకుని తనకుతాను సమాధానపరచుకున్నాడు రాఘవ. మాధవి ఇక చిన్నబుచ్చుకోదన్న ఊరట
మనసులో!
మాధవికి ఇంట్లో మళ్లీ కొత్త
కాపురం మొదలుపెట్టినట్లుంది.తండ్రి మంచంపై పడుకుని పద్యాలు వల్లెవేస్తున్నట్లే
ఉంది.ఆ ప్రతిధ్వనులు నిశ్శబ్దాన్ని ఛేదించినట్లనిపించినా శూన్యం
భయపెడుతున్నట్లుంది. పెళ్లయి నాలుగేండ్లు గడిచినా పిల్లలు కలగని మాధవికి చిన్న
కుర్రాడిలా మారాం చేసే మామయ్య లేని లోటు నెల కూడా గడవకముందే తెలిసి వస్తోంది. ఇల్లంతా బోసిపోయినట్లనిపించి అందులోంచి పుట్టిన శూన్యం మాధవి మనసంతా ఆక్రమించుకుని సన్నని వేదన
మొదలయింది.
“మామయ్యగారిని చూసివస్తామండి ఎలా ఉన్నారో ” అని పోరసాగింది భర్తను.
“ నెలేగా అయింది,ఆయన ఉన్నప్పుడు గోల!లేకపోయినా గోలేనా? ” నవ్వాడు రాఘవ.
“ సరేనండి నాది గోలేలెండి పదండి. అక్కడ ఆయనేం గోల చేస్తున్నాడో
వంటవాడిని, మేనేజరును!
మీకోసం మీ అబ్బాయి,కోడలు
వచ్చారు అని చెప్పగానే సంబరపడిపోలేదు చలపతి. నవ్వుకున్నాడంతే.ఏదో లోకానికి భయపడి
పలకరించడానికి వచ్చారేమో అనుకుని నెమ్మదిగా కర్రపట్టుకుని లేచి నిలబడి
అడుగుముందుకేసాడు.
చలపతికి శరీరం తూలుతున్నట్లనిపించింది.
“ అయ్యో పడిపోతారు మామయ్యా,” అంటూ మాధవి , “ నాన్నా జాగ్రత్త! ” అంటూ రాఘవ పట్టుకున్నారు.
“మామయ్యా మీ బ్యాగెక్కడ? ”
“ఎందుకు?” అంటూనే వేలితో తన గదివైపు చూపించాడు.
బయట పడి ఉన్న ఆయన బట్టలన్నీ
సంచిలోకి గబగబాతోసి,
“ పదండి మామయ్యా! మనింటికి వెళ్దాం.” అంది భయం భయంగా!తన తండ్రిని
ఈ స్థితికి తెచ్చిన తనపై భర్తకు ఎంత కోపమొచ్చిందో అని బెరుగ్గా చూసింది రాఘవ వైపు.
“వద్దమ్మా నాకు ఇక్కడే బాగుంది.” తను వాళ్లనెంత ఇబ్బంది
పెట్టానో అనుకోవడానికే సిగ్గుపడుతున్నాడు
చలపతి.
భార్యపై తొంగి చూచిన
విసుగును అదుపులో పెట్టుకుంటూ,
‘ ఏమంటావ్ నాన్నా’ అన్నట్టు చూసాడు రాఘవ.
“వద్దురా నాకిక్కడే బాగుంది. నేనే వస్తాలేరా ఎప్పుడో
ఒకప్పుడు .నాకిక వేరే షిఫ్టులొద్దు. ” దృఢంగా పలికాడు చలపతి.
కాని మాధవి కన్నుల్లో నీరై జాలువారుతున్న పశ్చాత్తాపం చూసాక
తప్పించుకోవాలనుకున్న పట్టుదల సన్నగిలసాగింది చలపతిలో!
అందరితో ‘ వెళ్లొస్తా ’నని చెప్పాడు సంతోషంగా. చేతికర్ర కోడలికందించి
కొడుకు భుజంపై చెయ్యివేసి నడిచాడు తనకై ఆటో పిలుస్తున్న కోడలి వంక ఆప్యాయంగా
చూస్తూ!
‘తను వచ్చిన రోజు ఉత్సుకత చూపిన ఎన్నోకళ్లు బేలగా, దీనంగా చూస్తుంటే చలపతికి మనసులో కలుక్కుమంది. తన కోడలిలో వచ్చిన
మార్పు తానొక వేస్ట్ పేపర్ అన్న నిరాశనుండి తనను తప్పించింది. తనను
వెంటాడుతున్న ఆ దీనత్వం నిండిన కళ్లల్లోకి వెలుగులు నింపేలా మార్పు జరగాలి ’ అని దేవుడిని మనసారా
కోరుకున్నాడు.
మార్పు జరగాల్సింది
మనసులలో! వృద్ధాప్యం మరో బాల్యమే! ఈ విషయాన్ని విస్మరించిన మాధవి, ‘ తండ్రి కొడుకులకు దూరం
పెంచి తన తండ్రిలానే వృద్ధుడైన మామయ్యకు ఖేదం కలిగించానే ’ అని బాధపడసాగింది మాధవి.
అమ్మాయ్! ఆ ఆశ్రమానికి
వెళ్లకముందు టమాట ముక్కలు ఎండపెడ్తుంటివే, పచ్చడి కలిపేసావా? అక్కడికెళ్లాక వారానికే జిహ్వ చచ్చుపడిపోయిందంటే నమ్ము. సరేమరి, వంటయేదాక
కాస్త టీ,బిస్కట్లు ఇస్తావా అంటూ పుత్రోత్సాహము తండ్రికి
.....పద్యమందుకున్నాడు చలపతి. ‘ పునరపి బాల్యం ’ అని నవ్వుకుంటూ టీ,బిస్కట్ల
ప్లేటు అందించింది మాధవి.
****************
( ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక సౌజన్యంతో )
Subscribe to:
Posts (Atom)








