Wednesday, June 27, 2012

మీరు క్యూలో ఉన్నారు

18 comments





 4-7-2012-నవ్య వీక్లిలో  ప్రచురింపబడ్డ నా కథ

ఇవాళ కాస్త తొందరగా రారాదూ  సరోజిని కొడుకును బ్రతిమాలుతున్నట్టుగానే అడిగింది.
రారాదు అని మనసులోనే అనుకుంటూ, ఈ రోజు ఆడిట్ జరుగుతోంది.బాగా ఆలస్యమవుతుంది.విసుగ్గా అన్నాడు శశాంక్.
మరి నిన్న పక్కింటి మమత ఆంటీ చెప్పిన మాట!గట్టిగా అడగటానికి సరోజిని సంకోచిస్తోంది.
మొన్నఎదురింటి ఆంటీ అయింది,ఇప్పుడిక పక్కింటి ఆంటీ,అమ్మా నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనిస్తావా?
మీ అమ్మ అడిగేదాంట్లో నీ ప్రశాంతతకు భగ్నమేమిటో!అంతే విసుగ్గా అన్నాడు శశాంక్ తండ్రి రఘుపతి.
ఇదిగో మళ్లీ వాదనలొద్దు,ఎలాగైనా ఈ ఏడాది నీ పెండ్లి కావాల్సిందే సరోజిని ముఖంలో దుఃఖం నీడలు పరుస్తోంది.
ఎందుకు కాదు?మొట్టమొదట నాలుగో ఫ్లోర్ అంకుల్ చెప్పిన సంబంధమని నెలరోజులు డిటెక్టివ్ ల్లాగా సర్వే చేసి చేసి,వివరాలన్నీ సేకరించుకుని,అదీ నేను ఒప్పుకున్నాక మీరు నీళ్లు నములుతూ తేల్చేసారు.ఏమంటే అమ్మాయి కాస్త ఛాయ తక్కువ అన్నారు.సరే మీ ముచ్చటెందుకు అని నేను పట్టుపట్టలేదు. మొన్న ఎదురింటి ఆంటీ చెల్లెలు కూతురు అంటూ ఆ అమ్మాయిని ఏకంగా ఇంట్లోకే తెచ్చేసారు. అంతటితో ఆగారా,లేదే నాకు పరిచయం చేసి ఆ అమ్మాయిని  నా బైక్ పై కూర్చోబెట్టుకుని పది కిలోమీటర్ల దూరాన ఉన్న వాళ్ల తాతయ్య ఇంటిదగ్గర వదిలేదాక మీరు నన్ను వదలలేదు.
అమ్మాయి పసిమి ఛాయ,వంశం బాగుంది,ఆస్తి బాగుంది,పెట్టుపోతలు బాగున్నాయి,మేము రెఢీ అని గంట కొట్టాం కాని  నా ప్రక్కన పీటకాదు స్టూలు వేసి నిలుచోబెట్టాలి అని నువ్వేగా వద్దన్నావు.మాటలు వెతుక్కుంటున్న భార్యకు వత్తాసుగా పలికాడు రఘుపతి.
నిజమే మీరు చెప్పేది కాని నేను ఒప్పుకుని ఉంటే ఈడుజోడు లేని అమ్మాయిగా కనబడేదికాదా?నాకేమో సరిజోడు కావాలి,మీకేమో ఆస్తి,అంతస్తు,వంశం,పలుకుబడి వగైరా వగైరా!ఆవగైరాలో భారీ కట్నముందని అందరికీ తెలుసు.ఇప్పుడివన్నీ ఎందుకులేమ్మా కొన్నాళ్లు ఈ సంబంధాల వేట వదిలెయ్యండి.తన నిర్ణయమదేనన్నట్లు గట్టిగా చెప్పాడు శశాంక్.
నువ్వలా అనేస్తే ఎలా నాయనా, ఏదో నీ పెళ్లి చూస్తేగాని నా బొంది పోదని నీకు తెలుసుకదా! ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేసుకుందాం.ఈ ఒక్కరోజుకు సెలవు పుచ్చుకోరా.
నానమ్మా, ఇంకా నీ మాట వినబడలేదేమా అని చూస్తున్నాను.నాపెళ్లి చూసాక నాకు కొడుకు పుట్తే చూడాలంటావు,తరువాత వాడిపెళ్లి!విరిగిన కాలును శపిస్తూ మంచంలో ఉందికాని లేకపోతే అపార్ట్ మెంటంతా కలియదిరిగి ఇంటికొక సంబంధం తీసుకునిరాగల సమర్థురాలు.నానమ్మపై మనసులోనే సెటైర్ వేసుకుని, ఇలా కుదరదుకాని మీకు తెలిసిన అమ్మాయిలనందరినీ ఒకరోజు పెరేడ్ చేయించండి,ఏ అమ్మాయి బాగుందో చూసి...
చాల్లే వేళాకోళం,పెళ్లంటే ఎన్ని చూడాలి?సరోజిని నిట్టూర్చింది.
 “ఎన్ని చూస్తారు(సంబంధాలు)?ఫస్ట్ ఫ్లోర్ లో వుండే వెంకటేశ్వర్లు తన ప్రశ్నకు జవాబును మనసులోనే చెప్పుకుంటూ ప్రవేశించాడు.
రండంకుల్ నన్ను రక్షించండి,ఉదయాన్నే పెళ్లిచూపుల సుప్రభాతం మొదలు!ఆఫీసుకెళ్తుంటే పెళ్లి,వస్తూనే పెళ్లి,అన్నం తింటున్నా,నిద్రవస్తున్నా పెళ్లి, పెళ్లి!....
మంచిదేగా,నానమ్మ కూడా ముచ్చట పడుతోంది చూడు. అని శశాంక్ ను నవ్వుతో సమాధానపరచి,
సరోజినివైపు చూసాడు చెప్పాలా వద్దా అనుకుంటూ.చెప్పాలి తప్పదు.ఎవరో ఒకరు చెప్పకపోతే ఈ జల్లెడ పట్టడం ఆపై వడబోత తుదిలేని కార్యక్రమమవుతుంది.చనువున్న తనే చెప్పకపోతే తనది బాధ్యతా రాహిత్యంకూడా  అని తన ఆలోచనను సమర్థించుకున్నాడు.
అమ్మా మీరు,మీవారు,అబ్బాయి కలిసి కూర్చుని ఆలోచించి ఒక నిర్ణయానికి   రండి.అసలే కరువు రోజులు,ధరలు మండిపోతున్నాయి.అధమం మైసూర్ పాక్ లేదా కారప్పూస చేయాలన్నా,కొనాలన్నా అయిదువందల నోటు మారాల్సిందే!
శెనగపిండికంతెందుకు నాయనా!’’ పెళ్లిచూపులమిషతో తాము ఫలహారాలు లాగించేస్తున్నామనుకుంటున్నాడా అనే సందేహం.
చక్కెర,నెయ్యికూడా కావాలికదా మామ్మగారూ! చక్కెర చేదెక్కిపోతోంది.వంట్లో షుగర్ మూలాన చక్కరలేని కాఫీకి అలవాటుపడ్డా  చక్కెరకొనే మోతాదు తగ్గినందుకు ఆనందపడే అల్పసంతోషి.అదే నైజాన్ని పెళ్లి చూపులకు వర్తించుకుంటాడు.                                                                                                                                 మీరే  చూస్తున్నారుగా అన్నయ్యగారూ...అంటూ కాఫీ అందించింది సరోజిని.  త్రాసులో తూకానికి
సరుకులైతే ఫరవాలేదు,మీరు అమ్మాయిలను,ఆస్తులను తూకమేస్తే ఎలా?రాళ్లు ఇటు, అందం,ఆస్తి, అంతస్తు అటు... ఉదయాన్నే విమర్శించడానికి వచ్చాడనుకుంటారని  మరిన్నిమాటలను గొంతుకలోనే ఆపేసాడు వెంకటేశ్వర్లు.
మాకేం  నలుగురున్నారా ఏదో అబ్బాయికి వచ్చిన కట్నంతో అమ్మాయికి కాస్త ఘనంగా పెళ్లి చేస్తామని ఆశపడటంలో తప్పేముంది? అప్పుడు మీలాంటి పెద్దలే అడుగుతారు మీ అమ్మాయికి ఏమిస్తారు అని!అప్పుడేంచేయాలి?రఘుపతి తమ వైఖరిని సమర్థించుకున్నాడు.
శశాంక్ తన ప్రమేయం ఉండకూడదనుకుని స్నానం మిషగా అక్కడనుండి తప్పుకున్నాడు.
అన్నయ్యగారూ  వారి మాటలలో నిజాన్ని అర్థం చేసుకోండి.మా అబ్బాయికి పెళ్లి చేయాలని మాకుండదా? అయితే మేమనుకున్నట్టు లేకపోతే తలకు కాలికి అందని దుప్పటిలా ఉంటుంది మా పరిస్థితి.ఇప్పుడందరు చూసేది స్టేటస్సేకదా?
సరే మీకు స్టేటస్ కావాలి,మీవారికి బాగా డబ్బులు కావాలి.అబ్బాయికి అమ్మాయి అందం, చందం,ఈడు,జోడు...మీ ఈక్వేషన్లు నాకు తెలియవుకాని నాకు తెలిసిందల్లా ఒక్కటే మీ అబ్బాయికి మూడు పదులు నిండాయి.ఒకటి అరా తెల్లవెంట్రుకలు కూడా అగుపడుతున్నాయి.బట్టతలకు ఆహ్వానం పలుకుతున్నట్టే ఉంది.అన్న అని పిలవడం మానేసి అంకుల్ అని పిలవడం మొదలుపెట్టక ముందే ఏదో ఒక సంబంధం చూసి....
మళ్లీ ఏదో ఒక సంబంధమంటావు.....అమ్మాయి బాగుండాలికదా,వాడి ఎత్తుకు సరిపడేపిల్ల కాకపోతే వాడొప్పుకోడు.విసుక్కున్నాడు రఘుపతి.
సరే  సరే...అలాగే  చూద్దాం అమ్మాయి బాగుండాలి.వాళ్ల అమ్మ,నాన్న చదువుకుని ఉంటే మరింత మేలు,ఆస్తి అంతస్తులేకాక అమ్మాయి తండ్రో, తాతో ఏ ఎం.పీనో, ఎం.ఎల్.ఎ నో అయితే మరింత రాజకీయ ప్రయోజనం.రఘుపతి కుటుంబంలోని వారి కోరికల చిట్టా వెంకటేశ్వర్లుకు తెలుసు.
సరుకుండగానే సరికాదు.సరుక్కు గిట్టుబాటు ధరను మనమే నిర్ణయించుకోవాలికదా! రఘుపతి మాటలకు, అందులోని వ్యాపారధోరణికి వెంకటేశ్వర్లు తెల్లబోయాడు.
నేను మీ శ్రేయోభిలాషిని పైగా  కాస్త దగ్గరి బంధువును కూడా అనే చనువుతో చెప్తున్నాను మరిక అబ్బాయిని ముదిరిపోనివ్వకండి.
శశాంక్ వస్తున్న అలికిడి విని అందరు మౌన మంత్రము పఠిస్తున్నారు.
వస్తానంకుల్ బైక్ స్టార్ట్ చేసాడునాయనా త్వరగా  ..  సరోజిని  మాట పూర్తికాకమునుపే ఎలాగోలా
వస్తాలే.అంటూ  పెళ్లి మాటల స్థానే ఫైళ్లను తలచుకుంటూ బండిని పరుగులు తీయించాడు.
శశాంక్ భయపడ్డట్టుగాకాక ఆడిట్ కాస్త త్వరగానే పూర్తయింది.
ఇంటి దగ్గర అందరు అప్పటికే ఎదురు చూస్తున్నారు.క్యాబ్ ను పిలిపించాడు వెంకటేశ్వర్లు.
నువ్వురావాలి మరి అన్నాడు రఘుపతి తమకు   బై చెపుతున్న వెంకటేశ్వర్లుతో.
నేనేందుకు మీకు నచ్చాక చూస్తాలే.అనుమానంగానే ఉంది వెంకటేశ్వర్లుకు ఏవంక పెట్తారోనని.
 రండి అన్నయ్యా, ముగ్గురెలా వెళ్తాం,మీరుకూడా రండి.సరోజిని అడగ్గానే ఇక తప్పదు అనుకుని కారెక్కాడు.
కారు ఇంటిముందుకు చేరగానే ఎదురువచ్చాడు అమ్మాయి తండ్రి.స్వంత బంగళా,ఇంటిముందున్న ఇన్నోవా కారు,ఇంటివారి అభిరుచిని తెలుపుతూ పూల పరిమళం వెదజల్లుతున్న తోట. ఫరవాలేదు పక్కింటి ఆంటీ అన్నీ చూసే చెప్పినట్లుంది,అమ్మ,నాన్నకుకూడా నచ్చితీరుతుంది.అందమైన వాతావరణంలో అమ్మాయి కూడా ఆకర్షణీయంగా వుండాలని కోరుకుంటున్నాడు శశాంక్. ఎలాగైనా  ఈ సంబంధం తప్పక కుదురుతుంది.సరోజిని గట్టిగా నమ్ముతోంది. అమ్మాయి తల్లి,తండ్రి సాదరంగా ఆహ్వానించారు.వారివెనుకనే సంబంధం చెప్పిన పక్కింటి మమత ఆంటీ!
అమ్మాయి తండ్రి పేరుమోసిన డాక్టరు.తల్లి డిగ్రీ కాలేజీలో లెక్చరర్.అమ్మాయి బి.టెక్ చేస్తుండగానే క్యాంపస్ సెలెక్షన్ లో వచ్చిన ఉద్యోగం.ఇంట్లోని వారందరు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవారు.ఇంటి ట్రెజరీలో ఏ ఒడిదుడుకులు లేవు.వెనకనున్న ఆస్తులు పెరిగేవేకాని తరిగేవి లేవు.అమ్మాయి మేనమామ ప్రత్యక్ష రాజకీయాలలో లేడుకాని ఆయన శ్వాసించేది మాత్రం రాజకీయాన్నే. ఆయన ద్వారా తమ పనులు జరిపించుకునే వారెందరోవున్నారు.పలుకుబడికల కుటుంబం.అమ్మాయికి ఆస్తి వుంది,అందం వుంది పైగా చక్కటి ఉద్యోగముంది. అమ్మాయి తల్లి కూడా విద్యావంతురాలు,లెక్చరర్.తండ్రి మంచి హోదాలోనే రిటైర్ అయ్యాడు.అమ్మాయి ముఖంలో వున్న కళ ఆయస్కాంతంలా ఆకర్షిస్తోంది.రఘుపతి కుటుంబంలో అందరి ముఖాలలోను తృప్తి కనిపిస్తోంది.వారి ఆదరణ మరింతగా నచ్చుతోంది అందరికీ!వారు వడ్డించిన రెండు మూడు రకాల స్వీట్లు అందించిన రుచికన్నా వారి కుటుంబమందించిన ఆస్తి,ఉద్యోగ వివరాలు మరింత పసందుగా ఉన్నాయి శశాంక్ తల్లిదండ్రులకు.అందరిని ఓకంట గమనించిన వెంకటేశ్వర్లు ఈసారి శశాంక్ పెళ్లి బాజా తప్పక మోగుతుందనుకున్నాడు.
    ఇంటికి తిరిగి వెళ్లాకకూడా అమ్మాయి రూపం శశాంక్ ను గిలిగింతలు పెడుతూనే వుంది.అమ్మాయి నచ్చిందని ఇంటికి రాగానే ఫోన్ చేసి పక్కింటి మమత ఆంటీకి చెప్పకుండా వుండలేకపోయాడు శశాంక్. మిగిలిన వివరాలు తెగ నచ్చేసాయని మనసులోనే అనుకున్నారు రఘుపతి,సరోజిని. పరధ్యానం  ఎక్కువైందని  ఆఫీసులో శశాంక్ స్నేహితులు అతడిని ఆటపట్టిస్తున్నారు.
గుమ్మం దగ్గర శబ్ధమైనా,ఫోను మోగినా, మీ అబ్బాయి నచ్చాడు.మీరెప్పుడు చెప్తే అప్పుడే నిశ్చితార్థం చేయడానికి మేము రెడీ అని అమ్మాయి అమ్మో,నాన్నో తమ మనసుకు నచ్చే మాట చెప్తారని ఆశగా
ఎదురు చూస్తున్నారు శశాంక్ తల్లిదండ్రులు.శశాంక్ కూడా తన ఆతృత బయటకు కనబడకుండా అమ్మ, నాన్నల సంభాషణలపై ఓ చెవి వేసే వుంచాడు.వారం గడవడమే గగనమైంది ముగ్గరికీ! వదిన ఏమేమి
సారెలు తెస్తుందో అని శశాంక్ చెల్లెలు మనసులోనే లెక్కలు వేసుకుంటోంది.వదినె తెచ్చే సారె బిందెలు తనపాలిటి లంకెబిందెలుగా జమ చేసుకుంటోంది.
ఇలా ఎదురు చూస్తున్నవారి దగ్గరకు ఇరువైపుల తెలిసిన మధ్యవర్తి ఒకాయన మంచి వర్షంలో వచ్చాడు.వర్షానికి తడిచిన గొడుగును ఓవారగా పెట్టి నీరు జారిపోయేదాకా చూస్తూ నిలబడ్డాడు.అదే ఆరిపోతుంది గొడుగువిప్పి ఆరబెట్టండి.ఆలోచిస్తూనే గొడుగును విప్పిపెట్టి వచ్చాడు వచ్చినవ్యక్తి. చక్కటి కబురు తెచ్చేవుంటాడనుకుని వేడివేడి కాఫీ,మురుకులు తెచ్చిపెట్టింది సరోజిని.
శశాంక్ గదిలోనుండి బయటకు రావాలా వద్దా అన్న సందేహంలో పడ్డాడు. కంప్యూటర్ షట్ డౌన్ చేసి బయటకు అడుగెయ్యబోయాడు.వాళ్ల అమ్మాయికి మరో సంబంధం వచ్చిందట.అది చూసాకే మీకేసంగతి చెప్తామన్నారు.లేదూ మీకేదైనా వేరే సంబంధం వస్తే చూసుకోమన్నారు.
శశాంక్ ముఖం వివర్ణమైంది.తనేమైనా బస్సుకోసం ఆగాడా? ఒక బస్సుకాకపోతే మరో బస్సు అన్నట్లుంది.’ ‘మరిమీరు చేసిందేమిటి? మనసు వేసిన ప్రశ్నకు జవాబు తడుముకున్నాడు శశాంక్.నిజమే తాము చూసిన సంబంధాలన్నీ ఏదో ఒక వంక పెట్టి అమ్మో,నాన్నో,తనో ఎవరో ఒకరు ఇదికాకపోతే ఇంకొకటి అదీ కాకపోతే మరొకటి అంటూ అమ్మాయిలను క్యూ కట్టించాము ఇప్పుడు తాను క్యూలో నిలబడినట్లుంది. శశాంక్ లో అంతర్మధనం.
అయ్యో,గొడుగు ఎగిరిపోతోంది.వచ్చిన మధ్యవర్తి పరుగు తీసాడు.
అవకాశం ఎగిరి పోతున్నట్లనిపించింది అందరికీ.నిజానికి అవకాశాలు సన్నగిలి పోయాయి అని అర్థమవుతోంది అందరికీ!వచ్చిన సంబంధాలకు వంకలు పెట్టి బాధించామేమో.శశాంక్ లో మధన మొదలైంది.రఘుపతి,సరోజిని మాటలకు తడుముకోవలసివస్తోంది.
మనిషిలో రాజీపడే తత్వం లేకపోతే కోరికలకు,ఆశలకు కళ్లెం పడక మరీ ముఖ్యంగా పెళ్లి సంబంధాల వెతుకులాటలో ఇలాంటి పర్యవసానాలు నేటి రోజుల్లో నేను చాలా చూస్తున్నా!అందుకే నేనప్పుడే  చెప్పాను వచ్చిన ప్రతి సంబంధానికీ వంకలు పెట్టి తప్పులు పట్టకండిరా అని నానమ్మ మాటలను మరిక అడ్డుకోలేదు శశాంక్.                                                                                                                                                                                             
*******


Tuesday, June 26, 2012

మరో దిద్దుబాటు

12 comments

ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 5/7/2012 (జన్మదిన సంచిక)లో ఆంధ్రభూమి-నాటా పోటీలో ఎంపికైన నా కథ

మరో దిద్దుబాటు
                                                  
  రవి అసహనంగా అటు ఇటు కదుల్తున్నాడు.అసహనానికి కారణం తెలిసినా అధిగమించలేని అశక్తతకు తనపై తనకే కోపం.సుమకు బాధగాలేదా?చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి బ్రతుకును రావణకాష్ఠం చేసింది.ఏమనుకుంటోందో!అనుకున్నాడు విరక్తిగా.
          ఒక్క క్షణం కూడా రవి గురించి ఆలోచించాలనిపించడంలేదు సుమకు.అయినా రవి చుట్టు అల్లుకున్న ఆలోచనలే. ఈ రాత్రి గడిస్తే తనెవరో అతనెవరో!కోర్టు విధించిన గడువు ఎప్పుడు ముగుస్తుందో! కోర్టు విడాకులు మంజూరు చేయడం, ఆ తరువాత అంతా  స్వేచ్ఛే!ఫ్రీబర్డ్స్ అన్నమాట.
కోర్టు మాట ప్రకారం జంటగా వంటరి కాపురం చేసారు.తన నిర్ణయాన్ని మార్చే ఏ వింతలు విడ్డూరాలు జరిగి పోలేదు.అల్లావుద్దీన్ అద్భుత దీపంలా కోరిన వెంటనే విడాకులు వస్తే ఎంత సుఖం!ఆఫ్ట్రాల్! చిన్న మాటకు పశువులా ప్రవర్తిస్తాడా?
జరిగినది గుర్తుకు వస్తే చాలు సుమ మనసు గంధకంలా మండుతోంది.కళ్లలో నీళ్లు, నిస్సహాయత.
ఇంత అనాగరికంగా నాపైకే చేయ్యెత్తాడంటే  ఎంత  పురుషాంహకారం? చదువుకున్నదానిని,హక్కులు తెలుసు,వాటిని కాపాడుకోవడం తెలుసు,రక్షణకవచాలెన్నో ఉన్నాయి.పల్లెటూరి పిల్లనుకున్నాడేమో కసిరినా కొట్టినా కాళ్లకు చుట్టుకుపోవడానికి!
ఎ.సి చల్లనిగాలులు పంపిస్తున్నాకోపం సెగలు రేపుతోంది.సర్దుబాటుకు ఆస్కారమే లేకుండాపోయిన   దాంపత్యం.
ఈ ఒక్కరాత్రి గడిస్తే చాలు.ఆపై ఎవరిదారి వారిదే.
తన ఆత్మగౌరవం కాపాడుకున్నాననే ఆనందం,తనపై చెయ్యి చేసుకోవాలనుకున్న రవికి గుణపాఠం చెప్పగలిగానన్నతృప్తి!అందుకే  సర్ది చెప్పబోయిన తల్లిదండ్రులను కూడా వారించింది.సుమకు హాయిగా నిద్ర పట్టేసింది.కాలేజీలో స్త్రీ స్వేచ్ఛ,హక్కులపై తన డిబేట్ల తాలుకు మధుర జ్ఞాపకాలు కలలై అలరించసాగాయి.
వాళ్లను కలపాలని వచ్చిన సుమ అమ్మ,నాన్న హాల్లో పడకేసారు ఒకరినొకరు నిందించుకుంటూ.నీ పెంపకమే దీనికి కారణమంటే కాదు నీ పెంపకమేనంటూ! వాదనలో పాయింట్లు బలంగానే వున్నాయి.కాని ప్రయోజనం శూన్యం.తాము వాదనలో నెగ్గడం కాదు కూతురి కాపురాన్ని నిలబెట్టలేక ఓడిపోయి మిన్నకుండిపోయారు.మానవులు కాదు మమతలు అంతమయిపోయేరోజు ఎంతో దూరంలోలేదని ఇద్దరు అనుకున్నా, పైకి పలకలేని పెద్దరికం, మనసులోనే మాటలను సమాధి చేయడానికి అలవాటుపడిపోయింది.

రవికి మనసంతా చేదుపూత పూసినట్లుంది. చదువుకున్నది,తెలివైనది,సంసారాన్ని చక్కగా నడిపించగల తోడు దొరికిందనుకున్నాడు.వెంట వచ్చిన ఆస్తిని వద్దన్నాడు.కూతురి కోసమన్న అత్తమామల కోరికను కాదనలేకపోయాడు.గారాబంగా పెరిగిన బిడ్డే!అలా అని పొరబాట్లను సర్దుకోమనకూడదా!అన్నీతనే సర్దుకోవాలా!ఏదో ఆవేశంలో చెయ్యి లేపాడు.కొట్టాడా? లేదే!                                                  సరే,సారీ,సారీ అని ఎన్ని సార్లు బ్రతిమాలాడు?ఏణ్ణర్థం కాపురంలో ముప్పాతిక శాతం పుట్టింటిలోనే.కాదనలేదే. తల్లిదండ్రులకు తనపై వున్న ప్రేమతో వారు కొనిచ్చిన నగలు,చీరలు, వాటిని ప్రదర్శించే అవకాశాలు.కిట్టీ పార్టీలు, పబ్బులు,హబ్బులు,సల్సా డాన్సులు.వద్దంటే ఎలాగు వినదు తనే తెలుసుకుంటుందిలే అనుకున్నాడు.తన భార్య  గురించి ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి అని ఆఫీసు ప్యూను వెకిలిగా నవ్వుతూ చెప్పినప్పుడు అక్కడే పడి చావాలనిపించింది.ఆ కోపంలో ఇంటికి రాగానే తన ఆలస్యాన్ని ప్రశ్నించింది సుమ. 
ఏమాలస్యం కారు వుండి కూడా అంది.
నాకు టైమవుతోంది కదా.అవతల మిసెస్ గీత పదే పదే ఫోన్ చేస్తోంది అన్న బాధ సుమలో.
నిజమే నీకు టైమవుతోంది.విసుగ్గా అన్నాడు
ఏమంటున్నావ్?
ఏమీ లేదులే అన్నా విడిచి పెట్టలేదుసుమ.
ఏదో మనసులో పెట్టుకుని అంటున్నావ్,నిజం చెప్పు అని నిలదీయసాగింది.
అదే! వెళ్లే టైమవుతోంది కదా! అని సర్దబోయాడు.
కాదు, మరేదో ధ్వనిస్తోంది.
అవును విడిపోయే టైమవుతుంది నువ్విలాగే ప్రవర్తిస్తే అనేసాడు తను విసిగిస్తోంటే.
ఏమన్నావ్ అంటూ విసురుగా మీదకు రాబోయిన  సుమను, “ ఏయ్,ఆగు,నీవు ఒక ఆడదానివేనా,దెబ్బలు తినగలవ్ నా చేతిలో అంటూ చెయ్యి లేపాడు తాను.
తప్పే!అనకూడదు...అనేసాడు.చేతిని లేపడం పొరబాటే! వెంటనే సుమ ఆడ పులిలా మారిపోయింది.
బి కేర్ ఫుల్! నేను రియాక్టయితే నీకే టైమవుతుంది జైలుకు.విసురుగా వెళ్లిపోయింది సుమ
అంతే అవే చివరి మాటలు.కాని సుమ రియాక్షన్ ఇంతలా విడాకుల దాకా వస్తుందనుకోలేదు.తమ కుటుంబాలలో అమ్మ,నాన్న, అక్క,బావ పెద్దమ్మ,పెద్దనాన్న ఇలా ఎందరో మాటలు విభేదించారు కాని వారి మనసులు విభేదించలేదు.వారి తగవులు అద్దంపై ఆవగింజలే!ఏనాడు విడాకులు అన్న మాటే వినబడలేదు.ఇప్పుడు ఒకరి రుచులు ఒకరికి నచ్చకపోయినా,అభిరుచులు వేరైనా,మాట తీరు నచ్చకపోయినా విడాకులు,విడాకులు  అంటూ పెండ్లి మంత్రాలను మరిపించే విడాకుల మంత్రం.  రవి తల ఆలోచనలతో వేడెక్కుతోంది.                                                                                                                        

ఇది సాధారణ తగవు .భార్యాభర్తల నడుమ చిన్న గిల్లికజ్జాలే.కాని ఇవే చిలికి చిలికి గాలివానలే కాదు సునామీలై దాంపత్య వ్యవస్థను ఛిద్రం గావిస్తున్నాయి.విడాకులు  ఎంతో సులభం అనుకుని కలిసి జీవించడంకన్నా విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. పెళ్లి మంత్రాలు చదివినంతసేపు పట్టడంలేదు విడాకుల మంత్రాక్షరాలు పఠించడానికి! స్త్రీల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు అర్థం సరిగా నిర్వచించుకోలేక విపరీతార్థాన్ని అన్వయించుకుంటున్నారు. భార్యాభర్తలనే పదాలను క్రోధ ద్రావకంలో ముంచి సంసారాలను నిస్సారవంతం చేసుకుంటున్నారు. అమ్మ,నాన్నలు,అత్త,మామలు కేవలం ఉత్సవ విగ్రహాలే. పిల్లలను ప్రశ్నించలేని అనిమిషులు. సర్ది చెప్పలేని తల్లిదండ్రుల నిస్సహాయత.గట్టిగా
                                                         
చెప్పాలంటే  పిల్లల అంబులపొదిలోని ఆత్మహత్యాస్త్రం. సుమ తల్లిదండ్రుల మనసుల్లో మూగ రోదనే.తల్లిదండ్రుల ఊరడింపులు,రవి వారింపులు సుమ పట్టుదలను ఒక్క అంగుళమైనా కదిలించలేకపోయాయి.

ఇల్లు చేరుకున్న సుమ ఆనందంగా వూపిరి తీసుకుంది.ఇల్లంతా కలియతిరిగి పనివాళ్లనందరిని ప్రేమగా పలకరించింది.తనకు తలంటు పోసే భాగ్యను పిలిచింది.
రా తలంటుదువుగాని అని భాగ్యను పెరట్లోకి లాక్కుపోయింది సుమ
మాటల మధ్యలో తనకు నెల తప్పిందని సిగ్గుపడుతూ చెప్పింది భాగ్య.
సరే నీ కొడుకుతో ఆడుకుంటాలే.గలగలా నవ్వింది సుమ.
ఏదో చెప్పబోయి ఆగిపోయింది భాగ్య.
తలంతా భారంగా వుంది ఒక చేత్తోనే కాదు, రెండు చేతులతో బాగా రుద్దు.
రెండో చెయ్యి లేవదమ్మా,ఒక నెల కదప కూడదన్నారు.
ఏమిటీ? కళ్లు మూసుకుని కూర్చున్న సుమ ఉలికిపడి కళ్లు తెరిచి అప్పుడు చూసింది భాగ్య చేతిని.
ఏమైందే నీకు? అంటూ ఆతృతగా అడిగింది
పడ్డానమ్మా.” అంది భాగ్య.
బుద్ధుందా?ఎలా పడ్డావ్?”
మా స్నానాలగదిలోనేనమ్మా,జారిపడ్డాను అంతే.
మరేం చేసావ్?అమ్మ డాక్టరు దగ్గరకు పంపలేదా?
పంపారమ్మా, వెళ్లి ఆపరేషను కూడా చేయించుకొచ్చా.మణికట్టు దగ్గర సన్నగా విరిగిందటమ్మా.డాక్టరు బాబు ఇంకా ఓ వారం జాగ్రత్తగా ఉండమన్నారు.మరేం ఫర్వాలేదు జాగ్రత్తగా వుంటానని చెప్పి వచ్చాను.
సరేలే ఘనకార్యం చేసేవుగాని ,కాసిన్ని పూలు కోసిపెట్టు స్నానం చేసొస్తా.                                  
కనకాంబరాలు మాలగా కట్తోంది సుమ.పూలందిస్తోంది భాగ్య.
భాగ్యా,ఎక్కడున్నావు?”కాస్త గట్టిగానే అరుస్తూ వచ్చాడు భాగ్య భర్త వెంకటయ్య.
                                                           
వచ్చావా,ఏందియాళ అమ్మాయిగారు వచ్చారని సంతంతా చుట్టబెట్టుకు తెచ్చావా ఏంది?భాగ్య నవ్వింది.
భార్య నవ్వును కళ్లంతా విప్పార్చి చూస్తూ,
కాదే, సంతలో పకోడీల దుకాణం తెరవడం కుసింతాలీసం అయింది కాని తీపు సయించదంటావని పకోడీలు తెచ్చినా,ఇదిగో పుల్ల మామాడి కాయలు.మరీ పిందెలల్లే వున్నాయి వచ్చే వారానికి కొంచం పెద్దవే అవుతాయిలే.
అమ్మాయిగారు,మా ఆయనకు అన్నం పెట్టి వస్తాను,చారులో పకోడీలు నంజుకోవాలంటే చానా ఇష్టం.అంటూ లేచింది. తన అంగీకారం కోసం ఎదురు చూడకుండానే వెంకటయ్య వెంట పరుగెత్తింది.
ఆ..ఆ...చిన్నగా నడు.” తలపై మెల్లగా మొట్టాడు వెంకటయ్య.
                                                          
ఏమయ్యోయ్ నిన్ను మొట్టేవాడొస్తున్నాడు.అని నవ్వుతూ భర్త చెయ్యి పట్టి ఊపింది భాగ్య.
ఏయ్!ఏమిటా వేషాలు అమ్మాయిగారు చూస్తున్నారనైనా లేకుండా,సినిమాలు ఎక్కువయాయి నీకు.నవ్వుకుంటూ తమ చిన్నగూటిలోకి వెళ్లిపోయారు.
ఎంత బాగా చూసుకుంటాడు భార్యను!నిట్టూర్చింది సుమ.
ఏంచేస్తున్నావు సుమా,భోంచేద్దువుగాని, రా,నాన్న కాచుక్కూర్చున్నారు.పిలుస్తూ వచ్చింది సుమ తల్లి.
పాపం భాగ్య ఎలా పడిందో చూసావా అమ్మా?సుమ బాధగా అడిగింది తల్లిని.
పడిందా? అలా అని ఎవరు చెప్పారు?
అదేమిటీ!పడలేదా?” సందేహంగా ఆగింది సుమ.
అయ్యో,వాడు తోస్తే పడిందే అది.
ఎవడు?సుమలో ఆశ్చర్యం రెట్టింపయింది.
ఇంకెవడు! దాని మొగుడు.
ఎవరు వెంకటయ్యా?భార్యనంత ప్రేమగా చూసుకుంటున్నాడే!ఎందుకు తోస్తాడు?
వాడేదో తన పెద్దనాన్న కూతురి పెళ్లికి ఓ రెండొందలు చదివిస్తానన్నాడు.అదే దీని కొంప ముంచింది.అందరికీ డబ్బు సాయం చేయాలనే తత్వం వెంకటయ్యది.కాసు కరిగితే మళ్లీ దొరకదు అని దీని భయం.డబ్బులడిగాడని పెంకులెగిరిపోయేలా అరుపులు,వాడిని వాడి వాళ్లను కలిపి కేకలేసింది.
పెళ్లాం,మొగుడి సంగతులు నలుగురిలో ఎత్తి చూపుతావా?” అని ఇంట్లోకి బలంగా తోసి గడియ వేసేసాడు.ఎంతైనా మగాడు బలవంతుడు కదా!దాని అరుపులకి హడలిపోయాం.మీ నాన్న,నేను గట్టిగా కోపగించుకున్నాక బయటకు వచ్చారు.వాడు రంకెలు,చెయ్యి విరిగేట్టు తోసేసాడు బాబోయ్ అని ఇది ఏడుపు.పుట్టింటికి పోతానని ఒకటే గొడవ.అలాగే వెళ్దువు గానీలే అని కారు డ్రైవరు వెంట డాక్టరు దగ్గరకు పంపించా.కాస్తలో తప్పింది మణికట్టు దగ్గర చెయ్యి విరిగితే ఎంత ప్రమాదం!
మరి పుట్టింటికెళ్లలేదా?సుమ ఆతృతగా అడిగింది .
మగాడు బలవంతుడైనందుకేనా ఇలా పశుబలం చూపుతాడు !’ఆమె మనసులో రవి రూపం అస్పష్టంగా.
అదెందుకెళ్తుంది,దాని మొగుడిని వదిలి?నేను కాచిన చారు లేకపోతే అన్నం సరిగా తినడు,వేణ్ణీళ్లు కాచివ్వకపోతే కష్టజీవి ఒళ్లునొప్పులు తగ్గవు.అన్నం వేడిగా వండితే గాని తినడు అని ఒక్క చేత్తోనే వాడికి వండి పెడ్తోంది.
మరి వాడలా తోస్తే ఇదెలా ఊరుకుంది పోలీసు కంప్లైంటు ఇవ్వచ్చుగా.ఆ పని తనైనా చెయ్యాలనుకుంటూ కోపంగా అడిగింది సుమ.
చదువుకున్నవాళ్ల తెలివితేటలు వీళ్లకుండవులే.సరే ఆలస్యమవుతోంది రా.” సుమ తల్లి మరోమారు కూతురిని భోజనానికి పిలిచి వెళ్లింది.

అమ్మ పొగుడుతోందా?విమర్శిస్తోందా?నిరుత్తరురాలై  తల్లి వెళ్లినవైపే చూస్తూ, ఆకులు,రాలిన పూల రేకులు పోగు చేద్దామని చీపురందుకుంది.
అయ్యో అమ్మాయిగారు మీరూడ్చడమేమిటి,నేనున్నానుగదా.” అని బలవంతంగా సుమ నుండి చీపురు లాక్కుంది భాగ్య. ఒక కన్నుకు దెబ్బ తగిలితే మరోకన్ను ఏడుస్తుంది,అలాగే ఒక చేత్తో ఊడుస్తున్నా మరో చెయ్యి సహకరిస్తున్నట్టుగా ఊగుతోంది.అబ్బా! అని దెబ్బ తగిలిన చేతిని నొక్కుకుంటూనే ఓపికగా పని చేస్తోంది భాగ్య.
భాగ్యా
ఏంటమ్మా,’ అన్నట్టు చూసింది
నీకు మీ ఆయన మీద కోపంలేదా?
అదేంటమ్మాయిగారు ఎందుకుండాలి కోపం?
ఎందుకా నిన్ను లోపలికి తోసి నీ చెయ్యి విరిచినందుకు.
అయ్యో మా ఆయన తప్పేం లేదమ్మా.నన్ను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాడు.జీతమంతా నాకే ఇస్తాడు.ఏదో పుట్టినరోజులు,పెళ్లి చదివింపులు అంటానే ఉంటాడు.అందుకే నాకు తిక్కరేగి ఒల్లనన్నాను.వాడు బతిమలాడేసరికి నేను గొంతు పెంచి గదిమాను.వాడు నా నోరు తగ్గించమన్నాడు.నాకు పూనకం వచ్చింది కదా తగ్గలేదు.ఆయనకసలే సిగ్గు నలుగురిలో పలుచనైతామని నన్ను చెయ్యట్టుకుని లోనికి తోసాడు,నేను తగ్గి ఉండాల్సింది.తగ్గలేదు నేను చెయ్యి బలంగా లాక్కున్నాను.ఆ పెనుగులాటలో బొమిక కాస్త చిట్లింది.అంతేనండి జరిగింది.మళ్లీ ఆయన్నడగకండమ్మా బాధ పడి అన్నం తినకుండానే తొంగుంటాడు రాత్రికి.నిజానికి అంట్లు కడగడం,బట్టలుతకడమే కాదు సగం వంటపని కూడా చేసేస్తున్నాడండి పాపం. భాగ్య ముఖంలో వెంకటయ్యను గూర్చి దిగులు!
బాత్రూంలో పడ్డానని తనతో చెప్పిన అబద్ధాన్ని మరచిపోయింది , ఇప్పుడేమో వాడి తప్పేమిలేదన్నట్లు వెంకటయ్యను వెనకేసుకొస్తోంది.
మరి పుట్టింటి కెళ్తానన్నావటకదా,వెళ్లుండాల్సింది. ఇలాంటి మొరటువాడితో కాపురంకన్నా విడాకులు నయం.
తన కష్టం,భాగ్య బాధ సుమను మరింత ఉద్రేకపరుస్తున్నాయి.
అదేంటమ్మాయిగారు అలా అంటారు!నేను పుట్టింటికెళ్లడమేమిటి?నా ఇంటిని, నా ఇంటోడిని గాలికి వదిలేసి నేనెక్కడికెళతాను?ఏదో బాధలో సవాలక్ష అనుకుంటాం.అవన్నీ చేసేస్తామా?
సుమ భాగ్యవైపు వింతగా చూడసాగింది.
బడిలో చిన్నప్పుడు మన చెయ్యట్టుకుని పంతులుగారు ఓనమాలు సరిగా దిద్దిస్తారు,మరి పెళ్లాం, మొగుడు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని తప్పులు సరిదిద్దుకోవాల. అంతగా చదువులేనిదాన్ని నేను చెప్పింది తప్పు అనుకుంటే మన్నించండమ్మా.  
ఆ రాత్రి సుమ మనసులో రూపుదిద్దుకుంటున్న దిద్దుబాటు.

                                                ************