Saturday, September 29, 2012

డ్యూక్ గార్డెన్-The crown jewel of Duke University



                                                         

                                                            


చెట్ల ఊసులు,పూల బాసలు ఎక్కడైనా ఒకటే!మైసూర్ బృందావనమైనా, ఆహ్లాదపరిచే అరకులోయ ఆర్చిడ్స్ అయినా,హైద్రాబాద్  పబ్లిక్ గార్డెన్ అయినా ,కడియం కనకాంబరాలు,మల్లెల తోటైనా, అలరింపచేసిన అమెరికా డ్యూక్ గార్డెన్ అయినా!

ఇంటి చుట్టు వేసిన పూల చెట్లు సరే, దగ్గరలో ఏదైనా తోటలు లేవా అన్న ప్రశ్నకు మా అమ్మాయి మరి నువ్వు నడవగలవా అంది.నీదే ఆలస్యం అన్నట్టు చూసాను.వెంటనే చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి.మేమున్న చోటునుండి డ్యూక్ గార్డెన్స్ అరగంట ప్రయాణమే.

పెద్దపెద్ద చెట్లనీడ, తల్లి పరచిన సహజ ఛత్రమై  అలరిస్తుంటే  చిరుగాలికి తలలూపుతున్న పూలబాలలు మనసునిట్టే ఆకట్టుకున్నాయి.సాయంకాలపు నీరెండలో తళతళ మెరిసే సప్తవర్ణశోభితమైన తోటలో ,పాదాలను సుతిమెత్తని గరిక అనునయంగా సేదదీరుస్తున్న అనుభూతి కలిగి చకచకా నడుస్తుంటే మా అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తోంది అమ్మకెందుకు చెట్లన్నా,పూలన్నా ఇంత ఇష్టమని!నాకేనా!పసిపాప నవ్వులను,రంగురంగుల పువ్వులను ఆస్వాదించని వారుంటారా? వుండగలరా?

Sarah P.Duke gardens " The crown jewel of Duke University,"

డ్యూక్ యూనివర్సిటీకి అనుబంధమైన ఈ తోట అటు విద్యార్థులకు,ప్రొఫెసర్లకు,సందర్శకులకు నిత్యకళ్యాణం పచ్చతోరణమే!ఒకవంక రోజ్ గార్ఢెన్,మరొక వంక బటర్ ఫ్లై గార్డెన్,మరొకవంక డాఫడిల్స్,చామంతులు,మందారాలు!ఇక తామర కొలను,అందులో ఈదులాడే చేపపిల్లలను చూస్తే పుడమిపై ప్రకృతి తైలవర్ణ చిత్రాన్ని లిఖించి అందాలను పేర్చిన సృష్టికర్త చాతుర్యానికి అబ్బరపడకమానము.అన్నిటినీ మించి మనపైనే వాలిపోతాయేమోననేటట్లు హడావిడి పడిపోయే సీతాకోకచిలుకలు!పూలను తాకితే కుట్టేస్తామన్నట్లు పూలపై వాలి తేనెనుగ్రోలే చిన్ని చిన్ని తేనెటీగలు.వర్ణనకు మించిన సోయగాలు మనలను కదలనీయవు.

ఏడాదికి కనీసం మూడు లక్షలమంది ప్రంపంచంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చి ఈ తోటలను సందర్శిస్తారు.డా.ఫ్రెడెరిక్ ఎం హేన్స్(1883-1946) శ్రమ ఫలితంగానే బీడుభూమిగానున్న నేల పూలవనంగా రూపుదిద్దుకుంది.ఈమె శ్రమకు ఆర్థిక సహాయమందించిన సారా.పి.డ్యూక్,ఆమె కూతురు మేరీ డ్యూక్ బిడిల్ ఔదార్యం ఎన్నదగినవి.

విద్యార్థులకు పాఠ్యవేదికగా,వివాహాలకు పుష్పయవనికగా,సమావేశాలకు సభాప్రాంగణంగా బహుపాత్రలు పోషించే ఈ పూదోట భగవంతుడు మానవులను కరుణతో అనుగ్రహించి   స్వర్గపుతానులోనుండి  తుంచి ఇచ్చిన చిన్న  పూలతివాచీ  ముక్క అనిపించకమానదు.  

కొసమెరుపు:  పేరెన్నికగన్న డ్యూక్ యూనివర్సిటీలో  మనకు తెలిసిన  తెలుగువారెవరైనా  ఉన్నారా అన్న మావారి ప్రశ్నకు, You will soon see  అని  తొమ్మిదేండ్ల మా చిన్నారి మనవరాలు ఇచ్చిన సత్వర జవాబు మాఅందరిలో విరినవ్వులు  పూయించింది.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

4 comments:

ఆదూరి హైమవతి said...

అమెరికా అంతా బ్లాగ్ కొచ్చేసి,అధ్భుతంgaa ,ఆపూల సౌందర్యం కళ్ళకుకట్టినట్లు మీవ్యాఖ్యానం ,అదేమరి కవిహృదయం.
ఆదూరి.హైమవతి.

జలతారు వెన్నెల said...

డ్యూక్ గార్డెన్స్ గురించి విన్నాను ఉమాదేవి గారు. నేను యునివర్సిటి విసిట్ కి వచ్చినప్పుడు చూడడం . చూడాలి ఎప్పుడన్నా.. మీ మనవరాలి కోరిక నెరవారాలని ఆశిస్తూ...

Unknown said...

మీ కవితలు.. మీరచనలు అద్భుతంగా ఉన్నాయి... చదువుతుంటే అలా చదువుతూనే ఉండాలన్న ఆసక్తి పెరుగుతూంది.. మీరు పోస్ట్ చేసిన ఆంధ్రభూమి కథనాలు కూడా చాలా బాగున్నాయి.

సి.ఉమాదేవి said...

తాతాజీగారు మీ రచనాసక్తికి అభినందనలు. నా రచనలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

Post a Comment