Thursday, July 25, 2013

చేరువైనా,దూరమైనా మాటమహిమే!

10 comments


నేటి ఆంధ్రభూమిలో(25-7-13) నా వ్యాసం.

       సృష్టిలో మనిషికి మాత్రమే లభించిన వరం వాక్కు. మన మాటలో ఎంతగా విజ్ఞత పాటిస్తే అది మంత్రమై ఎదుటివారిని అంతగా అలరిస్తుంది. చిలకలకు, మైనాలకు మాటాలు నేర్పితే అవి మనం నేర్పిన మాటలనే పలుకుతాయి. అదే మనిషైతే సొంత ఆలోచనాశక్తితో భావాలను పంచుకుంటాడు. పసిపాపలను లాలించి, బుజ్జగించే మాటలు, ఎదిగిన పిల్లలను అనునయించే మాటలు, కష్టాల బారిన పడినవారిని ఓదార్చే మాటలు... ఇలా ఎన్నో రూపాలలో మాటే మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే, మాటలను వినియోగించేటప్పుడు పాటించాల్సిన కనీస మర్యాదల్ని విస్మరిస్తే- మాటలే తూటాలై పేలి అవతలి వ్యక్తి మనసును గాయపరుస్తాయి. కటువు మాటలు పాముకాటుకన్నా విషపూరితం. తప్పు చేసిన వారిని దండించే సందర్భంలో సౌమ్యత పాటిస్తే మళ్లీ ఆ తప్పు జరిగే అవకాశం ఉండదు. ఎపుడూ అరుస్తూ, కేకలు వేస్తూ కంకర రాళ్లలాంటి మాటలను ఇతరులపై ప్రయోగిస్తే మనసుల మధ్య దూరం కొలవలేనంతగా పెరిగిపోతుంది.
       ‘మీరొక మాట చెప్పండి.. పనవుతుంది..’ అని కొందరంటుంటారు. అది పెళ్లి సంబంధమైనా కావచ్చు. ఉద్యోగానికి సిఫారసు కావొచ్చు. కొంతమంది మాటకున్న విలువ అలాంటిది. కొంతమంది పెద్దలు అంతగా చదువుకోకపోయినా, సాహిత్యంపై పట్టులేకపోయినా అనుభవం నేర్పిన పాఠాలను తమ మాటలలో రసాత్మకంగా చెబుతుంటారు. అలాంటి వారి మాటలు భావితరాలు తమ జీవనగమనంలో పేర్చుకోవలసిన మైలురాళ్లని అర్థమవుతుంది. అలాగే, కొందరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. మరి కొందరు ప్రయోజనం లేని మాటలను ఊసుపోక చెబుతూ పదే పదే వల్లె వేస్తుంటారు. పరుగులు తీసే కాలానికి ఇలాంటి మాటలు ‘స్పీడ్ బ్రేకర్లే’. కాలం విలువ తెలిసిన వారు మాత్రం ఇలా వృథా మాటలతో కాలక్షేపం చేయరు. మాటతీరుతో ఎవరి ము ఖభావాలను గానీ, వారి మనసులో ఏముందో గానీ కొంతవరకూ చెప్పవచ్చు. కానీ, ఇది ఎల్లవేళలా సాధ్యం కాదు. తేనెపూసిన మాటల గమ్మత్తేమిటంటే మనకు తెలియకుండానే ఆ మాటలు నిజాలని నమ్మేస్తాం. అసలు నిజం బయట పడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మాటలను సమతూకంలో వాడటం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. కానీ, ఆ పద్ధతిని అలవాటు చేసుకోవడం అంత కష్టమేమీ కాదు.
‘మేం చాలా కచ్చితంగా మాట్లాడతాం, ఏదైనాసరే కుండబద్దలు కొట్టినట్లు చెప్తాం..’ అని ఎవరైనా అంటే- వాళ్లు కుండల్ని కాదు.. ఎదుటివారి హృదయాన్ని బద్దలు కొడుతున్నారని గ్రహించాలి. చెప్పే విధానంలో సౌమ్యత లేకపోతే వినే వ్యక్తిలో గౌరవం తగ్గుతుంది. దీంతో ప్రేమాభిమానాలు తగ్గిపోయ ఒకరికొకరు దూరమవుతారు. మనసు గాయాలకు మంచి మాటే సరైన లేపనం. ‘మా మాటే శిలాక్షరం’- అని ఎవరైనా మొండిగా అనుకుంటే వారు మనుషులేనా? అన్న మాట వాడక తప్పదు!
http://www.andhrabhoomi.net/content/c-56








Sunday, July 21, 2013

రసరమ్య కథాగుచ్ఛం

3 comments
21-7-13, ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నా సమీక్ష.



  రసరమ్య కథాగుచ్ఛం
          రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక ప్రచురించిన కథాసంపుటం సోమేపల్లి పురస్కార కథలు. ఇవి చిన్న కథలే అయినా మనసుపై పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. ఇందులో కలమూనిన రచయిత(త్రు)లు తమదైన శైలిలో కథాంశాన్ని క్లుప్తంగా, సూటిగా సముచితరీతిని చెప్పిన తీరు అభినందనీయం.
             కథారచన రచయిత(త్రి) మనసును నిత్యం తొలిచే వడ్రంగి పిట్టలాంటిది.లక్ష్యం దిశగా సాగిన అక్షరసేద్యం పండేదాక మస్తిష్కం నిద్రపోదు. కథాహాలికుల రచనాతపస్సు ఫలసిద్ధి పొందడం ప్రచురింపబడినప్పుడే!వందేళ్ల కథావైభవం ప్రభవిల్లుతున్నవేళ రమ్యభారతి వంటి సాహిత్య పత్రికలేకాక మరెన్నో దిన,వార,మాసపత్రికలు కథలపోటీలు నిర్వహిస్తూ  రచయిత(త్రు)లకు  అందిస్తున్న ప్రోత్సాహం హర్షణీయం.
సూక్ష్మాంశాన్ని సునిశిత పరిశీలనతో చిన్నకథలలో అందంగా అమర్చి పాఠకులకు అందించాలని సోమేపల్లి సాహితీ పురస్కారాలను నెలకొల్పి కథకులకు కథా ఉద్దీపన గావించడం హర్షదాయకం. దాదాపు ముప్ఫైకథలకు పైగా సంపుటీకరించి ప్రచురింపబడ్డ ఈ కథలలో వస్తువైవిధ్యం ఎన్నతగినది. భాషలో సరళత్వం,భావనలో గాఢత  పొదిగి మన ముందు పేర్చిన కథలు పలు సామాజికాంశాలను జల్లెడ పట్టాయి.
                జీడిగుంట రామచంద్రమూర్తిగారి కథ గుండెపోటు. ఇది కొడుకు ప్రవర్తనతో గుండె కోతకు గురైన తల్లి కథ. గుండెలకు హత్తుకుని పెంచిన బిడ్డలు గుండెక్షోభ కలిగిస్తే మరి గుండెపోటు శరీరానికికాదు,మనసుకు అని తెలియచెప్తుంది.
              పచ్చని చెట్లపై పక్షుల కిలకిలల మేలుకొలుపులు నేడు కేవలం మనసుపొరలలో మాత్రమే నిక్షిప్తమైన ఆడియోలుగా  మిగిలిపోయాయని తెలియచెప్పే కథ రేణుకా అయోల రచించిన కథ, అలారం’. గడియారమో,సెల్ ఫోనో గగ్గోలు పెట్తేనే తప్ప మనకు నిద్రలేవాలన్న కోరిక ఉండదనడానికి మనం కోల్పోయిన కిలకిలారావాలే! పెకిలించి వేయబడ్డ చెట్ల స్థానంలో వెలసిన అపార్ట్ మెంట్లు కిలకిలల బదులు కలకలం మిగిల్చాయంటుందీ కథ.
 వృద్ధులను  జీవచ్చవాలుగా పోలుస్తూ వారిని అపహాస్యం చేసే యువతకు చొప్పదండి సుధాకర్ రచించిన       రెక్కలుతెగిన పక్షులు కథ చెంపపెట్టు.
                అన్ని అనర్థాలకు మూలం లంచమనే విషపురుగే.ఇది కుట్టినచోట అన్యాయం న్యాయమైపోతుంది. ఏదేశానికైనా వెళ్తే నేను ట్రావెలర్ గా వెళ్తాను,అదే భారతదేశానికైతే పిల్ గ్రిమ్ గా వెళ్తాను అనే విదేశీయులముందే మనం లంచావతారాలమై ఇవీ మా నిజస్వరూపాలు  అని నిలబడటం బాధాకరం. బస్సులో బయల్పడిన డ్రగ్స్, అధికారుల ధనాశతో మాఫీకావడం మనదేశంలో లంచం ఊడలమర్రిలా ఎలా వ్యాపించిందో తెలిపే కథ జె.ఆర్.సుధీర్ రచించిన బలమైన కుటుంబాలు-బలహీన సమాజం.
వడలి రాధాకృష్ణగారి  నింగి నీడలు ‘. ఇందులోని కరుణరసాత్మక కథనం మనసును చెమరుస్తుంది. గర్భాన్ని అద్దెకిచ్చే తల్లుల మమకారాన్ని ఆర్థికావసరం ఎలా నలిపి పిండి చేస్తుందో చెప్పే కథ. పిల్లలులేని కమలాకరం,దాక్షిణ్య బిడ్డ కోసం ఒక తల్లి గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు.ఆ తల్లికి బలవర్ధక ఆహారం  ఏర్పాటు చేస్తారు. కాని వారు విధించిన షరతు తల్లి మనసును ఆలోచింపచేస్తుంది. బిడ్డలో ఏదైనా అవాంఛనీయత కనబడితే   ఆ బిడ్డను అంగీకరించలేమన్నప్పుడు ఆ తల్లి తీసుకున్న నిర్ణయం చదవాల్సిందే.
            ఆతిథ్యం నిడివిలో చాలా చిన్న కథే! చిన్నారి రమ్య మనసులో, కేవలం పాలు తాగి, బడికి వెళ్లి ఆకలితో లంచ్ బెల్ వరకు వేచి చూసే కంటే అతిథి వచ్చినప్పడు అమ్మ తప్పక చేసే టిఫను తినగలను అనుకుంటుంది. అందుకు  అతిథిని పదిరోజులైనా ఉండమనే రమ్య మాటలు మనసును కలుక్కుమనిపిస్తాయి. చాలీచాలని జీవికలకు అద్దం పడుతుందీ కథ. చిన్న కథలలో గొప్పకథలంటే ఇవే!
          టి.ఎస్.ఎ.కిష్ణమూర్తిగారి కథ సుచిత్ర నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలకు  నిలువుటద్దమే. వేధించిన భర్తే నాలు సంవత్సరాల తరువాత వచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నా అతని ప్రవృత్తి తెలిసిన సుచిత్ర ఆత్మస్థైర్యంతో అతనికి దూరంగా, బిడ్డలకు దగ్గరగా నిలబడి తానేమిటో తెలియచెప్తుంది.
         దేశ పురోగాభివృద్ధిలో వీధికొక బడే కాదు ప్రతి వీధికొక వృద్ధాశ్రమము ఏర్పడుతున్నాయి.  అయితే ఈ వృద్ధాశ్రమాలు  వృద్ధులను కుటుంబాలకు దూరంగా మానసిక బందీలను చేసే బదులు వారికి రిక్రియేషన్ క్లబ్బులుగా మారగలిగితే జీవిత చరమాంకంలో వారికి ఆనందార్ణవమే కదా! ఇదే చెప్తుంది జి.మేరీ కృపాబాయి రచించిన సీనియర్ సిటిజన్ రిక్రియేషన్ క్లబ్ కథ.
               ‘ కొంచెం చేదు,కొంచెం వగరు మనకందరికి అనుభవమైన కథే. నేటి బాల్యం కోల్పోతున్న అమ్మమ్మల, నానమ్మల, తాతయ్యల సాహచర్యం మళ్లీ పొందగలిగిన పిల్లలు ఇక వారి దగ్గరే ఉండి చదువుకుంటామన్న వైనం. సెలవులలో పిల్లలను అత్తమామాలకు అప్పచెప్తే తనకు ఆటవిడుపే అనుకున్న తల్లికి ఈ కథ నామౌచిత్యం శీర్షికకు  సరితూగినదే!
               ఇంటర్నెట్ ప్రసాదించిన ఆటలలో చంపు..చంపు అంటూ ప్రత్యర్థిని హతమార్చే ఆటలు వేలికొసతో ఆడుతున్న చిన్నారుల మనసులను ఆ ఆటలే భూతదయతో నిండాల్సిన వారి మనసులను భూతభయంతో చంపి కలవర పెడుతోంది. ఇది చిన్నకథే కాని మిన్నకథగా మలచిన పాలపర్తి జ్యోతిష్మతిగారి కథ భూతం చదివి ఆ భూతాన్ని వదలగొట్టే ప్రయత్నం చేస్తే బాల్యం భయవిహ్వలం కాదన్న సందేశం బాగుంది.     
                 రమేష్ కుమార్ రచించిన ఖాళీ చదివాక మనసంతా శూన్యమేర్పడి నిజంగానే ఖాళీ ఏర్పడుతుంది. ఆకలిగొన్నవానికి ఆపన్నహస్తం చాచలేనినాడు అది మానవత్వానికి మచ్చేఅని చెప్తుందీ కథ. జీవితచట్రంలో  భర్త జబ్బు వల్ల ఇరుకున పడ్డ భార్య నాలుగు లక్షలు ఖర్చు పెట్టినా నయంకాని రోగంతో తీసుకుంటున్న భర్త ఇంకా ఎంతకాలం బ్రతుకుతాడో చెప్పమని డాక్టరును అడగడం కడుపులో కవ్వం పెట్టి చిలికినట్లవుతుంది.
      వర్ణనలు లేవు,అలంకారాలు లేవు,భాషా చమక్కులు లేవు. అయితేనేం కథలన్నీ ఆకట్టుకున్నాయి. కారణం.. కథలల్లబడిన నేపథ్యం.సామాజికాంశాలకు ఇవ్వబడిన ప్రాముఖ్యం.మానవసంబంధాలు ఉల్కలలా రాలిపడి మనిషిని బంధవిముక్తుడిని చేసాయనుకుని మురిసిపోవడంకాదు కావాల్సింది!అడుగంటిపోతున్న అనుబంధాలను సన్నని దారపుపోగుతోనైనా సరే బలంగా పెనవేయాలనే ఆర్తి కథలలో అంతర్లీనంగా ప్రవహించడం ముదావహం.
                                                                                                                    

                                                                                                                         



                     

Friday, July 19, 2013

మాటే మంత్రం

8 comments



సాయంత్రం నాలుగు దాటింది. అచ్యుతంలో ఆందోళన మొదలయింది. మరో పదినిమిషాలు గడిచాయి. ఇక లాభం లేదు. కోడల్ని అడిగెయ్యాల్సిందే!
"
అమ్మాయ్! రమా ... బాబు, పాప ఇంకా స్కూలు నుండి రాలేదేమ్మా?'' ఆతృతగా అడిగాడు అచ్యుతం.
మామగారివైపు చురచురా చూసింది రమ. 'ఇప్పటికి నాలుగుసార్లడిగాడు. అత్తగారే నయం! కాస్త చాదస్తంగా ఏదో చెప్పేది కానీ ... పని దగ్గర మాత్రం బాగా సాయం చేసేది. ఆవకాయ, వడియాలు ఏడాదికి సరిపడా తయారుచేసేది. ఆమె ఉన్నా బాగుండేది. ఈ మామగారి బాధ ఆమే పడేది. చంపుతున్నాడు. పనీపాటా లేదు. పిల్లలొస్తే వాళ్ల చుట్టూ తిరుగుతాడు. వాళ్లకూ ఊపిరాడనివ్వడు. ఏవో ప్రశ్నలు వేస్తాడు. వాళ్లకూ ట్యూషన్లు, హోమ్‌వర్క్‌లూ ఉంటాయి. పోనీ ... ఈయనేమైనా సహాయం చేస్తాడా అంటే అదీ లేదు. పైగా ... అమ్మాయ్! చదువు, చదువు అని పిల్లల్ని హైరానా పెట్టకమ్మా, ఎంత వయసని! మా రోజుల్లో మాకూ ... అంటూ మొదలెడతాడు. ఎన్నాళ్ళీ నస?'
రమ కోపంగా, చిరాగ్గా అచ్యుతం వైపు చూసి మొహం తిప్పుకుంకుంది.
'నేనే మడిగానని ఆ కత్తుల్లాంటి చూపులు! పాపం చిన్నపిల్లలు. పొద్దుట ఏడున్నరకు ఆటోలో వెళ్తారు. నాలుగుదాటింది, ఇంకా రాలేదు. ఆందోళన పడాల్సింది తల్లి. అదిపోయి గాభరాపడుతున్న నాపై కోపమెందుకు? ఆటో కుర్రాడిని కోపగించి పిల్లల్ని ఆలస్యం చెయ్యకుండా తీసుకురమ్మని దబాయించి చెప్పాల్సింది మాని నన్ను కోపంగా చూస్తే ఏం లాభం! మాటా మంచీ చెప్పుకోకపోతే ఎలా? అంతకన్నా విషాదం ఉంటుందా?'

అచ్యుతం మాటలన్నీ స్వగతమే!
ఐదు నిమిషాలు నిశ్శబ్దం!
"అమ్మాయ్! పిల్లలు ... '' అని మరోమారు అంటుండగానే ఆటో శబ్దం విన్పించింది.
"ఏంట్రా అమ్మలూ! ఆలస్యమైందేం? బాబూ ఆటో కుర్రాడినిలా పిలు'' తనైనా కాస్త గట్టిగా చెప్పాలి, పిల్లల్ని ఆలస్యంగా తెస్తే ఊర్కోనని ... అచ్యుతం మాట మాటగానే మిగిలిపోయింది. చెప్పాలనుకున్న నాలుగు మాటలు బయటకెళ్లే మార్గం లేక మనసులోనే చతికిలబడ్డాయి. "అమ్మలూ'' అంటూ ఏదో చెప్పబోయాడు అచ్యుతం.

"
డ్రెస్ మార్చుకోవాలి తాతయ్యా'' అంటూ పిల్లలు లోనికి తుర్రుమన్నారు. అందరికీ నీటిదాహంతో నాలుక పిడచకట్టుకుపోతుంది. తనకేమో నాలుగు మాటలైనా మాట్లాడకపోతే పిడచకట్టుకుపోతుంది. పిల్లలు వస్తే ఏదో నాలుగు మాటలు వాళ్లతో మాట్లాడవచ్చు కదా అని ఎదురుచూస్తుంటాడు.
పిల్లలు రాగానే చిప్స్‌ప్యాకెట్లు, బిస్కట్లు తయారుగా వుంటాయి. పాలు తిరగబోస్తున్న చప్పుడు. తన చిన్నప్పుడు బడి నుండి రాగానే ఉడికించిన శనగ గుగ్గ్గిళ్ళు, వేగించిన శనగపప్పులు, బెల్లంముక్క లేదంటే అరటిపండ్లు ఇచ్చేది అమ్మ. రాత్రి ఎనిమిది దాటకముందే వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ కలిపిపెట్టేది.
మరోసారి చూశాడు లోనికి. పాపం పిల్లలు ఎంత ఆకలిగొన్నారో. రాత్రికి అన్నం వద్దని వాళ్లెప్పుడైనా మారాం చేస్తే పిజ్జా బర్గరు అంటూ ఆఘమేఘాల మీద విష్ణుమూర్తిలా తెచ్చిచ్చిపోతాడు ఒకడు! ఇక అన్నం దిగుతుందా? కొబ్బరి చిప్పలంత టిఫిన్ బాక్సుల్లో ఎంత కూరి పెట్టినా కడుపు నిండుతుందా? అదే మా కాలంలో ... అయితేనా? అఅటు ఇటు చూశాడు. ఎవరికి చెప్పాలి? అమ్మ పెట్టిన ఆవకాయ బద్ద నంజుకోవడం గుర్తుకొచ్చి లాలాజలం నాలుకను తడిమింది. అయినా నాలుక పిడచకట్టుకుపోతూనే ఉంది, మాట పలికే అవకాశం రాక!

దేశ జనాభా నూరుకోట్లు దాటింది. దేశమంతా జనమే. కాని నాతో మాటలు పంచుకునే వారే లేరు. నేను మాట్లాడితే వినేవారే లేరు. మాటలే మంత్రాలు, మాకులే మందులు అనేవాళ్లు పెద్దవాళ్లు. నలుగురితో కలిసి నవ్వటం కాదుకదా ... నలుగురు కూర్చుని మాట్లాడుకోవడమే లేదు. సెల్లులో సొల్లు తప్ప మరొకటి లేదు. మాటపోయాక ప్రాణం వున్నా పోయినా ఒకటే అంటారు. తనకు మాట పడిపోకుండా ప్రాణం పోయినట్లుంది. తనను వీడి వెళ్లిన భార్య గుర్తుకొచ్చింది.
'సులోచనా! అదృష్టవంతురాలివి నువ్వు. నాకన్నా ముందే వైతరణి దాటేసావ్!' భార్య జ్ఞాపకాలు కాసేపు పొద్దుపుచ్చుతాయి. ఉద్యోగం వున్నన్నాళ్లూ కాలానికి కళ్లెం వేయాల్సివచ్చేది. ఎప్పుడెప్పుడు ఇల్లు చేరుకుని మంచానికడ్డం పడదామా అని ఉండేది. అప్పటికి రేడియోలు మాత్రమే ఉండేవి. కాసేపు పాటలు, కాస్త వార్తలుతరువాత రేడియో కట్టేసేవాడు. పిల్లల చదువులు, కూరగాయలు, పచారీసామాను ... అన్నీ సులోచనే చూసుకునేది!

తాను చేసింది మార్కెటింగ్ ఉద్యోగం అనడం కన్నా మాటల ఉద్యోగం అనడమే సబబు. చెప్పాల్సిన విషయానికి విస్తృతి పెంచాలి కనక మాటలు ఎక్కువే మాట్లాడాలి. ఇల్లు చేరుకునేసరికి సులోచన కాఫీ కాచి ఇచ్చేది. మిఠాయిలో, మరమరాలో ఏవో ఒకటి పిల్లలతో పాటు తనకూ పెట్టేది. కష్టం, సుఖం కలబోసుకోవాలని వుండేదేమో తాను తిన్నంతసేపు తన దగ్గరే కూర్చుని ఏదో చెప్పాలన్నట్టుగా చూసేది. ఉదయం నుండి ఇంట్లో ఒక్కతే వుండేది గనక నాతో అదీ ఇదీ మాట్లాడాలని చూసేది. తనకేమో గొంతుక ఆర్చుకుపోయినట్లు మాట పెగిలేది కాదు. బయట మాట్లాడే ఉద్యోగం. ఇంకా ఏం మాట్లాడగలడు ఇంటికి వచ్చాక! తినడం ఆలస్యం నిద్ర కావలించుకునేది. పాపం! ఏదైనా చెప్పుకోవాలని సులోచన ఎంత తపన పడిందో! ఇప్పుడర్థమవుతోంది తనకి.  ఆమె వుసురే ... ఆగమంటూ మనసు చీవాట్లేసింది. జీవితమంతా తన క్షేమమే కోరిన ఇల్లాలినలా అనుకోవద్దని హెచ్చరించింది.

క్షమించు సులోచనా! నీ మనసులో మాటలు గొంతులోనే అదిమిపట్టేసేదానివి. నేను ఇంట్లో నీ ముందుంటే చాలు అని తృప్తి పడేదానివి. నీ బాధలు, కష్టాలు నేనేమీ పట్టించుకోలేదు. గొంతుకలో బరువుగా ఏదో దిగుతున్నట్టు భావన. ఎగదన్నుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపట్టి మింగుతున్నాడు అచ్యుతం.
పిల్లలిద్దరూ టెన్నిస్ రాకెట్లు వూపుకుంటూ 'బై' చెప్తే దానికి జవాబుగా మాటతో పనేముందిలే అనుకుని మౌనంగా తలాడించాడు అచ్యుతం. మరో గంట గడిచింది. "ఏం నాన్నా ... వాకింగ్‌కి వెళ్లవచ్చుగా, అలా కూర్చున్నారు హుషారు లేకుండా!'' ఇంట్లోకి వస్తూనే అడిగాడు వంశీ. కొడుకు వచ్చి అలా పలకరించగానే అచ్యుతం కళ్లు ఆనందంగా మెరిశాయి. ఎంతైనా కొడుకు కొడుకే! అమ్మాయికి పెళ్లి చేసి పంపించేశాక ఏడాదికి ఒక్కమారే వస్తోంది. ఆ వచ్చినప్పుడు కూడా షాపింగ్‌లు, టైలర్లు, పాత నేస్తాలు, సినిమాలు అని తిరగడమే సరిపోతుంది. కూతురి కూతురంటే తనకి ప్రాణం. వచ్చినప్పుడల్లా 'తాతయ్యా' అని దగ్గరకొస్తే 'మళ్లీ ఏడాది దాకా కనబడవు, నీ జట్టు కటీఫ్' అని మనవరాలితో కాసేపు ఊసులాడేవాడు. అవే బంగారు జ్ఞాపకాలు. మనవరాలికేదైనా కొనివ్వమని కూతురికి చెక్కురాసిచ్చేవాడు. అప్పుడు తండ్రి దగ్గర కాసేపు కూర్చునేది. తను చెక్కు రాసివ్వడానికి అటు, ఇటు చెక్కు పుస్తకం తిరగేస్తూ సరి చూస్తూ అవీ ఇవీ సంసారం విషయాలు, అల్లుడి సంగతీ అడిగేవాడు. 'అబ్బ! అవెప్పుడూ ఉండేవే! ఒక చెక్కు రాయడానికింతసేపా? సంతకం పెట్టు నాన్నా, అవతల బ్యాంకు టైమయిపోతుంది' అని తొందరచేసేది కూతురు. ఆ మధ్య వాకింగ్‌కి వెళ్తే దురదృష్టం వెనకనుండి బైకు రూపంలో దాడి చేసినప్పుడు, ఓ వారం రోజులు నడుమునెప్పితో లేవలేక ఇబ్బంది పడటం వంశీకి తెలిసినా ప్రమాదమేమీ జరగలేదని ఎక్స్‌రేలు చూసి డాక్టరు చెప్పాడని తండ్రిని వాకింగ్‌కు వెళ్లమంటాడు. 'పోతే ఫరవాలేదుకాని కాలు, చెయ్యి పోగొట్టుకుంటే భారం నీకే' అంటాడు అచ్యుతం. అలా అచ్యుతం వాకింగ్‌కు బైక్ నడిపిన కుర్రాడు మంగళం పాడేసాడు. చెప్పమన్నట్టుగా చూశాడు వంశీ.
"తోచడం లేదురా అబ్బాయ్. మాట్లాడేవారే ఎవరూ లేరు. మాట్లాడిద్దామన్నా లేరు. మంచివో, చెడ్డవో నాలుగు కబుర్లు చెప్పేవాళ్లు లేరు. నేను చెప్పబోయినా వినేవారు లేరు. ఇంటిముందు కట్టేసే కుక్కకు నాకు తేడా లేదు. అదే నయం దానిష్టంగా అది మొరుగుతుంది'' చెప్పాడు అచ్యుతం.
తండ్రి మాటలకు వంశీకి నవ్వు వచ్చినా ఆయన నొచ్చుకుంటాడని నవ్వును బయట
అవునులే! చిన్నప్పుడెప్పుడైనా వీళ్లకు నాలుగు మాటలు చెప్పివుంటేనా, అన్నిటికీ అమ్మే. తనదే తప్పు అని మనసుకు సర్ది చెప్పుకునేవాడు. బయటకు కనబడనీక, "నాన్నా, నీ బాధ నాకు తెలుసు. నీ గురించి నేనూ ఆలోచిస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు ఏదో అడ్డంకి వస్తోంది. రేపు సాయంత్రం దాకా ఓపికపట్టు. నేను ఏదో ఒకటి చేస్తాను'' అన్నాడు.

కొడుకేదో మంత్రమేసినట్లు చెప్తుంటే - మనసంతా తేలికపడ్డట్టు సాంత్వన పొందాడు. ఊహలకు రెక్కలు తొడిగి కొడుకేం చేస్తాడా? అని ఆలోచించసాగాడు. మరుసటి రోజు సాయంత్రం దాకా వేచి ఉండాలంటే ఆగలేకపోతున్నాడు.
'మీ నాన్నగారితో ఎలా వేగాలి? చంపేస్తున్నాడు. పిల్లలు ఆలస్యంగా వస్తే టెన్షన్! పేపర్ ఆలస్యమైనా అంతే. హడావుడిగా వచ్చే పేపర్ కుర్రాడిని ఆపి వాడికి నాలుగు సుద్దులు చెప్తారు. నేను చెప్పేదెందుకు? మీరు చూస్తున్నదేగా! పనిమనిషిని పని చేస్తున్నంతసేపు దాని కష్టసుఖాలు తానే ఆర్చేవాడిలా అద్దె నుండి ఇంటి బడ్జెట్ దాకా అన్నీ అడుగుతాడు. మా కాలంలో ఇంత ధరలు లేవు. ఖర్చులు లేవు ఎలా బతుకుతావో అని జాలి చూపిస్తాడు. రేపు పనిమనిషి జీతం పెంచమంటే మాత్రం మానిపించేస్తాను' అప్పుడప్పుడు రమ చేసే ఇలాంటి ఫిర్యాదులకు చెక్ పెట్టాలనే నిర్ణయించుకున్నాడు వంశీ.
"బాధపడకు రమా! ఏదో పెద్దవాళ్ల చాదస్తం. ఆయనకు పొద్దు పోవడం లేదు. దానికి మందుందిలే'' తండ్రికి చెప్పిన సంగతే రమకు చెప్పాడు.
"ఏ మందులు వద్దుకాని మీరు కాస్త ఆయనకు నచ్చచెప్పండి. అందరి వెంట పడకపోతే అదే పదివేలు. ఎవరి బతుకు వాళ్లను బతకనిస్తే చాలు'' రమ విసుగ్గా అన్న మాటలకు కాస్త నొచ్చుకున్నా, 'సరే రేపటికి అంతా సర్దుకుంటుంది' అనుకుని ధీమాగా నిద్రలోకి జారుకున్నాడు వంశీ.
కొడుకు పలకరింపుతో విసుగ్గా పడుకున్నవాడల్లా ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు. కోడలు కాఫీ తెచ్చి ఇచ్చింది ఇద్దరికీ. హమ్మయ్య! కాఫీ తాగేలోపు తను ఇన్నాళ్లూ మధనపడుతున్నది కొడుకుతో చెప్పాలి అనుకున్నాడు. గొంతు సవరించుకున్నాడు. అర్థమైపోయింది వంశీకి. కపోతే అదే పదివేలు. ఎవరి బతుకు వాళ్లను బతకనిస్తే చాలు'' రమ విసుగ్గా అన్న మాటలకు కాస్త నొచ్చుకున్నా, 'సరే రేపటికి అంతా సర్దుకుంటుంది' అనుకుని ధీమాగా నిద్రలోకి జారుకున్నాడు వంశీ.

సాయంత్రమైంది. ఆరుదాటి చీకటి ముసురుకుంటోంది. ఆ లోపల నాలుగైదుసార్లు అడగనే అడిగాడు అచ్యుతం. "అమ్మాయ్ రమా, వంశీ ఇంకా రాలేదేఁ?' అని.
"వస్తారులెండి'' పొడిగా అంది రమ.
'పాపం వంశీ, పొద్దుట పిడికెడు మెతుకులు తినుంటాడు, మా రోజుల్లో ఇలాంటి పాలిష్ బియ్యం తినేవాళ్లమా? దంపుడు బియ్యం, లేదంటే రాగి సంగటి, రోటి పచ్చడి!' అవి ఇప్పుడు లేకపోయినా ఆ రుచులు గుర్తుకు తెచ్చుకుని లొట్టలేస్తూ చెప్పాలనుకున్నాడు. కాని రమ చూసిన చూపుకు చెప్పాలనుకున్న మాటలు గొంతులోనే ఉండిపోయాయి అచ్యుతానికి.
'ఏమిటో ఈ అమ్మాయి ఏదీ వినిపించుకోదు. సులోచన ఉండి వుంటే అన్నీ వినేది!' ముఖం ముడుచుకొని కూర్చున్నాడు అచ్యుతం. 'ఆలస్యానికి కారణం ఫోన్ చేసి చెప్పొచ్చుకదా' భర్త ఆలస్యానికి రమకూ ఆందోళన మొదలైంది. అడపాదడపా కిటికీలో నుండి తొంగి చూస్తున్నాడు అచ్యుతం.

ఆటోట్రాలీ వచ్చి ఆగింది. అందులోంచి టి.వి. అట్టపెట్టె దిగడం చూసిన రమ ఆశ్చర్యపోయింది. టి.వి. కొనాలనేది ఎన్నాళ్ళనుండో ఉన్న కోరికే. కాని ఇలా వున్నట్టుండి కొనడం! పిల్లల పరీక్షలయ్యాక కొనాలనుకున్నారు. కాని వాళ్ల నాన్న కోసమేమో! ఇదేనేమో ఆయనన్న మందు!
"పద పద ఆ టేబుల్‌పై పుస్తకాలు, అవీ అడ్డం తియ్యి'' వంశీ తొందర చేశాడు రమని.
డైనింగ్ టేబుల్ స్టడీ టేబుల్‌గా రూపం మార్చుకుని, ఇప్పుడు టి.వి. టేబుల్ అయ్యింది. టి.వి.కిక కేబుల్ కనెక్షన్ ఇచ్చేస్తే నాన్నకు బోలెడంత కాలక్షేపం. ఎవరినీ పిలిచి పిలిచి విసిగించడు. రమ విసుగూ తగ్గుతుంది. పనిమనిషి తన పని తను చేసుకుపోతుంది మరేం ప్రశ్నలు, ఆరాలు లేకుండా ... అనుకున్నాడు వంశీ.

"చూశారా నాన్నా. మీరిక దిగులు పడనక్కరలేదు. ప్రపంచవార్తలు క్షణాల్లో తెలిసిపోతాయి. ఆట, మాట, పాట, కథలు, సీరియళ్లు, సినిమాలు నీవు ఏది కావాలంటే అది ఇరవైనాలుగు గంటలూ మాట్లాడుతూనే ఉంటుంది''.
తను చేసిన పనికి తండ్రి నుండి మెప్పు ఆశిస్తున్నాడు వంశీ. కొడుకు మాటలు కన్నార్పకుండా వింటున్నాడు అచ్యుతం.
'నా కొరకు మాట్లాడే యంత్రం తెచ్చావన్నమాట. చివరికి ఇదా నాకు తోడు' అన్నట్లు నిట్టూర్చాడు అచ్యుతం.
తండ్రిలో తానాశించిన సంతోషం కనబడకపోయేసరికి "నాన్నా రేపు కేబుల్ కనెక్షన్ వచ్చేస్తుంది. మీకిక మాటలకు కొదవుండదు. మీకిక దిగులక్కరలేదు. మీకిక బోర్ ఉండదు'' ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు వంశీ.
'నిజమే ... చాలా మాటలే వినిపిస్తాయి. బొమ్మలే కన్పిస్తాయి. దిగులు ఉండదు, బోరు ఉండదు. కాని నేను చెప్పాలనుకున్నది ఎవరికి చెప్పాలి? మా కాలంనాటి ... ఎన్నో సంగతులు ఎవరితో చెప్పుకోవాలి? మనిషి మనిషితో మాట్లాడుకోలేడా, నేను మాట్లాడితే టి.వి. వింటుందా? 'ఊఁ' కొడుతుందా ... మా కాలంలో ... ' ఎన్నో చెప్పాలనుకున్న అచ్యుతానికి మాట జీరబోయి గొంతుకేదో అడ్డం పడింది.

ఆంధ్రజ్యోతి సౌజన్యంతో