Wednesday, June 6, 2012

పనిపిల్లలూ పసిపిల్లలే!



6-6-12,ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రికలో నా వ్యాసం.


      మీకు పనిపిల్ల వుందా? అని ఎవరైనా అడిగినప్పుడు, ఉంది అంటే ఎంతదృష్టం ఎప్పడు మీ చేతిక్రింద ఉంటుంది అంటారు.నిజమే ఈ మాటమాత్రం ముమ్మాటికీ నిజం.ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాక పనిపిల్ల రోజంతా ఇంటి ఇల్లాలి చేతిక్రిందే ఉంటుంది. ఆ అమ్మాయికి పనిగంటలనేవి ఏవి నిర్దిష్టంగా ఉండవు. పిలిచిన వెంటనే   పలకాలి.లేదంటే అక్షింతలు.తెమ్మన్నది తేవాలి. అందుకోమన్నది అందుకోవాలి. చెయ్యమన్నది చెయ్యాలి. లేదంటే తిట్ల వర్షం లేదా దెబ్బల వాన కురుస్తుంది.ఇక ఇంట్లో ఉండే వారందరికీ వీరే పనిపిల్లలు.  బడికెళ్లే పిల్లలకు బూట్లందించాలి. లైటు, ఫ్యాను వెయ్యమన్నప్పుడు వెయ్యాలి.ఆపమనగానే వచ్చి పరుగున ఆపాలి. ఊడ్చిందే ఊడుస్తూ,తుడిచిందే తుడుస్తూ, కడిగిందే కడుగుతూ వైర్ లెస్ గాడ్జెట్ అవుతుంది. తమ ఇష్టాలను మరచి ,కష్టాలకు అలవాటు పడుతుంది ఇలాంటివారి బాల్యం. తమ పిల్లల చేతులకు మాయిశ్చరైజర్ పూసే వారికి ,పనిపిల్లల అరచేతులలో బొబ్బలు కనబడవు.ఇంతకష్టపడ్డా వీరికి సరైన వసతులుండవు. ఏ మెట్లక్రిందో ఉండాల్సిందే.ఈ పిల్లలు కష్టపడకపోతే వీరికిక తగినంత తిండే ఉండదు. కన్నతల్లిదండ్రులే వీరిని కష్టాలకొలిమిలోకి నెట్టుతారు. సంతాననభారం లేదా ధనలేమితో పిల్లలను పోషించలేక  ఏ అమ్మ ఇంట్లోనో పనికి కుదిరిస్తే అంత తిండి,గుడ్డ  జరిగిపోతుందన్న వారి ధోరణే  పనిపిల్లలనబడే పసిపిల్లల బతుకులను  నరకప్రాయం చేస్తోంది.
         మానవహక్కులగురించి మాట్లాడుతారు.మానవత్వాన్ని మరచి పసిమొగ్గలనదగ్గ చిన్నపిల్లలను ధూళి, దుమ్ము,పొగ వెదజల్లే ఫ్యాక్టరీలలో,జౌళి పరిశ్రమలలో,ప్రమాద భరితమైన భవన నిర్మాణంలో, విష వాయు వులు వెదజల్లే కెమికల్ పరిశ్రమలలో ఊపిరినావిరి చేసి, ఆస్తమావంటి రోగాలకు సులభంగా దారిచూపే సిమెంట్ కర్మాగారాలలో ఇరికించి వారి ఆరోగ్యానికీ ఎసరు పెడ్తున్నారు.ఇది శ్రమదోపిడీయే కాదు,వారి బాల్యనికీ దోపిడీయే! ఇంటా,బయటా ఏ పనులలోనైనా పిల్లలను వినియోగిస్తారు.వారిని శారీరకంగా మానసికంగా హింసిస్తారు.
      పధ్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలను గృహాలలోకాని,హోటళ్లలోకాని,పరిశ్రమలలోకాని పనులకొరకు వినియోగించడాన్ని ప్రభుత్వం చట్టరూపేణా ఏనాడో నిషేధించింది.అయినా కోట్లాదిమంది పిల్లలు నేటికీ బాలకార్మికులుగా తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు.పరిశ్రమలలో శ్రమించే బాల కార్మికులకు తాము పని చేసేచోట ఉండే వాతావరణం ఎంత ఫ్రమాదకరమైనదో తెలియదు..కెమికల్ వాయువులు వారిని చర్మరోగాలకు గురి చేస్తాయి. టపాసులు,అగ్గిపెట్టెలతయారీ పిల్లలను అనుకోకుండా ప్రమాదాలలోకి నెట్టడమేకాదు వారి ప్రాణాలను హరించడం చూస్తుంటాం.
           తల్లిదండ్రుల పేదరికం పసిపిల్లలను పనిపిల్లలుగా మారుస్తోంది.పేదరికం సాకుగా తమ పిల్లలను పనిలో చేర్చిన పెద్దలు, పిల్లల కష్టాన్ని నంజుకుంటారే తప్ప పిల్లలపై మరే శ్రద్ధ చూపరు.ఎవరింట్లోనో పనికి పెట్టి వారిని కన్నందుకు బ్రతుకుతెరువు ఏర్పరచామని అనుకుంటారే తప్ప అమ్మ,నాన్నలను వీడిన పిల్లలు కొత్త ప్రదేశంలో తినీ తినక భయంతో నిద్రరాక,పనిభారంతో కృంగిపోయి కష్టం చెప్పుకునే దారిలేక విలవిలలాడ్డం వారిని కన్నవారికి అర్థంకాదు.చెప్పినా అర్థం చేసుకోరు.చేసుకోవాలని ప్రయత్నించరు.మరి పిల్లల తల్లిదండ్రులే వారి బిడ్డలకు చిన్నవయసులోనే పనిసంకెళ్లు బిగిస్తుంటే పిల్లలను పనిలో పెట్టుకున్నవారు వారి పిల్లలగురించి తప్ప ఇతర పిల్లల గురించి ఆలోచించనివారు పనిపిల్లల గురించి ఆలోచిస్తారా? ఆ ఆలోచనే దరిచేరనివ్వరు.తమకు,తమ పిల్లలకు కూర్చున్న దగ్గరకు కాఫీలు,పాలగ్లాసులు రావాల్సిందే!మళ్లీ ఇవన్నీ కడిగి తడిలేకుండా తుడిచి ఎక్కడివక్కడ అమర్చాలి. వదిలిన చెప్పులు ,విడిచిన బట్టలు,తిన్న పళ్లెం,తాగిన కప్పులు,గ్లాసులు ఎప్పటికప్పుడు తమతమ స్థానాల్లోకి వెళ్లవలసిందే.మీ ఇల్లెంత బాగుందో,అన్నీ చక్కగా అమర్చారే అంటే గర్వంగా తలపంకిస్తారే తప్ప చేదోడుగా ఉన్న పనిపిల్ల ప్రస్తావన తీసుకునిరారు.శారీరకంగా నిర్బలులైన ఈ పిల్లలను పనితనంతోనే అంచనా వేస్తారు.అంతేకాని  వారికి శక్తిలేదని, చేయలేరని ఒప్పుకోరు.పిల్లలు చేస్తేసరి.లేకుంటే తొడపాశం,వీపుమీద వాతలు ఉండనే ఉంటాయి. తమ పిల్లలను ఒక్కదోమ కుడితే ఆ దోమను చంపందే వదలరు.మరి ఆహారం చెడితే పనిపిల్లలకే వాటా!కుళ్లిన పండ్లు వారికే!ఇది అతిశయోక్తి కాదు.ఇంత ధరపెట్టి కొన్నాం,ఎలా పారేస్తాం అనే నైజమే దీనికి మూలం. ఇలాంటి సంకుచిత్వం వీడాలి.మన పిల్లలు  పసిపిల్లలయితే, పనిపిల్లలు పసిపిల్లలు కారా? చిన్నవయసులో వారిని పనుల్లో బలిచేయకండి.అన్నం పెట్టడంతోపాటు ఆప్యాయతతో కాస్త అక్షర భిక్ష కూడా పెట్టండి.

                                                                                                        

 

  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

16 comments:

anrd said...

బాగుందండి. చక్కటి పోస్ట్.

Jai Gottimukkala said...

ఇళ్లలోనే కాదు పెట్రోల్ బ్యాంకులలో హోటళ్ళలో ఇంకా ఎన్నో చోట్ల పిల్లలు పని చేస్తూ కనిపిస్తారు. నాకెందుకులే అని అందరూ సరిపెట్టుకుంటే పరిస్తుతులు మారవు.

చిన్న పిల్లలకు వోట్లు లేవు. వారి అవసరాలను పట్టించుకునే నాథుడు లేదు.

A sad commentary on how India is treating its future citizens.

మాలా కుమార్ said...

పేదవారైన తల్లితండ్రులు తమ పిల్లలకు ఇంత తిండి , బట్ట దొరుకుతుందికదా అని తమకు గడవక పనిలో చేరుస్తారు . సరే మరి ధనవంతులైన తల్లి , తండ్రులు పసి పిల్లలని కూడా చూడకుండా అడ్వర్టైజ్మెంట్స్ లో , సినిమాలలో నటింపచేస్తారు .వాళ్ళకు గడవక కాదు . గొప్ప కోసం . ఆనందం కోసం . పసిపిల్లలను , చదువుకోవలసిన వయసులో వున్న పిల్లలను అలా లైట్ల వెలుగులో , ఎండలలో నటింపచేయటం న్యాయమా ? వారి గురించి ఎవరూ ఆలోచించరే!

జలతారు వెన్నెల said...

చదవగానే చాలా guilty గా అనిపించ్చిందండి.. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారింట్లో మొదలయిన ఈ పనిపిల్లలను ఇంట్లో నే ఉంచుకోవడం అన్న ది మాకు తెలుసు. కాని వారిని బాగా చూసుకునేవాళ్ళం. వారికి మా ఇంట్లో చాలా స్వతంత్రం ఉండేది. వాళ్ళను తన సొంత పిల్లలుగానే చూసేది మా అమ్మమ్మ. తరువాత మా అమ్మ గారు, కొన్ని సంవత్సరాలు పనిపిల్లలను తెచ్చుకున్నా చదువు మాత్రం నేర్పింది. ఆ అమ్మాయికే అంత శ్రధ మాత్రం ఉండెది కాదు. సినిమాలు చూడడానికి ఇష్టపడెది.

శ్రీలలిత said...

మీరు చెప్పింది అక్షర సత్యాలు. ఇది సమాజం చాలా సిగ్గుపడే విషయం.
ఇంకా మాలాగారు చెప్పినట్టు తల్లితండ్రుల సంతోషం, సరదాల కోసం లైట్లవెలుగులో మాడిపోయే పిల్లల గురించి కూడా ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే వారి తల్లితండ్రులే దానిని సమర్ధిస్తారు.
ఎవరి గొడవ వారిదే తప్పితే ఎదుటివారి గురించి (స్వంత పిల్లలైనా సరే )ఆలొచించే మనస్తత్వం మనలో తగ్గిపోతోంది. కారణాల్లో స్వార్ధం పెరిగిపోవడంకూడా ఒకటేమో...

Anonymous said...

మానవత్వం లేని వాళ్ళు, బాల్యం విలువ తెలియని వాళ్ళే పసిపిల్లలని పని పిల్లలుగా మార్చగలరు.

ఇంకొంతమంది ఉంటారు. హోటళ్ళలో పనిచేసే పిల్లల మీద చెయ్యి కూడా చేసుకుంటారు. అదే సర్వరు పెద్దవాడైతే నోరెత్తలేరు.

సి.ఉమాదేవి said...

anrd గారు ధన్యవాదాలండీ!

సి.ఉమాదేవి said...

Jai Gottimukkala Garu,మీ స్పందన ఆలోచనను మరింత పెంచుతుంది.ధన్యవాదాలండి.

సి.ఉమాదేవి said...

మాలా కుమార్ గారు,ఒక వ్యాసానికి తగినంత స్పందనే పరిష్కారాన్ని అన్వేషిస్తుంది.మీరు చెప్పిన అంశం మరింత ఆలోచింప చేస్తుంది.

సి.ఉమాదేవి said...

వెన్నెలగారు,అందరు ఒకేలా ఉండరు.ఆదరించి కరుణ చూపే అమ్మలు ఉంటారు.

సి.ఉమాదేవి said...

శ్రీలలితగారు,మీరన్నట్లు పిల్లల విషయంలో అశ్రద్ధ వారి జీవితాలను బలి చేస్తోంది.కఠినమనస్కులలో కాస్తయినా మార్పు కలిగితే చాలు.

సి.ఉమాదేవి said...

bonagiri garu,మీరన్నది నిజమే.మానవత్వంలేని చోట బాల్యం బలవుతుంది.

జ్యోతిర్మయి said...

ఎన్ని అసమానతలో...అసమర్ధత దీనికి మూలకారణం, పనికి పంపించినవాళ్ళది, పనిలో పెట్టుకున్నవారిదీనూ...ఈ అసమానత చూస్తూ పెరిగిన పిల్లలకు అది తప్పు అన్న భావన కూడా కలుగాదేమో..చిన్నప్పట్నుంచి ఆ విధంగా అలవాటయి పోతుంది కదా...ఆలోచింప చేసే చక్కని వ్యాసం ఉమాదేవి గారూ...

వనజ తాతినేని/VanajaTatineni said...

ఉమా దేవి గారు పసి వాళ్ళని కార్మికులుగా చూడటం తప్పే! కానీ వారికి ఆదరణ చూపి ఖాళీ సమయంలో వారి వయసుకి తగ్గ పనులు చేస్తూ బడికి వెళుతూ చదువు కోవడం అనే అవసరాన్ని గుర్తించితే చాలు.
మన దేశ పరిస్థితులని బట్టి నిర్భంద విద్య ఉంటే తప్ప పసివళ్ళు పని వాళ్ళు కాకుండా ఉంటారని నాకనిపిస్తూ ఉంటుంది.
మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి. ఇలాగే మంచి వ్యాసాలూ వ్రాస్తూ ఉండండి.

సి.ఉమాదేవి said...

జ్యోతిర్మయిగారు,ఆలోచింపచేసేదే వ్యాసం అనే నా అభిప్రాయానికి మీ స్పందన ఊతమిచ్చింది.ధన్యవాదాలు.

సి.ఉమాదేవి said...

వనజగారు,ప్రోత్సాహాన్ని మించిన టానిక్ ఏముంటుంది?పిల్లల కళ్లలోని ప్రశ్నలకు జవాబులు తెలియని పెద్దరికం వారిని మభ్యపెట్టాలని చూస్తుంది.దీనికి పేద,ధనిక తారతమ్యం లేదు.విద్య ఆవశ్యకతపై మీ అభిప్రయం సబబే1

Post a Comment