Thursday, September 27, 2012

అమెరికా వృక్షంపై తెలుగు పక్షులు

ఏపుగా పెరిగిన మేపిల్,ఓక్ వృక్ష సముదాయాల నడుమ  విశాలమైన ప్రాంగణం. పచ్చని పచ్చిక పేని పుడమితల్లికి మాలవేసినట్లు చుట్టు పరచుకున్నగరిక తివాచీ!వేదిక అందరికీ కనబడేలా తీరుగా అమర్చిన కుర్చీలు.వేదికేకాదు ఒకరికొకరు పరస్పరం కనబడుతూ కళ్లతో మొదటి పలకరింపులు కూడా జరిగేలా ఉన్నాయి అమరిక.అమ్మాయిల నుదుట తీర్చిన రంగురంగుల బిందీలు తెలుగుదనాన్ని రంగరిస్తున్నాయి. పిల్లలు,పెద్దలు ఉత్సాహానికి ఉల్లాసం జోడించి అటు ఇటు నడయాడుతుంటే గోదావరి గలగలా ప్రవహిస్తున్నట్టు,క్రిష్ణమ్మ ఉరుకులు పెడుతున్నట్లు భావన మదిలో మెదలి మనసంతా ఆనందార్ణవమైంది.ఆటపాటల సంగమమైన తెలుగు సరదాల పందిరి క్రింద ఒకే గూటి పక్షుల నందనవనమై భాసిల్లింది తెలుగు వారి పిక్నిక్ సందడి.
పిల్లలు,పెద్దలు అత్యంత హుషారుగా పాల్గొన్న మ్యూజికల్ చెయిర్స్,టగ్ ఆఫ్ వార్ ఆద్యంతము అలరించాయి.తంబోలా చివరి నిమిషం వరకూ ఉత్కంఠతో సాగింది.బహుమతులు కూడా ఇచ్చి ఉత్సాహపరిచారు.అన్నిటినీ మించి షడ్రషోపేతమైన విందు,సాయంత్రం పిల్లలకు బిస్కట్లు,పెద్దలకు ఘుమఘుమలాడే టీ ఓపికను పెంచాయి. రాజమండ్రి,విశాఖ, హైద్రాబాద్,నల్గొండ,అదిలాబాద్ ఒకరా,ఇద్దరా ఐదువందలపైనే ఒక్క గూటిలో చేరిన పక్షుల కుహూరవాల్లా తేటతెనుగు కిలకిలారావాలు వినిపించసాగారు.మనం చేసుకునే వనభోజనాలను పోలిన ఈ తెలుగు  పిక్నిక్ మనసుకు ఆహ్లాదాన్ని,ప్రమోదాన్ని పెంచి జీవితంలో మనం కోల్పోకూడని అనుభూతులను ఒడిసి పట్టుకోమంటుంది.అన్నిటినీ మించి విజిటర్స్ వీసా పుచ్చుకుని బిడ్డలను కలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల వెంట పిల్లల్లా అడుగులో అడుగు వేస్తూ నడవడం,పిల్లలు అమ్మనాన్నలను పొదివి పట్టుకుని నడిపించడం చూడచక్కటి  వేడుక! 

  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

4 comments:

జలతారు వెన్నెల said...

ఉమాదేవి గారు, భలే ఆనందం వేసిందండి మీ పోస్ట్ చూసాక...

అంతే అంతే మేమింతే!
కన్నవారికి, అయిన వారికి దూరంగా...ఇక్కడికి వచ్చి వాలిన పక్షులమే
మాతో పాటు , మా లాగే ఎగిరి వచ్చిన పక్షులందరు మాకు ఆత్మీయులే
రాత్రి, పగలు తేడా లేకుండా ఒక్కోసారి పని చేసే యంత్రాలమే
మేము కన్న చిన్నారుల సమక్షం లో అన్నీ మరచిపోయి వారి బంగారు భవిష్యత్తు కోసం పాటు పడుతున్నవారమే
వారాంతరపు సెలవల్లో ఇలా పార్టీ లు చేసుకుంటూ సంబరిపడిపోయేవారమే
అప్పుడప్పుడు చిరుజల్లులా వచ్చి చల్లటి ఆశీస్సులు అందించే మీ లాంటి వారు ఎప్పుడూ మా వద్దనే ఉండిపోవాలని ఆశ పడేవారమే
అంతే అంతే మేమింతే!

మాలా కుమార్ said...

వలస పక్షుల కిలకిలారావాలు చక్కగా వినిపించారండి .

సి.ఉమాదేవి said...

మనోభావాలను మనసే పలికితే కలిగే స్పందనను మీ వ్యాఖ్య చూపగలిగింది వెన్నెలగారు.

సి.ఉమాదేవి said...

మాలాగారు,ధన్యవాదాలండీ.

Post a Comment