Thursday, May 22, 2014

ఎన్నాళ్లకెన్నాళ్లకు!

4 comments


అక్షరమంటే అమితమైన ప్రేమతో మాధ్యమమేదైనా సరే అక్షర ఆవిష్కరణ చేయాలనుకునే నాకు జ్యోతి  వెలిగించిన చిరుదివ్వె నా చిన్నిగుండె చప్పుళ్లు. మనసు పరుగిడినంత వేగంగా మనిషి పరుగులు పెట్టలేనపుడు మధ్యమధ్యలో చతికిలపడటం ఖాయం.ఈ మధ్య అదే జరుగుతోంది.అయితే ఈ రోజు నా బ్లాగు పదివేల వీక్షకులను దాటినట్లు చెప్తుంటే బాల్యం మనసును తాకిందేమో,ఉత్సాహం ఉరకలువేసి బ్లాగ్మిత్రులకందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.  

Friday, May 2, 2014

గాజునది

0 comments
ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురింపబడిన నా సమీక్ష.




                                    మనసు గలగలలు వినిపించిన గాజునది  
                    స్త్రీ బహురూపిణి. విభిన్న పాత్రలను ఏకకాలంలో పోషించగలగడం ఆమెకున్న అసామాన్య శక్తి.అయితే  తదనుగుణంగా స్త్రీ భావజాలం కూడా త్రిడి ప్రింటర్ లోవలె ఏమూసలో కావాలంటే అలానే కావాలంటూ ముద్ర వేయడం సబబనిపించుకోదు. శిలాలోలిత కలంపేరుగా లక్ష్మి రచించిన కవితా సంపుటి గాజునది. స్త్రీ మనసును పారదర్శకం చేసే శీర్షిక గాజునది. శిలాలోలిత ఆలోచనా నెగడు నిత్య జ్వలితం. అందుకే ఈ నిరంతర కవితా మెరుపులు.ఈ కవితా ఒరవడికి  పేర్చబడ్డ కవితా శీర్షికలు స్త్రీల అసహాయతలకు, సమాజంలోని అవాంఛనీయ పోకడలకు,మసిబారుతున్న మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనాలు.
                   గాజుబీకరులో బంధింపబడిన నీటి చిత్రంలా కాక స్థిరీకృతమైన ఆకారాల్లో  జీవలక్షణాలను పుణికి పుచ్చకున్న భావజాలము కావాలని గాజునది లో చెప్పిన లోతైన భావనాపటిమ కవితా వస్తువుపై శిలాలోలితకున్న పట్టు తెలుపుతుంది.తమదైన వ్యక్తిత్వంతో కొత్త బాటను నిర్మించుకునే స్త్రీలు చేయి తిరిగిన శిల్పులే కదా!
గాజులగలగలలే కాదు గొంతుముడి విప్పుకుని బయల్పడిన మాటల గలగలలు వినిపించిన గాజునది, రచయిత్రి నిశిత పరిశీలనా శక్తిని,సామాజికాంశాల ఆసక్తిని స్ఫటికమై ప్రస్ఫుటింపచేస్తుంది.

          జీవితంలో పైకెదిగి వృద్ధిలొకి రావాల్సిన ఎందరి ఆశాసౌధాలనో బాంబు పేలుళ్లు కూల్చివేసాయి. తెగిపడ్డ సీతాకోక చిలుక రెక్కలు కవిత చదివితే, మనసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతుంది.కాలమేఘాలు కురిపించిన బాష్పగోళాలు గోకుల్ చాట్ పేలుళ్లు.వాటికి సశేషంగా మిగిలిన దుఃఖవీచికలు ఇంకా మనసును తాకుతూనే ఉన్నాయి.
గాజుముక్కల వంతెన కవితలో బ్రతుకు సమరాన్ని వర్ణిస్తూ గాజుముక్కలపై నడకేనని అనడం ఉపమానమే కాదు అమృతోపమానం. నిజమే!ఆదమరచి నడిచామా గాజుముక్కలు కసుక్కున కాటేస్తాయి.
       విరోధినామ సంవత్సరమైనా. వికృత నామ వత్సరమైనా కాలం చెట్టుకు పూచిన కొత్త పువ్వులేనంటారు. కాలానికి కాళ్లు నొప్పి పడినప్పుడల్లా  ఓ క్షణమాగి కొత్త పేరుతో నడుస్తుంటుంది అని చమత్కరించడం చిరునవ్వులు పూయిస్తుంది.కాలం పరచిన బాటలో మీ కాలి బాట  మీలోకే దారితీయాలని చెప్పడం ఆత్మావలోకనమే.
మానవ హారం మరో చక్కటి కవిత. మనిషిని మనిషిని కలిపి కుట్టేది మానవత్వం.కలలెప్పుడు మానసిక ప్రపంచ కవాటాలే. మనిషి గొంతు ముడి విప్పితే రాలేది మాటలే.అవే కలగలిసిన మానవత్వపు మూటలు అని చదివినప్పుడు బస్తాలలో బంధింపబడిన మానవత్వాన్ని మూటలు విప్పి మానవాళిపై వెదజల్లాలనిపిస్తుంది.
కాంతి+కాంతి=చీకటిచీకటి రేఖలపై కాంతిని ప్రసరించి స్త్రీ పురుష సమానత్వంలో అహానికి వీడ్కోలు పలికితే బ్రతుకంతా వెన్నెల పుప్పొడే! మలినమైన మానవతా పరిమళం మనిషితనానికి వీడ్కోలు పలికితే ఆర్థిక సంబంధాలు అగాథాలు సృష్టిస్తాయి.అని కాంతిని స్త్రీ,పురుషులకు సంకేతపదాలుగా వర్ణించారు.
చలన సూత్రాలు.చదివితే కళ్లలో అకాల వర్షమే! దేహాలు వదిలి వెళ్లినా వాళ్లు విదిల్చిన అక్షరాలు  ఊతకర్రయి అక్షరపూలను శాశ్వతం చేసాయనడం, ఎందరో సాహితీవేత్తలు కురిపించిన  అక్షరాలకు మోకరిల్లాలనిపిస్తుంది.
 రోబో కవితలో, ప్రాణమున్న రోబోలం మనం.మనకై మనం  నవ్వం,మాటలాడం.కరుణించం, కలసిరాం. మననుంచి ఎప్పుడో జారిపడిపోయిన పాదరసం బొట్టు మన మనసు అంటారు.అందుకే ఆ పాదరసపు బొట్టుకు పునఃప్రతిష్ట జరగాలంటారు.నిజమే! అమానుషత్వమే తనువంతా ఆమ్లధారలా తడుపుతున్నవేళ మనసును తిరిగి ప్రతిష్టించుకోవాల్సిందే..
        ఉత్తరం ఉరిపోసుకుంది.ఇది అక్షర సత్యం.మనిషి మాటలు ఔట్ డేటెడ్. స్పర్శను,స్వరాన్ని కోల్పోతూ అక్షరాలు చాటింగులు,సొరుగులు,గోడలు,ముఖ పుస్తకాలే ఇక మనకు మిగిలింది అన్నా, మానవ పరిమళం మనిషితనమొక్కటే అని చెప్పినా,ప్లాస్టిక్  పర్యావరణానికి ముప్పని చెప్పడమైనా ఆమె దృష్టంతా మానవసమాజ శ్రేయస్సే!

                                                                                                                                                                                                                             



Friday, March 14, 2014

నిశ్శబ్ద జలపాతాలు

0 comments
2-3-2014  ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో  నా సమీక్ష.

హోరెత్తిన నిశ్శబ్ద జలపాతాలు
           
   పొత్తూరి జయలక్ష్మి రాసిన ప్రతికథ వెనుక తిరోగమించే సమాజపోకడలపట్ల  ఆవేదన బలంగా కనిపిస్తుంది. మూఢనమ్మకాలు మనిషి లక్ష్యాన్ని అలక్ష్యంవైపు నెట్టి సాధించవలసిన విజయాలకు అడ్డుగోడలవుతాయి.ఆచారాలు ఆచరణీయమే! అయితే మూఢాచారాలు మనిషినే కాదు మనసును కకావికలం చేస్తాయి. దీనికి దృష్టాంతాలే నిశ్శబ్ద జలపాతాలు వినిపించిన హోరునాదం.అందులో అలవోకగా రచయిత్రి కలం జాలువార్చిన కథాజలపాతాలు మన మనసులలో నిరంతరం ఉరకలు వేస్తూనే ఉంటాయి.
            అన్ని మంచి శకునములే. చక్కటి కథ. ఊహలకు రెక్కలు పొదిగి మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్లవు ఈమె కథలు.మన ఇరుగు పొరుగు వారి జీవితాలలో జరిగే సంఘటనలు వారినెలా ప్రభావితం చేస్తాయో చూసినట్లు,వినినట్లు మనకు వివరిస్తారు. మంచి పనికి మంచి మనసుంటే చాలంటారు.పిల్లి ఎదురు పడ్డా దుశ్శకునమని ఆందోళన పడటం మనిషిని మరింత భీరువును చేస్తుంది.ఇది అందరికీ తెలుసు కాని కథగా చెప్తే సూదిమందులా సత్వరం పనిచేస్తుంది కదా!
అనుమానం దాంపత్య జీవితానికి విషపు చీడలాంటిది.పరస్పర అనుమాన నివృత్తితో సంసారం స్వర్గమవుతుంది.మనసు పాడింది సన్నాయి పాట కథ ఇదే చెప్తుంది.
ఇక నిస్సహాయుడు కథలో నేటి సమాజ ముఖచిత్రం స్ఫష్టంగా గోచరిస్తుంది.ప్రేమగా పెంచుకున్న వృక్షాలను నరికివేసి ఆ స్థానంలో ఇల్లు కట్టుకోవడం నేడు నిత్యవేడుకే!ప్రాణంలేని ఆత్మీయులు ఫోటోలలో దర్శనమిస్తారు.ప్రాణంలేని చెట్టు గుమ్మంగా,అల్మైరాగా మిగులుతాయి.మనిషికి మరణం ఒక జీవక్రియ కాని చెట్టుకు మాత్రం మరణం హత్యే అన్న రచయిత్రి మాటలు మనసున్న మనిషికి రంపపుకోత!
           పూలబంధం కథ మనసుల పుష్పరాగమే! ఇల్లుకట్టి చూడు కథ ఇల్లు కట్టిన  ప్రతి ఒక్కరికి అనుభవైకవేద్యమే. పులికన్న గిలి భయమెక్కువ ఉంటుంది. ఇల్లు కట్టడంలో వాస్తు ప్రధానం. నమ్మినా నమ్మకపోయినా అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో వాస్తును అంతో ఇంతో పాటిస్తారు. వాస్తే కాదు వాస్తవాలు గ్రహించడం కూడా అవశ్యమేనంటారు.
           ఆర్థికమాంద్యం విసిరిన వలలో గిలగిలలాడిన చేప వికాస్. అయితే బలైనది అతడి భార్య వికసిత.భర్తను చేరుకోగలనన్న ఆశతో అమెరికాలో అడుగు పెట్టిన వికసితకు వికాస్ ముఖం చాటేస్తాడు.అయితే బేలతనం వదలి తన జీవితానికి బాట వేసుకుంది వికసిత. వికసితవదనం కథలో వికాస్ ప్రవర్తనకు మూలకారణాలు ఏవైనా అమ్మాయిలూ, బహుపరాక్! అనక తప్పదు.
            తమకు ఎదురయే ఇబ్బందులకు మూఢనమ్మకాలను ఆశ్రయించి మనసును సాంత్వన పరచాలనుకుంటారు. అది తాత్కాలికమేకాని శాశ్వత పరిష్కారం చూపలేదు. కాలంతోపాటు మనము మారాలి. సాటివారిని మనతో సమానంగా చూసే అలవాటు చేసుకోవాలి మానవత్వాన్ని మించిన మతంకాని కులంకాని లేదనే నిజం అమృతబిందువులు కథలో కురిసిన అమృతమే! 
            కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న నేటి పరిస్థితులలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు,కనీసం తమను కన్నవారేవరో తెలియని పసిపాపలు ఒకవైపు,తమ పొత్తిళ్లను వీడి వత్తిళ్లను కావలించుకున్న సంతానానికి భారమైన వృద్దతల్లిదండ్రులు మరొకవైపు. వీరిని కలిపే ఆలోచనకు అనురాగపు పొదరిల్లు కథ వేదికగా నిలవడం సత్సంకల్పం. 
               రచయిత్రి ముద్రించిన తొలి కథల సంపుటి ఇది. దైనందిన జీవితంలో ఎదురయే విభిన్న వ్యక్తులు, వారిలోని వైవిధ్య వ్యక్తిత్వాలు,వారి జీవితాలలో తారసపడే ఎన్నో సంఘటనల వైచిత్రి రచయిత్రిని కథారచనవైపు పురికొల్పి వుండవచ్చు.అయితే వాటిని నేర్పుగా కథలుగా మలచి సమాజానికి సంతసమేకాక,సందేశము మిళితము చేసి అందించడం సామాజిక స్పృహ ఉన్న వారికే సాధ్యం కదా. అది జయలక్ష్మి కథలలో అంతర్లీనమైన జలపాతమే!  

                                                                                                    
  


     

Tuesday, December 31, 2013

శుభాకాంక్షలు

4 comments
బ్లాగ్మిత్రులందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు.



Sunday, December 29, 2013

చిత్రగ్రంథి

0 comments
ఈ రోజు ఆదివారం ఆంధ్రప్రభలో చిత్రగ్రంథి కవితా సంపుటిపై నా సమీక్ష.


                     

       
                                                             కవితారసాలూరిన చిత్రగ్రంథి

 సుధామ జగమెరిగిన కవి,రచయిత, విశ్రాంత ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారి. సాహితీప్రక్రియలన్నిటిలోను ప్రవేశమున్నప్పటికీ కవితాసరిగమల ఆలాపనకే పెద్దపీటవేసి ఆంధ్రప్రభ దినపత్రికలో కవికాలమ్ నిర్వహించిన ఈ కవి కలం కవితాసుధాభరితమై ప్రశంసలనందుకుంది. సాహితీబాటలో కవిగా,రచయితగా, బహుపాత్రధారియైన సుధామ మనముందుకు తెచ్చిన చిత్రగ్రంథి కవితా సంకలనం వస్తువైవిధ్యంతో అలరిస్తుంది.
ఇక చిత్రగ్రంథిలోకి ప్రవేశిద్దాం.తొలికవితకు శీర్షికే కవి(త) ప్రవేశం .
కలుషితమవుతున్న పర్యావరణం మనిషిని ప్రకృతికి దూరం చేస్తోంది.
నీటిని గాలిని ధ్వనిని
క్షరముకాని అక్షరంగా సహజసిద్ధంగా
స్వచ్ఛంగా నిలుపుకుంటే చాలు
మహిని,మనిషిని కూడా రక్షించుకున్నట్లే. అంటూ పర్యావరణాన్ని రక్షించుకోవాలనే స్పృహను కలిగిస్తారు.
భూత,వర్తమాన,భవిష్యత్కాలాలను సమన్వయపరచుకోవడమెలాగో స్వగతం-స్వాగతం కవిత మనకు వినిపిస్తుంది.
గతాన్ని వర్తమాన కవ్వంతో చిలికి  భవిష్యత్తు మీగడను పైకి తేల్చడమే ముఖ్యం అనడం కవి దార్శనికత మూడు కాలాలకు విస్తరించడమే.
జీవితంపై ఆశ ఉద్దీపన కావాలి కాని అంతం కాకూడదు.
జీవితేచ్ఛ  కవితలో ఆశలు నిర్మించేవాళ్లు గోడలను కొలుస్తారంటారు. అవరోధాల గోడలనధిగమించాలి. మృత్యుశ్వాసనధిగమించి జీవితేచ్ఛ పరిమళించాలి.బ్రతుకుపై నిరాశకు వీడ్కోలు పలికే కవిత.
అగ్నినగ్నీకరం  కవిత భగ్గుమనే హృదయావేదనను ప్రతిఫలిస్తుంది. నగిషీకరించడంకాదు నగ్నీకరించినపుడు అది అగ్నీకరణమన్న కవి భావుకత కవితావేశాన్నందిస్తుంది.
మనిషి మానుషాన్ని మటుమాయం చేస్తున్నాడు. మానవ ప్రకృతిని మానవుడు ధరించేలా చెయ్యి.జీవనగీతం రానివ్వమని కొత్త పల్లవి పాడుతారు.
ఉల్లితరిగినప్పుడు కన్నీళ్లులా ….పఠిత సజలనేత్ర కావాలి అనడం హృద్యంగా ఉంది.
విలువ శీర్షికన రాసిన కవిత అమూల్యమైనదే. మెట్లపై మనిషి జారి పోవడం కాదు,నేడు మెట్లే జారిపోతున్నాయి.
వినిమయ విపణి వీధిలో మనిషే వస్తువై, మారిన ప్రపంచానివే విలువలు కాని వ్యక్తిత్వ ప్రపంచానివి కావు అనడం ఈ కవికి మానవతా విలువలపైనున్న ఆర్తిని ప్రస్ఫుటింపచేస్తుంది.
చితిలోను చ్యుతిలేని వృద్ధాప్యం
బ్రతుక్కీ,మృత్యువుకి మధ్య చివరి జాప్యం.
చివరి జాప్యంలో మారుతున్న విలువలలో మనిషీ మారకద్రవ్యమే అని సూటిగా చెప్పడం గుండెలో నాటుకుని కళ్లను తడుపుతుంది.
ఆకాశవాణినుండి కవితావాణిదాకా సుధామ మీటిన మైలురాళ్లు సాహితీబాట లోని పథికులకు మార్గనిర్దేశనాలే అనడంలో అతిశయోక్తి లేదు.
ఏదో నాలుగు కవితలు రాసేసాం, కలం మూసేసాం అనుకోకుండా  విలక్షణత,వస్తువైవిధ్యానికి ప్రాధాన్యతనిచ్చిన కవితా పఠనం ఉత్సుకతను ఉద్దీపన కావిస్తుంది.చిత్రగ్రంథి  కవితా సంకలనం మనసును ఉరకలేయించడమేకాదు  అదుపు తప్పిన సమాజపోకడలకు  చురకలు వేస్తుంది.చిలికేకొద్ది చిక్కనైన కవిత్వం  తొంగి చూచిన ప్రతి పాఠకుడిపై చిలకరించిన చల్ల పలుకై పలకరిస్తుంది. ఆలోచన, అవగాహన, రమ్యతకు తగిన సమతుల్యత మాటల పటాటోపంకాక పదాల పల్లవింపులు సహజత్వానికి దగ్గర దారై మన దరిదాపులలోనే కవి నిలుచుని మనతో కవితా కబుర్లు చెప్తున్నట్లుంటుంది .మనసును హత్తుకున్న కవితేదయినా ఆ కవితాస్రష్టను కలకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది.