Wednesday, June 27, 2012

మీరు క్యూలో ఉన్నారు






 4-7-2012-నవ్య వీక్లిలో  ప్రచురింపబడ్డ నా కథ

ఇవాళ కాస్త తొందరగా రారాదూ  సరోజిని కొడుకును బ్రతిమాలుతున్నట్టుగానే అడిగింది.
రారాదు అని మనసులోనే అనుకుంటూ, ఈ రోజు ఆడిట్ జరుగుతోంది.బాగా ఆలస్యమవుతుంది.విసుగ్గా అన్నాడు శశాంక్.
మరి నిన్న పక్కింటి మమత ఆంటీ చెప్పిన మాట!గట్టిగా అడగటానికి సరోజిని సంకోచిస్తోంది.
మొన్నఎదురింటి ఆంటీ అయింది,ఇప్పుడిక పక్కింటి ఆంటీ,అమ్మా నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనిస్తావా?
మీ అమ్మ అడిగేదాంట్లో నీ ప్రశాంతతకు భగ్నమేమిటో!అంతే విసుగ్గా అన్నాడు శశాంక్ తండ్రి రఘుపతి.
ఇదిగో మళ్లీ వాదనలొద్దు,ఎలాగైనా ఈ ఏడాది నీ పెండ్లి కావాల్సిందే సరోజిని ముఖంలో దుఃఖం నీడలు పరుస్తోంది.
ఎందుకు కాదు?మొట్టమొదట నాలుగో ఫ్లోర్ అంకుల్ చెప్పిన సంబంధమని నెలరోజులు డిటెక్టివ్ ల్లాగా సర్వే చేసి చేసి,వివరాలన్నీ సేకరించుకుని,అదీ నేను ఒప్పుకున్నాక మీరు నీళ్లు నములుతూ తేల్చేసారు.ఏమంటే అమ్మాయి కాస్త ఛాయ తక్కువ అన్నారు.సరే మీ ముచ్చటెందుకు అని నేను పట్టుపట్టలేదు. మొన్న ఎదురింటి ఆంటీ చెల్లెలు కూతురు అంటూ ఆ అమ్మాయిని ఏకంగా ఇంట్లోకే తెచ్చేసారు. అంతటితో ఆగారా,లేదే నాకు పరిచయం చేసి ఆ అమ్మాయిని  నా బైక్ పై కూర్చోబెట్టుకుని పది కిలోమీటర్ల దూరాన ఉన్న వాళ్ల తాతయ్య ఇంటిదగ్గర వదిలేదాక మీరు నన్ను వదలలేదు.
అమ్మాయి పసిమి ఛాయ,వంశం బాగుంది,ఆస్తి బాగుంది,పెట్టుపోతలు బాగున్నాయి,మేము రెఢీ అని గంట కొట్టాం కాని  నా ప్రక్కన పీటకాదు స్టూలు వేసి నిలుచోబెట్టాలి అని నువ్వేగా వద్దన్నావు.మాటలు వెతుక్కుంటున్న భార్యకు వత్తాసుగా పలికాడు రఘుపతి.
నిజమే మీరు చెప్పేది కాని నేను ఒప్పుకుని ఉంటే ఈడుజోడు లేని అమ్మాయిగా కనబడేదికాదా?నాకేమో సరిజోడు కావాలి,మీకేమో ఆస్తి,అంతస్తు,వంశం,పలుకుబడి వగైరా వగైరా!ఆవగైరాలో భారీ కట్నముందని అందరికీ తెలుసు.ఇప్పుడివన్నీ ఎందుకులేమ్మా కొన్నాళ్లు ఈ సంబంధాల వేట వదిలెయ్యండి.తన నిర్ణయమదేనన్నట్లు గట్టిగా చెప్పాడు శశాంక్.
నువ్వలా అనేస్తే ఎలా నాయనా, ఏదో నీ పెళ్లి చూస్తేగాని నా బొంది పోదని నీకు తెలుసుకదా! ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేసుకుందాం.ఈ ఒక్కరోజుకు సెలవు పుచ్చుకోరా.
నానమ్మా, ఇంకా నీ మాట వినబడలేదేమా అని చూస్తున్నాను.నాపెళ్లి చూసాక నాకు కొడుకు పుట్తే చూడాలంటావు,తరువాత వాడిపెళ్లి!విరిగిన కాలును శపిస్తూ మంచంలో ఉందికాని లేకపోతే అపార్ట్ మెంటంతా కలియదిరిగి ఇంటికొక సంబంధం తీసుకునిరాగల సమర్థురాలు.నానమ్మపై మనసులోనే సెటైర్ వేసుకుని, ఇలా కుదరదుకాని మీకు తెలిసిన అమ్మాయిలనందరినీ ఒకరోజు పెరేడ్ చేయించండి,ఏ అమ్మాయి బాగుందో చూసి...
చాల్లే వేళాకోళం,పెళ్లంటే ఎన్ని చూడాలి?సరోజిని నిట్టూర్చింది.
 “ఎన్ని చూస్తారు(సంబంధాలు)?ఫస్ట్ ఫ్లోర్ లో వుండే వెంకటేశ్వర్లు తన ప్రశ్నకు జవాబును మనసులోనే చెప్పుకుంటూ ప్రవేశించాడు.
రండంకుల్ నన్ను రక్షించండి,ఉదయాన్నే పెళ్లిచూపుల సుప్రభాతం మొదలు!ఆఫీసుకెళ్తుంటే పెళ్లి,వస్తూనే పెళ్లి,అన్నం తింటున్నా,నిద్రవస్తున్నా పెళ్లి, పెళ్లి!....
మంచిదేగా,నానమ్మ కూడా ముచ్చట పడుతోంది చూడు. అని శశాంక్ ను నవ్వుతో సమాధానపరచి,
సరోజినివైపు చూసాడు చెప్పాలా వద్దా అనుకుంటూ.చెప్పాలి తప్పదు.ఎవరో ఒకరు చెప్పకపోతే ఈ జల్లెడ పట్టడం ఆపై వడబోత తుదిలేని కార్యక్రమమవుతుంది.చనువున్న తనే చెప్పకపోతే తనది బాధ్యతా రాహిత్యంకూడా  అని తన ఆలోచనను సమర్థించుకున్నాడు.
అమ్మా మీరు,మీవారు,అబ్బాయి కలిసి కూర్చుని ఆలోచించి ఒక నిర్ణయానికి   రండి.అసలే కరువు రోజులు,ధరలు మండిపోతున్నాయి.అధమం మైసూర్ పాక్ లేదా కారప్పూస చేయాలన్నా,కొనాలన్నా అయిదువందల నోటు మారాల్సిందే!
శెనగపిండికంతెందుకు నాయనా!’’ పెళ్లిచూపులమిషతో తాము ఫలహారాలు లాగించేస్తున్నామనుకుంటున్నాడా అనే సందేహం.
చక్కెర,నెయ్యికూడా కావాలికదా మామ్మగారూ! చక్కెర చేదెక్కిపోతోంది.వంట్లో షుగర్ మూలాన చక్కరలేని కాఫీకి అలవాటుపడ్డా  చక్కెరకొనే మోతాదు తగ్గినందుకు ఆనందపడే అల్పసంతోషి.అదే నైజాన్ని పెళ్లి చూపులకు వర్తించుకుంటాడు.                                                                                                                                 మీరే  చూస్తున్నారుగా అన్నయ్యగారూ...అంటూ కాఫీ అందించింది సరోజిని.  త్రాసులో తూకానికి
సరుకులైతే ఫరవాలేదు,మీరు అమ్మాయిలను,ఆస్తులను తూకమేస్తే ఎలా?రాళ్లు ఇటు, అందం,ఆస్తి, అంతస్తు అటు... ఉదయాన్నే విమర్శించడానికి వచ్చాడనుకుంటారని  మరిన్నిమాటలను గొంతుకలోనే ఆపేసాడు వెంకటేశ్వర్లు.
మాకేం  నలుగురున్నారా ఏదో అబ్బాయికి వచ్చిన కట్నంతో అమ్మాయికి కాస్త ఘనంగా పెళ్లి చేస్తామని ఆశపడటంలో తప్పేముంది? అప్పుడు మీలాంటి పెద్దలే అడుగుతారు మీ అమ్మాయికి ఏమిస్తారు అని!అప్పుడేంచేయాలి?రఘుపతి తమ వైఖరిని సమర్థించుకున్నాడు.
శశాంక్ తన ప్రమేయం ఉండకూడదనుకుని స్నానం మిషగా అక్కడనుండి తప్పుకున్నాడు.
అన్నయ్యగారూ  వారి మాటలలో నిజాన్ని అర్థం చేసుకోండి.మా అబ్బాయికి పెళ్లి చేయాలని మాకుండదా? అయితే మేమనుకున్నట్టు లేకపోతే తలకు కాలికి అందని దుప్పటిలా ఉంటుంది మా పరిస్థితి.ఇప్పుడందరు చూసేది స్టేటస్సేకదా?
సరే మీకు స్టేటస్ కావాలి,మీవారికి బాగా డబ్బులు కావాలి.అబ్బాయికి అమ్మాయి అందం, చందం,ఈడు,జోడు...మీ ఈక్వేషన్లు నాకు తెలియవుకాని నాకు తెలిసిందల్లా ఒక్కటే మీ అబ్బాయికి మూడు పదులు నిండాయి.ఒకటి అరా తెల్లవెంట్రుకలు కూడా అగుపడుతున్నాయి.బట్టతలకు ఆహ్వానం పలుకుతున్నట్టే ఉంది.అన్న అని పిలవడం మానేసి అంకుల్ అని పిలవడం మొదలుపెట్టక ముందే ఏదో ఒక సంబంధం చూసి....
మళ్లీ ఏదో ఒక సంబంధమంటావు.....అమ్మాయి బాగుండాలికదా,వాడి ఎత్తుకు సరిపడేపిల్ల కాకపోతే వాడొప్పుకోడు.విసుక్కున్నాడు రఘుపతి.
సరే  సరే...అలాగే  చూద్దాం అమ్మాయి బాగుండాలి.వాళ్ల అమ్మ,నాన్న చదువుకుని ఉంటే మరింత మేలు,ఆస్తి అంతస్తులేకాక అమ్మాయి తండ్రో, తాతో ఏ ఎం.పీనో, ఎం.ఎల్.ఎ నో అయితే మరింత రాజకీయ ప్రయోజనం.రఘుపతి కుటుంబంలోని వారి కోరికల చిట్టా వెంకటేశ్వర్లుకు తెలుసు.
సరుకుండగానే సరికాదు.సరుక్కు గిట్టుబాటు ధరను మనమే నిర్ణయించుకోవాలికదా! రఘుపతి మాటలకు, అందులోని వ్యాపారధోరణికి వెంకటేశ్వర్లు తెల్లబోయాడు.
నేను మీ శ్రేయోభిలాషిని పైగా  కాస్త దగ్గరి బంధువును కూడా అనే చనువుతో చెప్తున్నాను మరిక అబ్బాయిని ముదిరిపోనివ్వకండి.
శశాంక్ వస్తున్న అలికిడి విని అందరు మౌన మంత్రము పఠిస్తున్నారు.
వస్తానంకుల్ బైక్ స్టార్ట్ చేసాడునాయనా త్వరగా  ..  సరోజిని  మాట పూర్తికాకమునుపే ఎలాగోలా
వస్తాలే.అంటూ  పెళ్లి మాటల స్థానే ఫైళ్లను తలచుకుంటూ బండిని పరుగులు తీయించాడు.
శశాంక్ భయపడ్డట్టుగాకాక ఆడిట్ కాస్త త్వరగానే పూర్తయింది.
ఇంటి దగ్గర అందరు అప్పటికే ఎదురు చూస్తున్నారు.క్యాబ్ ను పిలిపించాడు వెంకటేశ్వర్లు.
నువ్వురావాలి మరి అన్నాడు రఘుపతి తమకు   బై చెపుతున్న వెంకటేశ్వర్లుతో.
నేనేందుకు మీకు నచ్చాక చూస్తాలే.అనుమానంగానే ఉంది వెంకటేశ్వర్లుకు ఏవంక పెట్తారోనని.
 రండి అన్నయ్యా, ముగ్గురెలా వెళ్తాం,మీరుకూడా రండి.సరోజిని అడగ్గానే ఇక తప్పదు అనుకుని కారెక్కాడు.
కారు ఇంటిముందుకు చేరగానే ఎదురువచ్చాడు అమ్మాయి తండ్రి.స్వంత బంగళా,ఇంటిముందున్న ఇన్నోవా కారు,ఇంటివారి అభిరుచిని తెలుపుతూ పూల పరిమళం వెదజల్లుతున్న తోట. ఫరవాలేదు పక్కింటి ఆంటీ అన్నీ చూసే చెప్పినట్లుంది,అమ్మ,నాన్నకుకూడా నచ్చితీరుతుంది.అందమైన వాతావరణంలో అమ్మాయి కూడా ఆకర్షణీయంగా వుండాలని కోరుకుంటున్నాడు శశాంక్. ఎలాగైనా  ఈ సంబంధం తప్పక కుదురుతుంది.సరోజిని గట్టిగా నమ్ముతోంది. అమ్మాయి తల్లి,తండ్రి సాదరంగా ఆహ్వానించారు.వారివెనుకనే సంబంధం చెప్పిన పక్కింటి మమత ఆంటీ!
అమ్మాయి తండ్రి పేరుమోసిన డాక్టరు.తల్లి డిగ్రీ కాలేజీలో లెక్చరర్.అమ్మాయి బి.టెక్ చేస్తుండగానే క్యాంపస్ సెలెక్షన్ లో వచ్చిన ఉద్యోగం.ఇంట్లోని వారందరు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవారు.ఇంటి ట్రెజరీలో ఏ ఒడిదుడుకులు లేవు.వెనకనున్న ఆస్తులు పెరిగేవేకాని తరిగేవి లేవు.అమ్మాయి మేనమామ ప్రత్యక్ష రాజకీయాలలో లేడుకాని ఆయన శ్వాసించేది మాత్రం రాజకీయాన్నే. ఆయన ద్వారా తమ పనులు జరిపించుకునే వారెందరోవున్నారు.పలుకుబడికల కుటుంబం.అమ్మాయికి ఆస్తి వుంది,అందం వుంది పైగా చక్కటి ఉద్యోగముంది. అమ్మాయి తల్లి కూడా విద్యావంతురాలు,లెక్చరర్.తండ్రి మంచి హోదాలోనే రిటైర్ అయ్యాడు.అమ్మాయి ముఖంలో వున్న కళ ఆయస్కాంతంలా ఆకర్షిస్తోంది.రఘుపతి కుటుంబంలో అందరి ముఖాలలోను తృప్తి కనిపిస్తోంది.వారి ఆదరణ మరింతగా నచ్చుతోంది అందరికీ!వారు వడ్డించిన రెండు మూడు రకాల స్వీట్లు అందించిన రుచికన్నా వారి కుటుంబమందించిన ఆస్తి,ఉద్యోగ వివరాలు మరింత పసందుగా ఉన్నాయి శశాంక్ తల్లిదండ్రులకు.అందరిని ఓకంట గమనించిన వెంకటేశ్వర్లు ఈసారి శశాంక్ పెళ్లి బాజా తప్పక మోగుతుందనుకున్నాడు.
    ఇంటికి తిరిగి వెళ్లాకకూడా అమ్మాయి రూపం శశాంక్ ను గిలిగింతలు పెడుతూనే వుంది.అమ్మాయి నచ్చిందని ఇంటికి రాగానే ఫోన్ చేసి పక్కింటి మమత ఆంటీకి చెప్పకుండా వుండలేకపోయాడు శశాంక్. మిగిలిన వివరాలు తెగ నచ్చేసాయని మనసులోనే అనుకున్నారు రఘుపతి,సరోజిని. పరధ్యానం  ఎక్కువైందని  ఆఫీసులో శశాంక్ స్నేహితులు అతడిని ఆటపట్టిస్తున్నారు.
గుమ్మం దగ్గర శబ్ధమైనా,ఫోను మోగినా, మీ అబ్బాయి నచ్చాడు.మీరెప్పుడు చెప్తే అప్పుడే నిశ్చితార్థం చేయడానికి మేము రెడీ అని అమ్మాయి అమ్మో,నాన్నో తమ మనసుకు నచ్చే మాట చెప్తారని ఆశగా
ఎదురు చూస్తున్నారు శశాంక్ తల్లిదండ్రులు.శశాంక్ కూడా తన ఆతృత బయటకు కనబడకుండా అమ్మ, నాన్నల సంభాషణలపై ఓ చెవి వేసే వుంచాడు.వారం గడవడమే గగనమైంది ముగ్గరికీ! వదిన ఏమేమి
సారెలు తెస్తుందో అని శశాంక్ చెల్లెలు మనసులోనే లెక్కలు వేసుకుంటోంది.వదినె తెచ్చే సారె బిందెలు తనపాలిటి లంకెబిందెలుగా జమ చేసుకుంటోంది.
ఇలా ఎదురు చూస్తున్నవారి దగ్గరకు ఇరువైపుల తెలిసిన మధ్యవర్తి ఒకాయన మంచి వర్షంలో వచ్చాడు.వర్షానికి తడిచిన గొడుగును ఓవారగా పెట్టి నీరు జారిపోయేదాకా చూస్తూ నిలబడ్డాడు.అదే ఆరిపోతుంది గొడుగువిప్పి ఆరబెట్టండి.ఆలోచిస్తూనే గొడుగును విప్పిపెట్టి వచ్చాడు వచ్చినవ్యక్తి. చక్కటి కబురు తెచ్చేవుంటాడనుకుని వేడివేడి కాఫీ,మురుకులు తెచ్చిపెట్టింది సరోజిని.
శశాంక్ గదిలోనుండి బయటకు రావాలా వద్దా అన్న సందేహంలో పడ్డాడు. కంప్యూటర్ షట్ డౌన్ చేసి బయటకు అడుగెయ్యబోయాడు.వాళ్ల అమ్మాయికి మరో సంబంధం వచ్చిందట.అది చూసాకే మీకేసంగతి చెప్తామన్నారు.లేదూ మీకేదైనా వేరే సంబంధం వస్తే చూసుకోమన్నారు.
శశాంక్ ముఖం వివర్ణమైంది.తనేమైనా బస్సుకోసం ఆగాడా? ఒక బస్సుకాకపోతే మరో బస్సు అన్నట్లుంది.’ ‘మరిమీరు చేసిందేమిటి? మనసు వేసిన ప్రశ్నకు జవాబు తడుముకున్నాడు శశాంక్.నిజమే తాము చూసిన సంబంధాలన్నీ ఏదో ఒక వంక పెట్టి అమ్మో,నాన్నో,తనో ఎవరో ఒకరు ఇదికాకపోతే ఇంకొకటి అదీ కాకపోతే మరొకటి అంటూ అమ్మాయిలను క్యూ కట్టించాము ఇప్పుడు తాను క్యూలో నిలబడినట్లుంది. శశాంక్ లో అంతర్మధనం.
అయ్యో,గొడుగు ఎగిరిపోతోంది.వచ్చిన మధ్యవర్తి పరుగు తీసాడు.
అవకాశం ఎగిరి పోతున్నట్లనిపించింది అందరికీ.నిజానికి అవకాశాలు సన్నగిలి పోయాయి అని అర్థమవుతోంది అందరికీ!వచ్చిన సంబంధాలకు వంకలు పెట్టి బాధించామేమో.శశాంక్ లో మధన మొదలైంది.రఘుపతి,సరోజిని మాటలకు తడుముకోవలసివస్తోంది.
మనిషిలో రాజీపడే తత్వం లేకపోతే కోరికలకు,ఆశలకు కళ్లెం పడక మరీ ముఖ్యంగా పెళ్లి సంబంధాల వెతుకులాటలో ఇలాంటి పర్యవసానాలు నేటి రోజుల్లో నేను చాలా చూస్తున్నా!అందుకే నేనప్పుడే  చెప్పాను వచ్చిన ప్రతి సంబంధానికీ వంకలు పెట్టి తప్పులు పట్టకండిరా అని నానమ్మ మాటలను మరిక అడ్డుకోలేదు శశాంక్.                                                                                                                                                                                             
*******


  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

18 comments:

మాలా కుమార్ said...

కథ చాలా బాగుందండి . మీరన్ని సమకాలీన సమస్యలు తీసుకొని రాస్తున్నారు .బాగుంది.

Padmarpita said...

చాలా బాగారాసారండి...అభినందనలు.

Anonymous said...

పెళ్ళికి అమ్మాయిలు దొరకటం లేదండీ! నిఝం గా నిజం. ముదురు బెండకాయలే ఎక్కువ కనపడుతున్నాయండి. శాస్తి బాగా అవుతోందండి. ఆయ్!

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బాగుంది. క్యూ లో ఉన్న వారికి చురుక్కు మనిపించే కథ,వేగిర పడాలి అనుకునే కథ.
అభినందనలు..ఉమా దేవి గారు.

జ్యోతిర్మయి said...

కళ్ళు తెరిపించే కథ. చాలా బావుందండీ. అభినందలనలు ఉమాదేవి గారూ..

సి.ఉమాదేవి said...

మాలాగారు,సమాజమే కథలకు కాణాచి.

సి.ఉమాదేవి said...

పద్మార్పితగారు, ధన్యవాదాలండీ

సి.ఉమాదేవి said...

శర్మగారు,స్త్రీపురుష నిష్పత్తిలో తేడా ప్రమాదఘంటికలు వినిపిస్తుంది.ఆలోచనా సరళి మారనంతవరకు ఏవిషయమైనా సమస్యాత్మకమే!

సి.ఉమాదేవి said...

వనజగారు,స్పందింపచేయగలిగేదే నిజమైన కథ.మీఅభినందనలకు ధన్యవాదాలు.

సి.ఉమాదేవి said...

జ్యోతిర్మయిగారు, ధన్యవాదాలండీ.

శ్రీలలిత said...

కథ చాలా బాగుందండీ. చివర్న చురుక్కు మనిపించారు..

జలతారు వెన్నెల said...

బాగా రాసారండి! ఈ మధ్య కాలం లో ఇదే జరుగుతుంది! అమ్మయిలు తక్కువయ్యరు అని కూడ వింటున్నాను.

సి.ఉమాదేవి said...

ధన్యవాదాలు లక్ష్మిగారు,కొన్ని వాస్తవాలను అంగీకరించక తప్పదు.

సి.ఉమాదేవి said...

వెన్నెలగారు,ధన్యవాదాలు,మీరన్నది నిజమే!

పరిమళం said...

బావుందండీ కధ!ఈమధ్య మా మేనల్లుడి విషయంలో ఇలాగే జరిగింది:) :)

సి.ఉమాదేవి said...

పరిమళంగారు,మాలాగారి కామెంటుకు నా జవాబు చూసారు కదా,సమాజంలో ఇలాంటి సంఘటనలు చాలా చూస్తాము.కథ నచ్చినందుకు ధన్యవాదాలు.

ఆదూరి హైమవతి said...

మీరూ క్యూలోఉన్నారు బావుంది, మగపిల్లలతరఫువారి ధీమా అడుగంటేరోజులువచ్చాయిమరి!
ఆదూరి.హైమవతి

సి.ఉమాదేవి said...

కథ నచ్చినందుకు ధన్యవాదాలు హైమవతిగారు.

Post a Comment