Showing posts with label అవీ-ఇవీ. Show all posts
Showing posts with label అవీ-ఇవీ. Show all posts
Friday, July 18, 2014
Thursday, May 22, 2014
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
అక్షరమంటే అమితమైన ప్రేమతో మాధ్యమమేదైనా సరే అక్షర ఆవిష్కరణ చేయాలనుకునే నాకు జ్యోతి వెలిగించిన చిరుదివ్వె నా చిన్నిగుండె చప్పుళ్లు. మనసు పరుగిడినంత వేగంగా మనిషి పరుగులు పెట్టలేనపుడు మధ్యమధ్యలో చతికిలపడటం ఖాయం.ఈ మధ్య అదే జరుగుతోంది.అయితే ఈ రోజు నా బ్లాగు పదివేల వీక్షకులను దాటినట్లు చెప్తుంటే బాల్యం మనసును తాకిందేమో,ఉత్సాహం ఉరకలువేసి బ్లాగ్మిత్రులకందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Tuesday, December 31, 2013
Sunday, November 17, 2013
భువన సుందరి
“ మీకు తోచడంలేదా? బోర్
కొడ్తోందా?అయితే అలా లాంగ్ డ్రయివ్ వెళ్దామా?” అన్న మా అమ్మాయి మాటలకు అమెరికాలో మనకు పొద్దుపోవడం ఎలా అని ఆలోచిస్తున్న నాకు సంబరం పెరిగి నన్ను చిన్నపిల్లని చేసేసింది.
“ఎందాకా అన్నాను?”
“చెప్తాగా!” అంది ఊరిస్తూ.
“ చెప్పు తల్లీ మా బంగారు కదా!” అన్నాను.
“మనం బూన్ కు వెళ్తున్నాం” అంది.
“అక్కడ ఏముంది?” అన్నాను.
“నీకిష్టమైనవి!అంతే కాదు గ్రాండ్ ఫాదర్స్ మౌంటెన్ కూడా” అంది.
అర్థమైంది చెట్లు,పూలు చూస్తూ అక్కడికి వెళ్తామన్నమాట!
మరిక ఆలస్యం
కాలేదు.కుటుంబమంతా చకచకా తయారైపోయాము.
ప్రకృతిలో మమేకమైతే దైవం
కళ్లెదుట సాక్షాత్కరించినట్లే!
వాస్తవానికి అరకులోయ నా
నోస్టాల్జియా!అందుకేనేమో ఆనాటి జ్ఞాపకాలను తడి ఆరనివ్వని నిరంతర మననంలో ఇలాంటి
పయనాలు పునశ్చరణలే!
మాటల కలబోతలో దూరం
తరిగిపోతోంది. ఫాల్ ప్రారంభమైందంటే అమెరికా లో రంగుల హరివిల్లే!పచ్చని చెట్లన్నీ
పసుపు,ఆరెంజ్ రంగుల మిశ్రమమై కనువిందు చేస్తున్నాయి.
మాటమరచి,చేష్టలుడిగిన నాకు,
పరచుకున్న కదంబం
అల్లంతదూరాన కనువిందు
మనసు దరిచేరిన హరివిల్లు
కనకాంబరపు లేత వర్ణార్ణవహేల
పచ్చదనానికి మేలి ముసుగు
ఆరని గోరింట గురుతులు
సృష్టికర్త చిలకరించిన పుప్పొడులు
రంగుల హోళీ ఆడుతున్న
ప్రకృతికేళి
చూపరుల చూపును నిశ్చలమై
నిలిపి
అనిమేషులుగ మార్చిన భూన్ సుందరి
నన్నుఅలరించిన భువన సుందరే!
Saturday, November 2, 2013
Wednesday, August 14, 2013
Sunday, August 4, 2013
స్నేహబంధము ఎంత మధురము!
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం! అన్న పలుకులెంత మధురం అనిపించక మానవు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే స్నేహితుల వేడుక ఫ్రెండ్ షిప్ డే!స్నేహసౌరభం ఎల్లెడలా వ్యాపింపచేసే ఈ రోజు ఆగస్టు మాసం మొదటి ఆదివారంతోపాటు అడుగేసేరోజు.
నిజమైన స్నేహానికి అసలైన చిరునామా ఎల్లలెరుగని
బాల్యం.స్నేహానికి అంకురార్పణ జరిగేది కల్లాకపటం తెలియని బాల్యంలోనే.తల్లి ఒడివీడి
బడి చేరినపుడు ఏర్పడే మానసిక శూన్యం సాటి పిల్లల స్నేహ మాధుర్యంతో
నిండుకుంటుంది.స్కూల్,ఆపైన కాలేజీ అటు
తరువాత మరిన్ని పై చదువులు. చివరకు ఉద్యోగాలలోనో,వ్యాపారాలలోనో స్థిరపడ్డాక
కూడా బాల్య స్నేహితులను కొందరు మరువలేరు.చిన్నప్పటి స్నేహితులను ఎన్నోసంవత్సరాల తరువాత కూడా గుర్తుపెట్టుకునేవారు కొందరైతే
స్నేహంగా పలకరించిన వారిని ఎక్కడ చూసామబ్బా అని తలలు పట్టుకునే వారు
మరికొందరు.ఏది ఏమైనా స్నేహ పరిమళం మల్లెలు,గులాబీలు కలబోసిన కలశ తీర్థం.నేటి
స్నేహాలలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన పెనుమార్పులు స్నేహ పరిధిని పెంచాయి. ఫేస్ బుక్
తెరవని వారు అరుదు.స్నేహితుల సంఖ్య వందలు దాటుతోంది.కాని అది పరిమితులకు లోబడిన స్నేహం.
తాత్కాలిక స్నేహాలు కొన్నుంటాయి.వ్యాపారాభివృద్ధికై జరిగే
సమావేశాలు లేదా ఎవరి పుట్టిన రోజు,పెళ్లి
పార్టీలలోనో పరిచయమైన కొత్త నేస్తాలు వీరు. ఇవి ఎంత తొందరగా ఏర్పడుతాయో అంత
తొందరగా అంతర్థానమవుతాయి.కొన్ని సందర్భాలలో కొంతకాలం కొనసాగవచ్చు. అయితే
ఫలాపేక్షలేని స్నేహమే నిజమైన స్నేహంగా నిలబడుతుంది.ఎలాంటి భేషజాలకు పోని స్నేహమే
నిజమైన స్నేహం.
స్నేహానికి ముఖ్యమైన ధర్మాలు మూడు.మొదటిది,స్నేహంలో
కల్మషం ఉండ కూడదు.ఇక రెండవది మోసానికి తావివ్వరాదు.మరి చివరగా స్నేహితుల నడుమ
అబద్ధాలు ప్రవేశించ కూడదు. అప్పుడా స్నేహం నిత్య పరిమళమే.
నీ స్నేహితుల గరించి చెప్పు,నీ గురించి నేను
చెప్తాను అంటారు.మంచి చెడుల విశ్లేషణకు స్నేహం కూడా ప్రామాణికమే!వేగవంతమైన
జీవనపరుగులో ఓదార్చే చల్లని చలివేంద్రం స్నేహం.హృదయాలను స్వచ్ఛంగా,నిర్మలంగా
ఆవిష్కరించినపుడే మాలిన్యంలేని స్నేహానికి బీజం పడుతుంది.స్నేహధర్మాలకు
తిలోదకాలిస్తే,’దోస్త్ దోస్త్ న రహా’ అని పాడుకోవలసివస్తుంది. స్నేహానికి
పట్టం కట్టిననాడు స్నేహబంధము ఎంత మధురము....
Sunday, June 16, 2013
నాన్నా నమామి!
అమ్మ! అనగానే అమ్మేకదా,ఏం అనదు అనే భరోసా.అదే నాన్న అనగానే అమ్మో! ఎక్కడివాళ్లక్కడ గప్ చుప్!అందరికీ ఇదే సూత్రం వర్తించక పోవచ్చు అయితే నా విషయంలో మాత్రం అమ్మ దగ్గరకన్నా నాన్న దగ్గరే చనువు ఎక్కువ. అందుకేనేమో నాన్న మమ్మల్ని వీడేదాకా ఆయన వెన్నంటి ఉండగలిగే అవకాశాన్ని ఆ దేవుడు అనుగ్రహించాడు.
అందరము జీవిస్తాము, మరణిస్తాము. మంచి చేయాలి అని అంతా చెప్తారు అయితే నువ్వు అందరికి మంచి చేయలేకపోవచ్చు కాని ఎవరికి చెడు మాత్రం చేయకు అని చెప్పేవారు.నిజంగా ఆయన జీవితాన్ని కాచి వడబోసి చెప్పిన మాటలు, ఆయన మరణాంతరం కూడా మేము శతక సమానంగా నేటికి వల్లెవేస్తూనే ఉన్నాము.
పని చేయడం కష్టంగానే ఉంటుంది,కాని పని పూర్తయాక దొరికే ఆనందం ముందు ఈ కష్టం ఎంత అని అడుగడుగునా మమ్మల్ని కార్యోన్ముఖులను చేయడంలో ఆయన ఓర్పు,నేర్పు ఈనాటికీ చెయ్యి పట్టుకుని నడిపించినట్లే ఉంటుంది.
ఇక క్రమశిక్షణ మోతాదు మించినా నేటికీ అదే మార్గదర్శిగా దారి చూపుతోంది.భోజనానికి ముందు మరచిపోకుండా చేతులు కడుక్కోవడం,తినేటప్పుడు చప్పుడు రాకుండా తినడం...ఇలా ఎన్నో రూల్స్ అండ్ రెగులేషన్స్ మా బాల్యంలో మాకు మింగుడు పడేవికావు.అయితే ఆ సారమంతా గ్రహించినవారము కదా మాకు తెలియకుండానే అదే జీవనసరళికి అలవాటుపడిపోయాము.
తండ్రెపుడు పిల్లల క్షేమాన్నే కాంక్షిస్తాడు.తండ్రి మాట కరుకైనా మనసు వెన్న అన్నది అందరికి అనుభవైకవేద్యమే కదా!
ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు నమస్సులు!
Saturday, June 1, 2013
కాలాతీత వ్యక్తి డా. పి.శ్రీదేవి
ఇందిర పాత్రపై సుజాతగారి విశ్లేషణ చదివాక నేనిది 2010లో రాసాను.ఈ రోజు వనజవనమాలి గారి విశ్లేషణ చూసాక ఈ వ్యాసం మళ్లీ పోస్ట్ చేస్తున్నాను. నేనెప్పుడో చదివిన కాలాతీత వ్యక్తులు నవలపై మరోమారు
స్పందించాలనిపించింది. నవలలెన్నో పుట్టాయి,పుట్తున్నాయి.కొన్ని నవలలు మనం చదువుతాము,కొన్ని మనల్ని చదివిస్తాయి.ఈ కోవలోకే చెందుతుంది డా.పి.శ్రీదేవి రచించిన కాలాతీతవ్యక్తులు.అసంఖ్యాకమైన నవలలు
చదివుంటాము.కాని అన్ని గుర్తుండవు.కొన్ని
అవే మరుగునపడిపోతాయి.అయితే దాదాపు యాభైయేండ్లనాటి నవల ఇప్పటికీ మనతో సహప్రయాణం చేస్తోంది.బ్రతుకుబాటలో కుటుంబం ప్రాథమికవ్యవస్థ.బంధువులు ,స్నేహితులు, పరిచయాలు,వృత్తి అవసరాలు ఇత్యాదివెన్నో పునాదిగా ఏర్పడ్డది
సామాజిక వ్యవస్థ.ఈ రెండు వ్యవస్థలే మనిషి మనుగడను శాసిస్తాయి అని ప్రస్ఫుటింపచేస్తుందీ నవల.ఇఫ్పటికీ ఆనాడు శ్రీదేవి చిత్రించిన వ్యవస్థ తీరు తెన్నులు అటు
సమాజంలోను ఇటు కుటుంబంలోను దర్శనమిస్తూనే ఉన్నాయి.
ఇందిర,కళ్యాణి,ప్రకాశం,క్రిష్ణమూర్తి,డా.చక్రవర్తి,ఆనందరావువంటి పాత్రలు సజీవ చిత్రణలే.ఆనందరావునుండి క్లోనింగ్ చేయబడ్డవ్యక్తులుకోకొల్లలు,ఆనందరావుది సుఖజీవనానికి అలవాటుపడ్డ ప్రాణం.బాధ్యతారాహిత్యానికి అతడే నిలువెత్తు
నిర్వచనం.కూతురిపైనే పరాన్నభుక్కులా
ఆధారపడే తండ్రులున్నారు ఇప్పటికీ.కూతురు ఉద్యోగం చేయకపోతే తమకు తెల్లవారదని,కూతురు అత్తగారింటికి వెళితే సిగరెట్లకు,తాగుడుకు ముఖం వాయాల్సివస్తుందని కడకు కూతుర్లను వృద్ధకన్యలను చేసే మహానుభావులైన తండ్రులు నేడు లేరనలేం. అలాంటి ఆనందరావు తన కూతురైన ఇందిరకు స్వేచ్ఛనిచ్చి తను స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాడు.ఇక శవంపై రాబందుతో పోల్చదగిన పాత్ర శేషావతారం.చెల్లెలిని ఉద్ధరిస్తున్నానంటూ ఆమె ఆస్తిని ఆబగా చప్పరించేసి ఆమె కొడుకు ప్రకాశాన్ని కీలుబొమ్మలా ఆడించాడు,డాక్టరు కోర్సు చదివించడానికి.తనకంటూ ఒక వ్యక్తిత్వంలేని ప్రకాశం నిజంగా ఒక డాక్టరుగాకాక ఏసీదాసాదా వ్యక్తో అయితే పాఠకుడు రాజీపడేవాడు.అర్భకుడని ఇందిర క్షమించినా పాఠకులు క్షమించలేని వ్యక్తి ప్రకాశం. ఇందిర వ్యక్తిత్వం అంచనాలకతీతం.ఇందిరలాంటి స్త్రీని ఆనాడేకాదు నేటికి హర్షించదు సమాజం.గళమెత్తి పోరాడే గొంతుకామెది. అనాలనుకున్నది అనెయ్యడం. చేయాలనుకున్నది చేసెయ్యడం.ఇవే ఇందిర పాత్రకు ప్రత్యేకత కలిగించాయి.స్త్రీకుండే సహజధోరణిలో కళ్యాణి,ప్రకాశంలకు ఎడం కల్పించి ఆమె ప్రకాశానికిదగ్గరైనా,అతడి భీరుత్వాన్ని చూసి భీకరంగా మండిపడ్డ యువతి.భర్త అనేవాడు భార్యకు రక్షణవలయంగా ఉండాలంటుంది.తన కాళ్లమీద తాను నిలబడుతున్నానన్న అభిమానం ఉన్నఇందిరకూడా తాను మగవాడికి రక్షణకాదు తనకు రక్షణ కావాలని కోరుకుంటుంది.అయితే స్త్రీ తనకందిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోరాదన్న పాఠం నేర్పుతుంతీమె గమనం.
ఈ నవలలో మరొక ముగ్ధ కళ్యాణి.చిరుగాలికే వణికే చివురుటాకువంటి అమ్మాయి.చిన్నప్పుడు వైద్యవిద్య చదివించలేనని తండ్రి బి.ఎలో చేర్పిస్తాడు,అది ఆమెకు మొదటి దెబ్బ.తనవాడనుకున్న ప్రకాశం తన మరణవార్త తెలిపితే వచ్చి ఆదుకుంటాడని భ్రమపడటం ఆమె జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ.ఎవరు ఎవరికి ఏమీకారు ఆనుకున్నతరుణంలో చిత్రంగా ఒకనాటి సహాధ్యాయి వసుంధర ఆదుకుంటుంది.అలాగే మునసబు రామ్మూర్తినాయుడు ఆమెను తండ్రిలా ఆదుకుంటాడు.కళ్యాణిని పరామర్శించడానికి వచ్చినప్పుడు అతడికి గుండెపోటు వస్తుంది.ప్రకాశం స్నేహితుడు క్రిష్ణమూర్తి,డాక్టరు చక్రవర్తి కళ్యాణికి అండగా నిలుస్తారు.మునసబు మరణిండంతో ఆమెను ఆదుకోవాలనుకుంటారు.అందరు చేయూతనందించేవారే కాని ఆమెకు అందుకోవాలనే ఇచ్ఛ లేదు.నిర్లిప్తత ఆవరించుకున్న కళ్యాణిలోమార్పు తెస్తాడు డాక్టరు చక్రవర్తి.ఘనీభవించిన ఆమె హృదయాన్ని మీటి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.అలాగే క్రిష్ణమూర్తి వసుంధరకు దగ్గర కావాలనుకుంటాడు. అయితే ఇందిరకు అనుకోకుండా కట్టుబడిపోతాడు.
ఇందిర తన ఎప్పటి ధోరణిలోనే సాగిపోతుందను కుంటాడు పాఠకుడు.కాని నవల చివరలో ఆమె జీవితాన్ని విశ్లేషించిన తీరుకు అబ్బురపడతాడు. తననుతాను కాపాడుకోగల సత్తా ఉన్న యువతినని ఇందిర ధీమా.ఆ ధీమా అందించిన మాటల జలపాతహోరు ప్రకాశం, కళ్యాణి,క్రిష్ణమూర్తి తదితర పాత్రలు జీర్ణించుకోలేవు.ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోలేక గుటకలు మింగుతారు.ఇలాంటి సన్నివేశాలే పాఠకులలో ఉత్కంఠను రేపుతాయి. తరువాతేమవుతుందోనన్న ఉత్సుకతను కలిగించి ఏకబిగిని చదివిస్తాయి.ఈ నవలలోనున్న కీలకాంశం ఇదే.
కొన్ని పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. అలాంటిదే వైదేహి పాత్ర.ఆనాటి సాంఘిక భద్రతా వలయంలో వేసారిపోతుంది వైదేహి.సోదరుడి అతిప్రేమ జలగలా పట్టుకుని ఆమెను ఎటు కదలనివ్వదు. వెన్నంటే పెళ్లిచూపుల ప్రహసనాలకు ఎదురొడ్డి నిలవగలగడం అప్పటికే వేళ్లూనుకున్నదనడానికి వైదేహి పాత్రే నిదర్శనం.
ఎన్నో సామాజికాంశాలను తడిమిన నవల కాలాతీత వ్యక్తులు.సినిమాకోణంలో కాక సమాజపరంగా దృశ్యీకరించుకుంటూ చదివితే ఈ నవల నిరంతర చర్చా వేదికే.
Subscribe to:
Posts (Atom)






