Showing posts with label సమీక్షలు. Show all posts
Showing posts with label సమీక్షలు. Show all posts
Sunday, October 12, 2014
Friday, May 2, 2014
గాజునది
ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురింపబడిన నా సమీక్ష.
మనసు గలగలలు వినిపించిన గాజునది
స్త్రీ బహురూపిణి. విభిన్న
పాత్రలను ఏకకాలంలో పోషించగలగడం ఆమెకున్న అసామాన్య శక్తి.అయితే తదనుగుణంగా స్త్రీ భావజాలం
కూడా త్రిడి ప్రింటర్ లోవలె ఏమూసలో కావాలంటే అలానే కావాలంటూ ముద్ర వేయడం
సబబనిపించుకోదు. శిలాలోలిత కలంపేరుగా లక్ష్మి రచించిన కవితా సంపుటి గాజునది.
స్త్రీ మనసును పారదర్శకం చేసే శీర్షిక గాజునది. శిలాలోలిత ఆలోచనా నెగడు
నిత్య జ్వలితం. అందుకే ఈ నిరంతర కవితా మెరుపులు.ఈ కవితా ఒరవడికి పేర్చబడ్డ కవితా శీర్షికలు స్త్రీల అసహాయతలకు, సమాజంలోని
అవాంఛనీయ పోకడలకు,మసిబారుతున్న మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనాలు.
గాజుబీకరులో బంధింపబడిన నీటి
చిత్రంలా కాక స్థిరీకృతమైన ఆకారాల్లో
జీవలక్షణాలను పుణికి పుచ్చకున్న భావజాలము కావాలని గాజునది లో చెప్పిన లోతైన
భావనాపటిమ కవితా వస్తువుపై శిలాలోలితకున్న పట్టు తెలుపుతుంది.తమదైన వ్యక్తిత్వంతో
కొత్త బాటను నిర్మించుకునే స్త్రీలు చేయి తిరిగిన శిల్పులే కదా!
గాజులగలగలలే కాదు గొంతుముడి
విప్పుకుని బయల్పడిన మాటల గలగలలు వినిపించిన గాజునది, రచయిత్రి నిశిత పరిశీలనా
శక్తిని,సామాజికాంశాల ఆసక్తిని స్ఫటికమై ప్రస్ఫుటింపచేస్తుంది.
జీవితంలో పైకెదిగి వృద్ధిలొకి
రావాల్సిన ఎందరి ఆశాసౌధాలనో బాంబు పేలుళ్లు కూల్చివేసాయి. తెగిపడ్డ సీతాకోక చిలుక
రెక్కలు కవిత చదివితే, మనసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతుంది.కాలమేఘాలు
కురిపించిన బాష్పగోళాలు గోకుల్ చాట్ పేలుళ్లు.వాటికి సశేషంగా మిగిలిన దుఃఖవీచికలు
ఇంకా మనసును తాకుతూనే ఉన్నాయి.
గాజుముక్కల వంతెన కవితలో
బ్రతుకు సమరాన్ని వర్ణిస్తూ గాజుముక్కలపై నడకేనని అనడం ఉపమానమే కాదు అమృతోపమానం.
నిజమే!ఆదమరచి నడిచామా గాజుముక్కలు కసుక్కున కాటేస్తాయి.
విరోధినామ సంవత్సరమైనా. వికృత నామ
వత్సరమైనా కాలం చెట్టుకు పూచిన కొత్త పువ్వులేనంటారు. ‘ కాలానికి కాళ్లు నొప్పి
పడినప్పుడల్లా ఓ క్షణమాగి కొత్త పేరుతో
నడుస్తుంటుంది’ అని చమత్కరించడం చిరునవ్వులు పూయిస్తుంది.కాలం పరచిన బాటలో
మీ కాలి బాట మీలోకే దారితీయాలని చెప్పడం
ఆత్మావలోకనమే.
మానవ హారం మరో చక్కటి కవిత.
మనిషిని మనిషిని కలిపి కుట్టేది మానవత్వం. ‘కలలెప్పుడు మానసిక ప్రపంచ కవాటాలే.
మనిషి గొంతు ముడి విప్పితే రాలేది మాటలే.అవే కలగలిసిన మానవత్వపు మూటలు’ అని చదివినప్పుడు బస్తాలలో
బంధింపబడిన మానవత్వాన్ని మూటలు విప్పి మానవాళిపై వెదజల్లాలనిపిస్తుంది.
కాంతి+కాంతి=చీకటి. చీకటి రేఖలపై కాంతిని ప్రసరించి స్త్రీ పురుష సమానత్వంలో
అహానికి వీడ్కోలు పలికితే బ్రతుకంతా వెన్నెల పుప్పొడే! మలినమైన మానవతా పరిమళం
మనిషితనానికి వీడ్కోలు పలికితే ఆర్థిక సంబంధాలు అగాథాలు సృష్టిస్తాయి.అని కాంతిని
స్త్రీ,పురుషులకు సంకేతపదాలుగా వర్ణించారు.
చలన సూత్రాలు.చదివితే కళ్లలో
అకాల వర్షమే! దేహాలు వదిలి వెళ్లినా వాళ్లు విదిల్చిన అక్షరాలు ఊతకర్రయి అక్షరపూలను శాశ్వతం చేసాయనడం, ఎందరో
సాహితీవేత్తలు కురిపించిన అక్షరాలకు
మోకరిల్లాలనిపిస్తుంది.
రోబో కవితలో, ‘ ప్రాణమున్న రోబోలం మనం.మనకై
మనం నవ్వం,మాటలాడం.కరుణించం, కలసిరాం. మననుంచి
ఎప్పుడో జారిపడిపోయిన పాదరసం బొట్టు మన మనసు’ అంటారు.అందుకే ఆ పాదరసపు బొట్టుకు పునఃప్రతిష్ట జరగాలంటారు.నిజమే! అమానుషత్వమే
తనువంతా ఆమ్లధారలా తడుపుతున్నవేళ మనసును తిరిగి ప్రతిష్టించుకోవాల్సిందే..
ఉత్తరం ఉరిపోసుకుంది.ఇది
అక్షర సత్యం. ‘ మనిషి మాటలు ఔట్ డేటెడ్. స్పర్శను,స్వరాన్ని కోల్పోతూ
అక్షరాలు చాటింగులు,సొరుగులు,గోడలు,ముఖ పుస్తకాలే ఇక మనకు మిగిలింది ’ అన్నా, మానవ పరిమళం
మనిషితనమొక్కటే అని చెప్పినా,ప్లాస్టిక్ పర్యావరణానికి
ముప్పని చెప్పడమైనా ఆమె దృష్టంతా మానవసమాజ శ్రేయస్సే!
Friday, March 14, 2014
నిశ్శబ్ద జలపాతాలు
2-3-2014 ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నా సమీక్ష.

హోరెత్తిన నిశ్శబ్ద జలపాతాలు
పొత్తూరి జయలక్ష్మి రాసిన ప్రతికథ వెనుక
తిరోగమించే సమాజపోకడలపట్ల ఆవేదన బలంగా కనిపిస్తుంది.
మూఢనమ్మకాలు మనిషి లక్ష్యాన్ని అలక్ష్యంవైపు నెట్టి సాధించవలసిన విజయాలకు అడ్డుగోడలవుతాయి.ఆచారాలు
ఆచరణీయమే! అయితే మూఢాచారాలు మనిషినే కాదు మనసును కకావికలం చేస్తాయి. దీనికి
దృష్టాంతాలే నిశ్శబ్ద జలపాతాలు వినిపించిన హోరునాదం.అందులో అలవోకగా రచయిత్రి కలం
జాలువార్చిన కథాజలపాతాలు మన మనసులలో నిరంతరం ఉరకలు వేస్తూనే ఉంటాయి.
అన్ని మంచి శకునములే. చక్కటి కథ. ఊహలకు
రెక్కలు పొదిగి మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్లవు ఈమె కథలు.మన ఇరుగు పొరుగు వారి
జీవితాలలో జరిగే సంఘటనలు వారినెలా ప్రభావితం చేస్తాయో చూసినట్లు,వినినట్లు మనకు
వివరిస్తారు. మంచి పనికి మంచి మనసుంటే చాలంటారు.పిల్లి ఎదురు పడ్డా దుశ్శకునమని
ఆందోళన పడటం మనిషిని మరింత భీరువును చేస్తుంది.ఇది అందరికీ తెలుసు కాని కథగా
చెప్తే సూదిమందులా సత్వరం పనిచేస్తుంది కదా!
అనుమానం దాంపత్య
జీవితానికి విషపు చీడలాంటిది.పరస్పర అనుమాన నివృత్తితో సంసారం స్వర్గమవుతుంది.మనసు
పాడింది సన్నాయి పాట కథ ఇదే చెప్తుంది.
ఇక నిస్సహాయుడు
కథలో నేటి సమాజ ముఖచిత్రం స్ఫష్టంగా గోచరిస్తుంది.ప్రేమగా పెంచుకున్న వృక్షాలను
నరికివేసి ఆ స్థానంలో ఇల్లు కట్టుకోవడం నేడు నిత్యవేడుకే!ప్రాణంలేని ఆత్మీయులు
ఫోటోలలో దర్శనమిస్తారు.ప్రాణంలేని చెట్టు గుమ్మంగా,అల్మైరాగా మిగులుతాయి.మనిషికి
మరణం ఒక జీవక్రియ కాని చెట్టుకు మాత్రం మరణం హత్యే అన్న రచయిత్రి మాటలు మనసున్న
మనిషికి రంపపుకోత!
పూలబంధం కథ మనసుల పుష్పరాగమే! ఇల్లుకట్టి
చూడు కథ ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరికి
అనుభవైకవేద్యమే. పులికన్న గిలి భయమెక్కువ ఉంటుంది. ఇల్లు కట్టడంలో వాస్తు ప్రధానం.
నమ్మినా నమ్మకపోయినా అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో వాస్తును అంతో ఇంతో పాటిస్తారు. వాస్తే
కాదు వాస్తవాలు గ్రహించడం కూడా అవశ్యమేనంటారు.
ఆర్థికమాంద్యం విసిరిన వలలో
గిలగిలలాడిన చేప వికాస్. అయితే బలైనది అతడి భార్య వికసిత.భర్తను చేరుకోగలనన్న ఆశతో
అమెరికాలో అడుగు పెట్టిన వికసితకు వికాస్ ముఖం చాటేస్తాడు.అయితే బేలతనం వదలి తన
జీవితానికి బాట వేసుకుంది వికసిత. వికసితవదనం కథలో వికాస్ ప్రవర్తనకు మూలకారణాలు
ఏవైనా అమ్మాయిలూ, బహుపరాక్! అనక తప్పదు.
తమకు ఎదురయే ఇబ్బందులకు మూఢనమ్మకాలను ఆశ్రయించి
మనసును సాంత్వన పరచాలనుకుంటారు. అది తాత్కాలికమేకాని శాశ్వత పరిష్కారం చూపలేదు.
కాలంతోపాటు మనము మారాలి. సాటివారిని మనతో సమానంగా చూసే అలవాటు చేసుకోవాలి
మానవత్వాన్ని మించిన మతంకాని కులంకాని లేదనే నిజం అమృతబిందువులు కథలో కురిసిన
అమృతమే!
కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న
నేటి పరిస్థితులలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు,కనీసం తమను కన్నవారేవరో
తెలియని పసిపాపలు ఒకవైపు,తమ పొత్తిళ్లను వీడి వత్తిళ్లను కావలించుకున్న సంతానానికి
భారమైన వృద్దతల్లిదండ్రులు మరొకవైపు. వీరిని కలిపే ఆలోచనకు అనురాగపు పొదరిల్లు కథ
వేదికగా నిలవడం సత్సంకల్పం.
రచయిత్రి ముద్రించిన తొలి కథల సంపుటి
ఇది. దైనందిన జీవితంలో ఎదురయే విభిన్న వ్యక్తులు, వారిలోని వైవిధ్య
వ్యక్తిత్వాలు,వారి జీవితాలలో తారసపడే ఎన్నో సంఘటనల వైచిత్రి రచయిత్రిని
కథారచనవైపు పురికొల్పి వుండవచ్చు.అయితే వాటిని నేర్పుగా కథలుగా మలచి సమాజానికి
సంతసమేకాక,సందేశము మిళితము చేసి అందించడం సామాజిక స్పృహ ఉన్న వారికే సాధ్యం కదా.
అది జయలక్ష్మి కథలలో అంతర్లీనమైన జలపాతమే!
Sunday, December 29, 2013
చిత్రగ్రంథి
ఈ రోజు ఆదివారం ఆంధ్రప్రభలో చిత్రగ్రంథి కవితా సంపుటిపై నా సమీక్ష.
కవితారసాలూరిన చిత్రగ్రంథి
సుధామ జగమెరిగిన కవి,రచయిత, విశ్రాంత
ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారి. సాహితీప్రక్రియలన్నిటిలోను ప్రవేశమున్నప్పటికీ కవితాసరిగమల ఆలాపనకే పెద్దపీటవేసి ఆంధ్రప్రభ దినపత్రికలో కవికాలమ్ నిర్వహించిన ఈ
కవి కలం కవితాసుధాభరితమై ప్రశంసలనందుకుంది. సాహితీబాటలో కవిగా,రచయితగా, బహుపాత్రధారియైన
సుధామ మనముందుకు తెచ్చిన చిత్రగ్రంథి కవితా సంకలనం వస్తువైవిధ్యంతో అలరిస్తుంది.
ఇక ‘చిత్రగ్రంథి ‘లోకి ప్రవేశిద్దాం.తొలికవితకు
శీర్షికే ‘కవి(త) ప్రవేశం ’.
కలుషితమవుతున్న పర్యావరణం
మనిషిని ప్రకృతికి దూరం చేస్తోంది.
నీటిని గాలిని ధ్వనిని
క్షరముకాని అక్షరంగా
సహజసిద్ధంగా
స్వచ్ఛంగా నిలుపుకుంటే చాలు
మహిని,మనిషిని కూడా
రక్షించుకున్నట్లే. అంటూ పర్యావరణాన్ని రక్షించుకోవాలనే స్పృహను కలిగిస్తారు.
భూత,వర్తమాన,భవిష్యత్కాలాలను
సమన్వయపరచుకోవడమెలాగో స్వగతం-స్వాగతం కవిత మనకు వినిపిస్తుంది.
గతాన్ని వర్తమాన కవ్వంతో
చిలికి భవిష్యత్తు మీగడను పైకి
తేల్చడమే ముఖ్యం అనడం కవి దార్శనికత మూడు కాలాలకు విస్తరించడమే.
జీవితంపై ఆశ ఉద్దీపన కావాలి
కాని అంతం కాకూడదు.
‘జీవితేచ్ఛ’ కవితలో ఆశలు
నిర్మించేవాళ్లు గోడలను కొలుస్తారంటారు. అవరోధాల గోడలనధిగమించాలి. మృత్యుశ్వాసనధిగమించి
జీవితేచ్ఛ పరిమళించాలి.బ్రతుకుపై నిరాశకు వీడ్కోలు పలికే కవిత.
‘అగ్నినగ్నీకరం’ కవిత భగ్గుమనే
హృదయావేదనను ప్రతిఫలిస్తుంది. నగిషీకరించడంకాదు నగ్నీకరించినపుడు అది అగ్నీకరణమన్న
కవి భావుకత కవితావేశాన్నందిస్తుంది.
మనిషి మానుషాన్ని మటుమాయం
చేస్తున్నాడు. మానవ ప్రకృతిని మానవుడు ధరించేలా చెయ్యి.జీవనగీతం రానివ్వమని ‘కొత్త పల్లవి’ పాడుతారు.
ఉల్లితరిగినప్పుడు
కన్నీళ్లులా ….పఠిత సజలనేత్ర కావాలి అనడం హృద్యంగా ఉంది.
‘విలువ’ శీర్షికన రాసిన కవిత అమూల్యమైనదే. మెట్లపై మనిషి జారి
పోవడం కాదు,నేడు మెట్లే జారిపోతున్నాయి.
వినిమయ విపణి వీధిలో మనిషే
వస్తువై, మారిన ప్రపంచానివే విలువలు కాని వ్యక్తిత్వ ప్రపంచానివి
కావు అనడం ఈ కవికి మానవతా విలువలపైనున్న ఆర్తిని ప్రస్ఫుటింపచేస్తుంది.
చితిలోను చ్యుతిలేని వృద్ధాప్యం
బ్రతుక్కీ,మృత్యువుకి మధ్య
చివరి జాప్యం.
చివరి జాప్యంలో మారుతున్న
విలువలలో మనిషీ మారకద్రవ్యమే అని సూటిగా చెప్పడం గుండెలో నాటుకుని కళ్లను
తడుపుతుంది.
ఆకాశవాణినుండి
కవితావాణిదాకా సుధామ మీటిన మైలురాళ్లు సాహితీబాట లోని పథికులకు మార్గనిర్దేశనాలే
అనడంలో అతిశయోక్తి లేదు.
ఏదో నాలుగు కవితలు రాసేసాం,
కలం మూసేసాం అనుకోకుండా విలక్షణత,వస్తువైవిధ్యానికి ప్రాధాన్యతనిచ్చిన
కవితా పఠనం ఉత్సుకతను ఉద్దీపన కావిస్తుంది. ‘ చిత్రగ్రంథి ’ కవితా సంకలనం మనసును ఉరకలేయించడమేకాదు అదుపు తప్పిన సమాజపోకడలకు చురకలు వేస్తుంది.చిలికేకొద్ది చిక్కనైన
కవిత్వం తొంగి చూచిన ప్రతి పాఠకుడిపై చిలకరించిన
చల్ల పలుకై పలకరిస్తుంది. ఆలోచన, అవగాహన, రమ్యతకు తగిన సమతుల్యత మాటల పటాటోపంకాక
పదాల పల్లవింపులు సహజత్వానికి దగ్గర దారై మన దరిదాపులలోనే కవి నిలుచుని మనతో కవితా
కబుర్లు చెప్తున్నట్లుంటుంది .మనసును హత్తుకున్న కవితేదయినా ఆ కవితాస్రష్టను
కలకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది.
Sunday, December 15, 2013
జూలియస్ సీజర్
ఈ రోజు 15-12-2012 ఆదివారం ఆంధ్రప్రభలో నా సమీక్ష.
లక్ష్మీకాంత మోహన్ అనువదించిన మరో
చక్కటి నాటకం జూలియస్ సీజర్.విలియం
షేక్స్ పియర్ చిత్రిక పట్టిన ఆనాటి సమాజస్థితి గతులను తరచి చూడాలంటే చరిత్ర,సాహిత్య
పఠనమే రహదారి.చదివిన సాహిత్యానికి దృశ్యీకరణ రసానుభూతికి రాచబాట.అయితే నటన ద్వారా
మనం చలనచిత్రాలలోని సన్నివేశాలకు స్పందిస్తాం
కాని నాటక ప్రదర్శనలో ఈ అనుభూతికి మించిన
ఆనందం సాక్షాత్కరిస్తుంది. కారణం ప్రత్యక్షంగా కనబడే పాత్రధారులు.వినబడే
గాత్రం,అలరించే హావభావాలు.జీవితమనే నాటకరంగంలో మనిషి జీవనం రంగుల రాట్నమే.
జూలియస్ సీజర్
నాటకానికి వేదిక రోము నగరం.ఆ తర్వాత సార్థిస్,ఫిలిప్పీ వస్తాయి. రోమన్ సామ్రాజ్యం
పతనావస్థకు చేరినపుడు జూలియస్ సీజర్ పాత్ర
ప్రవేశిస్తుంది.న్యాయానికి అన్యాయం, మంచికిపోతే చెడు ఎదురైంది అనడం వింటుంటాం.అది
సర్వసామాన్యంగా జరిగేదే!మంచికి చెడుకు నిత్య సంఘర్షణే. సీజర్ పరిపాలనలో అదే
జరిగింది. సీజరుకు వ్యతిరేకంగా పనిచేసి అతడిని అంతమొందిస్తే అతడికి తల ఒగ్గక బ్రతకవచ్చుననుకుంటాడు
కేషియస్.అందుకు తన మిత్రుడైన బ్రూటస్ తో సంప్రదింపులు జరుపుతాడు.
సీజర్ భార్యకు వచ్చిన పీడకల సైతం సీజరును
భయపెట్టదు.అమాయకత్వాన్ని స్వార్థమెపుడు మాయ చేస్తూనే ఉంటుంది.విజయోత్సవంలో
పొంగిపోతున్న సీజరును అప్రమత్తంగా ఉండాలని చేసిన హెచ్చరికలు అతడిని కాపాడలేకపోయాయి. నమ్మిన
స్నేహితుడు బ్రూటస్ సైతం సీజరుపై కత్తిదూసినపుడు ‘యు టు బ్రూటస్!’ అని ప్రాణాలొదులుతాడు సీజరు. నమ్మినవారు మోసం
చేసినపుడు ఈ నాటికి ఎక్కడో ఓ చోట వినబడుతుందీ మాట!
ఇక అనువాదంలో
ఇమిడిపోయిన తెలుగు పలుకుబడుల ద్వారా నారికేళపాకాన్ని కదళీపాకం చేసి అందించిన రచయిత
అభినందనీయుడు.
రచయితగా,కవిగా
స్వయంప్రకాశకుడు ఈ అనువాదకర్త.విలియం షేక్స్ పియర్ రచనలు వసివాడని నిత్య పారిజాత
సుమాలు.అదే స్ఫూర్థితో అనువదించబడ్డ పదిహేను నాటికలు కూడా రంగస్థల వేదికపైనే కాదు పాఠకుల హృదయ వేదికపై కూడా సుగంధభరితం కావాలని ఆకాంక్షిద్దాం.
Sunday, December 8, 2013
తుఫాను
ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో తుఫాను నాటికపై నా సమీక్ష.
నేటికీ
మరపురాని నాటి నాటికలు
విలియమ్ షేక్స్ పియర్ ఆంగ్ల సాహిత్యాభిమానులకు
ఆరాధ్యుడు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, వారి మనోభావాలను పదునైన చమత్కృతితో నాటకీకరణ గావించి
రంగస్థలానికి తను రచించిన నాటికలను ఆభరణాలుగా ఒసగిన మహాకవి. తాను మరణించినా తన
నాటకాలకు చిరాయువు ప్రసాదించిన రచయిత షేక్స్ పియర్. అట్టి రచనలను తనదైన శైలిలో
మాతృకలోని మాధుర్యం చెడకుండా అనువదించారు పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్ గారు. ఇతనిలోని
కళాకారుడు విభిన్నరూపాలలో అలరించాడు. విద్యార్హతలు కళాపిపాసకు కొలమానాలు కానేరవు. తగిన
గుర్తింపు దొరికినపుడు రచయితకు గాని,నటుడికిగాని ప్రాణవాయువందుతుంది.అదే మరిన్ని మంచి
రచనలకు ఆయువుపట్టవుతుంది.
కావ్యేషు నాటకం రమ్యం
అంటారు.నాటికలలో సమకాలీన అంశాలను పరిగణలోనికి తీసుకున్నపుడు ఆనాటి రాజరికాలలోని
నిరంకుశత్వాన్ని, భూస్వాముల పెట్టుబడిదారీతనాన్ని,ప్రజల కడగండ్లను కళ్లకు
కట్టినట్టు చిత్రీకరించిన షేక్స్ పియర్ రచనలను తెలుగు పాఠకులకు అందించిన లక్ష్మీకాంత
మోహన్ అభినందనీయులు.
ఇక నాటకాలలోనికి వస్తే ముందుగా తుఫాను నాటకాన్ని
చూద్దాం.కథకు రంగం ఓడ,దీవి. ఆనాటి పరిసస్థితులకు అనుగుణంగా పాత్రలను సృష్టించి
మనల్ని ప్రేక్షకులు గావించిన కథాగమనం.రాజ్యకాంక్ష చిరాయువు.మోసం, కుట్ర, ద్రోహం
ఆయుధాలుగా మరింత ఊపిరి పోసుకుంటుంది. ‘తుఫాను’ నాటకంలో అదే జరిగింది .
ప్రాస్పెరో తన కూతురు మిరాండాకు తన తమ్ముడు ఆంటోనియో తనకు
చేసిన ద్రోహాన్నివివరిస్తాడు. నేపుల్స్ రాజుకు కప్పంకట్టి, అతని కనుసన్నలలో మెలగి అతడి ద్వారా
తన అన్నను సింహాసనం నుండి దించి సముద్రంలో
ఒక ఓటి పడవలో వదిలిపెట్టమని చెప్తాడు అంటోనియో.అయితే గాంజలో అనే వృద్ధుడు వీరికి తగినంత ఆహారమిచ్చి సహాయపడతాడు.
ఏరియల్ అనే భూతశక్తి ద్వారా సముద్రంలో తుఫాను రేపుతాడు ప్రాస్పెరో.జరిగిన
అన్యాయానికి ఓడపైనున్నతన ప్రత్యర్థులను భయభ్రాంతులను చేస్తాడు.అయితే వారిని
సముద్రానికి అర్పణ చేయడు.తుఫాను ఎలాగైనా ఉపశమింప చేయమని కోరిన కూతురికి ఏమీకాదన్న
భరోసా ఇస్తాడు.
ఫెర్డినాండు సముద్రంలో
మునిగి పోకుండా ప్రాస్పెరో ఉన్న గుహ దగ్గరకు చేరుకుంటాడు.తన మనసులో రూపు
దిద్దుకున్న ప్రణాళిక రచింప ప్రారంభిస్తాడు ప్రాస్పెరొ. ఫెర్డినాండు మరణించాడనుకుని అటు
మిలాన్ కు,ఇటు నేపుల్స్ కు రాజులవాలని ఆంటోనియో,సెబాస్టియన్ ఉవ్విళ్లూరుతారు.వారి
ఆలోచనకు ఏరియల్ అడ్డుపడుతాడు.
విభిన్న మలుపులు తిరిగి చివరి అంకంలో
మిరాండా,ఫెర్డినాండు ఒకటై రాజ్యాధికారులవుతారు.ఈ సుఖాంతానికి షేక్స్పియర్ రసరంజకంగా
తిప్పిన మలుపులను అంతే సహజంగా చక్కటి సంభాషణలతో,తెలుగు పలుకుబడులతో అలరింపచేసారు
లక్ష్మీకాంత మోహన్..
ఈ నాటకం మనదేశానికి సంబంధించిన ఇతివృత్తం కాకున్నా,రాసి శతాబ్ధాలు గడిచినా ఇంత ఆసక్తికరంగా వుందంటే ఇదెంత విశ్వజనీనమైందో అర్థమౌతుంది.
Sunday, December 1, 2013
వెనిస్ వర్తకుడు
ఈ రోజు(1-12-2013) ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురితమైన నా సమీక్ష.
చిన్నతనంలో ఆకట్టుకున్నకథలు, నాటికలు మనఃఫలకంపైనుండి చెరిగిపోవు.అయితే ఇప్పటికీ
రంగస్థలంపై ప్రదర్శించబడే ఇటువంటి నాటికలు
షేక్స్ పియర్ ప్రతిభకు అద్దం పడతాయి.లక్ష్మికాంత్ మోహన్ అకుంఠిత దీక్షతో
అనువదించిన నాటికలలో అహ్లాదకరమైన రచన వెనిస్ వర్తకుడు.
వెనిస్
నగర వర్తకుడు ఆంటనియో.అతడు చేసేది వాణిజ్యమే కాని వ్యక్తిగా ప్రేమాన్వితుడు, దయార్ద్ర హృదయుడు. అతని
స్నేహితుడైన బసానియో పోర్షియాను వివాహమాడాలనుకుంటాడు.అయితే ఆమె స్థాయికి
తగినట్లుగా వుండాలంటే అప్పు చేయాలి. ఆంటనియో అతడు కోరిన పైకం ఇవ్వలేక షైలాక్
దగ్గరకు తీసుకుని వెళ్తాడు.అధర్మానికి,కుటిలత్వానికి షైలాక్ ప్రతీక. దుష్ట ఆలోచనతో
అప్పు ఇచ్చిన షైలాక్ మూడు నెలల గడువులో అప్పు తీర్చకపోతే ఆంటనియో శరీరంనుండి ఒక
పౌండు మాంసాన్నినష్ట పరిహారంగా కోరుతాడు.మానవ సహజమైన అసూయ ఇలాంటి వింత కోరికకు
అంకురం తొడుగుతుంది.
నాటిక రెండవరంగం బెల్మాంటులో పోర్షియా ఆమె పరిచారిక
నెరిస్సాతో జరిగిన మాటల కలబోతలో మానవీయ కోణాలు ప్రదర్శితమవుతాయి. చక్కగా నడచుకుంటే
చక్కని జీవితం అని పలికిన నెరిస్సా పలుకులకు పోర్షియా స్పందిస్తూ ‘ చెయ్యటమనేది చెప్పటమంత
తేలికైతే కరువుకాటకాలు కనుమరుగయేవి. ఏది మంచో నూరు మందికి చెప్పగలిగినా నేను ఆచరణలో పెట్టడం మాత్రం కష్టం.మన మనసులు మంచి
మాట చెప్తున్నా మన ఉద్రేకాలు మాత్రం మనసులు గీచిన మంచి గీటుల్ని దూకి అవతల
పడుతాయి.’ అంటుంది. షేక్స్ పియర్ మనస్తత్వ విశ్లేషణను అత్యంత సహజంగా
అనువదించిన లక్ష్మికాంత మోహన్ అభినందనీయులు.
ఇక నాటకం చివరి
అంకంలో షైలాక్ మనసును మార్చాలని కడసారి
ప్రయత్నంగా మారువేషంలోనున్న పోర్షియా, ‘మనిషి హృదయంలో కరుణ సహజంగా ఉండాలికాని
నిర్బంధంతో రాదు ’ అంటుంది. ‘ అది వర్ష తుషారం ఆకాశం నుండి భూమి మీద పడినట్లు దానంతటదే
వస్తుంది. కరుణ అనేది రాజదండంకంటే బలవత్తరమైనది.కరుణ చూపమని దేవుడిని
వేడుకునే మనం ఇతరులపై కూడా కరుణ చూపమనే కదా!’ అని షైలాక్ ను
ప్రశ్నిస్తుంది. కాని విభిన్న మనస్తత్వాల మానవులం,అందరం ఒకేలా స్పందించం కదా! షైలాక్ తన మొండిపట్టు వీడడు.అయితే
పోర్షియా నాటకం చరమాంకంలో తన మారువేషంతో రంజింప చేసి షైలాక్ ఆట కట్టించడం
కొసమెరుపు.
మూలకథలోని భావ ప్రకటనా పటిమకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా తనకు
ఆశువుగా అలవడిన అనువాద కళను చక్కని సంభాషణా చతురత చూపి ఇది మనకు తెలిసిన నాటకమైనా
ఉత్సుకతను పెంచే రీతిన మలవడంలో మోహన్ గారు కృతకృత్యులయారనే చెప్పవచ్చు.
ప్రదర్శనకు
అనుకూలమైన నాటికల పరంపరలో ఇదొక అద్భుత రసమయ కావ్యం.
Sunday, November 17, 2013
యోగ విజయాలు
ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నా సమీక్ష.
యోగవిజయానుభావాల కదంబమాల
ఆత్మదర్శనమే పరమయోగం అని తెలిపే
ఈ పుస్తకం యోగసాధకుల మాటలలో చెప్పాలంటే ఉపశమింపచేసే మనోయోగం. మన ఎదుగుదల మన
మాటలలోనే తెలుసుకోవడం మనోయవనికను తొలగించి అచట పేర్చబడిన యోగాక్షరాలను తిలకించడమే!
మాస్టర్ యోగాశ్రమంలో యోగసిధ్ధిపొందిన వారి అనుభవాల సమాహారం ఈ రచన.
మానసిక,దైహిక బాధలు దైనందిన అతిథులే! యోగ
రసాస్వాదనే అందుకు తగిన ఆతిథ్యం. ఆధ్యాత్మిక ఎదుగుదలే యోగాలోని మొదటి లక్ష్యం
అంటారు ఎమ్.ఎస్.మూర్తిగారు.గురువు చూపిన దారిలో ఎవరి నడక వారు నడవాలి అంటారు.
సాధకులకు సాధనతోపాటు మంచి పుస్తక పఠనం కూడా జ్ఞానసంపదను అభివృద్ధి పరుస్తుంది. ప్రార్థన
మనసును ప్రక్షాళన చేస్తుంది.
యోగసాధకులు తమ అనుభవాల అంతర్వాణిని
అక్షరయోగంలో ప్రతిఫలించారు. యోగాశ్రమంలో శారీరక,మానసిక రుగ్మతలకు ఉపశమనం పొందిన
వారి హృదయావిష్కరణే ఈ యోగవిజయాలు.
మౌనమే నా యోగభాష అంటారు
యోగసాహిత్యం పట్ల ఆసక్తి, యోగసాధన పట్ల
అనురక్తిగల ఎన్,భారతిగారు. కష్టాలకడలి సునామీలా ముంచేస్తుంటే బయటపడేసే కాంతిరేఖ
యోగం.అదే జరిగింది వినోదరావు జయశ్రీ గారి అనుభవంలో!
యోగా నిత్యసాధనగా ఒకవైపు అంకితమవుతూనే
అకుంఠిత దీక్షతో డిగ్రీ సాధించి లాయరు కాగలగడం ఆత్మవిశ్వాసానికి పరాకాష్ట
అనిపిస్తుంది. మనల్ని కష్టపెట్టిన వారిని,నొప్పించినవారిని క్షమించడం కష్టమే!అయితే
యోగాలో మనిషి తన మనసును నియంత్రించుకోగలగడం వీరి అనుభవాలు మనకు తెలుపుతాయి..
జీవనవిధానం మెరుగు పడాలంటే ఆత్మను
తెలుసుకోవాలి.అంటే స్వస్వరూప దర్శనమేనంటారు సి.సుశీలమ్మ గారు.గురువుగారి కరస్పర్శే
పరసువేదిలా పనిచేసి తనబిడ్డను శస్త్రచికిత్స బారిన పడకుండా కాపాడింది అంటారు ఎస్.శోభారాణి
గారు. క్షమ,ఓర్పువంటి సుగుణాలను అలవరచుకోవాలంటే యోగసాధనే మార్గమని చెప్పిన మరెందరో
సాధకుల అనుభవాలు చదవదగ్గవి.
Sunday, November 10, 2013
ఆచార్య స్మారక సంచిక
ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురితమైన సమీక్ష. http://www.prabhanews.com/cartoonspecial/article-408116 చిరస్మరణీయమైన స్మారక సంచిక
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారిని
పరిచయం చెయ్యడమంటే సుగంధం పరిమళిస్తుందని చెప్పడమే! తెలుగు భాషాభిమానులు
మరచిపోలేని,మరువకూడని వ్యక్తి కృష్ణమూర్తిగారు. 1957 లోనే భాషా శాస్త్రంలో
పెన్సిల్వేనియా (అమెరికా)లో డాక్టరేట్ పొందారు.తెలుగు క్రియా ప్రాతిపదికలు-తులనాత్మక
పరిశీలన కృష్ణమూర్తిగారి థీసిస్.
తెలుగు భాషను ప్రపంచ స్థాయిలో పరిశోధించిన ప్రజ్ఞాశాలి. కృష్ణమూర్తిగారి
కృషిని స్మరించుకుంటూ వారిపై గల అభిమానాన్ని
వ్యక్తపరుస్తూ రాసిన వ్యాసావళి అంచెలంచెలుగా ఎదిగిన తెలుగు భాష వైభవాన్ని,అందుకు దోహదపడిన
కృష్ణమూర్తి గారిని మనసారా మరోమారు స్మరించుకునేలా మన ముందుకు తెచ్చారు, సి.పి.బ్రౌన్ అకాడమి వారు.
శాస్త్రీయ మార్గాలలో తెలుగును
ఆధునీకరించడానికి కావలసిన వ్యూహాలన్నిటిని భద్రిరాజుగారు తెలుగువారికి అందించారని
అంటారు, గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. తెలుగుభాషకు క్లాసికల్ లాంగ్వేజి హోదా సిద్ధించడానికి మార్గనిర్దేశక
సూత్రనిర్వచన మండలిలో సభ్యులుగా వారు చేసిన సేవలను జ్ఞాపకాల మాలికలల్లి
మనముందుంచుతారు.
రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరోవారు 2004లో
భద్రిరాజు కృష్ణమూర్తిగారికి కరెస్పాండింగ్ ఫెలోషిప్ ప్రకటించిన సంధర్భంగా రాసిన
తన వ్యాసంలో కె.కె రంగనాథాచార్యులుగారు ఈ ఫెలోషిప్ భద్రిరాజుగారికందిన అరుదైన
గౌరవంగా కీర్తిస్తారు. తులనాత్మక ,చారిత్రక,వర్ణనాత్మక భాషా శాస్త్ర శాఖలన్నిటిలోను
సమానంగా కృషి సల్పిన కృష్ణమూర్తిగారి శ్రమపై
ఈ వ్యాసం సమగ్రపాఠమే.
ఇక జి.వి. పూర్ణచందు గారు ప్రాచీనతా హోదా
విషయంలో భద్రిరాజుగారి పాత్రపై వివరణాత్మక వ్యాసాన్నందిస్తూ మనకోసం,మన భాష కోసం తన జీవితమంతా పాటుబడ్డ
కృష్ణమూర్తిగారిని పూజింపదగినవారుగా కీర్తిస్తారు.
అబ్బూరి ఛాయాదేవిగారు తమ
ఆత్మీయతానుబంధాన్ని ఉటంకిస్తూ సి.పి.బ్రౌన్ అకాడమీ వారు తెలుగు భారతి
అనే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారానికి కృష్ణమూర్తిగారి పేరును బలపరచడంలో
తను కూడా సభ్యురాలిగా పాలుపంచుకోవడం తనకు దొరికిన సదవకాశం అని భావించారు.
ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి
సైనికుడెంత అవసరమో ప్రాదేశిక భాషల స్వరూప స్వభావాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి
ప్రజల భాషల,ధ్వనుల పరిణామక్రమాణ్ణి గమనిస్తూ వాటి రూపాలను,రుచులను పెంచి
పోషించేందుకు కూడా భాషా సైనికుడవసరం అంటారు ఎ.బి.కె.ప్రసాద్ గారు. తెలుగువారి ‘థింక్ టాంక్’ భద్రిరాజుగారు అని
ప్రస్తుతిస్తారు.
అరకులోయ ప్రాంతంలో దాదాపు నాలుగువేల మంది
మాట్లాడే కొండ భాష(కూబి)గురించి వివరణాత్మక గ్రంథరచన మొదలుకొని అధికార భాషా విధానాల
వరకు ఎన్నో పరిశీలనాత్మక వ్యాసాలను రచించిన కృష్ణమూర్తిగారి గురించి ‘కృష్ణమూర్తిః
భారతస్య సుమహత్ గర్వకారణం’ అని మహామహోపాధ్యాయ
డా. పుల్లెల శ్రీ రామచంద్రుడు గారు చేసిన ప్రశంసకు అన్నివిధాలా అర్హులైనవారు
కృష్ణమూర్తిగారు అని పోరంకి దక్షిణామూర్తిగారు తమ సమగ్ర వ్యాసం ద్వారా మరోమారు విశదపరిచారు.
ఇక కస్తూరి విశ్వనాథంగారు నాలుగు దశాబ్దాలు
దాటిన తన పరిచయ బాటలో పాఠకులకందచేసిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు నాటిన
మైలురాళ్ల వివరాలు అలరిస్తాయి.తెలుగు భాషాశాస్త్రంలో ఒక మేరు పర్వతం
కృష్ణమూర్తిగారు అంటారు పోతుకూచి సాంబశివరావుగారు.ఇంకా ఎందరో పెద్దల అనుభవాలు, అనుభూతులు
తెలుగు వారందరు పునశ్చరణ చేయదగిన పాఠ్యాంశాలే!
కృష్ణమూర్తిగారికి అక్షరనివాళితో
పాటు వారికి సంబంధించిన మరెన్నో వివరాలను తెలుగు భాషాభిమానులకు కానుకగా పొందు
పరిచిన ఈ స్మారక సంచిక
పఠనీయం,స్మరణీయం.
Sunday, October 27, 2013
కావ్య కస్తూరి
ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో శ్రీనివాసగాంధిగారు రచించిన కావ్య కస్తూరి కవితల సంపుటిపై నా సమీక్ష.
కస్తూరి పరిమళాల కవితాఝరి
మనసున మెదిలే భావాలను కవితలుగా
సృజించి పాఠకులకందించారు శ్రీనివాస గాంధిగారు. స్పందన అందించిన ప్రతి వస్తు
విశేషము వీరి కవితకు స్ఫూర్తే. అయితే పదాడంబరానికి పోక చక్కటి పదాలతో కవితను
పారదర్శకంగా రచించి పాఠకులకందించారు.
‘నువ్వు సున్నావే ననుకున్నా
నువ్వొచ్చికలిశాకా మనం పది
అయ్యాం
సున్నాగా వెళ్లి నన్ను ఒకటిగా
ఒంటిగా చేశావు
ఇప్పుడు తెలిసింది సున్నా
విలువ!’
‘మనం, మోయలేని జ్ఞాపకాలు, ఇంతేనా మరి, ఎటనుంటివో, నానేరమేమి ‘ వంటి కవితల నేపథ్యం జీవన
సహచరి మధుర స్మృతులే.
జీవితంలో ఒంటరిగానున్న తనప్రక్కన
వచ్చిన భార్య సున్నాలా వచ్చి చేరి తన విలువను పెంచిదంటారు. సున్న తీసేస్తే విలువ
కోల్పోయినట్లు భార్య మరణం అతడిని ఒంటరివాడిని చేసినా ఆమె విలువ మాత్రం అతని
మనోయవనికపై శాశ్వతంగా పదిలమై నిలిచింది.
‘ పశువును అమ్మినపుడు పైకమిచ్చును కొన్నవాడు
పసుపుతాడుకు ఎదురు సుంకం
ఇదేమి కర్మం ’
మాంగల్యం పలుపుతాడుగ
మారినపుడు అన్వయించదగిన కవిత.
మాటవినని మనసును ‘నిన్నెలా జయించను’ అనే కవితలో ఆర్తిగా
ప్రశ్నిస్తారు.
మనసును ఓడించలేకపోవడమే
మనిషి పొందే నిరంతర పరాజయం అని ‘మనసు’ కవితలో ముక్తాయింపు నిస్తారు.
‘ నీకో ఉత్తరం రాయాలా?’ ఆలోచింపచేసే కవిత.
ఫోన్లలో,ఎస్ ఎం.ఎస్ లలో నోటీసులు మొదలుకుని పెండ్లి పిలుపులదాకా అందుతుంటే ఇక
ఉత్తరాలు ఎవరు రాస్తారు, ప్రత్తుత్తరాలెవరిస్తారు? ఈకవిత చదివినపుడు వెంటనే
కలమందుకుని లేఖకు శ్రీకారం చుట్టి, ఉభయకుశలోపరి అని రాయాలనిపిస్తుంది.
ఇక ‘ ఓ కవిత పుట్టింది’ కవితలో ‘కడుపు నింపుకునే దారి చూపించు, కడుపు నిండని
కబుర్ల కవిత్వాలెందుకు? అన్నారు.నేనేం
చెయ్యాలి మరో కవితెలా పుడుతుంది ’ అని ప్రశ్నిస్తారు. తల్లి
గర్భంనుండి ప్రసవవేదన అనంతరం బిడ్డ రూపం ప్రత్యక్షమైనట్లు కవి మనసును చీల్చుకుని
పుట్టిన కవిత పాఠకుడి మనసును తడిమినపుడు కవితలు పుట్టడమేకాదు పాఠకుల మనసుల్లో
చిరస్మరణీమవుతాయి.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.మరి ఋషిలా
మనగలగాలి అంటే ఆలోచన,అవకాశం.పట్టుదల,పవిత్రత ఇలాంటి సద్గుణాలెన్నో ఉండాలి అంటారు ‘మనిషి ‘ కవితలో!
కవితారచనపై అనురక్తితో కవితలు
వెలువరించిన శ్రీనివాస గాంధీ గారు వస్తువైవిధ్యాన్ని ప్రదర్శించడమే కాదు తన
శ్రీమతికి కవితా జ్ఞాపికగా కావ్య కస్తూరిని రచించి పాఠకులకందించడం ముదావహం. http://www.prabhanews.com/story/article-405948
Subscribe to:
Posts (Atom)















