ఈ రోజు (1-5-2013) ఆంధ్రభూమిలో ప్రచురింపబడ్డ నా వ్యాసం.
http://www.andhrabhoomi.net/content/m-503
జీవనయానంలో బ్రతుకంతా మారథాన్ రేస్ లా
మారిపోతున్న నేటి తరుణంలో మానవత కాగడా పెట్టినా వెతికినా దొరకని వస్తువులా
మృగ్యమయే పరిస్థితి ఏర్పడింది.ఈ దుస్థితి నానాటికీ అధికమవుతోంది. ఇటీవల మనమంతా నోటమాటరాక టి.విలకు కళ్లప్పచెప్పి గాంచిన
సంఘటనలనే తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. నడిరోడ్డుపై ప్రమాదానికి గురైనపుడు
సహాయం కోరి ఆక్రందనలు చేసినా కరగని కసాయితనాన్ని, పసిపాపపై పాశవిక దాడిని
గురించి ప్రసారమాధ్యమాలద్వారా చూసి తెలుసుకున్నాక ‘మానవత్వమా ఏదీ నీ చిరునామా?’ అని వెతకాల్సి వస్తోంది.
తరాల అంతరాలు
ఒకవైపు,వృత్తిలో ముందుండాలనే ఆరాటం మరొకవైపు సాటి మనిషి గురించి కనీసం కాస్తయినా
ఆలోచించలేకపోవడం మానవత చిరునామానే గల్లంతు
చేసేస్తోంది. యంత్రాలకు సైతం విశ్రాంతినిస్తాం. కాని మనుషులే మానవ యంత్రాలుగా
రాత్రి,పగలు పరిశ్రమిస్తూ, తమ జీవితాలలో తామేం మరచిపోతున్నామో గ్రహించలేని
స్థితికి చేరుకున్నారు.మరి అలాంటివారికి, మనిషి అంటే మానవత్వానికి మరోపేరు అని
అ,ఆలనుండి నేర్పినా వినే తీరిక ఉంటుందా అంటే? సందేహమే!
జీవితానికి అర్థమేమిటి అని చరమాంకంలో ప్రశ్నార్థకం పలికేకన్నా జీవితాన్ని
అర్థవంతంగా మలచుకోవడం మానవజీవితంలో మానసిక వికాసం మొగ్గతొడిగిననాడే
మొదలవాలి. విలాసవంతమైన జీవితానికి
తగినన్నివనరులు, అవకాశాలు,అయినా ఏదో శూన్యం, వెలితి, నిరాశ! ట్రెడ్ మిల్ పై
ఎడతెగని నడకలా నిద్రలేచింది మొదలు నిద్రించే వరకు జీవితమంతా పరుగుకే కేటాయిస్తే
మిగిలేదేమిటి?గతం వద్దు గత అనుభవాల పాఠాలు మాకొద్దు, భూతకాలంలో ఏమవుతుందో అనే
దిగులెందుకు? వర్తమానంలో సుఖపడటమే ముఖ్యమనుకునే వారి మాటలలోనే చెప్పాలంటే ఎంజాయ్ చేయడమే జీవిక అనుకుంటే మనిషి ఉనికికే
అర్థంలేదు. మరణించాక కూడా మన ఉనికిని తెలిపేది మన నడవడే. మనం నాటిన మైలురాళ్లు
ముందు ముందు శిలా ఫలకాలై వాటిపై మనిషిగా మనం నడయాడిన తీరు లిఖించబడి
కీర్తించబడుతుంది.
ప్రపంచమే పెద్ద యంత్రాగారమై మనుషులు మరమనుషులై
హృదయాలను మరచిపోతే కరుణ స్థానంలో కార్పణ్యం చోటుచేసుకుని, మనిషిని స్వార్థపు
హాలాహలంలో కరిగించి మనీషిగా రూపుదిద్దుకోనీయదు.
విచక్షణ లోపించినపుడు పైన పేర్కొన్నఅమానుష కార్యాలు చర్వితచర్వణమే! అందుకే మానవీయ
విలువలకు బాల్యంలోనే పునాది వేయగలగాలి. మానవత్వపు ఛాయలో విద్యాబోధన జరగాలి. విశాలదృక్పథం
సన్నగిలి బుద్ధి కుచించుకుపోతే సుగుణాలు ఆవిరై దుర్గుణాలు పాతుకుపోతాయి. మనసులు ఇరుకైనచోట మనుగడ
కష్టం. అందుకే తల్లి ఒడిలో నేర్వవలసిన తొలి పాఠం మానవత్వమే! అది నేర్వనినాడు మనిషితనానికి అర్థమే
మారిపోతుంది.
4 comments:
క్లుప్తం గా నేడు జరుగుతున్న కొన్ని అమానుషమైన సంఘటనలను ఉదహరించి, మానవత్వం మనిషిలో లోపించి,యంత్రం గా మారినప్పుడు,సమాజ దుస్థితి ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు రాసారు.అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, ఈ మనవత్వం నేర్పగలుగుతామా అసలు మనము? అది సహజం గా మనుషుల్లో మెండుగా ఉండేది ఒకప్పుడు.ఇప్పుడు అది పూర్తిగా లోపిస్తుంది అదే మనుషులలో. దీనికి కారణం సమాజం,మనుషులలో ప్రబలిపోతున్న పోటీ తత్వం వగైరాలు కూడా కావచ్చేమో!
వ్యాసం అలోచింపచేసింది ఉమాదేవి గారు.
బాగా రాశారు ఉమాదేవిగారు . నిజంగానే యంత్రాల లా మారిపోతున్నాము .మానవత్వం కోసం వెతుక్కోవలసి వస్తోంది .
జలతారువెన్నెలగారు నేను రాసినవి నాలుగు మాటలైనా మీ మనసులో కాసేపు ఆలోచనలను ప్రోదిచేసినందుకు సంతోషంగా ఉంది.
మాలా కుమార్ గారు, మీరన్నది నిజమే.యాంత్రికతే మానవతకు ప్రత్యామ్నాయమైతే మనిషితనాన్ని కాపాడుకోగలమా?
Post a Comment