Monday, April 1, 2013

కవిత



ఈ రోజు ఆంధ్రభూమిలో ప్రచురితమైన నా కవిత 


http://www.andhrabhoomi.net/content/a-413


                        
అబల కాదు అంకుశమై నిలవాలి

క్షిపణిలా అంతరిక్షంలోకి దూసుకెళ్లే అతివలున్నా
గర్భస్థ పిండంగానే పిండప్రదానం పొందే ఆడకూనలెన్నో
అయ్యో పాపం వారి ఆర్తనాదాలకు ఊరడింపు గీతం
ఆకాశంలో సగం కాదు
పుడమిపై పాతిక శాతమయ్యే విపత్తు
ఆడపుట్టుక పుటల నిండా చిదిమేసిన చేవ్రాలెన్నో
కుక్కలనోట, కాటి పాలిట గిరాటైన ఆడపిల్లలు
జననానికి మరణానికి నడుమ అడుగడుగునా గండాలే
ఆటబొమ్మను చేసి ఆడించే వేదికలు
రూపంపై రూకల మూటల వాణిజ్యాలు
చూపులే సూదులై గుండెపై దాడులు
కంటి తుడుపుల మాటల మంత్రాలు
లేపనాలు వద్దు, చీడలపై ద్రావకాలు రంగరించు
నివారణ కాదు నిష్కృతి, నిర్మూలనే ధ్యేయం కావాలి
మనిషి మనిషిలో ఆలోచనల నెగళ్ల నెగదోయాలి
మెదడులో కాదు ఆలోచన, హృదయంలో మొలకెత్తాలి
అన్యాయాన్ని ఎదిరించే ఆదిశక్తి కావాలి
ఆడపిల్ల పుట్టిందని ఉలిక్కిపడటం కాదు
అంకుశం పుట్టిందని గర్వపడాలి.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

8 comments:

Padmarpita said...

చాలా నచ్చింది

జలతారు వెన్నెల said...

చాలా రోజులకు ఉమా దేవి గారు..
పద్మార్పిత గారి మాటే నా మాట కూడాను. చాలా నచ్చింది.
అబల కాదు అంకుశమై నిలవాలి....చక్కటి సందేశం.

మాలా కుమార్ said...

చాలా బాగా వ్రాశారు.

సి.ఉమాదేవి said...

పద్మార్పితగారు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

సి.ఉమాదేవి said...

నా కవిత మీకు నచ్చినందుకు చాలా సంతోషం జలతారు వెన్నెలగారు.

సి.ఉమాదేవి said...

మాలాగారు కవిత నచ్చినందుకు సంతోషం.

శ్యామలీయం said...

ఉమాదేవిగారూ, మీ కవిత హృద్యంగా ఉంది. కొన్ని చిన్నచిన్న భాషాదోషాలు సవరించుకుంటే మరింత బాగుంటుంది.

> క్షిపణిలా అంతరిక్షంలోకి దూసుకెళ్లే అతివలున్నా
> గర్భస్థ పిండంగానే పిండప్రదానం పొందే ఆడకూనలెన్నో
ఈ రెండు పాదాల్లోనూ వచనభంగదోషం ఉంది, గమనించారా? క్షిఫణుల్లా అనీ గర్భస్థ పిండాలు గానే అనీ వాడితే సరి.

> ఆడపుట్టుక పుటల నిండా చిదిమేసిన చేవ్రాలెన్నో
ఈ పాదంలో చేవ్రాళ్ళెన్నో అని అనాలండి పుటలు అని వాక్యంలో తొలుత బహువచనం వాడారు కదా.

> చూపులే సూదులై గుండెపై దాడులు
ఈ‌పాదంలో మీరు బహుశః గుండెలపై అనదలచుకున్నారేమో. గుండె అని యేకవచనం చేసినా ఫరవాలేదు.

ముందే మనవిచేసినట్లు ఇవి పెద్దదోషాలేమీ కావు. చిన్న చిన్న భాషాప్రయోగసంబంధిదోషాలు. పరిహరించుకుంటే బాగుంటుంది. ఏదో చాదస్తం కొద్దీ‌ యెత్తి చూపాను కానీ మీరు నొచ్చుకునే ప్రమాదముంది. అలా గయితే మన్నించండి.

ఒకప్పుడు ఒక సుప్రసిథ్థ తెలుగు చలనచిత్రానికి శ్రీశ్రీగారు తెలుగువీర లేవరా అని ప్రబోధాత్మక గీతం‌ వ్రాసారు. అందులో వారు

ప్రతి మనిషి తొడలుగొట్టి శృంకలాలు పగులగొట్టి
శృంకలాలు పగులగొట్టి
చురకత్తుల పదును పెట్టి తుది సమరం మొదలుపెట్టి
తుది సమరం మొదలుపెట్టి
సింహాలై గర్జించాలీ

( ఈ‌ చరణంలో ప్రతిమనిషీ అని యేకవచనంలో మొదలు పెట్టి సింహాలై అని బహువచన్ం చేసారు ఆతరువాత. అది పొరపాటున జరిగింది వారికి తెలియక కానేకాదు. )
ఈ పాట వ్రాసి యిచ్చి వెళ్ళిపోయిన శ్రీశ్రీగారికి అందులో వచనసంబంధమైన అన్వయదోషం ఉందని గ్రహింపుకు వచ్చి పరుగున స్టూడియూకు వచ్చారు సరిజేద్దామని. అయితే అప్పటికే ఘంటసాల మాష్టారు ఆ పాటను బ్రహ్మాండంగా పాడి రికార్డు యిచ్చివేసారు. అది తెలిసి శ్రీశ్రీగారు చేసేది లేక ఊరకున్నారు. ఆతరువాత వారు యీ దోషం అలా మిగిలిపోవటం గురించి స్వయంగా చెప్పారు. అది ప్రమాదవశాత్రు దైవికంగా జరిగిన తప్పిదమనీ‌ వారన్నారు.

ఇదంతా యెందుకు చెప్పుతున్నానంటే స్వల్పదోషాలైనా వాటిని సరిదిద్దుకుంటే రచనలు మరింత శోభాయమానంగా ఉంటాయని విన్నవించటానికే. నా అథికప్రసంగం వలన, మీకు ఇబ్బంది కలిగితే, మన్నించ వలసినది.

సి.ఉమాదేవి said...

శ్యామలీయం గారు, మీకు కవిత నచ్చినందుకు సంతోషం.మీ సూచనలు గమనించాను.ధన్యవాదములు.

Post a Comment